CPI Demands Basic Facilities for Peddamma Colony
పెద్దమ్మ కాలనీ సమస్యలను పరిష్కరించాలి :
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండల కార్యదర్శి డి.జి.నరేందర్ ప్రసాద్ * శామీర్ పేట్ పెద్దమ్మ కాలనిలో సిపిఐ నాయకుల పర్యటన మేడ్చల్
జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
పెద్దమ్మ కాలనీలో ప్రజా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండల కార్యదర్శి డి.జి.నరేందర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా శామీర్ పేట్ మండలంలోని పెద్దమ్మ కాలనీలో బుధవారం సిపిఐ నేతలు ప్రజా సమస్యలపై పర్యటించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు అయినటువంటి మంచినీటి సరఫరా, వీధి దీపాలు, భూగర్భ మురికి నీటి పారుదల సౌకర్యం, బస్తీలోని రోడ్లు నిర్వహణ సక్రమంగా లేకపోవడం, నిత్యవసర వాడకానికి బోరు మోటరు మరమ్మత్తులు, ఇంటి నంబర్ల గుర్తింపు లేకపోవడం, చిన్నపిల్లలకు అంగన్వాడి కేంద్రంలోని నిర్వహణ కుగాను ప్రభుత్వ భవనం లేకపోవడం, ప్రభుత్వ వైద్యం సౌకర్యం మొదలగు సమస్యల పైన పెద్దమ్మ కాలనీవాసులు తీవ్ర ఆవేదన, అసంతృప్తి, దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాలుగా కాలనీ ఏర్పడిన నాటి నుండి ఇంకా కూడా కనీస సౌకర్యాలు లేవని సర్పంచులను, వార్డు మెంబర్లను, స్థానిక ఎమ్మెల్యేను కూడా విన్నవించుకున్నామని, అయినా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే లాగా ఉందన్నారు. ఎండాకాలం ఆరంభం అవుతున్న మార్చిలో త్రాగునీటి సమస్య, వాడుకోవడానికి బస్తీ నల్ల ద్వారా మూడు రోజులకు ఒకసారి కేవలం 50 లీటర్లు, 15 నిమిషాలు మాత్రమే వస్తున్నాయని, ఇంటింటికి నల్ల కనెక్షన్ ను ఇచ్చి, సమస్య ను గుర్తించి తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కీసర డిప్యూటీ కమిషనర్ వసంత రెడ్డి జిహెచ్ఎంసి 300వ వార్డు, శామీర్ పేట్ డివిజన్లోని, పెద్దమ్మ కాలనీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విన్నపాన్ని తెలియజేస్తామని సమస్య పరిష్కరించే వరకు పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మ కాలనీ పార్టీ నాయకురాలు మనమ్మ, జీవన్ ప్రధాన్, స్థానికులు జక్క్యాభి, సమీనా, కొప్పు స్వాతి, తూర్పాటి అంజమ్మ, పర్ధం మంగ, తూర్పాటి జ్యోతి, స్థానిక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
