
Collector
పనుల జాతర – 2025 కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
గురువారం ఐడిఓసి కార్యాలయం నుండి ఆగస్టు 22వ తేదీన నిర్వహించనున్న పనుల జాతర 2025 కార్యక్రమంపై
ఎంపిడిఓలు, ఎంపీఓలు, డిపిఓ, పీఆర్ ఇంజినీర్లు, ఏపీఓలతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా, ఫలప్రదంగా ఉండేలా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల జాతర ద్వారా గ్రామాల్లో జరుగుతున్న పథకాల అమలును ప్రజలకు తెలియజేసి, వారి అభిప్రాయాలను సేకరించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
అలాగే ప్రతి మండలంలో అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆగస్టు 22న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలల్లో 3.93 కోట్ల వ్యయంతో 1075 పనులు చేపట్టనున్నామని మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓ లు, ఎంపీఓలు భాగస్వాములు కావాలని తెలిపారు. పనుల జాతర 2025 లో భాగంగా ఆగష్టు 22న పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గత సంవత్సరం చేపట్టి పూర్తి అయిన పనులను ప్రారంభం, కొత్తగా చేపట్టిన పనులకు భూమి పూజ చేసి మొదలు పెట్టాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి గత సంవత్సరం చేపట్టి పూర్తి అయిన పనులను ప్రారంభించడం, నూతనంగా గుర్తించిన పనులకు భూమి పూజ నిర్వహించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం క్రింద పశువుల పాకలు, అజోల్ల, చెక్ డామ్స్, కంపోస్ట్ పిట్స్, పౌల్ట్రీ షెడ్స్, స్వచ్ఛ భారత్ మిషన్ క్రింద కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయాలని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఆగస్టు 22న కనీసం ఒక పనికి భూమి పూజ చేయాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పని రోజులు చేసిన దివ్యాంగుల కుటుంబాలను గుర్తించి వారిని సన్మానించాలన్నారు. గ్రామంలో నిబద్ధతతో పనిచేసిన మల్టీపర్పస్, పారిశుద్య కార్మికులను గుర్తించి సమావేశంలో వారిని సన్మానించాలని తెలిపారు. అలాగే గ్రామంలో స్వచ్ఛందంగా చెట్లు పెంపకంలో పాల్గొని ఇతరుల భాగస్వామ్యతో పచ్చదనాన్ని పెంపొందించడానికి తోడ్పాటు అందించిన వ్యక్తులను, కుటుంబాలను గుర్తించాలని వారిని కూడా సన్మానించాలని సూచించారు. నీటి సంరక్షణ భూగర్భ జలాలు పెంచే పనులను చేపట్టిన లబ్ధిదారులను గుర్తించి వారికి కూడా సన్మానం చేయాలన్నారు. ఫలవనాలు – వనమహోత్సవం కింద ఈత మొక్కలు, తాడిచెట్లు పండ్ల తోటలు పెంపకం లాంటి పనులను చేపట్టాలన్నారు. గుర్తించిన పనులకు మంజూరు ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్డిఓ బాల కృష్ణ, డిపిఓ శ్రీలత, పీఆర్ ఈ ఈ వేముకటేశ్వర్లు, అన్ని మండలాల ఎంపిడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పీఆర్ ఏ ఈలు తదితరులు పాల్గొన్నారు.