ఆ సమయంలో మా డ్రెస్సింగ్ రూం నిరాశతో నిండిపోయింది: పాక్ హెడ్ కోచ్
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూం పరిస్థితిపై ఆ జట్టు హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. భాతర బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. 176 పరుగుల లక్ష్య ఛేదనలో 114 పరుగులకే కుప్పకూలారు. దీంతో భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూం పరిస్థితిపై ఆ జట్టు హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ స్పందించాడు.
‘భారత్‌తో కీలకమైన మ్యాచ్‌లో మేం ఓడిపోయాం. ఆ సమయంలో పాక్ డ్రెస్సింగ్ రూం నిరాశ నిస్పృహలతో నిండిపోయింది. ఈ మ్యాచ్ ఎంత కీలకమో.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కున్న ప్రాధాన్యం ఏంటో మాకు తెలుసు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు మేం ఇతర జట్లతో ఐదు మ్యాచ్‌లు గెలిచాం. అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాం. కానీ భారత్‌తో మ్యాచ్‌లో ఓడిపోయాం. భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు. బంతి అనూహ్యంగా తిరిగింది. మేం సరిగానే ప్రారంభించాం. కానీ ఇషాన్ కిషన్ మా నుంచి మ్యాచ్‌ను దూరంగా తీసుకెళ్లిపోయాడు. మేం తిరిగి పుంజుకుంటాం. మేం ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో మంచి క్రికెట్ ఆడాం. ఈ టోర్నమెంట్‌లో రాణిస్తామనే ఆత్మవిశ్వాసం మాకుంది’ అని పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ పేర్కొన్నాడు.
