పంచాయతీ విధులను పకడ్బందీగా నిర్వహించాలి
– రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
– 100% ఆస్తి పన్ను వసూలు చేయాలి
– గ్రామాలలో ఆస్తుల రీ అసెస్మెంట్ కు ప్రణాళికాబద్ధంగా చర్యలు
– గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
– పంచాయతీ రాజ్ చట్టం పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి
– పంచాయతీ కార్యదర్శుల పని తీరు పై రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్
సిరిసిల్ల, మార్చి 13(నేటి ధాత్రి):
గ్రామాలలో ప్రభుత్వ విధులను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పంచాయతీ శాఖ పని తీరు పై పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ నిర్వహించారు. గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ, పన్నుల వసూలు, ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల ఫీజుల వసూళ్ల పై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, గ్రామాలలో ఉన్న రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలు, ఇండ్ల ఆస్తి పన్ను 100% వసూలు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరో 17 రోజులు సమయం మాత్రమే ఉందని,ఆస్తి పన్ను వసూలు లక్ష్యాలను చేరుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
జిల్లా వ్యాప్తంగా తక్కువ ఆస్తి పన్ను వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ ప్రత్యేకంగా రివ్యూ చేశారు. ఆస్తి పన్ను చెల్లించిన వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని అన్నారు.గ్రామాలలో అవసరమైన చోట ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆస్తి పన్ను విలువ పెంచాలని, రీ – అసెస్మెంట్ చేసి సరైన ఆస్తుల విలువ ప్రకారం పన్ను వసూలు చేయాలని కలెక్టర్ సూచించారు.
గ్రామాలలో వ్యాపారాల ట్రెడ్ లైసెన్స్ రెన్యువల్ సకాలంలో జరిగేలా చూడాలని, ట్రెడ్ లైసెన్స్ లేకుండా ఎక్కడైనా వ్యాపారాలు నిర్వహిస్తే సీజ్ చేయాలని అన్నారు. ట్రెడ్ లైసెన్స్ రెన్యువల్ పన్ను ముందుగా వసూలు చేయాల్సి ఉంటుందని అన్నారు. గ్రామాలలో మల్టీ పర్పస్ సిబ్బంది వేతనాలు ఎప్పటికప్పుడు పంచాయతీ నిధుల నుంచి చెల్లించాలని అన్నారు.
గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రభుత్వ పాఠశాలలు,అంగన్వాడీ కేంద్రాల పరిసరాలలో అపరిశుభ్రత అధికంగా గమనిస్తున్నామని, దీన్ని నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భవనాల పరిసరాల్లో పరిశుభ్రత పట్ల శ్రద్ద పెట్టాలని అన్నారు.రోడ్లను రెగ్యులర్ గా శుభ్రం చేయాలని, ప్రతి రోజు ప్రజల నుంచి చెత్త సేకరణ జరగాలని అన్నారు.
గ్రామాలలో పెండింగ్ ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులు క్లియర్ చేయాలని అన్నారు. ఆమోదించిన ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల నుంచి ఫీజు వసూలు చేయాలని, దరఖాస్తుదారులను ఫాలో అప్ చేస్తూ మార్చి 31 లోపు ఫీజు చెల్లించేలా చూడాలని, ప్రజలు ప్రభుత్వం కల్పించిన 25% రీబెట్ వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు.
ఎల్.ఆర్.ఎస్ చేసుకోకపోతే ఇంటి నిర్మాణం అనుమతులు, ఇతరులకు అమ్మేందుకు ఆస్కారం ఉండదని, ఎల్.ఆర్.ఎస్. చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.
ఈ సమావేశంలో డి.పి.ఓ. శరిపుద్దీన్, డి.ఎల్.పి.ఓ. నరేష్, డి.టి.సి.పి.ఓ. ఆన్సర్, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.