ఆయిల్ ఫామ్ విత్తన సాగు
ప్రారంభించిన జిల్లా వ్యవసాయ అధికారులు..
నిజాంపేట, నేటిధాత్రి:
ఆయిల్ ఫామ్ రిసోర్సెస్, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ విత్తన సాగు నర్సరీ ని ప్రారంభించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో ఆయిల్ ఫామ్ విత్తన సాగును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, జిల్లా ఉద్యానవన అధికారి ప్రతాప్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో రైతులు ఆయిల్ ఫామ్ పంటపై ఆసక్తి చూపడం ఆనందకరంగ ఉందన్నారు. రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా అధిక ఆదాయన్నీ పొందవచ్చని సూచించారు. తక్కువ నీటి వినియోగంతో అధిక లాభాలను ఈ పంట ఇస్తుందన్నారు. జిల్లాలో పంట విస్తరణకు కావాల్సిన నాణ్యమైన మొక్కలను స్థానిక స్థాయిలో పెంచడమే ఈ నర్సరీ లక్ష్యమని పేర్కొన్నారు.జిల్లా ఉద్యాన అధికారి మాట్లాడుతూ.. చల్మెడ గ్రామంలో 45 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ నర్సరీ ద్వారా మెదక్ జిల్లాకు నాలుగు లక్షల నాణ్యమైన మొక్కలను అందించడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. మొదటి విడత లక్ష విత్తనాలు నాటుటకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం రైతుల పొలాల్లో నాటేందుకు సిద్ధమవుతాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు వినయ్ విన్సెంట్, రాజ్ నారాయణ, ఏఈఓ లు శ్రీలత, మౌనిక, రమ్య, రైతులు ఉన్నారు.
