పడకేసిన జిల్లా, మండల టాస్క్ఫోర్స్ కమిటీలు

రియల్ ఎస్టేట్ జోరుగా. స్థానిక సంస్థల ఆదాయం బేజారుగా.

నాలా కన్వర్షన్ చట్టం-2020కు తిలోదకాలు

ఆదాయం రియల్ మాఫియాకు, అభివృద్ధి భారం స్థానిక సంస్థలకు

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉండటం, కరీంనగర్ పట్టణం క్రమక్రమంగా విస్తరిస్తుండటంతో పాటు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి మండలంలోని పలు గ్రామాలు చేరడంతో, మరికొన్ని కారణాల వలన రియల్ ఎస్టేట్ వ్యాపారం మారుమూల గ్రామాల్లోకి విస్తరించింది. ఒకప్పుడు పట్టణ పరిసర ప్రాంతాలకే పరిమితమైన వ్యాపారం సుమారు ఐదు ఏళ్లుపైగా పల్లె ప్రాంతాలకు విస్తరించడం, ప్రజలు సైతం తమకున్న ఆర్థిక వనరులతో నివాస స్థలాల మీద పెట్టుబడి పెట్టినట్లయితే సురక్షితమైన పెట్టుబడికి తగిన రాబడిగా భావించడం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసివచ్చింది. గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చౌకగా భూములు కొని దాన్ని ప్లాట్లుగా విభజించి ఎటువంటి లేఅవుట్ పర్మిషన్లు తీసుకోకుండా అమాయక ప్రజలను నమ్మించి అమ్మకాలు సాగిస్తూ లాభాలు గడిస్తుంటే పర్మిషన్లు లేని లేఅవుట్లలో స్థలాలు కొన్నటువంటి అమాయక ప్రజలు ఆస్థలాలలో ఇళ్లు నిర్మించుకోవాలంటే ఇంటి నిర్మాణ పర్మిషన్లు పొందడం చాలా ఇబ్బందిగా తయారైందన్న ఆవేదన ప్రజలలో నెలకొన్నది. పర్మిషన్లు తీసుకోకుండా లేఅవుట్లు వేసిన బడాబాబులు, రియల్టర్ల మీద ప్రభుత్వం ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా, అసలు విషయం‌ తెలియక అనధికారిక లేఅవుట్లలో స్థలాలు కొన్న అమాయక ప్రజలపై తీవ్రమైన భారం పడుతుందని మండలంలోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో పనిచేసిన పంచాయితీల కార్యదర్శులు, అధికారులు, పాలకవర్గాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు గానీ, ప్రస్తుతం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతగానీ పంచాయితీరాజ్ చట్టాన్ని, జీవోలను పక్కాగా అమలు చేసి ఉంటే అనధికారిక లేఅవుట్లు గ్రామాలలో ఏర్పాటు కాకుండా ఉండడంతో పాటు అమాయక ప్రజలపై భారం పడేది కాదని, గ్రామ పంచాయతీలు తమ ఆదాయాన్ని కోల్పోయేవి కాదనేది మండలంలోని ప్రజలలో మరోక బలమైన వాదన వినిపిస్తోంది. అయితే గత ప్రభుత్వం 2020లో అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్ల యజమానులు తమప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలని 30అగఘ్ట2020న జీవో నెం.135(ఎల్ఆర్ఎస్)ని విడుదల చేసి దరఖాస్తులు ఆహ్వానిస్తే అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఆధారంగా చాలా మంది ప్లాట్ల యజమానులు ఎల్ఆర్ఎస్ కు వెయ్యి రూ.ల చొప్పున కట్టి దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తులు తీసుకున్న అప్పటి ప్రభుత్వం వచ్చిన దరఖాస్తుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారనేది బహిరంగ విదితమే. ఇదిలా ఉంటే ఇదే అదునుగా భావించిన కొంతమంది జిల్లా, మండల పంచాయతీ అధికారుల ప్రోత్బలంతో గ్రామస్థాయి పంచాయితీ అధికారులు, గ్రామాలలోని సర్పంచులతో కలిసి అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్ల యజమానులు ఇంటి నిర్మాణాలకు దరఖాస్తు చేసుకుంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో భారీగా అవినీతికి పాల్పడ్డారనేది గ్రామాలలోని ప్రజలు బహిరంగంగానే మాట్లాడుకోవడం విదితమే. అనధికారిక లేఅవుట్లలో ఇంటి నిర్మాణ పర్మిషన్లు ఇచ్చే ముందు జీవో.నెం.67లోని పలు నిబంధనలలో పేర్కొన్న విధంగా జిల్లా అధికారుల అనుమతితోనే అట్టి ప్లాట్ రిజిస్ట్రేషన్లోని మార్కెట్ రేట్ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం సెటిల్మెంట్ ఛార్జీలు, ప్రొడాటా ఛార్జీలు, లెవీఛార్జీలు వసూలు చేసిన తర్వాత మాత్రమే ఇంటి నిర్మాణ పర్మిషన్లు మంజూరు చేయాల్సి ఉంటుందని, జీవో.నెం.67, జీవో.నెం.135 నిబంధనలను ఎక్కడా అధికారులు అమలు చేయకుండా ఉండడంతో ఇబ్బడిముబ్బడిగా అనధికారిక లేఅవుట్లలో ఇంటి నిర్మాణ పర్మిషన్లు ఇస్తుంటే కనీసం చర్యలు తీసుకోలేదని, తద్వారా గ్రామ పంచాయతీలు భారీగా ఆదాయాన్ని కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో ఆయా అనధికారిక లేఅవుట్లలో చేపట్టే అభివృద్ధి పనుల భారం ఆయా గ్రామాల ప్రజలపై భారీగానే పడనుందని సుస్పష్టంగా తెలియవస్తుందని, మండలంలోని ఒక గ్రామం (జగిత్యాల జిల్లా పరిధికి అనుకుని ఉన్న) గ్రామ పంచాయితీ పరిధిలో దాదాపు ఇరవైకి పైగానే అనధికారిక ఇళ్ళ నిర్మాణ పర్మిషన్లు నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేయడం, కనీసం నిబంధనలలో పేర్కొన్న విధంగా డెవలప్మెంట్ ఛార్జీలు, ప్రోడాటా బెటర్మెంట్ ఛార్జీలు వసూలు చేయకపోవడం వల్ల సుమారు పదిహేను లక్షల రూపాయల వరకు ఆదాయం కోల్పోవడం జరుగుతుందని మండలలోని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈవిషయమై జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయితీ అధికారులులకి పిర్యాదు చేసి రెండేళ్లు గడుస్తున్నా చర్యలు చేపట్టడంలో అధికారులు కాలయాపన చేస్తుండటంతో జిల్లా పంచాయితీ అధికారులపై తీవ్రమైన అనుమానాలు నెలకొన్న పరిస్థితి ఏర్పడింది. అనధికారిక లేఅవుట్లు వేయడం వల్ల రియల్ మాఫియా అమాయకులను దోపిడీకి గురి చేస్తుంటే, తప్పు ఒకరిదైతే శిక్ష అనుభవించేది మరోకరు అన్న చందంగా తెలిసి తెలియక ఫ్లాట్లు కొన్న అమాయక వినియోగదారులపై భారం మోయాల్సిన పరిస్థితి ఏర్పాటైందని ప్రజలు వాపోతున్నారు. ఇదంతా ఎల్.ఆర్.ఎస్-2020 కు ముందు జరిగినదైతే ఎల్ఆర్ఎస్2020 తర్వాత అంటే 2020సం. తర్వాత రియల్ మాఫియాకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఇదిలా ఉండగా గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్2020ని తీసుకువస్తే అనధికారిక లేఅవుట్లలో తెలిసో తెలియకో స్థలాలు కొన్నటువంటి అమాయక ప్రజల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపడానికోసం ఎల్ఆర్ఎస్2020 వచ్చిన అనంతరం అధికారులు మేల్కోకుండా అవినీతి నిద్రలో మునిగి ఇబ్బడిముబ్బడిగా ఎక్కడికక్కడ దాదాపు ప్రధాన రహదారులపై మండలంలోని పలు గ్రామాల్లో ఇష్టారాజ్యంగా సాగుతున్న, అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు సరికదా ప్రధాన రహదారులను ఆనుకుని రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు అవుతున్నా, ఆయా రహదారుల వెంట ప్రతిరోజూ ప్రయాణించే అధికారులకు వెంచర్లు కనిపించకపోవడం కొసమెరుపు. అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్లు నిలువరించడం కోసం అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ కిందిస్థాయి సిబ్బందికి తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నా మండల, గ్రామ స్థాయిలో పనిచేస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతో ప్రజలు ఒకింత అసహనానికి గురవుతున్నారు. ఈఅనధికారిక లేఅవుట్ల ఏర్పాటును కట్టడి చేయడం కోసం గతంలో రెవెన్యూ, పంచాయతీ, పోలీసు అధికారులతో కూడిన టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు నామమాత్రంగానే తయారైందన్న అపవాదు ప్రజల మనస్సులో ఏర్పడింది. టాస్క్ఫోర్స్ కమిటీల పర్యవేక్షణ లోపం, పంచాయతీ అధికారుల అలసత్వంతో పాటు రెవెన్యూ అధికారులు నాలా చట్టం2020 నిబంధనలను తుంగలో తొక్కుతూ యదేచ్ఛగా నాలా కన్వర్షన్ రిజిస్ట్రేషన్లు ఇబ్బడిముబ్బడిగా జరుగుతుండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతుంది. ప్రభుత్వం మారినా తమ తీరు మార్చుకొని అధికారులు గ్రామాలలో ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటైన అనధికారిక లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని, అధికారులు ఇప్పటికైనా మేల్కొని అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్లపై సమగ్ర విచారణ జరిపి చట్టం ప్రకారం గ్రామపంచాయతీలకు రావాల్సిన ఆదాయాన్ని పెంపొందించే విధంగా సరైన చర్యలు తీసుకుని స్థానిక సంస్థల అభివృద్ధికి కృషి చేయాలని మండలంలోని ఆయాగ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!