’’పొంగులేటి’’ ముందు ఎవరి కుప్పిగంతులు చెల్లవులే!
అధిష్టానం ముందు ‘‘పితూరీలు’’ చెప్పే వారి పాచికలు పారవులే!

అధిష్టానానికి అన్నీ తెలుసు.
పార్టీని అధికారంలోకి తీసుకురావడం

‘‘పాన్ నమిలినంత’’ సులువు కాదు.
`గెలిచిన తర్వాత ఫోజులు కొట్టినంత మాత్రాన సరిపోదు.
పదేళ్ళ తర్వాత పార్టీని అధికారంలోకి తేవడానికి ‘‘శీనన్న’’ పడిన కష్టం అధిష్టానానికి తెలుసు.
`జిల్లాలకు జిల్లాలు గెలిపించిన నాయకుడు ‘‘శీనన్న’’.
ఖమ్మంలో కారు తిరగకుండా చేసిన నాయకుడు ‘‘శీనన్న’’.
`తన సీటు గెలవడానికే ఆపసోపాలు పడ్డ వాళ్లు కూడా మాట్లాడుతున్నారు.
’’సిఎం. రేవంత్ రెడ్డి’’ తో కలిసి పార్టీ గెలుపుకు అహర్నిశలు కృషి చేసింది ‘‘శీనన్న’’.
ఖమ్మం సభతో కాంగ్రెస్ ను కదం తొక్కేలా చేసింది ‘‘శీనన్న’.
`తెలంగాణ లో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి తొలి ‘‘గర్జన ఖమ్మం సభ’’.
కాంగ్రెస్ కు వేవ్ తెప్పించడంలో రేవంత్ రెడ్డి’’ తర్వాత కష్టం ‘‘శీనన్న’’దే.
`అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ మాట్లాడతారు.
పదేళ్లలో ఓడిపోయిన వాళ్లు కూడా గొప్పలకు పోతున్నారు.
`’’శీనన్న’’ రాజకీయం పలుచన చేయాలని చూస్తున్నారు.
`పార్టీని అధికారంలోకి తేవడంలో ‘‘శీనన్న’’ కష్టం పార్టీ పెద్దలందరికీ తెలుసు.
పార్టీకి పది పైసలు సాయం చేయలేని వాళ్లు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.
`ఇప్పుడున్న పరిస్థితులలో పార్టీని నిలబెట్టే శక్తి వున్న నాయకులెవరో పెద్దలకు బాగా తెలుసు.
`పదవులకు న్యాయం చేయలేని వాళ్లు కూడా పెత్తనం కోసం ఆరాటపడుతున్నారు.
’’పొంగులేటి’’ ప్రభ తగ్గించాలని కలలు గంటున్నారు.
`పదవులొచ్చేలా దారి వేసిన ‘‘శీనన్న’’ నడవకుండా ముల్లకంప వేయాలని చూస్తున్నారు.
`వారి గోతులు వాళ్లే తవ్వుకుంటున్నారు.
`చెరపకురా చెడేవు అని తెలిసినా చాలా మంది మారరు.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఏటికి ఎదురీదేవాళ్లు మాటలు చెప్పరు. చెప్పినా వాటిని నిజం చేస్తారు. విజయాన్ని కళ్లముందు ఆవిష్కరిస్తారు. అలాంటి వారిలో రాష్ట్ర్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒకరు. ఏమీ చేయలేని వారు ఏతులెక్కువ చెబుతారు. కూర్చున్న చోటంతా నాదే అంటారు. గుర్రాలు మలుతున్నామని గొప్పలు చెప్పుకుంటారు. పదేళ్లుగా పార్టీకి ఇటుక కూడా పేర్చని వాళ్లు ఇదంతా మాదే అంటారు. ఇదంతా మా వల్లే అని గొప్పలు చెప్పుకుంటారు. అలాంటి వాళ్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద పడి ఏడుస్తుంటారు. పార్టీలో పొంగులేటికి లభించే ప్రాధాన్యత చూసి ఓర్వలేకపోతున్నారు. పార్టీ అధిష్టానం వద్ద మంత్రి పొంగులేటికి వున్న పలుకుబడిని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఆయన ప్రాభవం చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన నాయకత్వాన్ని భరించలేకపోతున్నారు. వారి పెత్తనం సాగడం లేదని కుళ్లుకుంటున్నారు. ఇదంతా పొంగులేటి మూలంగానే తమకు గుర్తింపు లేదన్న అక్కసుతో లేనిపోని రాద్దాంతం చేస్తున్నారు. అసలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన కృషి ఏమిటో తెలియని వాళ్లు కాదు. కాంగ్రెస్ పార్టీ కోసం మంత్రి పొంగులేటి ఎంత కష్టపడ్డారో తెలియని వాళ్లు కాదు. అయినా అదంతా గతం అనుకునే బాపతు కాంగ్రెస్‌లో పెరిగిపోయారు. ఓడదాటే దాకా ఓడ మల్లన్న అని పొంగులేటిని పొగిడిన వాళ్లే, ఇప్పుడు గెలిచి పదవులు రాగానే పొంగులేటిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. అలాంటి వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈ స్ధితికి వచ్చింది. అయినా వారు మారరు. ఇలా మంత్రి పొంగులేటి మీద పడి ఏడ్చే వారి వల్ల ఊదు కాలేదు లేదు. పీరు లేచేది లేదు. అయినా సరే పొంగులేటిని విమర్శిస్తే తప్ప మీడియాలో కూడా కనిపించలేని స్ధాయికి దిగజారుతున్నారు. పార్టీ పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే వారు..పార్టీని కష్ట కాలంలో వదిలేసి వచ్చిన వారు కూడా పొంగులేటిని విమర్శిస్తుంటే జనం నవ్వుకుంటున్నారు. ఆఖరుకు కాంగ్రెస్ పార్టీకి తీరని ద్రోహం చేసిన వాళ్లు కూడా పార్టీ అదికారంలోకి రావడానికి ప్రముఖ పాత్ర పోషించిన పొంగులేటిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇంతకన్నా విడ్డూరం మరొకటి వుండదు. పార్టీ పెంచి పెద్ద చేసినా, ఆ కృతజ్ఞత లేకుండా, అవకాశ వాద రాజకీయాల కోసం కండువాలు మార్చినవారున్నారు. పార్టీ అన్ని పదవులు ఇచ్చినా స్వార్ధం కోసం పార్టీని వీడిన వాళ్లున్నారు. ఎక్కడా దిక్కూ దివానం లేక మళ్లీ పార్టీ గూటికి చేరి పదవులు పొందిన వాళ్లు కూడా నిత్యం పొంగులేటిని ఆడిపోసుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయం అలాంటిది కాదు. ఆయన రాజకీయంగా తొలి అడుగుతోనే తెలంగాణ రాష్ట్రానికి వైసిపికి తొలి అధ్యక్షుడయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత వైసిపి నుంచి ఎంపిగా గెలిచారు. ఖమ్మం జిల్లాలో తన పట్టు ఏమిటో చూపించారు. తనతోపాటు ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. తన నాయకత్వ పటిమ మొదటి ఎన్నికల్లోనూ చూపించారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని విమర్శిస్తున్న వారిలో ఏ ఒక్కరికీ ఇలాంటి బలమైన రాజకీయ చరిత్ర లేదు. పార్టీ పేరు చెప్పుకుంటే తప్ప గెలవలేరు. పార్టీలు బిఫామ్‌లు ఇస్తే తప్ప పోటీ చేయలేరు. పార్టీకి అడుగడుగునా మోసం చేసిన వాళ్లు పొంగులేటిపై నీతి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదీ తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని చెప్పుకోవాలి. తమ స్ధానాలలో తాము గెలవలేని వాళ్లు కూడా పదవులు అందుకొని నీతిబాహ్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మేస్తే అది మొహంమీదే పడుతుంది. అది తెలిసినా పదే పదే అలాంటి పొరపాట్లు చేస్తూనే పోతుంటారు. గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒడిదొడుకులు ఎదుర్కొన్న కాలంలో పార్టీ పక్కన నిలబడిన వారు కాదు. పార్టీకి అండగా వున్న వాళ్లు కాదు. పార్టీని నిలబట్టే ప్రయత్నం ఏనాడు చేసిన వాళ్లు కాదు. అవకాశ వాద రాజకీయాల కోసం ఇతరపార్టీలకు వెళ్లి అక్కడి నుంచి కాంగ్రెస్‌ను తిట్టిన వాళ్లే ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారు. మంత్రి పొంగులేటి పెత్తనాన్ని ప్రశ్నిస్తున్నారు. మంత్రి పొంగులేని ప్రభుత్వంలో నెంబర్ టూగా కొనసాగుతుండడాన్ని ఓర్వలేకపోతున్నారు. సరిగ్గా ఆరు ఎన్నికలకు ఆరు నెలల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు ఆ పార్టీ పరిస్ధితి ఏ స్దితిలో వుంది? అనేది అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు అందుకున్నారో అప్పటి నుంచి పార్టీని గాడిలో పెట్టారు. పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. పార్టీ క్యాడర్లో నమ్మకాన్ని నింపుతూ వచ్చారు. పార్టీ క్యాడర్‌కు భరోసా కల్పించారు. అడుగడుగునా అప్పటి ప్రభుత్వం మీద సిఎం. రేవంత్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. అనేక సార్లు జైలు పాలయ్యారు. అనేక ఉద్యమాలు చేపట్టారు. పోరాటాలు చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసిఆర్‌ను ఊపిరి సలపనివ్వకుండా రాజకీయం చేశారు. బిఆర్ఎస్ను చీల్చి చెండాడారు. కేసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చారు. కేసిఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికి తీస్తూ వచ్చారు. కేసిఆర్ పాలనలో జరిగిన భూముల ఆక్రమణపై ప్రజల్లో చైతన్యం కల్గించారు. ప్రాజెక్టుల పేరుతో జరిగిన దోపిడీని ప్రజల ముందుంచారు. ఇలా రేవంత్‌రెడ్డి ఒంటరి పోరాటం సాగించారు. ఆఖరుకు పాదయాత్ర చేపట్టారు. పార్టీని గ్రామ గ్రామం నుంచి బలోపేతం చేసేందుకు అనేక రకాలుగా కృషి చేశారు. కాని పార్టీకి ఇంకా బలం కావాలి. బిఆర్ఎస్ను కొట్టడానికి మరో బలం తోడు కావాలి అనుకున్నప్పుడు పార్టీకి కనిపించిన వెపన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఆ సమయంలో పిపిసి. అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి వెళ్లి , పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత పొంగులేటి కాంగ్రెస్‌లోకి వచ్చారు. పార్టీని బలోపేతం చేసే బాధ్యత తీసుకున్నారు. ఖమ్మం నుంచే కాంగ్రెస్ గర్జన మొదలు పెట్టారు. బిఆర్ఎస్ను రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయేలా పొంగులేటి రాజకీయం చేశారు. ప్రజలను చైతన్యం చేశారు. తానున్నానని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఖమ్మంలో కారును తిరగన్వికుండా చేస్తానని శపథం చేసి నెరవేర్చారు. ఇదీ మంత్రి పొంగులేటి రాజకీయ యుద్దం. ఇలాంటి యుద్దం పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తప్ప మరొకరెవరైనా చేశారా? టిక్కెట్ల కోసం ఆరాపటపడ్డారు. టిక్కెట్ల కోసం ఎదురుచూశారు. వాళ్ల గెలుపుకోసమే శ్రమించారు. కాని ఇతర నియోజకవర్గాలలో ప్రచారం చేసే ప్రయత్నం చేశారా? తమ కన్నా పార్టీ గెలుపు ముఖ్యమని ముందుకుసాగారా? ఎన్నికల సమయమంతా చెమటోడ్చి వాళ్లు గెలిచేందుకే సమయం సరిపోలేదు. కాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి తమ నియోజకవర్గాలలో కనీస ప్రచారానికి వెళ్లకుండానే గెలిచిన నాయకులు. ఇతర నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల గెలుపుకోసం అహర్నిషలు కృషి చేశారు. ఇదీ పొంగులేటి నాయకత్వ పటిమ. పార్టీని అధికారంలోకి తీసుకురావడం అంటే పాన్ నమిలినంత సులువు కాదు. అయినా అధిష్టానానికి అన్నీ తెలుసు. ఎవరు ఏమిటో వారికి పూర్తిగా తెలుసు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంకితభావం ఎంత గొప్పదో తెలుసు. పార్టీ కోసం ఆయన కష్టపడిన తీరు తెలుసు. పార్టీకి అండగా వుంటూ ఆయన ఏం కోల్పోయారో కూడా తెలుసు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎన్ని త్యాగాలు చేస్తే పార్టీ గెలిచిందో కూడా డిల్లీ పెద్దలందరికీ తెలుసు. ఇప్పుడు మంత్రి పొంగులేటి మీద లేనిపోని విమర్శలు చేస్తే డిల్లీ పెద్దలు నమ్మరు. లేనిపోని రాద్దాంతాలు చేసి పార్టీకి నష్టం చేకూర్చుతున్న వాళ్లు ఎవరో డిల్లీ అధిష్టానానికి అన్నీ తెలుసు. ఇచ్చిన పదవులకు న్యాయం చేయలేక, పని చేయలేని వాళ్లే లేనిపోని పితూరీలు మోస్తుంటారు. ఇతర నాయకులు ఎదుగుతుంటే చూడలేరు. అందుకే మంత్రి పొంగులేటి మీద లేనిపోని పుకార్లు పుట్టించి, అసత్యాలు ప్రచారం చేయాలని చూస్తున్నారు. కాని ప్రజలు నమ్మడం లేదు. పార్టీ క్యాడర్ నమ్మడానికి సిద్దంగా లేదు. అవకాశ వాదుల మాటలు ఎవరూ నమ్మరు. చెరపకురా చెడేవు అని సామెతను నిజం చేసుకున్న వాళ్లు కూడా మళ్లీ మళ్లీ అదే పని చేస్తున్నారు. వాళ్లు అక్కడే వుంటారు. ఎదుగుతున్న వారిని చూస్తూ ఏడుస్తూనే వుంటారు. మంత్రి పొంగులేటి ప్రభను తగ్గించలేరు. ఆ వెలుగులు తక్కువ చేయలేరు.
