
ఇజం లేదు….అబద్దం తప్ప ఏమి కనిపించదు!
`రాజకీయమంటేనే ఊసరవెళ్లిలా మారుతోంది.
`రాజకీయమంటే అధికారమే పరమావది కాదు!
`ఐదేళ్లు వృధా అయితే గాని జనంలో మార్పు రాదు.
`నిజం నిప్పు…అబద్దం తప్పు!
`అలవి కాని హామీలు..ఇకపై జనం నమ్మరు!
`మరిన్ని హామీలు ఎవరిచ్చినా అసలే విశ్వసించరు.
`మూడు పార్టీలు మూలుగుతునే వున్నాయి?
`పదేళ్లలో ఇచ్చిన హామీలన్నీ బిఆర్ఎస్ అమలు చేయలేదు.
`వందరోజుల్లో అన్నీ పూర్తి అని చెప్పిన కాంగ్రెస్‌ది అదే దారి!
`ఒక్క ఛాన్స్ మాకు అని బిజేపి అడిగినా లాభం లేకపోవచ్చు!
`కేంద్రం నుంచి నిధుల గురించి జనానికి తెలియదనుకోకండి.
`ప్రజలు ఎంతో విజ్ఞులు…ప్రతిసారి మోసపోరు?
`భరోసా బలంగా ఏ పార్టీలోనూ లేదు?
`వచ్చే ఎన్నికలలో ధీమా ఇప్పటికీ లేదు!
`అనుమానంతోనే అన్ని విషయాలు చెబుతున్నారు.
`మేమే వస్తామన్న నమ్మకం కనబడటం లేదు!
`ఎన్నికల ముందు ఎంత చెప్పినా బాగా ఆలోచిస్తారు.
`జనాన్ని బలంగా నమ్మించే ప్రయత్నం చేస్తే కాని విశ్వసించరు.
`మరింత మెరుగైన పాలన కోసం ఎదురుచూస్తారు.
`ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకండి.
`నమ్మిన ప్రజలను నట్టెట ముంచకండి.
హైదరాబాద్,నేటిధాత్రి:
రాజకీయమంటే అధికారమొక్కటే కాదు. పాలించడమే కాదు. రాజకీయం అనేది ఒక సమూహం. అంతే కాని ఆ సమూహమంతా పాలించేందుకు మాత్రమే వుండాల్సిన పని కాదు. రాజకీయం అంటే ప్రశ్నించడం. ఎదిరించడం. నిలదీయం. నిర్భయంగా మాట్లాడడం. ప్రజా సమస్యలపై గళమెత్తడం. ఉద్యమాలు చేయడం. పోరాటాలు చేయడం. దర్నాలు చేయడం. నిరసలు చేపట్టడం . దీక్షలు చేయడం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొట్లాడడం. ఇదీ రాజకీయమంటే..అంతే కాదు రాజకీయమంటే దేశ ప్రగతి దారులు వెతకడం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం. సమసమాజ స్ధాపన కోసం ప్రయత్నం చేయడం. ఆ దిశగా చట్టాలు చేయడం. వాటిని అమలు చేయడం. జీవించే హక్కులాంటివి అందరికీ సమానంగా అమలు జరిగేలా చూడడం. సమాజాన్ని మేలుకొల్పడం. అసమానతలు తొలగించడం. ప్రజలను చైతన్యం చేయడం. దేశాభివృద్ది, ప్రజాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగడం. దేశాన్ని అన్ని రంగాల్లో పరుగులు పెట్టించడం. వెట్టి చారిరినీ నివారించడం. ప్రజలకు ఉపాధి కల్పనగావించడం. పేదరికం లేని సమాజాన్ని నిర్మానం చేయడం. ఆకలి లేని రాజ్యాన్ని సృష్టించడం. ఇదీ రాజకీయమంటే..ఇదీ నాయకులు చేయాల్సిన పని అంటే..అంతే కాని నిత్యం ఒకరి మీద ఒకరు మైకుల మందు చెప్పుకునే మాటలు కాదు. ప్రతి సమస్యను ప్రజా కోణంలో కాకుండా, పార్టీల స్వార్ధాల కోసం పనిచేయడం రాజకీయం అసలే కాదు. ఇప్పుడు సాగుతున్న రాకీయాలకు సిద్దాంతాలు లేవు. రాద్దాంతాలు మాత్రం మితిమీరుతున్నాయి. రాజకీయాన్ని, ప్రభుత్వానికి ముడిపెట్టి ఆధిపత్య రాజకీయాలు సాగిస్తున్నారు. ప్రజా సమస్యలు గంగలో కలిపేస్తున్నారు. ఏ పార్టీ చూసినా ఇదే అనుసరిస్తున్నాయి. ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రశ్నించినట్లు నటించడం. ఒక వేళ పాలకులను ప్రశ్నిస్తే ఇతర పార్టీలను దేహ ద్రోహులని ముద్రలు వేయడం. పాలక పక్షాలను ఎదురించిన వారిని కేసుల్లో ఇరికించడం. ప్రజా గొంతును నొక్కేయడం. ఇదే రాజకీయం అనే స్ధాయికి చేరుకున్నది. ఆధిపత్య రాజకీయాల్లో, కక్షపూరిత రాజకీయాలు చేరుకున్నాయి. అధికారంలో వున్న పార్టీలు ప్రతిపక్షాలను బెదిరించడం, వేధించడం అలవాటు చేసుకుంటున్నాయి. ప్రశ్నించే గొంతులు లేకుండా చూడాలనుకుంటున్నాయి. దాంతో ప్రజలు కోసం తాము వున్నామన్న విసయాన్నే నాయకులు మర్చిపోతున్నారు. అధికారంలోకి వచ్చిన వాళ్లు, ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వాలను కీర్తించేవారికి పదవులు. ప్రభువుల భక్తి ప్రదర్శించేవారే అసలైన నాయకులు అనే పరిసి ్ధతికి తెచ్చారు. లేకపోతే ఒక పార్టీలో గెలిచిన నాయకులు, తెల్లారేసిరికి ఏ పార్టీలో వుంటారో తెలియని అయోమయ పరిస్ధితులు. ఇంతే..రాజకీయం గురించి చెప్పుకోవాంటేనే అసహ్యం వేసేలా వాతావరణం మారింది. ఒకప్పుడు నాయకులు ప్రతిపక్షంలో వున్నందుకు గర్వంగా వుందని చెప్పుకునేవారు. పాలకపక్షంలో వున్న నాయకులు చేయలేని పనిని తాము చేస్తున్నామని చెప్పుకునేవారు. ఇప్పుడు ప్రతిపక్షంలో వుంటే ఏముంటుంది? కేసులు, వేదింపులు తప్ప ఐదేళ్లు ఏం అందుతుందన్న భావనకు నాయకులు కూడా వచ్చారు. దాంతో ప్రతిపక్షం అంటే పాలకపక్షం ముందు గజగజ వణికిపోవాల్సిన పరిస్ధితులు ఎదురౌతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పదేళ్లపాటు పాలన సాగించింది..తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజాస్వామిక తెలంగాణ ఫరిఢమిల్లుతుందని అందరూ అనుకున్నారు. కాని రాజ్యం అనేది ఎప్పుడూ తన పెత్తనాన్ని వదులుకోవడానికి ఇష్టపడదని కేసిఆర్ కూడా నిరూపించారు. ప్రతిపక్ష నాయకుల ప్రశ్నలు వినడానికి కూడా చాలా సందర్భాలలో ఇష్టపడలేదు. ప్రజల నుంచి సూచనలు తీసుకోవడానికి కూడా ఆసక్తి చూపలేదు. 2014 ఎన్నికల్లో కేసిఆర్ ఇచ్చిన హమీలు ఎన్ని? అమలు జరిగినవి? ఎన్ని అని చూస్తే, ఇచ్చిన హమీలకు, అమలుకు సామీప్యమే లేదు. అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు ఇస్తామన్నారు. కాని నిండు అసెంబ్లీలో తెలంగాణలో వున్న కుటుంబాలకంటే, రేషన్‌కార్డులు ఎక్కువ వున్నాయని, కోత కోసేశారు. రేషన్‌కార్డులు ఏరి వేశారు. డిల్లీలో జరిగిన సమావేశంలో కుటుంబాల కన్నా, రేషన్‌కార్డులు ఎక్కువ వున్నాయని తెలిసి తన తల తీసేసినంత పనైందన్నట్లు మాట్లాడారు. అంటే ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడ మల్లన్న అనే దానిని నిజం చేశారు. రెండోసారి అదికారంలోకి వచ్చిన తర్వాత పరిస్ధితులను అర్దం చేసుకొని, పార్టీ ఆగమైపోయేలా వుందని గ్రహించి, మళ్లీ కొన్ని రేషన్‌కార్డులు జారీ చేశారు. తెలంగాణలో అర్హులైన ప్రతి కుటుంబానికి రెండు పడకల గదుల ఇండ్లు ఇస్తామన్నాడు. కాని పదేళ్ల కాలంలో తెలంగాణ పల్లెల్లో ఒక్క ఇల్లు ఇచ్చింది లేదు. నిర్మాణం చేసింది లేదు. కాని లక్షల లెక్క చూపించి, జనాన్ని బురిడీ కొట్టించాలని కేసిఆర్ చూశాడు. గత ఎన్నికల్లో ఓడిపోయాడు. తెలంగాణలో అర్హులైన దళితులందరికీ మూడెకరాల భూమి ఇస్తామన్నాడు. భూమితో పాటు భూమిని సాగుకు యోగ్యం చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందన్నాడు. బోరు వేయిస్తామన్నాడు. ప్రభుత్వమే మోటారు బిగిస్తుందన్నాడు. ఉచిత కరంటు 24గంటలు సరఫరా చేస్తాన్నాడు. మూడేళ్లపాటు పెట్టుబడి సాయం మొత్తం అందిస్తానన్నాడు. ఏమైంది. రెండు సంవత్సరాలు వెలుసుబాటు పేరుతో కాలయాపన చేశాడు. మూడో ఏడు ప్రభుత్వంతో మూడెకరాల భూమి ఇవ్వడం సాద్యం కాదన్నాడు. అసల తెలంగాణలో ప్రభుత్వ భూమే లేదని చేతులెత్తేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి. కేజీటు పిజీ ఉచిత విద్య అన్నాడు. దాన్ని మరిపించేందుకు గురుకులాలు అన్నాడు. ఆఖరుకు కేజీటు పీజీకి మంగళం పాడారు. అంటే ఇచ్చిన హమీలను ఎలా అమలు చేయకుండా వుంటారో అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తుందని చెప్పడానికి సందేహం లేదు. మొహమాట పడాల్సినదేమీ లేదు. అదికారంలోకి రావాలంటే అబద్దాలు చెప్పాలి. ప్రజలను నమ్మించాలి. అనేది మాత్రం రాజకీయ పార్టీలు నేర్చుకున్నాయి. నిజం చెప్పడం మర్చిపోయాయి. నిజం చెబితే జనం నమ్మడం లేదని రాజకీయ పార్టీలు నిర్ధారణకు వచ్చాయి. 2023 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఆరుగ్యారెంటీలను ప్రకటించింది. ఎట్టి పరిస్ధితుల్లోనూ ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పింది. కాని ఎన్ని అమలు చేసింది? ప్రజలకు తెలియదా? అయిన తాజాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓ ఛానల్లో చెప్పిన మాటలు నిజమా? అనే సందేహపడాల్సిన పరిసి ్ధతి వస్తోంది. ఆరు గ్యారెంటీలలో ఒకటో, రెండో అమలు చేశారు. కాని ఒకటో, అరో అమలు కాకుండా మిగిలిపోయిందని చెప్పుకుంటున్నారు. కళ్లముందు ప్రజలకు పథకాల అమలు కనిపించడం లేదా? పధకాలు అమలౌతే ప్రత్యేకంగా రాజకీయ పార్టీలు చెప్పుకోవాలా? సంక్షేమం అందిన తర్వాత ప్రజలు మర్చిపోతారా? అయినా ప్రజలను మాయం చేయడం రాజకీయ పార్టీలు, పాలకులు ఊరుకోరు. పొరుగున వున్న ఆంద్రప్రదేశ్‌లోనే కాదు, దేశంలో వున్న అన్ని రాష్ట్రాలు ఇవే చేస్తున్నాయి. కేంద్రంలోవున్న బిజేపి అదే చేస్తోంది. ఎన్నికల ముందు ఉచితాలు ప్రకటించడం. ప్రచారం చేయడం తర్వాత చేతులెత్తేయడం అలవాటు చేసుకుంటున్నాయి. ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం తప్ప, అభివృద్ది సంక్షేమం సంగతి విషయంలో ఆ ఒక్కటి అడక్కు అనే పరిస్దితి వచ్చేసింది. అప్పులు చేయడంలో పాలకపక్షాలు పోటీ పడుతున్నాయి. 50 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అప్పులు 50లక్షల కోట్లు గా వుంటే, పదేళ్లలో బిజేపి కేంద్రంలో చేసిన అప్పు 1.50లక్షల కోట్లు అని అంటున్నారు. ప్రతిపక్షం చేసే ఆరోపణలు నిజమా కాదా? అనేది కూడా చెప్పడానికి పాలకపక్షాలు ఇష్టపడడం లేదు. తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం 8లక్షల కోట్లు అప్పు చేసి, కేసిఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని ప్రచారం చేసింది. కాని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లుకూడా కాలేదు. అప్పుడు 2.2ంలక్షల కోట్లు అప్పు చేసినట్లు కేంద్రం ప్రకటించింది.. కేసిఆర్ పదేళ్లలో చేసిన అప్పు కేవలం. 2.80లక్షల కోట్లు అని తేల్చింది. దాంతో కాళేశ్వరం, మిషన్ భగీరధ, వంటి పధకాలు అమలు చేశారు. మరి కాంగ్రెస్ ఈ అప్పులు తెచ్చి ఏం చేశారనే ప్రశ్నకుసమాదానం వుండదు. ఇలా ఎన్నికల ముందు ఏదైనా చెప్పడం. అలవి కాని హమీలు ఇవ్వడం. తర్వాత చేతులెల్తేయడం అన్ని పార్టీలు చేస్తున్నదే. రాజకీయాలంటే అబద్దాల సామ్రాజ్యాలని ప్రతిసారి నిరూపిస్తున్నవే. అన్నీ ఆ తాను ముక్కలే. అందరూ అందరూ అందరే!! 79ఏళ్ల స్వాతంత్య్రంలో మన దేశానికి మిగిలినవి అప్పులే!!!