ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి…
కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలి…
మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి…
నేటి ధాత్రి -మహబూబాబాద్ :-
చత్తీస్ ఘడ్ లో బీజేపీ, నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరా సాగిస్తున్న నరమేధాన్ని నిలుపుదల చేసి, కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎమ్ -ఎల్ న్యూడెమోక్రసీ, సిపిఐ ఎమ్ -ఎల్ మాస్ లైన్ పార్టీల జిల్లా కార్యదర్శులు విజయసారధి, సాధుల శ్రీనివాస్, గౌని ఐలయ్య, కొత్తపల్లి రవి, మధార్ లు డిమాండ్ చేశారు. కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరుపాలని శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ, గత 18 నెలలుగా మధ్య భారత అడవుల్లో భారత ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో హత్యకాండ కొనసాగిస్తుందని తెలిపారు. శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే కొరిందని, ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని మేధావులు, ప్రజాస్వామికవాదులు కోరుతున్నారని తెలిపారు. ఆపరేషన్ కగార్ ని వెంటనే నిలిపివేసి, బలగాలను వెనక్కి రప్పించాలని, ప్రభుత్వం చేస్తున్న ఈ హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు సమ్మెట రాజమౌళి, బానోత్ సీతారామ్, బండారి ఐలయ్య,అజయ్ సారధి రెడ్డి, మండల వెంకన్న, గునిగంటి రాజన్న, పెరుగు కుమార్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.