ప్రభుత్వ పాఠశాలలో పూలే గ్రంథాలయం.

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూలే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి వారోత్సవాన్ని పురస్కరించుకొని లీడ్ చిల్డ్రన్ లైబ్రరీ, గ్రామస్తుల సహకారంతో పూలే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. నర్సంపేట పట్టణానికి చెందిన లీడ్ చిల్డ్రన్ గ్రంథాలయ వ్యవస్థాపకులు కాసుల రవి కుమార్, జెడ్పిఎస్ఎస్ ఇటుకాలపల్లి మొదటి బ్యాచ్ టాపర్ నాంపల్లి మురళీధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దాతల సహకారంతో నిర్మించిన గదులలో వీరి చేతుల మీదుగా లైబ్రరీని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ముఖ్య అతిథి మురళీధర్ మాట్లాడుతూ రానున్న పదో తరగతి పరీక్షలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. విద్యార్థులు హార్డ్ వర్క్ మాత్రమే కాకుండా స్మార్ట్ వర్క్ పై కూడా దృష్టి పెట్టాలన్నారు. గత ఇరవై ఏండ్లలో పాఠశాలలో జరిగిన మార్పులను వివరించారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుపుతున్నారని అధ్యాపక బృందాన్ని ప్రశంసించారు. ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా తట్టుకోవాలని, క్షణికావేశాలకు లోనుకాకుండా బాధ్యతగా నడుచుకోవాలని సూచించారు.లీడ్ చిల్డ్రన్ గ్రంథాలయ వ్యవస్థాపకులు రవికుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎవరైనా గొప్ప స్థానానికి చేరుకున్నారంటే వారంతా మంచి పాఠకులై ఉంటారన్నారు. అందరూ చిప్కో ఉద్యమస్ఫూర్తితో హగ్ ఏ బుక్ అని సెల్ ఫోన్లు కాకుండా పుస్తకాలను ఉపయోగించుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమాదేవి, ఉపాధ్యాయులు కిరణ్ కుమార్ , సుధాకర్, ఫాతిమా, ప్రభాకర్,కుమారస్వామి,రవీందర్, రఘుపతి,రాములు,మహేందర్, శ్రీనివాస్ ,రత్నమాల, తాజొద్దిన్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!