ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు
‘‘పిఏ పిఆర్ఓ’’ లు ‘‘మూటల కోసమే’’ పనిచేస్తున్నారు!

`మంత్రులు, ఎమ్మెల్యేలను బద్నామ్ చేస్తున్రు!
`ప్రజల నుంచి పిఏ, పిఆర్వోల మీద సామాన్యుల నిరసనలు.

`పార్టీ నాయకులకు కూడా విలువివ్వరు.
`కార్యకర్తలను పురుగుల్లా చూస్తారు!
`మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పుకోలేక నాయకులు మధనపడుతున్నారు.
`ఎమ్మెల్యేలను నాయకులను కూడా కలువనివ్వరు!
`మంత్రుల దరి చేరనివ్వరు!
`ఎమ్మెల్యే బిజీ, బిజీ అని చెప్పి తిప్పించుకుంటున్నారు.
`ఎలాంటి సమాచారం తెలియనీయకుండా జాగ్రత్త పడుతుంటారు.
`సామాన్యులకు అప్పాయింట్ ఇవ్వరు!
`జనాలకు మంత్రులు, ఎమ్మెల్యేలను దూరం చేస్తున్నారు.
??జర్నలిస్టుల ఫోన్లుకు కూడా స్పందించరు.??
`మంత్రులు, ఎమ్మెల్యేల అధికారిక పర్యటనలపై వివరాలివ్వరు.
`కనీసం వార్త రాసి మీడియాకు పంపడం కూడా చేతకాదు!
`మంత్రుల సక్సెస్ స్టోరీలకు సమాచారం ఇవ్వరు.
`వార్తలను చూసి పారిశ్రామిక వేత్తలకు ఫోన్లు?
`రియల్ వ్యాపారులకు బెదిరింపులు?
`ఎమ్మెల్యేల పేరు చెప్పి దందాలు, పైరవీలు!
`అధికారులను సైతం హడలెత్తించి పనులు చేసుకుంటున్నారు!
హైదరాబాద్,నేటిధాత్రి:
దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదన్న సామెతను నిజం చేస్తున్నారు కొంత మంది ప్రజా ప్రతినిదుల పిఏలు, పిఆర్వోలు అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొంత మంది పిర్వోలు, పిఏలు అత్యుత్సాహానికి పోయి, మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలకు దూరం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పలకుబడిని పలుచన చేస్తున్నారు. వారి పేర్లు చెడగొడుతున్నారు. వారికి వున్న ఇమేజ్ను దెబ్బతీస్తున్నారు. ప్రజల్లో వారికి వున్న ఆదరణను దూరం చేస్తున్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకే తలవంపులు తెస్తున్నారు. రాజకీయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శల పాలయ్యేలా చేస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీలకు అస్త్రాలంచేలా వ్యవహరిస్తున్నారు. పిఏలు, పిఆర్వోలు చేసే మకిలి పనులకు ప్రజా ప్రతనిధులు సమాధానం చెప్పుకునే పరిసి ్దతి తీసుకొస్తున్నారు. మేమే ఎమ్మెల్యేలకు బాస్లమన్నంత దర్పం ప్రదర్శిస్తున్నవాళ్లున్నారు. మూడు ముడుపులు, ఆరు పైరవీలు అన్నట్లు అడ్డగోలు సంపాదనకు ఎగబడుతున్నారు. ప్రజా ప్రతినిధుల పరువు గంగపాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రజలే పాలకులు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిదులైన నాయకులు ప్రజా సేవకులు. ప్రజల కోసం ఆరాటపడే మనస్తత్వం వున్న వారు మాత్రమే సహజంగా నాయకులౌతారు. ప్రజలకు దూరంగా వుండాలనుకునే వారు నాయకులు కాలేరు. నాయకులు కావాలని చాలా మందికి వుంటుంది. కాని ప్రజా సేవ చేయగలిగే వారు మాత్రమే నాయకులుగా మారుతారు. ప్రజా జీవితంలో వుంటారు. ప్రజలు తమను ఎన్నుకంటే మరింత మేలైనా, మెరుగైన సేవ చేయడానికి ప్రజా ప్రతినిధులౌతారు. ప్రజల కోసం జీవితాలు త్యాగం చేసిన వారు మన దేశంలో చాలా మంది వున్నారు. ప్రజల ప్రాణంగా బతికిన వారు అనేక మంది వున్నారు. ప్రజల కోసం జీవితాంతం తపన పడిన వారు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. ఏ నాయకుడైనా సరే ప్రజల గుండెల్లో చిరస్దాయిగా నిలిచిపోవాలనే కోరుకుంటారు. తన తర్వాత తరాలు తనను గుర్తు చేసుకోవాలని తపన పడుతుంటారు. అలాంటి సేవలు చేస్తుంటారు. ఒక్కసారి నాయకుడైన తర్వాత ఎవరూ ప్రజలకు దూరంగా బతకాలని కోరుకోరు. గెలిచినా, ఓడినా ప్రజల్లోనే వుంటారు. ఒకప్పుడు నాయకులు ఎదరులేకుండా, తిరుగులేకుండా వరుస విజయాలు చూస్తుండేవారు. ఇప్పుడు ఒక్కసారి గెలిచిన నాయకుడు మళ్లీ గెలుస్తామా? లేదా? అన్న మీమాంసలోనే రాజకీయం చేస్తున్నారు. ప్రజలు మార్పు కోరుకున్నా, ప్రభుత్వాలను మార్చినా, కొంత మంది నాయకులు ఎప్పుడూ గెలుస్తూనే వుంటారు. అది వాళ్ల నాయకత్వ పటిమకు, ప్రజా సేవకు నిదర్శనం. కాని కొన్ని సార్లు నాయకులు ఎందుకు ఓడిపోయారో కూడా అర్దం కాని పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఐదేళ్లపాటు నిరంతరం ప్రజల్లోనే వుంటారు. ప్రజా సేవలో వుంటారు. అభివృద్ది పనులు అనేకం చేస్తూనే వుంటారు. తమ నియోజకవర్గ అభివృద్ది కోసం పాటు పడుతూనే వుంటారు. కాని మరుసటి ఎన్నికల్లో ఓటమి పాలౌతుంటారు? కారణం ఆ నాయకులు కాదు. నాయకులు నమ్మిన మనుషులు. నాయకుల వద్ద పనిచేసే అనుచరులు. ముఖ్యంగా పిఏలు, పిర్వోలు. ఈ విషయం పదవులు పోయిన తర్వాత గాని సదరు నాయకులకు తెలియకుండాపోతోంది. పిఏలు, పిర్వొల మూలంగా ఇటీవల కాలంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఎందుకంటే వాళ్లు నమ్మిన వాళ్లు బాగా పనిచేస్తున్నారని అనుకుంటారు. అలా వాళ్లు చెప్పిన మాటలు వింటూ నాయకులు వినడమే రాజకీయానికి ఇబ్బందికరమైన పరిస్దితులు వస్తున్నాయి. గతంలో గొప్పగా పనిచేసిన నాయకులు కూడా పిఏలు, పిర్వోల మూలంగా రాజకీయ మనుగడలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవాళ్లున్నారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో కూడా వాళ్లే కనిపిస్తున్నారు. నాయకులు మారినా, ప్రభుత్వాలు మారినా పిఆర్వోలు, పిఏలు మాత్రం మళ్లీ, మళ్లీ ప్రత్యక్షమౌతుంటారు. అదే పనిని వాళ్లు చేస్తుంటారు. దశాబ్ధాల తరబడి అదే పిఏలు, అదే పిర్వోలుగా పనిచేస్తున్న వాళ్లు అనేకమంది వున్నారు. అలా పాతుకుపోయి ప్రభుత్వాలను భ్రష్టుపట్టించిన వాళ్లే , మళ్లీ మళ్లీ ప్రత్యక్షమౌతుంటారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలు, ఇప్పటి వరుకు కొనసాగుతున్న వాళ్లు అనేక మంది వున్నారు. కాని పాపం వీళ్లను నమ్ముకున్న నాయకులు మాత్రం ఓటమి పాలై రాజకీయాలకు దూరమైన వారు కూడా వున్నారు. అలా వుంటుంది. పిఏల పనితీరు. ఎమ్మెల్యే, మంత్రులు అంటే ప్రజల మనుషులు. ప్రజా ప్రతినిధులు. ప్రజల కోసం వున్న సేవకులు. ఒక్కసారి ప్రజా ప్రతినిధి అయిన తర్వాత వారిని ప్రజలకు కలవకుండా చేస్తున్నదే ఈ పీఆర్వో, పిఏలు. వారికి లేనిపోనివి చెప్పి, నాయకులకు, ప్రజలకు దూరం చేస్తుంటారు. ఎన్నికల సమయంలో అందరూ కలిసిపనిచేస్తారు. కొందరు నాయకులు ఎక్కువ పనిచేయొచ్చు. కొంత మంది నాయకులు తక్కువ పనిచేయొచ్చు. కాని వారందరూ అదే పార్టీకి చేందిన నాయకులు. కాని ఒక నాయకుడు ప్రజా ప్రతినిధి అయిన తర్వాత వారికి దగ్గర కావడానికి అనేక మంది రకరకాల వార్తలు మోసుకొని వస్తారు. నిజానికి అందరూ కలిసి పని చేస్తేనే నాయకులు గెలుస్తుంటారు. కార్యకర్తల్లో కూడా కొన్ని విభేదాలుంటాయి. ఆదిపత్యాలుంటాయి. నాయకులుగా ఎదగాలన్న తపన వుంటుంది. ఎమ్మెల్యే, మంత్రి ఆశీస్సులతో మరింత ఉన్నత స్దానానికి చేరుకోవాలని వుంటుంది. ఈ ద్వితీయ శ్రేణి నాయకుల ఆశలే పిఏలకు, పిఆర్వోలకు వరంగా మారుతుంది. ద్వితీయ శ్రేణి నాయకులు చెప్పే ప్రతి విషయాన్ని ఎమ్మెల్యే చెవిలో వేసి, తనకు అత్యంత సమ్మకస్తుడు అని పేరు పొందేందుకు పిఏలు, పిర్వోలు ప్రయత్నిస్తుంటారు. అలా నాయకుడు గుడ్డిగా నమ్మే స్ధితికి వచ్చిన తర్వాత ఇక పిర్వోలు, పిఏలు తమ ప్రతాపం చూపిస్తుంటారు. ప్రజలకు ప్రజా ప్రతినిధులను దూరం చేస్తుంటారు. ఎమ్మెల్యేల ఫోన్లుకూడా తన చేతుల్లో పెట్టుకొని, ఎవరి ఫోన్ ఎత్తాలో, ఎవరి ఫోన్ ఎత్తకూడదో కూడా పిఏలు, పిర్వోలే నిర్ణయించే స్ధాయికి చేరుకుంటారు. కేవలం తమకు పనికి వచ్చే వారి ఫోన్లు మాత్రమే లిప్ట్ చేస్తుంటారు. లేకుంటే ఎమ్మెల్యే బిజీగా వున్నారంటూ దాట వేస్తుంటారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా, అదే సమాదానం చెబుతుంటారు. నాయకులు ఫోన్ చేసిన విషయం, ఎమ్మెల్యేలు, మంత్రులకు చేరవేయరు. ఎందుకంటే ఆ స్దాయిలో వుండే ప్రజా ప్రతినిధులకు ఊరిపి సలపనంత పని వుంటుంది. పని ఒత్తిడి కూడా గతం కాన్న ఎక్కువౌతుంది. దీనిని ఆసరా చేసుకొని పిఏలు, పిర్వోలు చెలరేగిపోతుంటారు. ఎమ్మెల్యేల దర్శనం చేసుకోవాలంటే, పిఏలు, పిర్వోలను ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్తితి వస్తుంది. ఇక పార్టీ నాయకులు, కార్యకర్తల పరిస్దితే ఇలా వుంటే సామాన్య ప్రజల పరిస్దితి ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. ఒకప్పుడు నాయకుడి వద్దకు ప్రజలు నేరుగా వెళ్లిపోయే పరిస్దితి వుండేది. నాయకులు కూడా ప్రజల వద్దకు చేరుకొని ప్రజాసమస్యలు తెలుసుకునే వెసులుబాటు వుండేది. ఇప్పుడు ఆ పరిస్దితి లేదు. ఎమ్మెల్యేల చుట్టూ అధికారులు, వ్యక్తిగత సిబ్బంది, పిఏలు, పిర్వోలు అంటూ చక్రబందనాలుంటాయి. వీళ్లందరినీ దాటుకొని వేళ్తేగాని ప్రజలకు నాయకులు అందుబాటులోకి రాని పరిస్ధితి నెలకొన్నది. ఈ విషయం సదరు ఎమ్మెల్యేలకు తెలియదు. మంత్రులకు కూడా తెలియదు. ఒకప్పుడు జర్నలిస్టులు నేరుగా ఎమ్మెల్యే, మంత్రులను కలిసే అవకాశాలుండేవి. అప్పుడు అది కూడా లేదు. ఎమ్మెల్యేలు, మంత్రుల అప్పాయింటు మెంటుకోసం పిఏ, పిర్వోలను అడగాల్సిన పరిస్ధితి ఎదురౌతోంది. ఇంతకీ ఈ పిఏలు, పిర్వోలు ఏం చేస్తున్నారంటే దందాలు చేస్తున్నారు. వసూళ్ల పర్వం మొదలు పెట్టారు. పైరవీ కారుల అవతారం ఎత్తుతున్నారు. వసూల్ రాజాలుగా మారుతున్నారు. రోజుకు ఎంత సంపాదిస్తున్నామన్నదానిపై దృష్టిపెడుతున్నారు. ఇదీ బైట వినిపిసున్న మాట. ప్రతి పనికి రేటు నిర్ణయిస్తూ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు అనేకమంది పిఏలు, పిర్వోల మీద వున్నాయి. పిఆర్వోలు మంత్రులకు సంబంధించిన షెడ్యూల్ను మీడియాకు ఎప్పటికప్పుడు అందజేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే అభివృద్ది, ప్రగతిని ఎప్పటికప్పుడూ వివరిస్తూ, వార్తలు పంపిస్తూ వుండాలి. సంబంధిత నియోజకవర్గాలలో వార్తా పత్రికల్లో వచ్చిన ప్రజా సమస్యలు ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలి. కాని ఆ పని చాల మంది పిర్వోలు చేయడం లేదు. జర్నలిస్టులకు కనీస సమాచారం అందించేందుకు కూడా ఇష్టపడడంలేదు. ఓ నాలుగుసార్లు ఫోన్ చేస్తే జర్నలిస్టుల నంబర్లు కూడా బ్లాక్ చేస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ప్రజల్లో లేనిపోని అపోహలు ఎదురయ్యేలా చేస్తున్నారు. ఇక పత్రికల్లో వచ్చే వార్తలలో తమకు ఆదాయ వనరులు సమకూరుతాయనుకున్నప్పుడు సదరు వ్యక్తులకు ఫోన్లు చేయడం, ఎమ్మెల్యే పేరు చెప్పి వసూళ్ల పాల్పడడం చేస్తుంటారు. అవతలి వ్యక్తులు నిజంగానే ఎమ్మెల్యే చేయించారేమో అనే భయంతో ముళ్లెలు మట్ట చెప్పడం కూడా జరుగుతుంది. ఇక వ్యవస్దలో అనేక రకాల పనులు వుంటాయి. వాటి కోసం కొంత మంది పైరవీలు చేసుకుంటారు. అలాంటి పనులతో పిఏలు పంట పండిరచుకుంటున్నారు. పైరవీలు, పనులు చక్కదిద్ది నాలుగు రాళ్లు సంపాదించుకోవడంలో పిఏలు, పిర్వోలు బీజీబిజీగా వున్నారంటూ ఆనేక ఆరోపణలున్నాయి. ఇలాంటి పిర్వోలను, పిఏలను గుర్తించి ఎమ్మెల్యేలు, మంత్రులు తేరుకోకపోతే మాత్రం రాజకీయంగా నష్టం చవి చూడాల్సింది వాళ్లే.. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు, మంత్రులు తేరుకొని నాయకులు, ప్రజలను కలిసి, ఎదురులేని, తిరుగులేని రాజకీయాలు చేస్తూ, మళ్లీ మళ్లీ గెలుస్తూ, ప్రజా సేవ చేయాలంటే స్వార్ధపరులైన పిఏలను, పిర్వోలను పక్కన పెట్టకపోతే తీరని నష్టాన్ని కొని తెచ్చుకున్న వాళ్లవుతారు.
