అప్పు చేసి పప్పు కూడు…అధికారుల తీరు చూడు!

 

-అప్పులే ఇష్టం… వసూళ్లు కష్టం!!

-మిల్లర్ల సొమ్ము దిగమింగుతాం…

-ప్రభుత్వానికి అప్పులే దిక్కంటాం..

-రైతు భరోసా కు పదివేల కోట్లు అప్పు.

-కోకాపేట రాయదుర్గం 400 ఎకరాలు ఐసిఐసిఐకి తనకా.

-ఆడిటింగ్‌ పూర్తి చేసి ఆర్బిఐ ని ఒప్పించే పనిలో టీజీఐఐసి.

-ఈ నెలాఖరుకల్లా రుణం మంజూరు?

-ఈ ఏడాది 7,000 మందికి పైగా ఉద్యోగులు పదవీ విరమణ.

-వారికి 2000 కోట్లకు పైగా చెల్లింపులు.

-9.6% వార్షిక వడ్డీతో పదివేల కోట్లు అప్పు ఇవ్వడానికి ముందుకొచ్చిన ఐసిఐసిఐ.

-రైస్‌ మిల్లర్ల బకాయిలు వసూలో అధికారుల నిర్లక్ష్యం?

-సివిల్‌ సప్లయ్‌ శాఖలో మిల్లర్ల 26 వేల కోట్లు బకాయిలు

-టెండర్‌ ప్యాడి డబ్బులు సకాలంలో వసూలు చేసినా2000 కోట్లు వచ్చేవి.

-టెండర్‌ ప్యాడి కాంట్రాక్టర్లకు సమయం ఎందుకు?

-ప్రభుత్వ ఆస్తులు తనకా తప్ప, మిల్లర్ల నుంచి వసూలు చేయరా?

-విజిలెన్స్‌ రిపోర్ట్‌ చెత్తబుట్టకు చేరింది?

-మిల్లర్లు అధికారులకు కల్పతరువులా?

-అందుకే బకాయి దారుల నుంచి వసూలు చేయడం లేదా?

-అవినీతి అధికారుల మీద చర్యలు లేవు?

-ఎన్నేళ్లు గడిచినా బకాయిలు వసూలు కావు?

`సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌ నియోజకవర్గంలో నీ నేరేడుచర్ల మండలం తిరుమల రైస్‌ కార్పొరేషన్‌ (దర్శించర్ల) మిల్లు యజమాని పేరు ‘‘జి.రాజేష్‌’’ జరిమానా తో బకాయి..107,16,90,801/-

`సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి లోని ‘‘సంతోషి మా ప్యారాబాయిల్డ్‌ మోడ్రన్‌ రైస్‌ మిల్లు’’మిల్లు యజమాని పేరు ‘‘జి వెంకటేశ్వర్లు’’ బకాయి జరిమానా తో కలిపి 110,39,96,525/-

`‘‘సివిల్‌ సప్లై అధికారుల అవినీతికి తార్కాణం?..ఈ ఇద్దరు మిల్లర్ల బకాయిలే 217.50 కోట్లు

మిగతా బకాయి దారులు 1175 మంది ఉన్నారు

` ఇప్పటివరకు రైస్‌ మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు 26 వేల కోట్ల పైచిలుకు మాటే

త్వరలో మరికొందరి బకాయిల మిల్లర్ల వివరాలు మీ ‘‘నేటిధాత్రి’’లో అంకెలతో సహా..

అప్పు చేసి పప్పు కూడు సామెత మన పాలకులకు బాగా అబ్బినట్టుంది. అచ్చొచ్చినట్లుంది. అది ఏ పాలకులైనా సరే..గత పాలకులైనా, ఇప్పటి పాలకులైనా నడిచే దారి ఒకటే. ఎంచుకునే మార్గం ఒకటే..అప్పు. అప్పు లేనిదే పూట గడవకుండా పోతోంది. అందుకే అన్నింటికీ సర్వరోగ నివారణి అప్పు. అది తప్ప మరో దారి లేదు. అయితే భూములు అమ్మాలి. లేకుంటే ఆస్ధులు తనఖా పెట్టాలి. ఆర్భీఐ నుంచి అనుమతి పొందాలి. అప్పుల మీద అప్పులు చేయాలి. సంక్షేమ పథకాల పేరుతో పంచాలి. అయితే ఇలా అప్పుల మీద అప్పులు చేస్తున్నా, పన్నుల వడ్డింపులు వాయింపులు కూడా ఏ ప్రభుత్వంలోనూ తప్పడం లేదు. పన్నులు పెంచడం తప్ప, తగ్గించింది వుండదు. దరలు పెంపు తప్ప తగ్గిన ధాఖలాలుండవు. ఎలా వడ్డింపులు వడ్డించాలా? అన్న దానిపై తప్ప, కోతలను, వాతల నుంచి ప్రజలను ఎలా రక్షించాలని ఏ పాలకులు అనుకోవడం లేదు. అందుకే ఎప్పుడూ అప్పుల వేటే సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ డిపార్టుమెంటుకు మిల్లర్లంతా కలిసి సుమారు 26వేల కోట్ల రూపాయలు బాకాయిలున్నారు. ఇది ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిన లెక్క. ఈ బకాయిలు వసూలైతే సగం రైతు రుణమాఫీ జరిగిపోయేది. లేకుంటే నాలుగు దఫాల రైతు భరోసాకు అవసరమైన సొమ్ము కూడేది. కాని ఇప్పుడు అదే రైతు భరోసా కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోంది. సంక్రాంతికి ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది. అందుకు ఎంత లేదన్నా రూ.7000 కోట్లు కావాలి. ఈ ఏడాది చివరి కల్లా సుమారు 10 వేల మంది ఉద్యోగులు రిటైర్‌ అవుతున్నారు. వారికి ఎంత లేదన్నా కనీసం రూ.3000 వేల కోట్లు అవసరమౌతాయి. అందుకోసం ఉన్న ఫలంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10వేల కోట్లు అవసరమౌతాయి. అందుకు అప్పు చేయక తప్పదు. అందుకే కోకా పేటలో వున్న ఓ 400 ఎకరాలను రాష్ట్ర ప్రభుతత్వం ఐసిఐసిఐ ప్రైవేటు బ్యాంకు నుంచి అప్పు తీసుకోవడానికి రెడీ అయ్యింది. ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. కాని మిల్లర్ల బాకాయిలున్న రూ.26 వేల కోట్లలో సగం వసూలు చేసేందుకు కూడా సమయం లేదా? ఆ శాఖ అధికారులు ఏంచేస్తున్నారు? ఎప్పుడూ తీరిక లేని పనుల్లో మునిగినట్లే కనిపిస్తారు. బకాయిల వసూళ్లును మాత్రం వదిలేస్తున్నారు. అప్పులు మాత్రమే చేద్దాం…అన్న చందంగా ముందుకు సాగుతున్నారు. బకాయి దారులైన మిల్లర్లకు మాత్రం వాయిదాల మీద వాయిదాలు గత పదేళ్లుగా ఇస్తూనే పోతున్నారు. ఇంతకీ ఆ శాఖ అదికారులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం, అలసత్వం, అవినీతి అన్నీ ఒకే చోట తిష్ట వేసి కూర్చున్న తర్వాత బకాయిలు ఎలా వసూలౌతాయి? మిల్లర్ల బకాయిలు కొండలా ఎలా పేరుకుపోతాయి? కనీసం ప్యాడీ టెండర్ల సమయంలో కాస్త శ్రద్ద పెట్టి సివిల్‌ సప్లై శాఖ వసూలు మొదలుపెట్టినా ఎంత లేదన్నా రూ.2000 వసూలయ్యేవి. కాని ఒక్క రూపాయి వసూలు చేయలేదు. పైగా బ్యాంకు గ్యారెంటీలను ప్రోత్సహించారు.రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్దితుల్లోనూ బకాయి దారుల నుంచి సొమ్ము వసూలు చేయాలని అధికారులను ఆదేశించినా లాభం లేకపోయింది. ఆఖరుకు గ్యారెంటీలు ప్రభుత్వమే ఒప్పుకోవాల్సి వచ్చింది. అందుకు కారణం అధికారులు. నేటి ధాత్రి గత పదేళ్లుగా ఇదే విషయం చెబుతోంది. ఆనాడు గత పాలకులు పట్టించుకోలేదు. అదికారులను ఆదేశించలేదు. సివిల్‌ సప్లయ్‌లో జరుగుతున్న అవినీతిని అరికట్టలేదు. అధికారుల అవినీతి, అడ్డగోలు సంపాదనను గత పాలకులు గుర్తించలేదు. ఇప్పుడూ అదే జరుగుతోంది. మిల్లర్ల నుంచి నెల నెల మామూళ్లే కాదు, ప్యాడీ కొనుగోలు సమయంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారుతాయన్నది భహిరంగ రహస్యమే. ఒక్కసారి సివిల్‌ సప్లయ్‌లో పోస్టింగ్‌ వచ్చిందంటే చాలు నాలుగు తరాలు కూర్చొని తిన్నా తరగనంత సంపాదన సమకూరుతందని అంటారు. కింది స్ధాయి నుంచి పై స్ధాయి దాకా సివిల్‌ సప్లయ్‌లో పనిచేసే అధికారులకు ఆడికార్లు కొనుగోలు చేసుకునేంత శక్తి ఎలా వస్తుంది. మిల్లర్ల నుంచి నగదు లంచాలే కాదు, గిఫ్టుల కింది కార్లు, విల్లాలు కూడా తీసుకుంటున్నారన్న సంగతి పాలకులకు తెలియదా? అందరికీ తెలిసినా ఎవరూ పట్టించుకోరు. అప్పుల కోసం మాత్రం ప్రతిపాదనలు సిద్దం చేయమంటే ఉరుకులు పరుగుల మీద రిపోర్టులు తయారు చేస్తారు. ఆగమేఘాల మీద నివేదికలు సిద్దంచేస్తారు. కాని మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయడానికి మాత్రం కార్యాలయం నుంచి అధికారులకు కాళ్లు కదలవు. ఎంత సేపు మిల్లర్ల మేలు కోసం తప్ప, ప్రభుత్వం కోసం అధికారులు పనిచేసినట్లు ఎక్కడా కనిపించదు. సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌కు నియోజకవర్గంలోని నేరేడు చెర్ల తిరుమల రైస్‌ మిల్లు బకాయిలు సుమారు 108 కోట్లుగా లెక్క తేలింది.( 107,16,90,801 కోట్ల రూపాయలు) అదే జి ల్లాకు చెందిన గడ్డిపల్లి మండలంలోని సంతోషి పారాబాయిల్డ్‌ రైస్‌ మిల్లు రూ.110,39,96,525 కోట్లు బాకాయిలున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మిల్లులే సుమారు రూ.217.50 కోట్లు బకాయిలున్నాయి. ఇలాంటి మిల్లర్లు ఇంకా 1175 మంది వున్నారు. వారిలో సగం మిల్లర్ల మీద ఒత్తిడి తెచ్చి సగం వసూలు చేసినా కనీసం రూ.5వేల కోట్లు వసూలౌతాయి. కాని అధికారులు దానిపై దృష్టిపెట్టరు. రాష్ట్ర ప్రభుత్వమేమో అధికారిక లెక్కల ప్రకారం భూముల ధరలతో కూడిన లెక్కలు సమర్పించి అప్పులు చేస్తుంటే, మిల్లర్లు మాత్రం తమ ఆస్దుల విలువ ఇష్టాను సారం పెంచి, బ్యాంకులను నమ్మించి, కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారెంటీలు తెస్తున్నారు. నిజంగా అవి సక్రమమైనవేనా ? అన్నది ఏ అదికారి పట్టించుకున్న పాపాన పోలేదు. వాటిపై ఎంక్వైరీ జరిగినట్లు వార్తలు వచ్చింది లేదు. ఆ బ్యాంకు గ్యారెంటీల వెనకాల వున్న మతలబు ఆరా తీయలేదు. నిజంగానే మిల్లర్లు అంతంత ఆస్దులున్నప్పుడు నేరుగా బకాయిలు చెల్లించొచ్చు. కాని గ్యారెంటీల వైపే ఎందుకు మొగ్గుచూపారు? వారి నుంచి బకాయిలు వసూలు చేయాలని ఓ వైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీరియస్‌గానే ప్రకటించారు. పైగా బాకాయిదారులైన వారికి ఒక్క వడ్ల గింజ కూడా ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి కూడా చెప్పారు. కాని ఆ మాటపై ప్రభుత్వం నిలబడలేదు. అధికారులు సీరియస్‌గా తీసుకోలేదు. మిల్లర్ల విజ్ఞప్తి అని ఒక విన్నపాన్ని ముందు పెట్టి, వారి నుంచి బ్యాంకు గ్యారెంటీలు తీసుకుంటే సరిపోతుందని నిర్ణయం ఎవరు తీసుకున్నారు. ప్రభుత్వం కూడా అంగీకరించిందా? ముఖ్యమంత్రి దానిపై ఆమోద ముద్ర వేశారా? సంబందిత మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కూడ ఓకే అన్నారా? ఈ వార్తలేమీ లేవు? కాని బకాయిదారులైన మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీలు తీసుకోవడం జరిగిపోయింది. వారికి వడ్దు అప్పగించడం కూడా పూర్తయింది. ఇలా లోలోన తంతు నిర్వహించడానికి అధికారులకు మిల్లర్లు పెద్దఎత్తున ముట్ట చెప్పినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. సంక్షేమ పధకాల అమలు కోసం ప్రభుత్వాలు పడే తిప్పలు అవి పడుతుంటాయి. అందుకోసం మిల్లర్ల మీద ఒత్తిడి రాకుండా వుండేందుకు అదికారులు బ్యాంకు గ్యారెంటీల ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. కాని ఎప్పటికైనా మిల్లర్లనుంచి వసూలు చేయాల్సిన వాటిని ఎందకు వదిలేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వందల మంది మిల్లర్లు బకాయిలు పడి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆ బకాయిలు కొండలా పెరిగిపోతున్నాయి. అయినా అదికారుల్లో చలనం లేదు. నెలలో ఒకటో తారీఖనే జీతాలు కావాలి. కాని బకాయిల వసూలు మాత్రం అదికారులకు పట్టింపు లేదు. ఇక ఇదిలా వుంటే ఎంతో మంది అవినీతి అదికారులు ఇతర శాఖలనుంచి సివిల్‌సప్లయ్‌ శాఖకు వచ్చి, ఏళ్ల తరబడి ఇక్కడే తిష్టవేసి, కోట్లు సంపాదిస్తున్నారు. అలాంటి అధికారులను ఇప్పటికైనా గుర్తించి వారిని వారి మాతృ సంస్ధలకు పంపిచాల్సిన అవసరం వుంది. ఇక పోతే ఇప్పుడు కాదు…అంటూ బకాయిల వసూలు ఇంకా, ఇంకా కాలయాపన చేసుకుంటూ పోతూ వుంటే అవి పెద్ద కొండలా మారిపోతాయి. ప్రభుత్వం వసూలు చేయడానికి గుదిబండలా మారుతాయి. ఈ పదేళ్లలో కొన్ని మిల్లులు కూడా మూతపడ్డాయి. అందులో బకాయి మిల్లులు వుంటాయి. వాటి నుంచి వసూలు చేయడం ఎవరి వల్ల కాదు. వచ్చే ఐదేళ్లు ఇలాగే కాలయాపన చేస్తే బకాయిలు పెరగడమే కాదు, వాటిని వసూలు చేయడం కూడా కష్టమే..అందుకే అప్పుల కోసం కాకుండా, బకాయిల వసూలు మీద దృష్టిపెట్టండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!