ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం గూడెం గ్రామంలో పీజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గూడెం గ్రామానికి చెందిన గూడ తిరుపతమ్మ రమేష్ దంపతుల కుమారుడు దామోదర్(30) గురువారం సాయంత్రం ఏడు గంటలకు పురుగుల మందు తాగి వాళ్ల పంటచేనులో ఆత్మహత్య చేసుకున్నాడు. మొక్కజొన్న చేనుకు నీరు పారించడానికి వెళ్ళిన కుమారుడు చీకటి అవుతున్నా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతుకుతూ తన సెల్ ఫోన్ కి ఫోన్ చేస్తూ వెతకగా చేనులోనే శవమై కనిపించాడు. చదువులో చాలా చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న దామోదర్ వ్యవసాయ పనుల్లో కూడా తల్లిదండ్రులకు సహాయపడుతూ ఉంటాడు. చురుకైన విద్యార్థిగా కష్టజీవిగా పేరు తెచ్చుకున్న దామోదర్ చనిపోవడంతో గ్రామం శోకసముద్రంలో మునిగింది. తల్లిదండ్రుల రోదనను ఆపడం ఎవరి తరము కాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోత్కాపల్లి ఎస్సై దీీకొండ రమేష్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.