– భవిష్యత్తుకు పునాది కులగణన
– కులగణన సర్వేకు సహకరించాలి
-బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
బీసీలు రాజ్యాధికారం కైవసం చేసుకోవడానికి ఈ కులగణన వజ్రాయుధమని, భవిష్యత్తుకు పునాది లాంటిదని, కులగణన సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న కులగణన సర్వేకు సహకరించని వారి భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేసి ఉత్తర కొరియాకు పంపించాలన్నారు. వచ్చే అన్ని ఎన్నికలకు ఈ సర్వే పునాదిరాయి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పిడికెడు శాతం లేని అగ్రకులాల వాళ్లు రాజ్యాధికారం ఏలుతుంటే.. దేశ జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలం మాత్రం ఓట్లు వేసే యంత్రాలుగా..జెండాలు మోసే బానిసలుగా మిగిలిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా బీసీ బిడ్డలు పనిచేస్తేనే మనకు రాజ్యాధికారం సిద్ధిస్తుందన్నారు. కులగణనను బీసీలు తేలికగా తీసుకోవద్దని, రాబోయే తరాల మన బిడ్డల కోసం..వారి హక్కుల కోసమైన సర్వేకు సహకరించాలన్నారు. ఎన్నో పోరాటాలు చేస్తేనే ఈ సర్వే జరుగుతుందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కులగణన సర్వే జరుగుతుందని, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కులగణన జరగడం లేదన్నారు. స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ వాళ్ళు తీసిన లెక్కలే ఇప్పటి వరకు ఉన్నాయని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి తెలంగాణలో మాత్రమే ఈ సర్వే జరుగుతుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం, నక్సలైట్ల ఉద్యమం, తెలంగాణ మలిదశ ఉద్యమం ముందుండి నడిపించింది బీసీలేనన్నారు. ప్రాణ త్యాగాలు బీసీలు చేస్తే..భోగభాగ్యాలు అగ్ర కులాల వారు అనుభవిస్తున్నారని దుయ్యబట్టారు.