*లోక్ సభలో ఇంటర్-మోడల్ బస్ స్టేషన్ ప్రగతిపై ఎంపీ గురుమూర్తి ప్రశ్న…
*మంత్రిత్వ శాఖ క్లారిటీ..
తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 13:
తిరుపతి బస్ స్టాండ్‌లో ఇంటర్-మోడల్ స్టేషన్ (ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) ఏర్పాటు ప్రస్తుత స్థితిపై గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి వివరణ కోరారు. హోలీ పండగ నేపద్యంలో సోమవారం వరకు పార్లమెంటు సెలవు కావడంతో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖిత పూర్వక సమాదనమిచ్చారు. ఈ సమాదానంలో ప్రాజెక్ట్ ప్రగతి గూర్చి వివరిస్తూ తిరుపతి ఇంటర్-మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్టుకు సంబందించి బేస్ మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని తెలిపారు. ప్రాజెక్ట్ డిజైన్‌ను సంబంధిత వర్గాల సూచనలతో మెరుగుపరచే పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రయాణికుల రవాణా సౌకర్యం, భద్రత, వేగవంతమైన రాకపోకలకు అనుగుణంగా మార్గదర్శకాలను ఖరారు చేస్తున్నారని పేర్కొన్నారు. డిజైన్ సిద్దమైన వెంటనే పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్ ద్వారా నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలసి ప్రాజెక్ట్ అమలు చేయనుందని తెలిపారు.