6 నెలలకే తారుమారు…….!
◆:- రూ.1.43 కోట్లతో చేపట్టినరోడ్డు పనుల తీరిది..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: (న్యాల్కల్): రాళ్లబాటగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేసి తారు వేశారు. ఇక రాకపోకల కష్టాలు తీరుతాయని సంబరపడిన న్యాల్కల్ మండలంలోని ఐదు గ్రామాల ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పడం లేదు. 3.6 కి.మీ. పొడవున పూర్తిగా ధ్వంసమైన రహదారికి రూ.1.43 కోట్ల నిధులు వెచ్చించి గుంతలు పూడ్చారు. అనంతరం తారుతో కొత్తగా వేసిన రహదారి ఆరు నెలలకే గుంతలమయంగా మారింది. ఫలితంగా అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించేవారితో పాటు.. ముంగి-శంషెల్లాపూర్ మార్గంలో నిత్యం ప్రయాణించేవారికి ఇక్కట్లు పెరిగిపోయాయి. న్యాల్కల్ మండలం ముంగి చౌరస్తాలోని ఆదిలక్ష్మి ఆశ్రమం నుంచి రాంతీర్థ్, గుంజోటి, వడ్డి, శంషెల్లాపూర్ గ్రామాల మీదుగా జహీరాబాద్-బీదర్ రోడ్డును అనుసంధానించే ఈ మార్గం మీదుగా అంతర్రాష్ట్ర ప్రయాణికులు అత్యధికంగా రాకపోకలు సాగిస్తుంటారు.
మరమ్మతుల్లో నిర్లక్ష్యం….
రోడ్డుకు ఐదేళ్లుగా మరమ్మతులు చేపట్టకపోవడంతో వడ్డి, శంషెల్లాపూర్ గ్రామాల మధ్య గుంతలు ఏర్పడ్డాయి. రాత్రి వేళల్లో రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది. సభలు, సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు ఆయా గ్రామాల ప్రజలు సమస్యను విన్నవించడంతో ఆరు నెలల క్రితం అత్యవసరమైన చోట గుంతలు పూడ్చి, మరమ్మతులు చేశారు. 3.6 కి.మీ. రోడ్డుపై కొత్తగా తారు పనులు పూర్తి చేశారు. మరమ్మతుల సమయంలో గుంతలను రోలర్తో తొక్కించి పూడ్చకపోవడం వల్ల తారు తొలగిపోతోంది. మళ్లీ గుంతలు ఏర్పడుతున్నాయి.అదుపుతప్పి పడిపోతున్న వాహనాలు: రహదారి దెబ్బతిని గోతులుగా మారిన ప్రాంతాల్లో వాహనాలు అదుపుతప్పి పడిపోతున్నాయి. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. అధ్వానంగా మారిన రోడ్డుపై కార్లు, ద్విచక్ర వాహనాలు దెబ్బతింటున్నాయని చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తారు తేలిపోవడంపై అధికారులతో మాట్లాడితే భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతోనే రోడ్డు దెబ్బతింటోందని తప్పించుకుంటున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. తారు పునరుద్ధరణ పనులు చేపట్టిన గుత్తేదారుతో మళ్లీ నాణ్యతగా మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
లారీలు, టిప్పర్లు అధిక లోడుతో వెళ్లడంతోనే..
అంతర్రాష్ట్ర రాకపోకలకు అనుసంధాన రహదారి కావడంతో ముంగి-శంషెల్లాపూర్ రోడ్డుపై భారీగా టిప్పర్లు, కంకర, ఇసుక లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. రహదారి సామర్థ్యానికి మించిన బరువుతో వెళ్లడంతో రోడ్డు ధ్వంసమవుతోంది. క్షేత్రస్థాయిలో సందర్శించి అవసరమైన చోట మరమ్మతులు చేపడతాం.
న్యాల్కల్ మండలంలో రహదారులపై ఓవర్ లోడ్ తో వెళ్తున్న లారీలు కనిపించడం సర్వ సాధారణం అయిపోయింది. ఈ మధ్య బయటపడ్డ గ్రానైట్ అక్రమ రవాణా అంశంతో ఈ ఓవర్ లోడ్ల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. అధిక బరువు ఉన్నా కూడా పెద్ద పెద్ద టిప్పర్లతో ఇసుక గ్రానైట్లను నిత్యం రవాణా చేస్తున్నారు. ఇక నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా అడ్డగోలు సంపాదనకు తెరతీస్తున్నారు. రోజుకు దాదాపు భారీ వాహనాలు న్యాల్కల్ మల్గి నుండి కర్ణాటక బీదర్ వివిధ మార్గాల్లో వెళుతున్నాయి. కానీ ఆర్టీఏ ఇటు విజిలెన్స్, టాస్క్ ఫోర్స్, మైనింగ్ అధికారులు మాత్రం తనిఖీలు చేస్తూ మిగతా వాటిని అసలు పట్టించుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా నిజాయితీగల అధికారి కేసులు నమోదు చేసిన తిరిగి పెద్దల ఒత్తిడితో నిమిషాల్లోనే ఆ వాహనాలు బయటికి వచ్చేస్తున్నాయి.
