‘‘ఓఎస్డీ’’లే మంత్రులను నిండా ముంచే మాయగాళ్లు?
`అది అర్ధం కాకా మంత్రులు అధికారుల మీద కేకలు వేస్తారు?

`అదే ‘‘పిఏ,పిఆర్ఓ’’ ల వల్ల ఓడిపోయిన మంత్రులు, ఎమ్మెల్యేలే ఎక్కువ?
`ఇటీవల మంత్రులకు సెల్‌ఫోన్ పట్టుకోవడం కూడా బరువైపోతోంది!

`అదే పిఏ,పిఆర్ఓ లకు వరమైపోతుంది?
`పిఏ, పిఆర్ఓ లు మీ వెనకే వుంటారు? గోతులు తవ్వుతారు?

`కోవర్టులుగా ఇతర పార్టీలకు సమాచారం చేరవేస్తారు?
`అధికారుల మీద తోసేస్తారు? అనుమానాలు సృష్టిస్తారు?
`నమ్మకస్తులుగా నటిస్తారు? భయపడినట్లు కనిపిస్తారు?
`నమ్మకం పెంచుకొని మోసం మొదలుపెడతారు?
`మంత్రుల వద్ద పనిచేస్తున్న పిఏ, పిఆర్ఓ లు గతంలో ఇతర మంత్రుల వద్ద పనిచేసిన వాళ్లే!
`అనుభవం ఉందన్న నమ్మకంతో మంత్రులు అవకాశమిస్తారు?
`ఆ అవకాశాన్ని అనువుగా మార్చుకొని సమాచారం చేరవేస్తుంటారు?
`గత పదేళ్లు పనిచేసిన వారికి విశ్వాసం చూపిస్తారు?
`ఇప్పుడు నమ్మిన వాళ్లను నిండా ముంచేస్తుంటారు?
`అధికారులను లీకు వీరులని ముద్రవెస్తుంటారు?
`తప్పులు తమమీదికి రాకుండా చూసుకుంటారు?
`అదే పిఆర్ఓ, పిఏ లు ఇప్పటి మంత్రుల పక్కనే?
హైదరాబాద్, నేటిధాత్రి:
నమ్మకమే మోసాని పునాది. నమ్మకమే మోసం చేయడానికి అసలైన దారి. నమ్మకం లేకుంటే మోసం చేయడం వీలు కాదు. నమ్మకం కల్గించకపోతే మోసం చేయడం సాధ్యమే కాదు. అలాంటి నమ్మకాన్ని కలిగినట్లే కలిగి, మోసం చేసే వాళ్లు పిఏ, పిఆర్ఓల రూపంలో మంత్రులు, ఎమ్మెల్యేల పక్కనే వుంటారు. ఎంతో నమ్మకంగా మంత్రులను బోల్తా కొట్టిస్తుంటారు. ఆ మంత్రుల రాజకీయాలను కూడా ఆగం చేస్తుంటారు. ప్రభుత్వాలను కూడా కుంగదీస్తుంటారు. అందుకే పిఏ పిఆర్వోలే లీకు వీరులు చెబుతుంటారు? ఓఎస్డీలే మంత్రులను నిండా ముంచే మాయగాళ్లు అని అంటుంటారు? అవి అర్ధం కాక మంత్రులు, ఎమ్మెల్యేలు అదికారుల మీద అరుస్తుంటారు. కేకలేస్తుంటారు? మంత్రులు చేయాలనుకున్న పనులను కూడా పిఏ, పిఆర్వో, ఓఎస్డీలు అడ్డుకుంటారు. అది మంత్రికి కూడా తెలియనంత సీక్రెట్‌గా వుంచుతారు? ఎందుకంటే పిఏ, పిఆర్వోలు ఎప్పుడూ మంత్రుల వెంటే వుంటారు. మంత్రుల వెనకే వుంటారు. మంత్రులు ఎవరితో ఏం మాట్లాడుతున్నా వింటారు. వాటిని చేరవేస్తుంటారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు గోతులు తవ్వుతుంటారు. మంత్రులు, ఎమ్మెల్యేల పిర్వోలు, పిఏలకు అన్ని పార్టీల ఎమ్మెల్యేతో పరిచయాలుంటాయి. గుర్తింపు వుంటుంది. పైగా గతంలో ఈ పిఏలు, పిఆర్వోలు ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద కూడా పనిచేసి వుంటారు. దాంతో మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలతో సత్సంబందాలు గట్టిగా వుంటాయి. ఆ ఎమ్మెల్యేలు ఓడిపోవడం వల్లనో, పార్టీలు అదికారం కోల్పోవడం వల్లనో వారు మరో పాలక పక్షం ఎమ్మెల్యేలు, మంత్రుల పంచన చేరుతారు. తమకు వున్న అనుభవాన్ని చెప్పి ఒప్పించుకుంటారు. అవసరమైతే రెకమండేషన్ చేయించుకొని ఇతర మంత్రుల వద్ద చేరిపోతుంటారు. అందువల్ల అందరికీ కృతజ్ఞతగా వుంటున్నట్లు నటిస్తుంటారు. కాని నమ్మిన వాళ్లను మోసం చేస్తున్నామన్న భావన కించిత్ కూడా పిఏ, పిఆర్వోలకు వుండదు. ఎవరు అధికారంలో వుంటే వారికి భజన చేస్తుంటారు. ఆ భజన నిజమే ఆ నాయకులు, మంత్రులు నిజమే అని నమ్ముతుంటారు. ఎంతో నమ్మకస్తులుగా నటిస్తుంటారు. ఎంతగా అంటే మంత్రులంటే, ఆ ఎమ్మెల్యేలంటే ఎంతో భయపడినట్లు కూడా కనిస్తుంటారు. దాంతో పూర్తిగా ఆ పిఏలను, పిఆర్వోలను ఎంతో నమ్ముతుంటారు. ఆ నమ్మకమే చాలా సార్లు మంత్రులు, ఎమ్మెల్యేల కొంప ముంచిన సందర్భాలు కూడా అనేకం వున్నాయి. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం జీవో విడుదల చేయకముందే ప్రతిపక్షాలకు ఆ జీవో చేరిందనే వార్త పెద్దఎత్తున ప్రచారం జరుగుతుండడంతో ఈ విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తోంది. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓ బృహత్తరమైన కార్యక్రమం చేపట్టాలని సంకల్పించింది. దాని కోసం ఎంతో కసరత్తు చేసింది. ఎంతో గోప్యంగా ఆ పని చేయాలనుకున్నది. రాష్ట్రాభివృద్ది కోసం, ముఖ్యంగా నగర విస్తరణ కోసం చేపట్టాలనుకున్న కార్యక్రమం ముందే ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇదెలా సాద్యమైందని ప్రభుత్వ పెద్దలే ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే సామెతను పిఏ, పిఆర్వో, ఓఎస్డీల రూపంలో పాలకపక్షంలో వుంటారు. ప్రభుత్వంచేస్తున్న పనులన్నీ లీకులు చేస్తుంటారు. ప్రతిపక్షాలకు ఉప్పందిస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ దొరికే జీతాలన్నా, చిన్న విషయాన్ని ప్రతిపక్షాలకు చేర వేస్తే వచ్చేది ఎక్కువ. అందుకే ఇలాంటి దుర్భిద్ది పనులు చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ మద్య ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్నే లీకు చేశారు. అది ఎవరన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఫలానా వ్యక్తి అంటూ కూడా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. కాని వాళ్లు ఎవరు? అంటే మాత్రం పాలకులకు అత్యంత సన్నిహితంగా వుండే వారే అన్నది అందరికీ తెలుసు. నమ్మితేనే కదా! మోసం చేసేది అనే సామెతను నిజం చేస్తుంటారు. ఇతర పార్టీలకు కోవర్టులుగా మారి సమాచారం చేర వేస్తుంటారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రచారం చేయడం మానుకొని, చేయాలనుకుంటున్న పనులపై ముందే లీకులిస్తారు? ప్రభుత్వాలను ఇరుకున పెడుతుంటారు. పైగా ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రతి పనిని నిశితంగా గమనిస్తుంటారు. ప్రతిపక్షాల నాయకులకు చేర వేస్తుంటారు. అది తెలుసుకోకుండా మంత్రులు, పాలకపక్ష పెద్దలు ముందు అదికారుల మీద అనుమానపడుతుంటారు. ఎందుకంటే పాలసీ మ్యాటర్లు అన్నీ ముందుగా తెలిసేది అధికారులకే! వాళ్లే వాటిని తయారు చేస్తారు. ప్రభుత్వం ముందు వుంచుతారు? కాని చాలా మంది ఉన్నతోద్యోగులైనా, చిన్న ఉద్యోగులైనా సరే వాటిని గోప్యంగానే వుంచుతారు. ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తారు. ఏదైనా తేడా వస్తే ఉద్యోగానికే ఎసరు వస్తుందని భయపడతారు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేయడానికి ఇష్టపడతారు. అంతిమంగా తమ ఉద్యోగానికి ఎలాంటి రిమార్క్ రాకుండా చూసుకుంటారు. అందువల్ల ప్రభుత్వ పాలసీలను ఆదిలో అధికారులు లీక్ చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ ఉద్యోగులస్దాయిలోనే ఏదైనా లీక్ అయినట్లు ఇతర అదికారులకు అనుమానం వస్తే, వాటిని మార్చి కొత్త పాలసీలను తయారు చేస్తారు. అందవల్ల ఉద్యోగ వ్యవస్ద వద్ద జరిగే లీకులు చాలా తక్కువ. ఉద్యోగులంతా సుద్దపూసలని కాదు. కొద్ది మంది మాత్రమే లీకులిస్తుంటారు. మెజార్టీ ఉద్యోగులు నిబద్దతగానే బాద్యతలు నిర్వర్తిస్తుంటారు. కాని అన్ని వేళ్లు అదికారుల వైపే చూపిస్తుంటాయి. ఎక్కువగా మీడియా వ్యక్తులతో సంబాషణలు ఎక్కువగా చేసేది అదికారులే. ప్రభుత్వం గురించి ఏదైనా సమాచారం అందించాలన్నా అధికారులే ఆదారం. కాని ఏవి గోప్యంగా వుంచాలో? ఏవి మీడియాకు చెప్పాలో అధికారులకు తెలుసు? కాని మంత్రల, ఎమ్మెల్యేల అనుమానపు చూపులు అధికారులపైనే పడుతుంటాయి. అందుకు కారణం కూడా ఈ పిఏ, పిఆర్వో, ఓఎస్డీలే. ఎందుకంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువగా నమ్మేది పిఏ, పిఆర్వోలనే కావడం వల్ల అదికాలను లీకు వీరులగా భ్రమపడుతుంటారు. అలా అదికారులపై అనుమానాలు కలిగే విదంగా మంత్రులకు లేనిపోనివి చెప్పేది కూడా ఈ పిఏ, పిర్వోలే అనేది సత్యం. అలా నమ్మే మంత్రులను, ఎమ్మెలను మొదట మోసం చేసేది కూడా పిఏ, పిఆర్వోలే కావడం గమనార్హం. వీళ్లు మోసం చేయాడానికి కూడా ఒక కారణం వుంటుంది. గతంలో ఈ పిఏ, పిఆర్వోలు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద పనిచేసి వుంటారు. కొంత మంది పిఏ, పిర్వోలు, ఎక్కువ కాలం కూడా గత పాలకుల వద్ద పనిచేసి వుంటారు. ఆ విశ్వాసంతో కూడా కొంత మంది పిఏలు, పిఆర్వోలు వ్యవహరిస్తుంటారు. పైగా అక్కడి నుంచి అందే ముడుపులకు కూడ ఆశపడుతుంటారు. అధికారులను లీకు వీరులని ముద్ర వేసి, తమ మీదకు రాకుండా చాలా జాగ్రత్తపడుతుంటారు. ఇటీవల కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మంది కనీసం సెల్‌పోన్ పట్టుకోవడం కూడ బరువైపోతోంది. ఏదైనా కాల్ వచ్చినప్పుడు మాట్లాడడం తర్వాత, పిఏ, పిఆర్వోలకు ఇవ్వడం అలవాటు చేసుకుంటున్నారు. దాంతో పిఏలు, పిఆర్వోలు సంబందిత మంత్రి కన్నా ముందు వీళ్లే సమాదానం చెబుతుంటారు. కొన్ని కాల్స్ అవాయిడ్ చేస్తుంటారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు వచ్చే మెసేజ్‌లను కూడా మేనేజ్ చేస్తున్నారు. దాంతో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏం జరుగుతుందో కూడా తెలిసే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఆఖరుకు మంత్రుల, ఎమ్మెల్యే చేతికి సెల్‌పోన్ వచ్చే సరికి వాళ్లు మాట్లాడిన కాల్ లిస్టు మాత్రమే వుంటుంది. పిఏలకు నచ్చిన మెజేస్‌లు మాత్రమే కనిపిస్తుంటాయి. దాంతో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏం జరుగుతుందో కూడా తెలిసే పరిస్దితి లేకుండా పోతోంది. అలా మంత్రులు, ఎమ్మెల్యేలు పోన్లు పట్టుకోలేనంత బరువు కావడం కూడా పిఏలు, పిఆర్వోలకు వరమైపోయింది. ఇలా గతంలో పిఏ, పిఆర్వోలను గడ్డిగా నమ్మిన ఎమ్మెల్యేలు, మంత్రులు అనేక మంది ఓడిపోయిన వారు వున్నారు. కేవలం పిఏలు, పిఆర్వోల వ్యవహార శైలి వల్ల కూడా ఓటమి పాలైన నాయకులు చాలా మందే వున్నారు. అయినా మంత్రులు, ఎమ్మెల్యేలు వారినే నమ్ముతుంటారు. వాల్లనే పక్కన పెట్టుకుంటారు. అలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరుకు పాలక పక్షం సీక్రెట్లన్నీ బైటక వెళ్లిపోతుంటాయి. ఇప్పటికైనా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ పిఏ, పిఆర్వోల విషయంలో జాగ్రత్త వహించపోతే మొదటికే మోసం రావొచ్చు? రాజకీయం తలకిందులు కావొచ్చు!!
