ఎన్యూమరేటర్ల స్థానంలో ప్రైవేట్ వ్యక్తుల సర్వే
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే తూతూ మంత్రంగా నడుస్తుంది.నర్సంపేట డివిజన్ దుగ్గొండి మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో సర్వే కోసం ప్రభుత్వ టీచర్ ను ఎన్యూమరేటర్ గా నియమించగా ఉపాధ్యాయుడి స్థానంలో ఒక ప్రైవేటు వ్యక్తితో సర్వే వివరాలు ఇంటింటికి తిరిగి సేకరిస్తుండడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 72 ప్రశ్నలతో సమాదానాలు కోడ్ ల రూపంలో రాయాల్సి ఉండగా ఎలాంటి అవగాహణ లేని ప్రయివేట్ వ్యక్తులతో సర్వే చేయించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది.సర్వే వివరాలతో కుటుంబానికి సంక్షేమ పథకాలను ఆధారంగా అందజేస్తామని స్వయానా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో సర్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది.అలాగే ఇటీవల దుగ్గొండి మండల కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్లకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పలు సూచనలు చేశారు.
గతంలో ఆరు గ్యరెంటీల ప్రజాపాలన దరఖాస్తు ప్రక్రియ,డాటా ఎంట్రీ విషయంలో కొన్ని తప్పులు జరిగాయని, దానితో కొన్ని కుటుంబాలు ప్రభుత్వ సబ్సిడీ పథకాలకు అర్హత సాధించలేకపోయాయని అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.ఐనప్పటికీ మండల అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యంతో ఎన్యుమరేటర్లు ఒకరికి బదులుగా మరొకరితో సర్వే చేస్తుండడంతో అనేక తప్పులు దొరలే అవకాశం ఉన్నది.ఇదే విషయమై చంద్రయ్యపల్లి గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు చరవాణి ద్వారా ఇచ్చిన ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ ,జిల్లా పరిషత్ సీఈఓ ఉన్నతాధికారుల ఆదేశాలతో మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో అరుంధతి, ఎంపీవో శ్రీదర్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీలు చేసి ప్రైవేట్ వ్యక్తుల చేత సర్వేలు చేయించిన మాట వాస్తవమేనని అట్టి విషయమై ప్రైవేటు వ్యక్తి నుండి సర్వేకు సంబంధించిన వివరాలను స్వాధీనపరచుకొని, ఎన్యుమరేటర్ పై చర్యలు తీసుకొని షోకాజు నోటీసులు అందించనున్నట్లు అలాగే అందుకు సంబంధించిన పూర్తి నివేదికలు జిల్లా కలెక్టర్ కు అందజేస్తున్నట్లు మండల స్పెషల్ ఆఫీసర్,జిల్లా ఉద్యనవన అధికారిని డాక్టర్ సంగీత లక్ష్మి
తెలిపారు. కాని మండలంలో కొన్ని చోట్ల ఎన్యూమరేటర్లకు బదులుగా కింది స్థాయి సిబ్బంది,ప్రైవేట్ వ్యక్తులు సర్వే చేయడం గమనార్హం.
ఎన్యూమరేటర్,పంచాయితీ కార్యదర్శి చర్యలు తీసుకుంటాం.
జెడ్పీ సీఈఓ రాంరెడ్డి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణ పట్ల తనకు బదులుగా మరొక ప్రైవేట్ వ్యక్తితో సర్వే చేయించిన ఎన్యూమరేటర్ పై చర్యలు తీసుకుంటామని జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి తెలిపారు.గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే పట్ల పర్యవేక్షణ చేస్తూ విధులు చేపట్టాల్సిన పంచాయితీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ప్రైవేట్ వ్యక్తులు పాల్గొన్నారని అందుకు కార్యదర్శికి షోకాజ్ నోటీస్ ఇస్తూ ఇద్దరిపై చర్యలు తీసుకుంటానని జెడ్పీ సీఈఓ పేర్కొన్నారు.