
Tension in Anantapur Over NTR Fans’ Protest
రంగంలోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అనంతపురంలో ఉద్రిక్తం
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసాన్ని ముట్టడించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దుగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడించనున్నారనే ముందస్తూ సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఆదివారం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాసంతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసులు మోహరించారు. ఆ క్రమంలో ఆ ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసి.. ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాల్లో బ్యారికేడ్లను ఉంచారు. మరోవైపు అనంతపురంలోకి ప్రవేశించే జాతీయ రహదారిపై వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇంకోవైపు గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపైకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. ముందస్తు సమాచారంలో.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్కు వెంటనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తూ.. ఆందోళనకు దిగారు.
అలా చేయకుంటే ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసంతోపాటు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరించింది. బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే.. ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ టీడీపీ అధిష్టానాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో అనంతపురంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక అనంతపురం నగరంలో పోలీసులను భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ వాహనదారులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అలాగే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా జిల్లా పోలీస్ యాంత్రాంగం చర్యలు చేపట్టింది.
జూనియర్ ఎన్టీఆర్పై ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ఒక ఆడియో మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్కు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబు సారథ్యంలో కేబినెట్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పలువురు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం పట్ల సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే వీరి వైఖరి కారణంగా విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తడంతో.. వెంటనే నివేదిక ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. అదే విధంగా విమర్శలకు తావివ్వకుండా నడుచుకోవాలంటూ పార్టీ ఎమ్మె్ల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచన చేసినట్లు సమాచారం.