
MPDO office...
ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు చెల్లించాలి…
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా…
నేటి ధాత్రి -బయ్యారం :-
మహబూబాబాద్ జిల్లా,బయ్యారం మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేసిన కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులుమరియు బయ్యారం మాజీ సొసైటీ చైర్మన్ రామగిరి బిక్షం డిమాండ్ చేశారు. సోమవారం న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మండల అభివృద్ధి అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో జి.విజయలక్ష్మి కి అందజేశారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి రామగిరి బిక్షం మాట్లాడుతూ,2024 – 2025 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలీలు పనులు చేసిన ఆరు వారాల డబ్బులు విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సరం చేస్తుందని అన్నారు.ఒక వారానికి 300 రూపాయలు ఆటో కిరాయి పెట్టుకొని పని ప్రదేశానికి వెళ్లి పని చేయడం జరిగిందని, ఇలా సుమారు మూడు నుంచి ఆరు వారాల వరకు పని చేసినా డబ్బులు కార్మికుల ఖాతాల్లో పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుండి పనిచేసిన వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి డబ్బులు చెల్లిస్తున్నారని విమర్శించారు. కొంత మంది కార్మికులు పని చేసినా వారికి హాజరు వేయకుండా ఆబ్సెంట్ వేసారని అన్నారు. ఉపాధి హామీ పనిలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని, అధికారులకు డబ్బులు ఇస్తేనే బ్యాంకుల్లో డబ్బులు పడే విధంగా చేస్తున్నారని అనేక మంది కార్మికులు వాపోతున్నారని అన్నారు.వేసవిలో ఎర్రటి ఎండలో కష్టపడి పని చేస్తే వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేయడం దుర్మార్గమని విమర్శించారు.ప్రతి సంవత్సరం ఉపాధి హామీ కూలీలకు రెండు నుండి మూడు వారాలు డబ్బులు చెల్లించకుండా ఎగవేస్తున్నారని విమర్శించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ డబ్బులు చెల్లించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉపాధి హామీ కార్మికులను సమీకరించి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు తుడుం వీరభద్రం, నేతకాని రాకేష్, గ్రామ నాయకులు బి రెడ్డి సంగన్న,జరిపోతుల బుచ్చయ్య, రెడ్డి మల్ల విశ్వనాధం, సోమారపు సుధాకర్, జినక లక్ష్మీనారాయణ, ఉపాధి కూలీలు జినుక రేణుక, గాజుల వెంకన్న, అబ్బరబోయిన రేణుక, విజయ, కాశమ్మ తదితరులు పాల్గొన్నారు.