– తెలుగు వారి ఆత్మ గౌరవంకు పెద్దపీట
– టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలో టిడిపి మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎస్ కే అజీమ్, ఉపాధ్యక్షులు కొడాలి శ్రీనివాస్
భద్రాచలం : నేటి ధాత్రి
ఎన్టీఆర్ భారతదేశానికే ఆదర్శ నేత అని, తెలుగువారి ఆత్మగౌరవానికి పెద్దపీట వేశారని టిడిపి మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి ఎస్.కె అజీమ్, ఉపాధ్యక్షులు కొడాలి శ్రీనివాస్ అన్నారు.
తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవంను భద్రాచలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ తాలూరి రాఘవయ్య గారి ఇంటిముందు జండా ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి షేక్ అజీమ్, పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొడాలి శ్రీనివాస్ మాట్లాడుతూ… నందమూరి తారక రామారావు భారతదేశానికే ఆదర్శనేత అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి పెద్దపీట వేసిన మహా నేత ఎన్టీఆర్ అన్నారు. రామారావు గారు 1982 మార్చి 29న కూడు, గూడు, నీడ అనే నినాదంతో టీడీపీ పార్టీ స్థాపించడం జరిగిందన్నారు.
పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆ యుగ పురుషుడు ఎన్టీఆర్ కి దక్కిందన్నారు.ఎన్టీ రామారావు గారు అధికారంలో వచ్చిన తర్వాతనే ప్రజలకు సంక్షేమం ఏమిటో తెలిసిందని,ఆనాడే రెండు రూపాయల కిలో బియ్యం, పక్కా ఇల్లు, రైతులకు ఉచిత కరెంటు తదితర అనేక సంక్షేమ పథకాలు చేపట్టినారన్నారు.
ముఖ్యంగా తెలంగాణలో ప్రజలను పట్టిపీడిస్తున్న పటేల్, పట్వారి వ్యవస్థను రద్దుచేసి మండలీకరణం తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ ది అన్నారు. ముఖ్యంగా మహిళలకు ఆస్తిలో సగభాగం, దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకు యూనివర్సిటీ స్థాపించిన ఘనత ఎన్టీఆర్ ది అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుంచాల రాజారాం, అభినేని శ్రీనివాస్, ఖమ్మంపాటి సురేష్ కుమార్, తాళ్లూరి చిట్టిబాబు, ప్రకాష్ రావు, రేపాక రాంబాబు, నూతలపాటి దాసయ్య, పోటు వెంకటేశ్వరరావు, అచ్యుతరావు, రామకృష్ణ, మహిళలు తాలూరి అనసూయ, కోనేరు గౌతమి, సీత,మణీ తదితరులు పాల్గొన్నారు