స్వచ్చ రాజకీయాలు ఎన్నటికీ చెరిగిపోవు
ఇల్లందు 5సార్లు గెలిచినా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య
ఇటీవల అవిశ్వాసంలో నెగ్గిన కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి
కొత్తగూడెం మున్సిపాలిటీ.విలువలు ఉన్న వ్యక్తులు ఎప్పటికీ ఓడిపోరని, స్వచ్చ రాజకీయాలు ఎన్నటికీ చెరిగిపోవని, కొత్తగూడెం మున్సిపాలిటీ అభివృద్ధికి కంకణం కట్టుకుని పనిచేస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అవిశ్వాసంలో నెగ్గడం అందుకు నిదర్శనమని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. గురువారం కొత్తగూడెంలోని మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి స్వగృహానికి గుమ్మడి నరసయ్య విచ్చేశారు. ఈ సందర్భంగా గుమ్మడి నరసయ్యకు మొక్కను అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం గుమ్మడి మాట్లాడుతూ.. నిజాయితీ, నిబద్ధత, నిస్వార్థ శ్రమకు ఎప్పుడూ విజయమే వరిస్తుందని, స్వార్ధ రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అవిశ్వాసంలో నెగ్గడం శుభపరిణామమన్నారు. అనంతరం కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించి.. నిరాడంబరమైన జీవితాన్ని సాగిస్తున్న గుమ్మడి నరసయ్య ఆశీస్సులు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పెద్దల ఆశీర్వాదం.. ప్రజల అభిమానం ఉన్నంతవరకు నిస్వార్థంగా సేవలు అందించేవారికి ఎప్పుడూ విజయమే సాధిస్తారని తెలిపారు.