`మంత్రి పదవుల కోసం మరింత సమయం!
`పార్టీ పదవులు మాత్రం సిద్దం!
`దాదాపు కార్యవర్గ పదవుల జాబితా సిద్ధం!
`పార్టీ పదవులు కూడా మరో మూడురోజుల తర్వాత విడుదలయ్యే అవకాశం.
`రోహిన్ రెడ్డి కి వర్కింగ్ ప్రెసిడెంట్.
`సీనియర్లకు పార్టీ పదవులలో సముచిత స్థానం.
`నాయకులలో అసంతృప్తి లేకుండా పదవుల పంపకం.
`పార్టీ క్రియాశీల బాధ్యతలతో నాయకులు సంతృప్తి చెందుతారని అధిష్టానం నమ్మకం.
`అన్ని జిల్లాల నాయకుల సూచనల మేరకు పార్టీ నిర్మాణం.
`స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం.
`ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు తక్కువ రాకుండా నాయకత్వం పటిష్టం.
`ప్రతి పక్షాల కన్నా ముందే ప్రజల్లోకి నాయకులు వెళ్లాలని ఆదేశం.
`ప్రభుత్వ పథకాలపై, నిర్ణయాలపై పకడ్బందీగా ప్రచారం.
`సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, రేషన్ కార్డులపై ప్రజల్లో అవగాహన పెంచడం.
`మంత్రి వర్గ విస్తరణపై ఎటూ తేల్చలేకపోతున్న అధిష్టానం!
`ఎటూ తేల్చుకోలేకపోతున్న రాష్ట్ర యంత్రాంగం.
`కావాలనే వాయిదా పడుతున్నట్లు సంకేతం.
`తప్పని పరిస్థితుల్లోనే దూరం జరుపుతున్నట్లు సందేశం.
`ఆరు పదవులు అందరికీ పంచలేక తల పట్టుకుంటున్న అధిష్టానం
హైదరాబాద్ ,నేటిధాత్రి:
ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో వున్న కొంత మంది నాయకులకు సంతోషకమైన వార్త. మరో రకంగా మంత్రి పదవులు ఆశిస్తున్న నాయకులకు కొంత చేదు గుళిక. ఎందుకంటే మంత్రి పదవుల పంపకం మరికొంత ఆలస్యమయ్యే సూచనలు కనిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఎంత వడబోసినా, ఎక్కడో సరైన సమ ప్రాధాన్యత అందరికీ కలిగించాలన్న ఆలోచనతోనే కాస్త ఆ ముహూర్తం దూరం జరుగుతోంది. కాకపోతే ఎంత ఆలస్యమైనా, సరే బెస్ట్ అనిపించుకునేలా విస్తరణ వుండాలన్నదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోరుకుంటోంది. సహజంగా ఎమ్మెల్యేలందరికీ మంత్రులు కావాలని కోరిక వుంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అయ్యేదాకా అదో తంటా. ఏళ్లకేళ్లు ఎదురుచూసి, చూసి, అవకాశం వచ్చినా రాజకీయ పరిస్ధితులు అనుకూలించక ఎమ్మెలు కాని వాళ్లు చాల మంది వుంటారు. వాళ్లలో అనేక సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి, ఓడిపోయి, గెలిచిన వాళ్లుంటారు. మరికొంత మంది ఎమ్మెల్యే కావడానికి పెద్దగా ఇబ్బందులు పడే పరిస్ధితి రాదు. అలాంటి వారు మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేలు అవుతుంటారు. రాజకీయ పరిస్దితులు రాష్ట్రంలో ఎలా వున్నా, ఎమ్మెల్యేలుగా గెలుస్తూనే వుంటారు. అటు ఓడిపోయిన వారైనా, ఇటు ఎప్పుడూ గెలుస్తుండేవారైనా పార్టీకి సేవ చేస్తూనే వుంటారు. అలా అవకాశాలు వచ్చి, ఎమ్మెల్యేలు అయిన వారు మంత్రులు కావాలనుకోవడం తప్పు కాదు. మంత్రులు కావాలన్న వారి కోరిక మొదటిసారే తీరే వారు కొందరుంటారు. ఎన్ని సార్లు ఎమ్మెల్యేలు అయినా మంత్రులు కాని వారు కూడా చాలా మంది వుంటారు. అయినా ఎక్కడో ఆశ వారిలో సజీవంగా వుంటంది. ఒక్కసారైనా మంత్రి కావాలని బలంగా కోరుకుంటారు. కాని ఇక్కడ మరో మతలబు వుంటుంది. ఒక్కసారి మంత్రి అయిన నాయకుడు సీనియర్ మంత్రిగా పదే పదే పార్టీ అధికారంలో వున్నంత కాలం మంత్రులుగా పనిచేయాలని కోరుకుంటారు. అలా అవకాశాలు దక్కుతుంటాయి. ఇప్పుడున్న కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జానారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే అందరికన్నా ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన నాయకుడిగా చిరిత్ర సృష్టించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా వున్న తుమ్మల నాగేశ్వరరావు కూడా అంతే..ఆయన ఏ పార్టీలో వున్నా మంత్రిగా వుంటూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నుంచి, తర్వాత బిఆర్‌ఎస్ నుంచి, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మంత్రి పదవి అందుకున్నారు. ఇలాంటి అవకాశం అందిరికీ రాదు. చాలా అరుదుగా వస్తుంది. గతంలో మంత్రిగా పనిచేసిన మంధని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇప్పుడు మరోసారి మంత్రి అయ్యారు. ఇలా కొంత మందిని పదవులు వాటంతటవే వరిస్తుంటాయి. చాలా మందికి మంత్రి పదవి దక్కినట్లే దక్కి చేజారిపోతుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడో మంత్రి కావాల్సిన కమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు. నల్లగొండ నుంచి మరో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా అలా అవకాశాలు కలిసివచ్చి ఇప్పుడు కూడా మంత్రులుగా పనిచేస్తున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఇప్పుడు మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో పలుసార్లు మంత్రిగాపనిచేసిన నిజాబామాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన మైనార్టీ నాయకుడు షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో వున్నా అదృష్టవంతుడు అనే పేరు వుంది. కాని ఈసారి ఆయన మంత్రి కాలేకపోతున్నారు. కాని ఆయన పేరు కూడా వినిపిస్తూనే వుంది. కాని ఆయనకు దక్కకపోవచ్చు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వస్తే, తాను గెలిస్తే మంత్రి కావాలనుకున్న మరో నాయకుడు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆయన గతంలో విప్‌గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని వదిలి బిజేపిలో చేరారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు అనే పేరు వుంది. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి కావాలన్న ఆశ కూడా వుండేది. కాని దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే కాలేకపోయారు. నిజంగా ఆయన గత ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ రాజకీయమే వేరేలావుండేదని ఆయన సన్నిహితులు అంటుంటారు. అలా అదృష్టం ఖాతలో మొదటిసారి ఎమ్మెల్యే అయినా బిసి నాయకుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ మంత్రి అయ్యారు. అంటే రాజకీయ పదవులు కూడా అదృష్టంతో ముడిపడి వుంటాయని చెప్పడానికి ఇవన్నీ సాక్ష్యాలనే అని చెప్పాలి. గతంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడూ కూడా గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆందోల్ ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహ ఈసారి మంత్రి అయ్యారు. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు మంత్రులౌతారన్న వాటికి కొన్ని లెక్కలుంటాయి. ఆ లెక్కలు దాటితేనే మరి కొంత మందికి అవకాశం వస్తుంది. మంత్రులయ్యే ఛాన్సు వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఆరు మంత్రి పదువులు ఖాళీగా వున్నాయి. వాటిలో ఓ నలుగురైదుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు. ఎందుకంటే మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపిగా, ఒకసారి ఎమ్మెల్సీగా, పిపిసి. అధ్యక్షుడుగా పనిచేసిన వి. హనుమంతరావు మంత్రి కావాలని, ముఖ్యమంత్రి కావాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కాని ఆయన పలుసార్లు టికెట్ ఇచ్చినా గెలవలేదు. ఆయనకు చాలా కాలంగా కాలం కలిసి రావడం లేదు. ఆయన ఆశ తీరే పరిస్దితి ఇక కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడున్న పరిస్దితుల్లో నిజామాబాద్ జిల్లాకు ప్రాదాన్యత లేకపోవడంతో సుదర్శన్‌రెడ్డి పేరులో ఎలాంటి మార్పు లేకుండా వినిపిస్తోంది. అయితే షబ్బీర్ అలీ పేరును ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారన్నది వేచి చూడాలి. ఇక కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఆయన ఆశ తీరుతుందా? లేదా? అన్నది ఎవరూ చెప్పలేని పరిస్ధితి. ఇటీవల పార్టీ అధిష్టానం భుజ్జగించిందని, ఆయన అందుకు ఒప్పుకున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అది ఎంత వరకు నిజమన్నది ఎవరికీ తెలియదు. ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు పదవి తీసుకొమ్మని చెప్పినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. కాకపోతే చాల మందికి తెలియని విషయం ఏమిటంటే జాతీయపార్టీలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు సహజంగానే పార్టీ ఉపాధ్యక్షులు అని చెప్పుకుంటారు. ఎంత మంది ఎమ్మెల్యేలున్నారో వాళ్లంతా ఉపాధ్యక్షులే అవుతారు. అలాంటి వారికి ప్రత్యేకంగా వర్కింగ్ ప్రెసిడెంటు ఇచ్చినంత మాత్రాన బాద్యతలు ఎక్కువగా వుండకపోవచ్చు. కాని గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా వున్న జగ్గారెడ్డికి ప్రత్యేకంగా వర్కింగ్ ప్రెసిడెంటు పదవి ఇచ్చారు. దాంతో ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంటు పదవి ఇచ్చి బుజ్జగించే అవకాశాలున్నాయి. కాకపోతే వర్కింగ్ ప్రెసిడెంటు అనేది ఆరో వేలు లాంటిదే..అలాంటి పదవిని రాజగోపాల్‌రెడ్డి తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి. ఇక మరో జిల్లా ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యే గడ్డం సోదరులు ఇద్దరూ మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరూ తగ్గేదేలే అన్నట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కాని వివేక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ పేర్లు మాత్రంపదే పదే వినిపిస్తున్నాయి. కాని పదవులు పంపకాలు ఆలస్యమౌతున్నాయి. ఇదే సమయంలో పార్టీ పదవుల పంపకాలకు మాత్రం ముహూర్తం ఫిక్స్ అయిందనే అంటున్నారు. నిజానికి మంగళవారం పార్టీ పదవుల జాబితా విడుదలౌతుందన్న ప్రచారం విసృతంగా జరిగింది. అందులో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు వున్నట్లు తెలుస్తోంది. పూర్తి జాబితాను ఈ నెల 30లోగా ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం వుందని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఖైరతాబాద్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు పదవి వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఏది ఏమైనా మంత్రి పదవులు ఇంకా ఆలస్యమైనా సరే, పార్టీ పదవులు తొందరగా పంపకాలు జరుగుతాయని తెలుస్తున్నందుకు నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.