భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహణ.
రైతుల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం – ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలో మంగళవారం భూ భారతి కొత్త ఆర్‌ఓఆర్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్‌డీవో మహేశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ భూవ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం, భూవివాదాలను తగ్గించడం, రైతులకు భద్రత కల్పించడం ఈకొత్త చట్టం ప్రధాన లక్ష్యమన్నారు. భూభారతి యాప్ ఉపయోగం, భూమి హక్కులపై పూర్తి సమాచారం తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ధరణి వ్యవస్థలో ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయని, రైతులకు న్యాయం జరగలేదని, రైతులు తమ హక్కులను కోల్పోయి తీవ్ర మనోవేదనకు గురయ్యారని, దీనివల్ల ఆత్మహత్యలు కూడా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలో సాక్షాత్తు ఓతహసిల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన కూడా జరిగిందన్నారు. కొత్త భూభారతి చట్టం రైతులకు అండగా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, బోనస్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ వంటి పునరుద్ధరణ చర్యలు తీసుకువస్తోందని, రాష్ట్రంలో ఎనభై నుండి తోంభై శాతం రైతులు లబ్ధి పొందేందుకు ఇరవై ఒకవేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. సాంకేతిక సమస్యల వల్ల కొందరికి రుణమాఫీ ఆలస్యం అవుతోందని, త్వరలో రెండు లక్షల లోపు రుణాలన్నీ మాఫీ కానున్నాయని పేర్కొన్నారు. కొత్త చట్టం అమలైనందున రైతుల ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో అనేక సంక్షేమ పథకాలు రైతులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెట్టబోతుందని తెలిపారు. ఈసదస్సులో అధికారులు, గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని చట్టంపై సందేహాలు నివృత్తి చేసుకున్నారు. ఈ అవగాహన సదస్సులో మండల ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాష్ కిరణ్, తహశీల్దార్ వెంకటలక్ష్మి, గోపాలరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మెరవేని తిరుమల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జవ్వాజి హరీష్, ఎంపీడీవో రాజేశ్వరి, రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.