https://epaper.netidhatri.com/
`మంత్రి సురేఖగారు మీరన్నా నిధులివ్వండి!
`అవినీతి ఉద్యోగులను తొలగించండి.
`ఏళ్ల తరబడి తిష్ట వేసిన వారిని సాగనంపండి.
`రాజన్నకు పూర్వ వైభవం కల్పించండి.
`వేములవాడ ఎందుకో వెనుకబడ్డది!
`దక్షిణ కాశీకే దిక్కులేకుంటున్నది.
`ఉమ్మడి రాష్ట్రంలో రాజన్నకు అన్యాయమే!
`తెలంగాణలో అభివృద్ధికి ఆమడ దూరమే!
`ఏటా వంద కోట్లన్నారు…ఏనాడో మర్చిపోయారు.
`రాజన్నకే శఠగోపం పెట్టారు.
`పాలకులు అలా…ఉద్యోగులు ఇలా!!
`దేవుని సొమ్ము ఏళ్లుగా మెక్కుతున్నారు!?
`పదేళ్లకు పైగా పదమూడు మంది తిష్ట!
`ఉద్యోగుల అవినీతిపై విచారణ.
`నిజనిర్థారణ జరిగినా చర్యలు లేవు.
`విచారణ నివేదిక బుట్ట దాఖలు చేశారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ ఉద్యమానికి వేముల వాడ రాజన్న ఆశీస్సులు వున్నాయి. తెలంగాణ ఉద్యమ ప్రస్ధానం, ఆట,పాట అంతా వేముల వాడ రాజన్న చుట్టే తిరుగాయి. అందుకే తెలంగాణ వచ్చింది. వేములవాడ రాజన్న కనికరమే తెలంగాణకు వరమైంది. తెలంగాణ ఉద్యమం ఊరూ, వాడ చేరేందుకు, రాజన్న పేరు మీద పాటలు కైగట్టి పాడని కవిగాయకులెందరో వున్నారు. అలా రాజన..ఓ రాజనా…ఎత్తుర తెలంగాణ జెండ…రాజన ఓ రాజన్నా..అంటూ పాటలు పాడారు. అసలు రాజన్న పదం లేకుండా తెలంగాణ పాటే లేదు. అంత గొప్పది రాజన్న దీవెన. ఆయన దీవెనతోనే మలి దశ తెలంగాణ సాధ్యమైంది. కాని తిరుపతి వెంకన్నకు తెలంగాణ మొక్కులు చేరాయి. విజయవాడ దుర్గమ్మకు మొక్కులు నెవరేరాయి. యాదగిరి నర్సన్నకుకొత్త కోవెల వచ్చింది. వెయియ కోట్లతో కొత్త గుడి నిర్మాణం జరిగింది. కాని తెలంగాణ ఉద్యమం మొత్తం తన పేరు చుట్టూ తిరిగిన రాజన్న ఆలయం మాత్రం అలాగే వుంది. అక్కడే వుంది. యాదగిరి గుట్ట పేరు మార్చి యాదాద్రి చేసిన తర్వాత అందరూ ప్రశ్నించడంతో నాడు కేసిఆర్ ఎముడాల రాజన్నకే ఏటా వంద కోట్లు ఇస్తామని మాట తప్పాడు. పదవి పోగొట్టుకొని ఇంట్లో కూర్చున్నాడు. తెలంగాణలో వేముల వాడ రాజన్న అంటే ఎంతో మహిమాన్వితమైన దేవుడు. తెలంగాణలో అత్యంత పురాతమైన దేవాయాలలో వేములవాడ రాజన్న ఆలయం ఎంతో విశిష్టమైంది. పశ్చిమ చాళుక్యుల కాలం కోనేరులో వున్నాననిచెప్పి, గుడి కట్టమని స్వయంగా శివుడే ఆదేశిస్తే గుడి నిర్మాణం జరిగింది. నాటి నుంచి రాజన్న పూజలందుకుంటున్నాడు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్నాడు. నిత్యం లక్ష మందికి పైగా వేముల వాడ రాజన్నను భక్తులు దర్శించుకుంటారు. మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు కొంగు బంగారమైన దేవుడు రాజరాజేశ్వర స్వామి. ఇప్పుడు బస్సు సౌకార్యలు, ఇతర రవాణా సౌకర్యాలున్నాయి. ఆరోశతాబ్ధంలో నిర్మాణమైన ఆలయం చాళుక్యుల కాలం నుంచి వెలుగు వెలుగుతోంది. రాజన్న ఆలయ కోనేరులో స్నానమాచరిస్తే శారీరక రోగాలన్నీ మాయమౌతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అలా కొన్ని వందల సంవత్సరాలుగా తెలంగాణలో విరాజిల్లుతున్న గొప్ప శైవక్షేత్రం. ఉమ్మడి పాలకులు ఏనాడు వేముల వాడను పట్టించుకోలేదు. వసతుల సౌకర్యాలు కల్పించలేదు. ఇప్పటికీ వేముల వాడలో వున్న గృహ సముదాయాలు కొన్ని వందల ఏళ్ల కాలం నాడు నిర్మాణం చేసినవే తప్ప, ఉమ్మడి రాష్ట్రంలో గాని, తెలంగాణ వచ్చిన తర్వాత గాని చేసిన నిర్మాణాలు లేవు. తెలంగాణలోని కొన్ని లక్షల కుటుంబాలు ఏటా రాజన్నను దర్శించుకోకుండా వుండరు. తెలంగాణలోని అన్ని దేవాలయాలకన్నా, ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వేముల వాడ నుంచే లభిస్తుంది. అయినా పాలకులు ఏనాడు వేముల వాడ అభివృద్దిపై దృష్టిసారించలేదు. గతంలో ఏటా వంద కోట్లు ఇస్తామని గొప్పలు చెప్పిన కేసిఆర్ మాటలు మాత్రం అనేకం చెప్పారు. వేముల వాడ టెంపుల్ ఏరియా అధారిటీ ఏర్పాటుచేశారు. పురుషోత్తమ రెడ్డిని సీఈవోగా నియమించారు. తొలిసారి ప్రకటించిన వంద కోట్లలో కూడా కొంత మాత్రమే ఇచ్చారు. కొంత దేవాలయ స్ధలాన్ని చదను చేసి వదిలేశారు. ఆ తర్వాత నిధులు మంజూరు మర్చిపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత కనీసం కొత్త క్యూలైన్ కూడా ఏర్పాటు చేయలేదు. నిర్వహణ లోపం గతం కన్నా అద్వాహ్నం చేశారు. సానిటేషన్ గురించి పట్టించుకునే నాధుడు లేడు.
ఇక ఉద్యోగుల అవినీతికి లెక్కే లేదు.
అంత పెద్ద గుడికి పూర్తి స్ధాయి ఈవో ఎప్పుడూ వుండడు. ఎప్పుడూ ఇన్‌చార్జి ఈవోలే దిక్కవుతారు. ఏటా కనీసం వంద కోట్ల ఆదాయం వేముల వాడ నుంచి ప్రభుత్వానికి వెళ్తుంది. ఈ ఆలయంలో ఓ పదమూడు మంది ఉద్యోగులు దశాబ్ద కాలానికి పైగా తిష్టవేశారు. వారు చేసే అవినీతి అంతా ఇంతా కాదు. వీరి అవినీతి మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది. సుమారు31 పేజీల నివేదిక తయారు చేశారు. విజిలెన్స్ అధికారులు ఒక్క రోజే రెండు లక్షల లడ్డూల రికవరీ చేసినట్లు రాశారు. రాజన్న భక్తుల కోసం కొనుగోలు చేసిన వస్తువులలో 25రూపాయలకు పైగా సరుకులు మాయమైనట్లు నిర్ధారణ చేశారు. ఇక కాళ్యాణ కట్టలో జరిగే అవినీతి, ధర్మశాల కిరాయిలలో చేతి వాటాలలకు లెక్కేలేదు. రీజినల్ జాయింట్ కమీషనర్ రామకృష్ణ మొత్తం ఎంక్వైరీ చేసి నివేదిక ఉన్నతాధికారులకు ఇచ్చారు. కాని అది బుట్ట దాఖలైంది. ఎలా పైనుంచి కింది దాకా రాజన్న సొమ్మును తింటున్నారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. భక్తులకు అసౌకర్యాలు సృష్టిస్తున్నారు.
ఎముడాల రాజన్న.. మా పార్టీ అధికారంలోకి రావాలని, నాయకులు ఎన్నికల్లో గెలవాలని మొక్కులు మొక్కుతారు. కోడెలు కట్టేస్తారు.
పదవుల కోసం పాహిమాం..పాహిమాం అంటారు. రాజకీయాలతో రాజ్యమేలాలని రాజన్నా, రాజన్నా అని కొలుస్తారు. తీరా కోర్కెలు తీరగానే, పదవులు రాగానే రాజన్నను మర్చిపోతారు. ఇది ఇప్పటి తరం నాయకులు పరిస్ధితి. అయినా రాజన్న అందర్నీ చల్లగానే చూస్తాడు. తప్పులు చేసిన వారిని కూడా క్షమిస్తాడు. దీవెనార్తులు ఇస్తూనే వుంటాడు. అందుకే పాలకులు తప్పు చేసినా, ఉద్యోగులు ఆలయాన్ని ఊడ్చుకుతింటున్నా ఊరుకుంటున్నాడు. ఉన్నది మేస్తున్నా కనికరిస్తున్నాడు. అవును…నిజమే..లేకుంటే దశాబ్ధాల తరబడి పూచిక పుల్ల కూడా వదిలిపెట్టకుండా దోచుకుతింటూ, దేవుని సొమ్మునే కైంకర్యంచేస్తూ, గుడికి చెందాల్సిన సొమ్మును దోచేస్తుంటే కూడా ఎవరూ ఏం చేయలేకపోతున్నారు. ఎంత మంది భక్తులు పిర్యాధులు చేసినా పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లు ఎక్కడిక్కడ ఎవరికి అందినంత వారు దోచేస్తున్నారు. ఆలయానికి వచ్చిన ఆదాయానికి కన్నం పెడుతున్నారు. రాజన్న భక్తులకు చుక్కలు చూపిస్తున్నారు. దేవుని సొమ్ము స్వాహా చేస్తున్నారు. దక్షిణాదిలో వైష్ణవాలయాలు వెలిగిపోతుంటే, శివాలయాలు దీపానికి కూడా నోచుకోవడం లేదని కొత్త బాష్యాలు చెప్పిన గత ముఖ్యమంత్రి కేసిఆర్ వేముల వాడను అభివృద్ధి చేస్తానని మాటలు చెప్పాడు. రాజన్నను కూడా మాయ చేశాడు.
కొత్త ప్రభుత్వం వచ్చింది. తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది.
ఉమ్మడి కరీంనగర్ నుంచి ఇద్దరు మంత్రులున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర సయమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజన్నను దర్శించుకున్నారు. ఆశీర్వాదం తీసుకున్నారు. దేవాదాయ, ధర్మాధాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ వున్నారు. త్వరలో సమ్మక్క`సారక్క జాతర పెద్దఎత్తున తెలంగానలో జరగనున్నది. తెలంగాణ నలు మూలలనుంచి సమ్మక్క జాతరకు వెళ్లే భక్తులు చాల వరకు ముందు వేముల వాడ రాజన్నను దర్శనం చేసుకున్న తర్వాతే సమ్మక్కతీర్ధం వెళ్తారు. అందువల్ల ఈ సమయంలో వేములవాడ అభివృద్దికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని భక్తులు ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా గత పదేళ్లకాలంలో వేములవాడలో జరిగిన అవినీతిపై కూడా మంత్రి కొండా సురేఖ దృష్టిసారించాలని కోరుతున్నారు. దశాబ్ధానికి పైగా పాతుకుపోయిన ఉద్యోగులు, ఈవోతో సహా అనేక అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ ఎంకైరీలో తేలింది. రిపోర్టు కూడా సంబంధిత శాఖ వద్ద కూడా వుంది. వెంటనే ఎంతో పవిత్రమైన రాజన్న ఆలయంలో తప్పు చేసిన వారికి శిక్షలు పడాల్సిందే. దేవుని సొమ్మును దోచుకున్నవారి భరతం పట్టాల్సిందే. లేకుంటే కొత్త ప్రభుత్వం మీద కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పాలకులు మారినా రాజన్న ఆలయంలో తిష్ట వేసుకొని కూర్చున్న అవినీతి పరులను కదల్చడం ఎవరి తరం కాదన్న అహం వారిలో మరింత పెరుగుతుంది. భక్తులకు సౌకర్యాల కల్పనలో మరింత నిర్లక్ష్యం కనిపిస్తుంది. కొత్త ప్రభుత్వం వెంటనే స్పందించి, రాజన్న ఆలయానికి మంచి రోజులు, భక్తులు మెరుగైన సౌకర్యాలు, సేవలు కల్పించాలని కోరుతున్నారు.