గన్నేరువరంకు అదనపు బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతిపత్రం
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా కేంద్రంలో మానేరు బ్రిడ్జి సాధన సమితి అధ్యక్షులు పుల్లెల జగన్ మోహన్, గన్నేరువరం మండల బిజెపి నాయకులు పుల్లెల రాము రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ని కలిసి గన్నేరువరం మండల కేంద్రానికి అదనపు బస్సులు వేయాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి గన్నేరువరం మండల కేంద్రానికి ప్రస్తుతం రెండు బస్సులు మాత్రమే నడుస్తున్నవని, అందులో ఒకటి పొత్తూరు మీదుగా గన్నేరువరంకు, మరొకటి గుండ్లపల్లి మీదుగా గన్నేరువరంకు నడస్తున్నవని, రెండు బస్సులు సరిపోక ప్రయాణీకులు అనేక అవస్థలు పడుతున్నారని తెలియజేశారు. అరవై మంది ప్రయాణించే బస్సులో వంద మందికి పైగా ప్రయాణీకులు ప్రమాదకరంగా నిత్యం బస్సుల్లో ప్రయాణించవలసిన వస్తోందని, గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలోని మానసాదేవి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో బస్సులో ప్రయాణికులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని కరీంనగర్ నుండి పొత్తూరు మీదుగా ఒక బస్సు, కరీంనగర్ నుండి గుండ్లపల్లి మీదుగా ఒక బస్సు అదనంగా వేయించగలరని మంత్రికి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి విద్యార్థుల, ప్రయాణికుల ఇబ్బందులను తీర్చడానికి, గన్నేరువరం, మాధాపూర్, ఖాసీంపేట, మైలారం, చొక్కారావుపల్లి గ్రామాల సౌకర్యం కోసం అదనపు బస్సులు వేయడానికి పరిశీలిస్తామని మంత్రి తెలియజేశారని పుల్లెల జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
