`తిరుగుబాటుకు తొలి అంకం.
`శాంతి భద్రతలపై బహిరంగ వ్యాఖ్యలు ప్రభుత్వానికి నష్టదాయం.
`ప్రతిపక్షానికి ఆయుధం అందించడం.
`తమ పాలనను తామే నిందించుకోవడం.
`కూటమిపైనే ఘాటు విమర్శలు.
`పోలీసు వ్యవస్థ మీద అసహనం.
`పాలన మీద నిర్వేదం.
`నేను రంగంలోకి దిగుతా అని హెచ్చరిక.
`రాజకీయంగా పట్టు కోసం తాపత్రయం.
`పోటీ చేసిన సీట్లలో గెలవడంతో పెరిగిన విశ్వాసం.
`అవరమైతే ప్రతిపక్ష పాత్రతో ఎదిగేందుకు ప్రయత్నం.
`జమిలీ ఎన్నికల నాటికి జనసేనను విస్తరించేందుకు వ్యూహాం.
`పాలనలో లోపాలకు తనకు సంబంధం లేదని చెప్పే సంకేతం.
`మంచిని మాత్రమే చెప్పుకోవడానికి ఇష్టం.
`కూటమి పేరుతో తనపై విమర్శలు రాకుండా చెప్పుకోవడం.
`ప్రభుత్వ వైఫల్యాలపై తన బాధ్యత కాదని తెలిపే ప్రయత్నం.
`తాను ముఖ్యమంత్రినైతే పాలన దూకుడుగా వుంటుందని చెప్పడం.
`బావోద్వేగాల రాజకీయ పునాదుల నిర్మాణం.
`జమిలి ఎన్నికలలో సగం సీట్లు సంపాదించుకునేందుకు మార్గం.
`ముఖ్యమంత్రి తర్వాత హోం శాఖ ఎంతో కీలకం.
`శాంతి భద్రతలు బాగాలేవంటే అది ప్రభుత్వ వైఫల్యం.
`అందుకు నాది బాధ్యత కాదన్నట్లు పరోక్షం వ్యాఖ్యానం.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఎవరు ఔనన్నా , ఎవరు కాదన్నా అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడవకముందే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుబాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలపై ఆవేశపూరితంగా మాట్లాడిన పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేకపోయినా, సమయం, సందర్భం చూసుకొని చెపాల్సిన మాటలు. హోం మంత్రి అనిత తన శాఖ మీద పట్టుకోల్పోయారన్న అర్ధం వచ్చేలా పవన్ వ్యాఖ్యలున్నాయని అనే వారుఅ ంటున్నారు. అయితే ఇక్కడ హోంశాఖ మంత్రి అనితకు కేవలం హోం, డిజాస్టర్ మేనేజ్ మెంటు పోర్టుపోలియోలు మాత్రమే వుంటాయి. లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా ముఖ్యమంత్రి చేతిలోనే వుంటాయి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే హోంశాఖను ఎవరికి కేటాయించినా, లాఅండ్ ఆర్డర్ అనేది వారి వారి చేతుల్లో వుంటుంది. ఈ మాత్రం పవన్‌కళ్యాణ్‌కు తెలియకుండా వుంటుందా? నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అనలేక, హోంశాఖ మంత్రి అనితనుద్దేశించి అన్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నేనే హోం శాఖ మంత్రినైతే పరిస్ధితులు మరో రకంగా వుండేవన్నారు. రాష్ట్రంలో నేరాలు ఇలాగే జరిగిపోతుంటే, హోం శాఖను తాను తీసుకోవాల్సి వస్తుందన్నారు. హోంశాఖ ఎవరు తీసుకున్నా, లాఅండ్ ఆర్డర్ మాత్రం మంత్రులకు ఇవ్వరు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే లా అండ్ ఆర్డర్‌ను ఇతరులకు ఇవ్వరు. ఇది ఆనవాయితీగా వస్తుంది. కేవలం కేంద్రంలో మాత్రమే హోం శాఖ చేతిలో లా అండ్ ఆర్డర్ వుంటుంది. రాష్ట్రాలలో ఆ పోర్టుఫోలియే హోం శాఖ మంత్రులకు ఇవ్వరు. ఎందుకంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తితే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయాల్సిందే అన్న సగతి పవన్‌కు తెలుసు. అయినా హోం మంత్రికి సూచనలు చేయడంలో అర్ధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కూడా గడవలేదు. అప్పుడే అంత చూమంతర్ కాలీ అన్నట్లు జరిగిపోవాలని అనుకుంటే కుదరదు.
లాం అండ్ ఆర్డర్ బాగా పనిచేస్తే రాష్ట్రం అభివృద్ది చెందుతుంది. నేర రహిత సమాజం నిర్మాణమౌతుంది. ప్రజలు స్వేచ్ఛగా, సంతోషంగా జీవిస్తారు. భయం లేకుండా అందరూ ఆనందంగా వుండేందుకు దోహదపడుతుంది. వాటిని ఎవరూ కాదనలేరు. కాని కొంత కాలంగా మౌనంగా వున్న పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో వున్నప్పుడు ఎలా ఊగిపోతూ మాట్లాడేవారో..ఇప్పుడు అదే ధోరణికి వచ్చారు. కారణం రాజకీయం. ఇంతకు మించి ఏమీ లేదు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ బలవంతుడయ్యాడన్నది ఒక అంశం. ప్రజలు జనసేను ఆదరించారు. గతంలో పట్టించుకోని ప్రజలు, పవన్ వ్యాఖ్యలను విన్నారు. ఆయన వల్ల సమాజంలో మార్పు వస్తుందని భావించారు. జనసేన పోటీ చేసిన సీట్లన్నీ గెలిచారు. అయితే ఆ గెలుపులో ఇటు తెలుగుదేశం, అటు బిజేపి సపోర్టు ఎంతో వుందన్న సంగతి మర్చిపోవొద్దు. ఇక రెండేళ్లలో జమిలీ ఎన్నికలు రానున్నాయి. ఈ లోపు తెలుగుదేశం నీడలోనే రాజకీయాలు చేయాలని పవన్ అనుకోవడంలేదు. జనసేన నాయకులు కూడా భావించడంలేదు. ఇప్పుడు ఒంటరిపోరు కూడా మనకు కలిసి వస్తుందన్న నమ్మకం వారిలో కలిగింది. గతంలోనే పవన్ కళ్యాన్ అవసరమైతే మనమే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుందని కూడా చెప్పారు. అవి ఆనాడు పవన్ కళ్యాణ్ ఆయాచితంగా అన్న మాటలు కాదు. మనం బలపడ్డాం. మరింత బలపడాలంటే, మన దారి మనం ఏర్పరుచుకోవాలన్న సంకేతాలు ఎప్పుడో పంపించారు. ఇప్పుడు వాటిని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ పిఠాపురంలో రెండుపార్టీల మధ్య సఖ్యత లేదు. రెండు పార్టీల మద్య గొడవలు జరుగుతూనే వున్నాయి. అవి రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు పాకాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణలు తమని పట్టించుకోవడం లేదని జన సైనికులు అంటున్నారు. జనసేనే నేతలు తమ ఇష్టారాజ్యం చేస్తున్నారని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి. ఈ పోరు ఇలా సాగుతున్న క్రమంలోనే పవన్ రాష్ట్ర ంలో శాంతి భద్రతల సమస్యలను తెరమీదకు తేవడంలో రాజకీయం తప్ప మరో అంశం లేనే లేదనిపిస్తుందంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలపై చర్చించాలనుకుంటే క్యాబినేట్ మీటింగ్‌లో పవన్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పొచ్చు. లేకపోతే నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లొచ్చు. అంతే కాని పాలనాపరమైన అంశాలను బైట పెట్టడం అంటే పొత్తు ధర్మాన్ని తప్పడమే అవుతుంది. తన దారి తాను చూసుకునే రోజులు వచ్చాయని చెప్పినట్లౌవుంది.
ఏదేమైనా పవన్ వ్యాఖ్యల వల్ల ప్రతిపక్షానికి ఆయుధం అందించడమే అవుతుంది. పైగా ఈ విషయంలో ప్రభుత్వం ఒక వేళ విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తే, ఆ విషయంలో నాకు సంబంధం లేదని ముందే తప్పుకునే ఎత్తుగడే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ విజయాలలో మాత్రమే నేను పాలు పంచుకుంటున్నప్పుడు, ఫెయిల్యూర్స్‌కు కూడా బాద్యత వహించాలి. నాకు, జరుగుతున్న శాంతిభద్రతల వైఫల్యానికి తమ పార్టీకి సంబంధం లేని తేల్చిచెప్పే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా తాను ముఖ్యమంత్రిని అయి వుంటే ఇలాంటి సమస్యలు లేకుండా వ్యవస్ధను ప్రక్షాళన చేసేవాడిని అని చెప్పుకోవడం కూడా అవుతుంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా నన్ను నమ్మండి. నా చేతిలో ఏమీ లేదని, నా చేతికి పూర్తి పగ్గాలిస్తే నేనేమిటో చూపిస్తాని చెప్పడమే అవుతుంది. పవన్ కళ్యాణ్ ఆది నుంచి భావోద్వేగాల మీదనే రాజకీయం చేయాలని చూస్తున్నాడు. ఆ దిశలోనే విజయం సాధించాడు. ప్రతిపక్షంలో వున్నప్పుడు నాకు అవకాశమివ్వండి? ఒక్కక్కొరి తాట తీస్తానంటూ సినీ డైలాగులు చెప్పేవారు. ప్రజలు నమ్మారు. గెలిపించారు. ఇప్పుడు మీరు చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి? అని ప్రజలు ప్రశ్నించకముందే, పూర్తి బాధ్యతలు నా చేతిలో ఏమున్నాయని చెప్పడానికి పవన్ రాజకీయం మళ్లీ మొదలు పెట్టారు. ఇది ఇప్పుడు చిన్నగా కనిపించొచ్చు. కాని రాజకీయం రాను రాను ముదిరితే తప్ప అసలు రాజకీయం అర్దం కాదు.
సాక్ష్యాత్తు ఒక ఉప ముఖ్యమంత్రి వ్యవస్ధలు సరిగ్గా పనిచేయడం లేదని భహిరంగంగా ప్రశ్నించడమంటే ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడమే అవుతుంది. నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకుడే అయితే ఈ వ్యాఖ్యలు చేసేవారు కాదు. హోంశాఖ ఫెయిల్ అయినట్లు అర్ధమొచ్చే విధంగా మాట్లాడేవారు. గతంలో పనిచేసినట్లు పోలీసులు ఇప్పుడు ఎందుకు పని చేయడం అని ప్రశ్నించడం వెనకు ఆయన మనోగతం అర్దం చేసుకోవచ్చు. పోలీసుల ఆత్మాభిమానం దెబ్బతినేలా నేరస్థులకు కులాలను, మతాలను ఆపాదించడం జరగుతుందా? నేరస్ధులను పోలీసులు వెనకేస్తున్నారనేలా మాట్లాడొచ్చా? చట్టం ఎవరికీ చుట్ట కావొద్దు. పోలీసు యంత్రాంగమంటే ప్రభుత్వాలు పరిగెత్తమనగానే జీ హుజూర్ అనేలా వుండాలా? ప్రభుత్వ రంగ వ్యవస్ధలన్నీ వేరు. పోలీసులు వ్యవస్ధ వేరు. పోలీసులకు వున్నంత బాధ్యత ఇతర శాఖలకు వుండదు. సమాజం కోసం అహర్నిషలు పనిచేసే యంత్రాంగం పోలీసులది. సమాజంలో జరుగుతున్న అక్రమాలకు, అన్యాయాలకు, నేరాలకు పోలీసులెలా బాధ్యులౌతారు? పోలీసులు కఠినంగా వుంటే సమజంలో నేరాలు తగ్గుతాయని వింటుంటాం. నేరస్థులపై పోలీసులు చర్యలు తీసుకుంటే చట్టాన్ని పోలీసులు చేతుల్లోకి తీసుకోవద్దని నాయకులే అంటారు. పోలీసులు ఉద్యోగాలు కత్తిమీద సాములాంటివి. నాయకులు, పాలకుల వైఫల్యాలను ఎప్పుడూ పోలీసుల మీద రుద్దొదు. పోలీసులు గత పాలకుల కొమ్ముకాస్తున్నారన్న విమర్శలు ఇప్పుడే కాదు, ఎప్పుడూ వుంటాయి? అందుకు ప్రోటోకాల్స్ కూడా వుంటాయి. ఇక నేరాల అదుపు విషయంలో అందిన సమాచారం మేరకు స్పందించేందుకే పోలీసులున్నారు. పాలకులే వ్యవస్ధలను తమకు అనుకూలంగా మల్చుకొని పనిచేయించుకోవడం వల్లనే ఇలాంటి పరిస్ధితులు ఎదురౌతుంటాయి. కాని నేరాల కట్టడికి పోలీసులు చేయాల్సినంత శక్తికి మించి చేస్తుంటారు. పాలకులే వారిపై విమర్శలు చేయడాన్ని ప్రజలు కూడా హర్షించరు. పోలీసులు వైఫల్యం చెందారు అని అంటే అందుకు పాలకులే కారణమనుకుంటారే గాని, పోలీసులను ఎవరూ నిందించరు. ఈ విషయం పవన్ తెలుసుకుంటే ఎంతో మంచిది. నేరం జరగ్గానే శిక్ష అమలు చేయడం అంటే ఇదేమైనా సినిమానా? చట్టం, న్యాయం అనేవి వుంటాయి. వాటి పరిధికి లోబడే పోలీసు వ్యవస్ధ పనిచేస్తుంది. నాయకులు చెప్పినట్లు కొన్ని సార్లు ఒత్తిళ్లకు తలొగ్గి, తర్వాత కోర్టుల చుట్టూ తిరుగుతున్నపోలీసులు ఎంతో మంది వున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారున్నారు. జైలు జీవితాలు కూడా అనుభవించిన వారున్నారు. ఆ తర్వాత ఏ నాయకుడు వారిని ఆదుకోడు. పాలకులు వస్తుంటారు..పోతుంటారు..పోలీసులే శాశ్వతం.