
రోడ్డు గుంతలు పూడ్చుకున్న ప్రజలు
గ్రేటర్ వరంగల్ మేయర్ కు సామాన్యుల బాధలు పట్టవ అంటూ ప్రశ్నిస్తున్న నగరవాసులు.
రోడ్ల గుంతలు పూడ్చాలంటూ పాలకులకు ప్రజల విన్నపం
నేటిధాత్రి, వరంగల్
వరంగల్ నగరంలో రోడ్ల పరిస్థితి ఇప్పుడు తీవ్రమైన సమస్యగా మారింది. ప్రధాన రోడ్ల మీద ఎక్కడ చూసినా గుంతలు, కుంగిపోయిన బ్లాక్‌టాప్, వర్షాకాలం కారణంగా రోడ్డుమీద భారీ ఆటంకాలు ఏర్పడ్డాయి. దీనివల్ల వాహనదారులు ప్రతిరోజూ ప్రమాద భయంతో ప్రయాణం చేస్తున్నారు.
ముఖ్యంగా వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద రోడ్డుమీద ఏర్పడిన గుంతలతో ఇబ్బందులు తాళలేక, స్థానిక ప్రజలు స్వయంగా సిమెంటు, రాళ్లతో గుంతలు భర్తీ చేస్తున్న దృశ్యం గురువారం కనిపించింది.
ప్రజా సౌకర్యాల పట్ల అధికారులు కనీస శ్రద్ధ పెట్టకపోవడంతో, సమస్యలు తామే పరిష్కరించుకోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పోతననగర్ రోడ్డులోనూ ఇదే దుస్థితి నెలకొని ఉందని ప్రజలు వాపోయారు. “పాలకులు తమ కమీషన్లపైనే శ్రద్ధ పెడుతున్నారు.
కానీ ప్రజల ఇబ్బందులు పట్టించుకోవటం లేదు. కమీషన్లపై చూపుతున్న శ్రద్ధను, ప్రజల సమస్యల పైన కనబరిస్తే బాగుండేది” అని సామాన్యులు ప్రశ్నించారు.
మేయర్, ప్రజాప్రతినిధులు నగర సమస్యలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే రోడ్లను మరమ్మతు చేసి, గుంతలు పూడ్చాలని వరంగల్ వాసులు విజ్ఞప్తి చేశారు.