డిల్లీలో గంగాపురం.. తెలంగాణలో మళ్ళీ బండికే పట్టం.

జాతీయ అధ్యక్షుడుగా కిషన్‌ రెడ్డి పేర పరిశీలన.

అదే సమయంలో తెలంగాణకు బండి కి పగ్గాలు.

వలసవాదులకు అవకాశం లేనట్లే.

అర్‌ఎస్‌ఎస్‌ హార్డ్‌ కోర్‌ నేతలకే బాధ్యతలు.

జమిలి ఎన్నికలు బిజేపికి అత్యంత ప్రతిష్టాత్మకం.

బిజేపిలో చేరినంత మాత్రాన వాళ్లంతా పక్క చూపులు చూసేవారే!

పార్టీలో చిచ్చులకు కారకులే!

దక్షణాదికి ప్రాధాన్యత సంకేతాలు.

జమిలీ ఎన్నికలు కిషన్‌ రెడ్డి హయాంలోనే!

దక్షిణాది నుంచి కిషన్‌ రెడ్డే అందరికన్నా సీనియర్‌.

దక్షణాదిన బిజేపికి వున్న సీనియర్లంతా తెలంగాణలోనే!

కర్నాటక కన్నా తెలంగాణ మీదే బిజేపి ఫొకస్‌.

తెలంగాణ ఏర్పాటుకు బిజేపి సహకారం.

తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు బిఆర్‌ఎస్‌ కు అవకాశం.

తెలంగాణ ఇచ్చింది మేమే అంటే కాంగ్రెస్‌ ను వరించిన విజయం.

జమిలి ఎన్నికలలో బిజేపికే అవకాశం అనుకూలం.

ఇప్పటి నుంచే దృష్టి పెడితేనే బలపడడం ఖాయం .

ఏ మాత్రం ఏమరపాటుగా వున్నా మరో ఐదేళ్లు దూరం.

బిజేపికి రెండు సీట్లు వచ్చినప్పుడు ఒక్క సీటు తెలంగాణ దే.

తెలంగాణ బిజేపికి ఆనాటి నుంచి కంచుకోటే.

ప్రజల మద్దతు పుష్కలంగా వున్నా నాయకుల మధ్య ఐక్యత లేదు.

పార్టీని అధికారంలోకి తేవాలన్న సక్యత కనిపించడం లేదు.

లుకలుకలతో రాజకీయం మరింత ఇబ్బంది కరం.

మళ్ళీ బండికి పగ్గాలు అప్పగిస్తేనే తెలంగాణలో బిజేపి మరింత పదిలం.

ఇప్పటికన్నా పదింతలు పెరిగే అవకాశం.

రాష్ట్ర స్థాయి నాయకులంతా కలిసి కష్టపడితే అధికారం ఖాయం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
మహరాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తర్వాత బిజేపి జాతీయ నాయకత్వంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. జాతీయ అధ్యక్షుడు జేపి. నడ్డా కాల పరిమితికూడా ముగిసిపోయింది. బిజేపిల ప్రతి మూడు సంవత్సరాల కోసారి జాతీయ అధ్యక్ష మార్పులు సహజం. అందులో భాగంగా ఈసారి దక్షిణాదికి అవకాశం కల్పించాలన్న ఆలోచన బిజేపి జాతీయ కార్యవర్గం నిర్ణయం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాలు కూడా ఈసారి బిజేపి అధ్యక్షపదవిని దక్షిణాదికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం. అయితే దక్షిణాది నుంచి జాతీయ రాజకీయాలలో కీలకభూమిక పోషించేందుకు కిషన్‌రెడ్డి తప్ప మరో నాయకుడు కనిపించడం లేదు. కర్నాకటలో బబిజేపిలో సీనియర్లు వున్నప్పటికీ తెలంగాణకు ఈసారి అవకాశమివ్వాలిని యోచిస్తున్నారు. కర్నాటక విషయంలో యడ్యూరప్పకు పార్టీ పగ్గాలు అప్పగించాలనుకున్నా, ఆయన వయసు 75 సంవత్సరాలు దాటిపోయాయి. తెలంగాణలో చాలా సీనియర్లు వున్నారు. అయితే వాళ్లలో కీలకమైన వాళ్లు వివిధ పదవుల్లో వున్నారు. కాని జాతీయ రాజకీయాలలో పెద్దగా పరిచయం లేని నాయకులు. అందువల్ల కేంద్ర నాయకత్వం కిషన్‌రెడ్డిని జాతీయ అధ్యక్షుడిని చేయాలన్న ప్రతిపాదనలు కూడా అధిష్టానం ముందు వుంచినట్లు కూడా సమాచారం. తెలంగాణలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాష్ట్ర అధ్యక్షపదవి నిర్వహించిన నాయకుడు కిషన్‌రెడ్డి. మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రెండుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కేంద్రంలో క్యాబినేట్‌ మినిస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా ఒకప్పటి జాతీయ అధ్యక్షులు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయకుడుకు అత్యంత సన్నిహితుడు కిషన్‌ రెడ్డి. జాతీయ రాజకీయాల మీద అవగాహన వున్న నాయకుడు. జాతీయ స్ధాయిలో పార్టీ నాయకులతో సత్సంబంధాలున్న నాయకుడు కిషన్‌రెడ్డి. అంతే కాకుండా ఇటీవల జమ్మూ ఎన్నికల ఇన్‌ఛార్చిగా బాధ్యతలు చేపట్టి, అక్కడ పార్టీకోసం విసృతంగా ప్రచారం చేశారు. పార్టీలో సమన్వయానికి కృషి చేశారు. జమ్ములో 29 సీట్లు రావడంలో కిషన్‌రెడ్డి పాత్ర కూడా వుంది. అంతే కాకుండా పార్టీలో సౌమ్యుడు. అజాతశత్రువుగా పేరున్న నాయకుడు కిషన్‌రెడ్డి. ఆయనను జాతీయ అధ్యక్షుడిని చేయడాన్ని తెలంగాణలోనే కాదు, జాతీయ స్ధాయిలో ఎవరూ వ్యతిరేకించే పరిస్ధితి లేదు. అందవల్ల ఆయనను జాతీయ అధ్యక్షుడిని చేయడంలో ఇబ్బంది పార్టీకి లేదు. నిజానికి దేశంలో బిజేపికి బలమైన పునాదులు వేసిన నాయకుల్లో వెంకయ్య నాయుడు, బంగారు లక్ష్మణ్‌ లాంటి వారు ఎంతో కృషి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరు ఏపి నేతలకు జాతీయ అధ్యక్షులు అయ్యే అవకాశం వచ్చింది. తర్వాత కాలంలో ఏపిలో బిజేపి అంత బలపడిన సందర్భం లేదు. తెలంగాణలో వున్నంత బలంగా ఏపిలో బిజేపి బలంగా లేదు. ఆది నుంచి తెలంగాణలో బిజేపి బలంగా వుంది. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న సందర్బాలలో కూడా తెలంగాణలోనే బిజేపి అసెంబ్లీ సీట్లు గెల్చుకున్న సందర్భాలున్నాయి. ఎన్టీఆర్‌ హయంలో వెంకయ్య నాయకుడు కూడా ఏపి నుంచి బిజేపి ఎమ్మెల్యే కావడానికి కూడా దోహదపడిరది. కాని దేశంలో రెండు బిజేపి సీట్లు సాధించిన సందర్భంలో గుజరాత్‌ నుంచి ఒకసీటు గెలిస్తే, తెలంగాణ హన్మకొండ నుంచి ఒక సీటు గెలిచి తెలంగాణలో తన ఉనికిని ఆనాడే చాటుకున్నది. ప్రస్తుత పరిస్ధితుల్లో దక్షిణాదిన కర్నాకట తర్వాత తెలంగాణలోనే బిజేపి బలంగా వుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో బిజేపి శ్రేణులున్నారు. ఇలాంటి సమయంలో జాతీయ స్ధాయిలో కిషన్‌రెడ్డి పార్టీ అద్యక్షుడుగా వుంటూ, రాష్ట్రంలో మళ్లీ బండి సంజయ్‌కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే తెలంగాణలో బిజేపికి తిరుగుండదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. అందుకే మహరాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలు అయిన తర్వాత నాయత్వ మార్పులో బాగంగా జాతీయ నాయకత్వం, తెలంగాణలో పార్టీ పగ్గాలు ఇతరులకు అప్పగించాల్సిన అసవరం వుంటుంది. అయితే కిషన్‌రెడ్డి ఇప్పటికే జోడు పదవులను నిర్వహిస్తున్నారు. ఎలాగైనా రాష్ట్ర అధ్యక్షపదవి ఎవరికో ఒకరికి ఇవ్వాల్సివుంటుంది. కాని పార్టీని బలోపేతం చేసే నాయకుడు బండి తప్ప మరొకరు కనిపించడం లేదు. రాష్ట్ర బిజేపిలో ఆశావహులు ఎక్కువగానే వున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు లోతుగా విశ్లేషించుకోవాల్సి వుంటుంది. బిఆర్‌ఎస్‌ నుంచి తరిమేస్తే ఈటెల రాజేందర్‌ రాజకీయ పునరావాసం కోసం బిజేపిలో చేరారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. కాని ఆయన గెలుపు బిజేపితో కన్నా,వ్యక్తిగత ప్రతిష్టతోనే గెలిచారన్న ప్రచారం బాగానే చేశారు. ఇది పార్టీ అధిష్టానం చెవిలో కూడ పడి ఆయనకు విపరీతమైన ప్రాదాన్యత కల్పించారు. ఆఖరుకు ఆయన చేసిన రాజకీయం మూలంగానే బండి సంజయ్‌ అధ్యక్షపదవి కూడా పోయిందన్న వార్తలు ఆ రోజుల్లో అనేకం వచ్చాయి. వాటిలో నిజా నిజాలు ఎలా వున్నా, బండి సంజయ్‌ అధ్యక్షపదవి పోయిన తర్వాత మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడుగా కిషన్‌రెడ్డిని నియమించిన సందర్భంలో బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కనీసం కిషన్‌రెడ్డినైనా పనిచేసుకోనివ్వండి. డిల్లీకి లేనిపోనివి మోసుకెళ్లకండి అని చురకలంటించిన సందర్భం కూడా చూశాం. అయినా బిజేపి జాతీయ కార్యవర్గం ఈటెల రాజేందర్‌కు విపరీతమైన ప్రాధాన్యత కల్పించింది. ఎలాగైనా సరే గజ్వెల్‌లో కేసిఆర్‌ను ఓడిరచి తీరుతానని చెప్పి గతంలో ఎప్పుడూ లేని సంప్రదాయం ఈటెల తన వశం చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ బిజేపి నేత రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేయలేదు. ఆ అవకాశం పార్టీ ఈటెలకు ఇచ్చింది. గజ్వెల్‌తోపాటు, హుజూరాబాద్‌లో కూడా పోటీ చేసేందుకు అనుమతిచ్చారు. కాని ఈటెల రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. అయినా పార్టీ మళ్లీ మల్కాజిగిరిలో అవకాశమిచ్చింది. ఈటెల పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇక ఆయనకు పార్టీ పదవి ఇచ్చేందుకు జాతీయ నాయకత్వం సిద్దంగా లేదు. ఈటెల మీద పార్టీలో వున్న వ్యతిరేకత జాతీయ నాయకత్వానికి పూర్తిగా తెలిసిపోయింది. ఇక ఇటీవల ఈటెల రాజేందర్‌ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు జాతీయ నాయకత్వం దృష్టికి వెళ్తూనే వున్నాయి. సహజంగా ఏ పార్టీ నాయకుడైనా ఇతర పార్టీల నాయకులను మా పార్టీలోకి రండి అంటారు. కాని ఈటెల రాజేందర్‌ మాత్రం పార్టీలు మారకండి? అంటూ హితబోధలు చేస్తున్నారు. అంటే ఏ పార్టీలో రాజకీయం మొదలుపెట్టారో ఆ పార్టీలోనే వుండండి అంటూ పరోక్షంగా బిజేపిలోకి ఎవరూ రావొద్దన్న సంకేతాలు పంపుతున్నారన్న అపవాదును మూటగట్టుకున్నారు. చేరికల కమిటీ చైర్మన్‌గా పనిచేసిన ఈటెల ఇలాంటి వ్యాఖ్యల వెనుక ఉద్దేశ్యం అందరికీ అర్దమైంది. అందుకే ఎట్టిపరిస్ధితుల్లోనూ ఈటెలను పరిగణలోకి తీసుకునే అవకాశంలేదు. ఇక మిగతా నాయకులు కూడా ఈటెల రాజేందర్‌ లాగానే వలస నాయకులే కావడం గమనార్హం. ఒక్క అరవింద్‌ మాత్రమే కొంత మినహాయింపు అని కూడా చెప్పొచ్చు. మెదక్‌ ఎంపి. రఘునందన్‌ రావుపై కూడా పార్టీ జాతీయ నాయకత్వం పెద్దగా ఆసక్తి లేదనే చెప్పాలి. ఆయన దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డిల్లీలో జాతీయ నేతలు ఎవరూ రాకపోయినా నేను గెలిచాను. అంటూ మీడియా చిట్‌ చాట్‌లో చెప్పారు. అది పెద్ద దుమారం రేపింది. నాయకులు జర్నలిస్టులను నమ్మి ఆఫ్‌ది రికార్డు ఏదైనా మాట్లాడితే దాన్ని వార్తగా మలచడాన్ని తప్పుపడుతున్నానంటూ చిందులు కూడా తొక్కారు. అయినా ఆయన మనసులో వున్న మాట బిజేపి పెద్దలకు తెలిసిపోయింది. అందువల్ల ఆయనను రాష్ట్రపగ్గాలు అప్పగించే అవకాశం లేదు. ఇక డికే. అరుణ కూడా పోటీలో వున్నప్పటికీ ఆ అవకాశమివ్వకపోవచ్చు. ఏ రకంగా చూసినా అటు తిరిగి, ఇటు తిరిగి బంతి బండి సంజయ్‌ కోర్టులోనే ఆగుతుందన్నది ఇక్కడ తేలుతున్న అంశం. జాతీయ స్ధాయిలో కిషన్‌రెడ్డి, రాష్ట్ర స్ధాయిలో బండి సంజయ్‌లు కలిస్తే తెలంగాణలో బిజేపికి అధికారం పక్కా అన్న మాటలు వినిపిస్తున్నాయి. చూద్దాం. ఏం జరగుతుందో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!