# పేదల కాలనీల అభివృద్ధికీ ప్రత్యేక నిధులు కేటాయించాలి.
# ఎంసిపిఐ(యు) నగర కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి :
ఎన్నికల హామీలను విస్మరిస్తున్న పాలక పార్టీల మెడలు వంచి ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే ప్రజా పోరాటాలే ఏకైక ప్రత్యామ్నాయమని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.బుదవారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) వరంగల్ నగర కమిటీ సమావేశం నలివెల రవి అధ్యక్షతన అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని స్థానిక ఓంకార్ భవన్ లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన పెద్దారపు రమేష్ మాట్లాడుతూ ఓట్లు సీట్లు అధికారం దక్కించుకోవడానికి అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కాక ఆచరణలో విస్మరిస్తున్నారని ఈ క్రమంలో బిజెపి మోడీ ప్రభుత్వం ప్రతి పేదవాడి అకౌంట్ లో రూ.15 లక్షలు వేస్తామని ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పన, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు, కార్మిక హక్కులు రక్షణతో పాటు అనేక హామీలు ఇచ్చి నేటికీ అమలు చేయకపోగా ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మతం పేరుతో మూఢత్వం నింపి కార్పొరేట్ శక్తులకు దాసోహం అయ్యారని ఆరోపించారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు గతంలో అమలు చేయని హామీల గురించి ప్రస్తావించకుండా తప్పుడు పద్ధతిలో ప్రయత్నిస్తున్నారని వీటిని ప్రజలు గమనించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయని ఏ పార్టీనైనా గద్దె దించాల్సిందేనని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన పోరాడి ప్రశ్నించే గొంతుకలకు అండగా నిలిచి ఎంసిపిఐ(యు), బిఎల్ఎఫ్ బలపరిచే అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.చారిత్రాత్మకమైన వరంగల్ పట్టణంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని స్లమ్ ఏరియాల్లో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయని పేదల నివసించే కాలనీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించాలని కోరారు.ఎంసిపిఐ(యు) వరంగల్ నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్ మాట్లాడుతూ వరంగల్ చరిత్రను నిలబడేలా ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే అధునాతనమైన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం, మామునూరు ప్రాంతంలో ఎయిర్ పోర్ట్, పరిశ్రమల ఏర్పాటు ఉపాధి కల్పన, పూర్తి స్థాయిలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని లేకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, జిల్లా కమిటీ సభ్యులు మాలి ప్రభాకర్, ఐతం నగేష్, అప్పనపురి నరసయ్య, ఎగ్గెని మల్లికార్జున్, నగర నాయకులు రాయినేని ఐలయ్య, జటబోయిన నరసయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.