
rehabilitation centers
ఎమర్జెన్సీ ప్లాన్‌లో భాగంగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు
ఆపత్కాలంలో బల్దియా టోల్ ఫ్రీ నెంబర్ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలన్న మున్సిపల్ కమిషనర్.
బల్దియా కమిషనర్‌తో కలిసి వరంగల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలను సందర్శించిన వరంగల్ కలెక్టర్.
వరంగల్, నేటిధాత్రి
భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు జలమయమైన వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించి సమర్థవంతంగా చర్యలు చేపట్టుటకు అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిధి లోని నాలుగు మండలాలలైనా వరంగల్, సంగెం, ఖిలా వరంగల్, వర్ధన్నపేటలలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం జరిగిందని అత్యధికంగా సంగెం మండలంలో 24 సెంటీమీటర్ల వర్షపాతం,
ఖిలా వరంగల్ మండలం లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని, జలమయమైన లోతట్టు ప్రాంతాలైన సాయి గణేష్ కాలనీ, గాంధీ నగర్, డి కే నగర్, లెనిన్ నగర్, అగర్తల చెరువు ప్రాంతం, మైసయ్య నగర్, గిరి ప్రసాద్ కాలనీ, పద్మ నగర్, శాకారాశికుంట తదితర ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో సందర్శించడం జరిగిందని, వర్షపు నీరు బయటకు వెళ్లే స్ట్రాం వాటర్ డ్రైన్ లు ఇరుకుగా ఉండడం వల్ల నీటి ప్రవాహంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఖిలావరంగల్ నుండి వరంగల్ వరకు జీడబ్ల్యూఎంసి తరపున అట్టి నాలాను విస్తరించడానికి పనులు కొనసాగుతున్నాయని, లోతట్టు ప్రాంతాలలో ఎమర్జెన్సీ ప్లాన్ కింద చర్యలు చేపట్టడం జరుగుతుందని మంగళవారం రాత్రి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని, లోతట్టు ప్రాంతాలలో ఉండే ప్రజల కోసం ఆహారంతో పాటు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మందులు అందుబాటులో ఉంచడం జరిగిందని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో పిల్లలను పాఠశాలకు పంపించవద్దని, ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే క్రమంలో ప్రాణహాని ఉంటుందని, కావున పిల్లలను చెరువుల్లో చేపల వేటకు వెళ్లకుండా తల్లిదండ్రులు నియంత్రించాలని, విద్యుత్ సంబంధ వస్తువులను తాకకుండా ఉండాలని, వర్షాలు కురిసే క్రమంలో ఎర్తింగ్ వచ్చే అవకాశం ఉంటుందని, భారీగా నీరు నిలిచి ఉండే లోతట్టు ప్రాంతాలకు విద్యుత్తు నిలిపివేయడం జరిగిందని, ఒకరోజు పునరవస కేంద్రాలలో ఆవాసం పొందడం వల్ల కలిగే నష్టం ఏమీ లేదని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వారు అందజేసిన సాటిలైట్ ఇమేజ్ లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని సమాచారం అందిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు.
బల్దియా కమిషనర్ మాట్లాడుతూ….
జీడబ్ల్యూఎంసి తరపున డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని ప్రతి వార్డులో జవాన్‌తో పాటు ప్రత్యేక మాన్ సూన్ బృందాలు అందుబాటులో ఉన్నాయని అంతే కాకుండా ఇంజనీరింగ్ బృందాలు కూడా క్షేత్ర స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారని వర్షపు నీటిని వేగవంతంగా బయటకు పంపించడానికి కచ్చా కాలువల ద్వారా పంపించడం జరుగుతుందని, శాశ్వత పరిష్కారం కోసం నాలాను
విస్తరించడంతో పాటు డ్రైన్ ఆక్రమణలను తొలగించడం జరుగుతుందని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సమీప ప్రాంతాల్లో ఉన్న పునరావాస కేంద్రాల్లోకి వెళ్లాలని ప్రస్తుతం 6 పునరావాస కేంద్రాలు ఎస్ ఆర్ నగర్ లో శుభం గార్డెన్, గాంధీ నగర్, మైసయ్యనగర్ కమ్యూనిటీ హాల్లో, డి కే నగర్లో బీరన్నకుంట హై స్కూల్ , గిరి ప్రసాద్ నగర్‌లోని కమ్యూనిటీ హాల్, ఏం ఎన్ నగర్ లోని మార్వాడీ హాల్లలోను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం ఆయా కేంద్రాలలో ప్రజలు ఆవాసం పొందుతున్నారని ఉదయం సుమారు 1300 మందికి అల్పాహారం అందజేయడం జరిగిందని లంచ్ తో పాటు డిన్నర్ కూడా అందజేస్తామని ప్రజల అవసరాల కోసం వరంగల్, హన్మకొండ కలెక్టరేట్ లతో పాటు బల్దియా ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ : 18004251980, మొబైల్ నంబర్:
9701999676 అందుబాటు లోకి తెచ్చామని, ప్రజలు ఈ నంబర్లలో సంప్రదించాలని జీడబ్ల్యుఎంసి తరఫున 2 డిఆర్ఎఫ్ బృందాలు 24×7 మూడు షిఫ్టులలో పనిచేస్తున్నాయని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఏంహెచ్ఓ సాంబశివరావు ఆర్డిఓ సత్యపాల్ రెడ్డి, సిఏంహెచ్ఓ డా.రాజారెడ్డి, డి ఎఫ్ ఓ శ్రీధర్ రెడ్డి, ఏం హెచ్ ఓ డా.రాజేష్ ఇంచార్జి ఈ ఈ సంతోష్ బాబు, వరంగల్, ఖిలా వరంగల్ తహసీల్దార్ లు మహమ్మద్ ఇక్బాల్, నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.