https://epaper.netidhatri.com/view/393/netidhathri-e-paper-1st-october-2024%09
దానికి లెక్కలేకనే దారి తప్పింది!!
పవన్ రాజకీయం సుడిగుండమైంది!
రాజకీయం లోతు తెలియక ముందే ఆట ఆగిపోనుంది.
ఒకసారి నాకు కులం లేదంటాడు.మరోసారి
కుల రాజకీయం చేయడం తప్పదంటాడు.
తాను బాప్టిజం స్వీకరించానంటాడు?
చెగువేరా లాంటి తిరుగుబాటు నాయకుడు ఆదర్శమంటాడు.
తన తండ్రి మంగళహరతితో సిగరెట్ వెలిగించుకునే వారంటాడు.
మా ఇంట్లో నిత్యం రామనామ జపం ఉంటుందంటాడు.
అందరి ఆహారపు అలవాట్లను గౌరవిస్తా అంటాడు.
బీఫ్ తినాల్సివస్తే తింటానంటాడు.
ముస్లింల సంప్రదాయం గౌరవిస్తానంటాడు.
ఇప్పుడు హిందువుల జోలికొస్తే తాట తీస్తానంటాడు.
తిరుమలలో అపచారం జరిగిందని విజయవాడలో దుర్గమ్మ మెట్లు కడిగాడు.
తప్పు చేసిన వాళ్లు ప్రాయశ్చిత్తం గురించి చెప్పాలి.
-తాను పసుపు దుస్తులు, పాదరక్షలు వేసుకొన ప్రాయశ్చిత్త దిక్ష కు కొత్త అర్థం చెప్పాడు.
-ప్రతిసారి పలుచన కావడం తప్ప చేసిందేముంది?
-పూటకో మాట…నోటి నిండా తీట!
-చెగువేరాను ఎటు పంపించారు?
-మహాత్మా బాపులే ఆశయాలు ఏమయ్యాయి!
-భగత్ సింగ్ త్యాగం ఏమైంది?
-సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా?
-దాసరి గారు అందుకే అన్నారు..పిచ్చోడి చేతిలో రాయి సినిమా తీశారు.
-హిందువుల మనోభావాలా…దానికి అర్థం తెలుసా?
-రాజ్యాంగ బద్ద పదవిలో వుంటూ తిక్క మాటలా!
-వరద బాధితుల సహాయమప్పుడు ఇబ్బంది కలిగిందా?..ఇప్పుడు జనాలను రెచ్చగొట్టడం సరైందా?
-అధికారంలో వున్నవారు ఆరోపణలా చేసేది!
-నిజాలు నిగ్గు తేల్చక ఏం చేస్తున్నారు?
-పవన్ హడావుడి పాత చింతకాయ తొక్కు!
ఒక అబద్దం వెయ్యి అబద్దాలును మోసుకొస్తుంది. సినిమా నటులు సినిమాలు చేసినప్పుడు ఎన్ని మాట్లాడినా చెల్లుతుంది. కాని ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏది మాట్లాడినా ఆచి తూచి మాట్లాడాలి. ప్రతి మాటకు ఒక అర్దం వుండేలా చూసుకోవాలి. అర్ధం పర్ధం లేని మాటలు ఎల్ల కాలం చెల్లవని తెలుసుకోవాలి. కాని తనపై ప్రజలకు పెరిగిన నమ్మకమో, అదృష్టమో కాని ఒక్కసారి నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఒక దశలో పవన్ సినిమాలకు కూడా పనికి రారు అనుకున్నారు. వరసగా పది సినిమాలు నడవకపోయినా, స్టార్ డమ్ నిలుపుకున్నారు. అలాగని ఆయన చేసిన పాతిక సినిమాలలో వండర్ క్రియేట్ చేసినవి ఏమీ లేదు. రికార్డులు బద్దలు కొట్టినవి లేవు. కాని యువతలో పెద్ద ఫాలోయింగ్ ఏర్పండి. అది ప్రజా రాజ్యం పార్టీ తర్వాత మరింత పెరిగింది. ప్రజా రాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి రాజకీయ గ్రాఫ్ పడిపోయింది. కాని జనసేన ఏర్పాటు తర్వాత మెల్లిమెల్లిగా అటు సినిమాల్లోనైనా, ఇటు రాజకీయాల్లోనైనా ఆయనపై కొంత నమ్మకాలు పెరిగాయి. దాదాపు పదిహేను సంవత్సరాల పాటు పెంచుకున్న నమ్మకం ఒక్కసారిగా కోల్పోయాడు. అడపా దడపా తన నిర్ణయాలు ఎలా వున్నా, ప్రజలు ఎన్నికల సమయాల్లో ఆదరించకపోయినా సినీ నటుడు కావడం వల్ల క్రేజ్ అలాగే వుండిపోయింది. కాకపోతే పవన్‌ను రాజకీయ పార్టీలు పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. 2014 ఎన్నికల్లో పవన్ పోటీ చేయలేదు. ఆయన పార్టీ పేరు మీద ఎవరినీ పోటీకి నిలపలేదు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘోరంగా బోల్తాపడ్డారు. కనీసం ఆయన కూడా గెలవలేకపోయారు. అన్న చిరంజీవి రెండు చోట్ల పోటి చేసి ఒక్క చోట తిరుపతిలో గెలిచారు. కాని పవన్ ఒక్క చోట కూడా గెలవలేదు. కాని ఆయన రాజకీయం అప్పటినుంచి మొదలైందని అన్నట్లుగానే వున్నారు. రాజకీయాల నుంచి పారిపోతారనుకుంటే నిలబడ్డారన్న నమ్మకంతో ప్రజలు గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్ధానాల్లో గెలిపించారు. దాంతో పవన్ తనమీద తనకు మరింత నమ్మకం పెంచుకున్నారు. ఆ నమ్మకం అతి విశ్వాసమైపోయింది. అతిని మరింత పెంచుకున్నట్లైంది. సినిమా నటుడుగా వున్నా, రాజకీయాల్లో పెద్దగా ప్రాధన్యత లేనప్పుడు పవన్ రకరకాల మాటలు మాట్లాడారు. అది ఇప్పుడు పెద్ద కుంపటైపోయింది. తిరుపతి లడ్డూ వివాదంలో పవన్ చేసిన హంగామాతో ఆయనపై పెద్దఎత్తున ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. మేధావులు కూడా ఆయనను ఎవరూ సమర్ధించలేకపోయారు. ఒకప్పుడు పవన్‌ను గమనించిన వారికి, ఇప్పుడు అదే పవన్‌ను గమనిస్తున్న వారికి ఆశ్చర్యవేస్తోంది. ఆయన ఆనాడు ఎన్ని మాట్లాడినా మతం రంగు పులుముకోకపోవడం వల్ల అవి పెద్దగా బైటకు రాలేదు. కాని ఇప్పుడు ఆయన తన అసలు స్వరూపం ఇదే అని చూపించారు. ముందు విద్యార్ధి దశ గురించి మాట్లాడుకుంటే తనకు చిన్ననాటి నుంచి చదువు మీద సరైన శ్రద్ద లేదని చెప్పాడు. ఇంత వరకు బాగానే వుంది. కాని తనకు కావాల్సిన ఇంగ్లీష్‌ను గురువులు బోధించలేకపోయారన్నారు. అందరూ ఉలిక్కిపడ్డారు. తనకు కావాల్సిన ఇంగ్లీష్‌ను గురువులు నేర్పించలేకపోవడం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. ఇక తర్వాత ఒక సారి తాను ఎంబిబిఎస్ చేయాలనుకున్నానని అని చెప్పాడు. బైపిసి తీసుకోవాలనుకున్నా అన్నాడు. మరో దగ్గర తాను ఎంపిసి తీసుకున్నానని చెప్పాడు. ఇలా ఎక్కడికెళ్తే అక్కడ ఇలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు. కాని పెద్దగా పవన్ వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకోలేదు. కాని ఎప్పుడైతే జనసేన స్ధాపన చేశారో అప్పటి ఆయన మాటలు మార్చుతున్న విధానం వల్ల క్రెడిబిలిటీ దెబ్బతిన్నదని చెప్పడంలో సందేహం లేదు. తొలుత చెగువేరా వంటి పోరాట యోధుడు లేడంటూ కీర్తించడం మొదలు పెట్టారు. దాంతో ఆయన అభిమానులంతా చెగువేరా బనియన్లు వేసుకోవడం అలవాటు చేసుకున్నారు. టూవీలర్ వెయికిల్స్ మీద చెరువేరా బొమ్మలు వేసుకున్నారు. కొన్ని సినిమాల్లో చెగువేరా ధరించే దస్తులను వేసుకున్నారు. ఇలా పెద్దఎత్తున ప్రచారం చేశారు. కాని అసలు చెగువేరా అనే వ్యక్తి క్యూబాలో ఏం చేశాడన్నది ఎవరికీ తెలియదు. నోట్లో చుట్ట ముక్క పెట్టుకొని ఫోజులిచ్చిన చెగువేరా వల్ల క్యూబాలో వచ్చిన మార్పు ఏమిటో తెలియదు. అయినా ఆయన చెగువేరా జీవితంతో నేర్చుకున్నదేమిటో కూడా ఎప్పుడూ చెప్పింది లేదు. తాను చెగువేరాలాగా పోరాటం చేసిందేమీ లేదు. తర్వాత కొంత కాలానికి తాను కమ్యూనిజమ్ బావాలు వున్న కుటుంబంలో పుట్టానన్నారు. తన తండ్రికి దైవారాధన అంటే అసలే ఇష్టం వుండేది కాదన్నారు. ఇవన్నీ ఆయన స్వయంగా చెప్పిన మాటలే. ఇంట్లో పూజ చేసిన తర్వాత మంగళహారతిలో వుండే దీపానికి తన తండ్రి సిగరెట్ అంటించుకునేవారంటూ చెప్పారు. అంటే తనుకు సనాతన ధర్మాల మీద నమ్మకాలు లేవంటూ చెప్పారు. తన కుటుంబం క్రిస్టియానిటీతో ముడిపడి వుందన్నారు. తన కొడుక్కు ఏదో చిన్న గాయమైన సందర్భంలో మేరీ మాతను తలుచుకుంటే ఆ నొప్పి తగ్గిపోయిందని చెప్పాడు. అసలు క్రైస్తవులలో మేరీ మాతను పూజించే వర్గం చాలా తక్కువ. కాని ఆయన మేరీ మాతను పూజించానని చెప్పారు. ప్రజల ఆహారపు అలవాట్లపై ఆ మధ్య పెద్దఎత్తున వివాదం చెలరేగింది. ఆ సమయంలో తాను భీఫ్ను వ్యతిరేకించాలన్న ఒత్తిడేదైనా వస్తే ముందు దానిని తింటానంటూ చెప్పారు. తర్వాత సినీ నటుడు ఆలీ కూతురు వివాహ సమయంలో ఆలీ ఇంట్లో విందుకు హజరైన పవన్ కింద కూర్చొని ముస్లిం సంప్రదాయం ఎంతో గొప్పదన్నారు. ఇంత వరకు బాగానే వుంది. తాను అన్ని మతాలకు అతీతడనంటూ ప్రజల్లోకి వెళ్లిన పవన్ కాళ్యాన్ గెలిచిన తర్వాత ఇటీవల తిరుమల లడ్డూ వివదంలో సనాతన ధర్మ రక్ష పరిరక్షకుడి అవతారం ఎత్తారు. దాన్ని కూడా ఎవరూ తప్పు పట్టాల్సిన పనిలేదు. కాని ఆయన అడుగుడుగునా చెప్పిన మాటలకు, ఆచరిస్తున్న విధాలకు పొంతన లేకుండాపోయింది. ఆయన అసలు నిజస్వరూపం బైట పడిపోయింది. కేవలం తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎలాంటి నిచ్చెనైనా వాడుకుంటాడని అర్ధమైపోయింది. ఒకప్పుడు సమాజంలో ఏవైనా వివాదాలు జరుతున్నాయంటే అవి హిందు మత వాదుల వల్లనే అంటూ కూడా మాట్లాడిన సందర్భం వుంది. కాని ఇప్పుడు హిందూ మతం జోలికి వస్తే ఒక్కొక్కడి తాట తీస్తానంటూ చెప్పడం మొదలు పెట్టారు. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ మొదలు పెట్టారు. ఎక్కడకు వచ్చారు. అసలు బొంత పురుగు సీతా కోక చిలుకగా మారినట్లు తాను ఏదిచెప్పినా అందంగా వుంటుందనుకుంటున్నాడో ఏమో? అన్న సందేహం కలుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల లడ్దూ విషయంలో పవన్ చేసిన అతి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిందనేచెప్పాలి. ఇక కులం విషయానికి వస్తే ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా మన దేశ సమాజిక వ్యవస్ధ కులాల పునాదుల మీదే ఆధారపడి వుంది. చివరకు ముస్లింలలో కూడా హెచ్చు తగ్గులున్నాయి. అందులో కూడా కులాలు గూడు కట్టుకొని వున్నాయి. కాని తాను అందరివాడినంటూ రాజకీయం మొదలు పెట్టాడు. తనకు ఏ కులం లేదన్నాడు. అందరి వాడిని అని చెప్పినా ప్రజలు నమ్మలేదు. ఏ కులం పవన్‌ను నమ్మి ఓట్లు వేయలేదు. వెంటే తన రూటు మార్చుకున్నాడు. కుల రాజకీయం చేస్తే తప్ప రాజకీయ మనుగడ లేదనుకున్నాడు. కులాన్ని ఏకంచేసే పని పెట్టుకున్నారు. ఇక్కడ సక్సెస్ సాధించాడు. కులం లేని రాజకీయం లేదని జ్ఞానోదయం పొందాడు. ఆ కులం పునాదుల మీద మత రాజకీయాన్ని నిలిపి ఇక తనకు తిరుగుండదన్న ఆలోచన చేశాడు. ఇదే సమయంలో తిరుమల లడ్డూ వివాదం తనకు కలిసొస్తుందని భావించాడు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మించి స్పందించడం మొదలు పెట్టారు. విజయవాడుకు వరదలు వచ్చిన సమయంలో ఆయన ప్రజలకు దూరంగా వున్నారు. ఏదో సాకుచెప్పి తప్పించుకున్నాడు. కాని మత రాజకీయం అవసరం వచ్చేసరికి ఈ వారంలో రోజుల్లోనే రకరకాల విన్యాసాలు వేశాడు. తిరుమలలో అపచారం జరిగితే అక్కడ ప్రాయశ్చితం చేసుకోవాలి. కాని విజయవాడ కనకదుర్గ ఆలయం మెట్లు కడిగి పాపపరిహారం చేసినట్లు చెప్పుకున్నాడు. విచిత్రమైన రాజకీయం నెరిపాడు. ఇక ప్రాయశ్చిత్త దీక్ష పేరును మొదలు పెట్టి తనకన్నా హిందూ పరిరక్షకుడు లేడన్నట్లు విపరీత ప్రచారం మొదలు పెట్టారు. అది మొదటికే మోసం తెచ్చిపెట్టింది. మొదటి నుంచి పవన్ చెప్పుకునే సినీ డైలాగ్ ఇప్పుడు మళ్లీ ఆయనకే విచిత్రంగా వినిపిస్తోంది. నాకొక తిక్కుంది..అదిసినిమాల వరకే లెక్క పనిచేసింది..కాని ఇప్పుడు ఆ తిక్కకు రాజకీయల్లో దారి మూసుకుపోయే పరిస్ధితి ఎదురౌతోంది. ఇక ఆ తిక్కేమిటో ఆ లెక్కేమిటో ప్రజలు కూడ తేల్చే సమయం భవిష్యత్తులో ఎలా వుంటుందో చూడాలి. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రింకోర్టు వ్యాఖ్యలతో పవన్ రాజకీయం ఎటు మలుపు తిరుగుతుందో కూడా చూడాలి.