`ఉమ్మడి రాష్ట్రంలో కొలువులు పోయి రోడ్డున పడ్డారు!
జై తెలంగాణా అనుడే పాపమైంది!ఉద్యోగాలకు శాపమైంది!!

`పన్నెండేళ్లుగా పాలకుల వద్దకు తిరుగుతూనే వున్నారు!
`ఏళ్ళుగా ఎదురుచూపులే.. పన్నెండేళ్లుగా పడి గాపులే?

`హోం గార్డుల వేదన అరణ్య రోదనే?
`పోయిన కొలువు కోసం కళ్ళలో ఒత్తు లేసుకొని ఎదురుచూస్తున్నారు?

`ఎప్పటికైనా మళ్ళీ యూనిఫామ్ వేసుకోకపోతామా అని గోడకు వేలాడ దీసుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు!
`పన్నెండేళ్లుగా కనిపించిన ప్రతి నాయకుడి కాళ్లు మొక్కారు?
`పిల్లా పాపలతో సహా నాయకుల కాళ్ల మీద పడి కన్నీళ్లు పెట్టుకున్నారు?
`అందరూ మాటిచ్చారు… మర్చిపోయారు!
నిండు అసెంబ్లీలో ఆనాటి సిఎం ‘‘కెసిఆర్’’ మాటిచ్చారు.
`ఆ బాధ్యత అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అప్పగించారు!
`హోం గార్డుల యూనియన్ అధ్యక్షుడు గా ఉండి ‘‘శ్రీనివాస్ గౌడ్’’ ఏమీ చేయలేకపోయారు!
`మాజీ మంత్రి ‘‘కేటిఆర్’’ అసెంబ్లీలో మాటిచ్చారు!
`బైట అనేక సార్లు హామీ ఇచ్చారు.
`గతంలోని ఎమ్మెల్సీ ‘‘కవిత’’ కాళ్ల మీద పడి ప్రాధేయ పడ్డారు?
`మాట తప్పారు.. హోం గార్డులను మర్చిపోయారు!
ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రస్తుత ‘‘సిఎం రేవంత్ రెడ్డి’’ ప్రశ్నించారు?
`హోం గార్డులకు అండగా నిలుస్తామన్నారు!
`మంత్రి ‘‘సీతక్క’’ హోం గార్డులకు మాటిచ్చారు.
`ఉప ముఖ్యమంత్రి ‘‘మల్లు భట్టి విక్రమార్క’’ అసెంబ్లీ లో అప్పట్లో మాట్లాడారు.
`పాలకపక్షం లోకి రాగానే విస్మరిచారు?
`పన్నెండేళ్లుగా హోం గార్డులు కొలువుల కోసం తిరుగుతూనే వున్నారు?
`పాలకులు కనికరించింది లేదు?
`తిరిగి హోం గార్థులకు కొలువులు దక్కింది లేదు!
`250 మందిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు!
`కొంత మంది దిగులుతో చనిపోయారు.
`మరికొంత మంది మానసిక క్షోభ తో అనారోగ్యం పాలయ్యారు.
`మిగిలిన వాళ్ళు కాళ్లరిగేలా తిరుగుతూనే వున్నారు.
`‘‘నేటిధాత్రి’’ అనేక సార్లు హోం గార్డులకు జరిగిన అన్యాయం గురించి రాసింది.
`వారు పడుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు ‘‘నేటిధాత్రి’’ అప్పటి పాలకుల దృష్టికి తీసుకెళ్ళింది?
`ఏకంగా 150 మంది హోం గార్డులను వెంట తీసుకొని ‘‘నేటిధాత్రి’’ అప్పటి మంత్రుల వద్దకు వెళ్లడం జరిగింది.
`ఒకటి రెండు సార్లు కాదు పదుల సార్లు బాధితులను వెంట బెట్టుకొని ‘‘నేటిధాత్రి’’ నాయకులను కలిసింది!
`బాధితుల పక్షాన పదుల సార్లు ‘‘నేటిధాత్రి’’ వారి స్థితి గతులు రాయడం జరిగింది.
`అయినా అప్పటి పాలకుల మనసు కరగ లేదు.
`పదేళ్లు వేడుకున్నా కొలువులివ్వలేదు.
`ఇటీవాల బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి అసెంబ్లీలో మళ్ళీ ప్రస్తావించారు!
`ఇప్పటికైనా కనికరించండి.. పోయిన కొలువులివ్వండి!
హైదరాబాద్, నేటిధాత్రి:
పన్నెండేళ్ల కింద కొలువులు పోయిన హోం గార్డులు కన్నీళ్లు మింగి బతుకుతున్నారు. నాయకులు చుట్టూ తిరిగి కాళ్లు అరిగిపోయాయి. నాయకులకు మొక్కి మొక్కి చేతులు అరిగిపోయాయి. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లుకూడా ఇంకిపోయాయి. ఇకనైనా దయతలచండి. వారిని కనికరించి కడుపులో పెట్టుకోండి. కొలువులిచ్చి వారి జీవితాలను నిలబెట్టండి. పాపం వాళ్లు అమాయకులు. అబాగ్యులు. అసహాయులు. నిర్భాగ్యులు. జాలి పడడానికి ఇంకా ఎన్ని రకాల పదాలున్నాయో అన్ని పదాలకు పర్యాయం వారి జీవితాలు. ఎందుకంటే వారు గత పన్నెండు సంవత్సరాలుగా ఎంతటి దుర్భరమైన పరిస్దితులు ఎదుర్కొంటున్నారో మాటల్లో చెప్పలేనిది. ఒకప్పుడు వాళ్లంతా హోం గార్డులుగా ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేసిన వాళ్లు. సుమారు దశాబ్ధన్నర కాలం పాటు ఖాకీ దుస్తులు వేసుకొని విధులు నిర్వర్తించిన వారు. ఆ సమయంలో చాలీ చాలని జీతమైన ఎప్పటికైనా జీవితాలు బాగుపడతాయన్న ఆశలో కొలువులు చేసుకున్నారు. వాళ్లు ఆ కొలువులు చేస్తుంటే కుటుంబ సభ్యులు కూలీ నాలి చేసుకుంటేనే కుటుంబం గడిచే పరిస్ధితులు అనుభవించారు. అయినా ఏదో ఒక ఆశ. ఎప్పటికైనా జీతాలు పెరగకపోతాయా? జీవితాలు మారకపోతాయా? అనుకుంటూ కొలువులు చేశారు. కాని అనూహ్యంగా వారి జీవితాలు తలకిందులౌతాయని కలలో కూడా అనుకోలేదు. వాళ్లే ఉమ్మడి రాష్ట్రంలో హోంగార్డులుగా కొలువులు చేశారు. కోటి ఆశలతో ఎండనక, వాననక రాత్రనక, పగలనక ఎప్పుడు డ్యూటీ వేస్తే అప్పుడు వి ధులు నిర్వర్తించారు. కాని పిడుగు లాంటి వార్త వినాల్సి వస్తుందని, కొలువులు ఊడిపోతాయని ఊహించలేదు. చేయని తప్పుకు బలయ్యారు. ఉన్న ఫలంగా సుమారు 250 మంది హోం గార్డులు ఉద్యోగాలు కోల్పోయారు. వాళ్లుచేసిన పాపం లేదు. నేరం లేదు. జై తెలంగాణ అని ఎలుగెత్తి చాటడమే వారు చేసిన నేరమైంది. కొలువులు పోవడానికి కారణమైంది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు కొలువులు తీసేసినా, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాగూ తమ ఉద్యోగాలు తమకు వస్తాయని అనుకున్నారు. అప్పుడు ఉద్యమ నాయకులందరూ అండగా నిలుస్తామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగాలిస్తామన్నారు. తెలంగాణ వచ్చింది. ఇప్పటికీ పన్నెండేళ్లు పూర్తయింది. కాని వారికి ఉద్యోగాలు రాలేదు. వారి ఒంటి మీదకు ఖాకీ దుస్తులు చేరలేదు. గోడకు వెళాడుతూ కొలువు కోసం ఆ యూనిఫామ్స్ ఎదురుచూస్తున్నాయి. కాని ఏ పాలకుల మనసు కరగలేదు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి వాళ్లు ఎక్కని గడప లేదు. మొక్కని దేవుడు లేడు. కనపడిన ప్రతి నాయకుడి కాళ్లు మొక్కారు. కన్నీళ్లలో వారి కాళ్లు కడిగారు. ఆఖరుకు వారి కుటుంబ సభ్యుల చేత కూడా నాయకుల కాళ్లు మొక్కించారు. అయినా ఏ నాయకుడికి దయ రాలేదు. ఏ నాయకుడు ఇప్పటి వరకు జాలి చూపలేదు. వారి కొలువులకు భరోసా ఇవ్వలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత నిండు అసెంబ్లీలో ఆప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ ఉద్యోగాలు పోయిన 250 మంది హోంగార్డులను ఆదుకుంటామన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన హోంగార్డులకు ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వ బాద్యత అన్నారు. ఆ సంగతిని అప్పటి హోంగార్డుల నాయకుడు, ఉద్యోగ సంఘాల ప్రతినిధిగా తొలి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన అప్పటి ఎమ్మెల్యే , మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు అప్పగించారు. కాని ఏమైంది? ఏమీ కాలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే మూలుగుతోంది. మంత్రి శ్రీనివాస్ తో కొన్ని వందల సార్లు భేటీ అయ్యారు .వేడుకున్నారు. కాళ్లు మొక్కారు. చేద్దాం..చూద్దాం అంటూ కాల యాపన చేశారు. దాంతో అప్పటి మంత్రి కేటిఆర్ వద్దకు వెళ్లారు. ఆయన కూడా అదిగో ఇదిగో అంటూ చెప్పుతూ వచ్చారు. కాని హోంగార్డులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇదే సమయంలో ఇక తమ జీవితాలకు వెలుగు రావన్న మనస్తాపంతో ఎంతో మంది మంచాన పడ్డారు. అనారోగ్యాల పాలయ్యారు. కుటుంబాలు గడిచేందుకు మూటలు మోశారు. కూలీ పనిచేశారు. అయినా వారి ప్రయత్నం చేస్తూనే వున్నారు. కనిపించిన నాయకులందరినీ కలుస్తూ వచ్చారు. వేడుకుంటూ వచ్చారు. ముఖ్యంగా అప్పటి ప్రతిపక్ష నాయకులు , ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు, ఎమ్మెల్యేలను, ఇప్పుడు మంత్రులుగా వున్న వారిలో చాలా మందిని కలిశారు. ఎట్టిపరిసి ్దతుల్లో ప్రభుత్వంతో కొట్లాడి ఉద్యోగాలు ఇప్పిస్తామని అప్పటి పిసిసి. అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి భఱోసా కల్పించారు. అంతే కాకుండా వచ్చేది మన ప్రభుత్వమే ఇప్పుడు న్యాయం జరక్కపోయినా తాము అదికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలిస్తామన్నారు. కాని ప్రజా ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా ఈ అభాగ్యుల కోరిక నెరవేరలేదు. వారికి కొలువులు రాలేదు. గత ప్రభుత్వ హాయాంలో ప్రతిపక్ష నాయకుడుగా, ప్రస్తుత ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో వీరి సమస్యను ప్రస్తావించారు. కొలువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన మంత్రిగా రెండేళ్లయినా ఆయన కూడా మర్చిపోయారు. హోంగార్డుల విషయంలో ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రస్తుత మంత్రి సీతక్క కూడా అప్పట్లో డిమాండ్ చేశారు. మర్చిపోయారు. ఇలా కాలం గడుస్తున్నా వారికి ఉద్యోగాలు రావడంలేదు. 250 మంది హోం గార్డులలో మిగతా వారికైనా తన వల్ల ఉద్యోగం వస్తే చాలని ఓ హోం గార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించిన వారు లేరు. ఆ కుటుంబాన్ని ఆదుకున్నది లేదు. అలా ఒక హోం గార్డు ఆత్మహత్య చేసుకున్నా గత పాలకుల మనసు కరగలేదు. వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇలా ఎక్కేగడప, దిగే గడప అంటూ ప్రయత్నాలు చేస్తున్న హోంగార్డుల కోసం నేటిధాత్రి గత ఐదారేళ్లుగా అటు అక్షర పోరాటం చేస్తూనే వారిని వెంట బెట్టుకొని నాయకులు వద్దకు కూడా వెళ్లడం జరిగింది. అనేక సార్లు వారి సమస్యలను ఉటంకిస్తూ వార్తలు రాయడం జరిగింది. వారి దీన గాధలను వింటేనైనా నాయకులు మనసు చలిస్తుందని అనేక కధనాలు రాసింది. అయినా వినిపించుకున్నవారులేరు. ఇలా నాయకుల్లో చలనం కనిపించడం లేదని అనేక సార్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటికి, గత ప్రభుత్వంలో సలహాదారుగా వున్న మాజీ ఎంపి. వినోద్ కుమార్ ఇంటికి కూడా వారిని నేటిధాత్రి వెంట తీసుకొని వెళ్లడం జరిగింది. అప్పుడు కూడా చూద్దాం. చేద్దామన్న మాటలే తప్ప, వారిని కనికరించలేదు. ఇంకా కాలయాపన చేస్తే వారు రిటైర్ మెంటు వయసు దగ్గరకు వచ్చేలా వుంది. సుమారు దశాబ్ధంన్నర కాలం పాటు డిపార్టుమెంటుకు సేవలు చేసి అన్యాయంగా కొలువులు కోల్పోయిన వారి మీద ఆ శాఖ పెద్దలు కూడా స్పందించకపోవడం విచారకరం. బిఆర్ఎస్లో వున్నప్పుడు ఎమ్మెల్సీ కవిత వద్దకు కూడా అనేకసార్లు వెళ్లి మొరపెట్టుకున్నారు. తిరిగి ఇప్పుడు మళ్లీ ఆమె వద్దకు వెళ్లి గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇక్కడ మరో విషయం వుంది. వారిని కొలువుల్లో నుంచి తొలగించిన తర్వాత కూడా బందోబస్తులు, వినాయక మండపాలు, దర్నాలు, నిరసనలు, ర్యాలీలు జరిగిన సందర్భాలలో కూడా వీరి సేవలు వినియోగించుకున్నారు. అలా కూడా వారికి ఆశలు కల్పించారు. వీరితోపాటు ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ఆంద్రాకు చెందిన వారు ఉద్యోగాలు చేస్తున్నారు. కాని తెలంగాణకు చెందిన హోం గార్డులు మాత్రం ఉద్యోగాలు కోల్పోయారు. తెలంగాణ వస్తే తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయనుకుంటే, బతుకులు తెల్లారే పరిస్తితి వస్తుందని వాళ్లు ఊహించలేదు. తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో బతకడమే కాకుండా, జీతాలు పెరిగి తమ జీవితాలు మలుపు తిరుగుతాయనుకున్నారు. వెలుగులకు బదులు, బతుకుల్లో చీకట్లు కమ్ముకున్నాయి. చీకటి తప్ప వెలుగు లేని మొండిజీవితాలుగా మిగిలిపోయాయి. జైతెలంగాణ అనడమే వారు చేసిన పాపమైంది. జై తెలంగాణ అనడమే వారి జీవితాలకు శాపమైంది. ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వం స్పందించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆనాడు వీళ్లకు భరోసా కల్పించారు. మంత్రులు కూడా వీరిని ఆదుకుంటామని చెప్పారు. ఇంకా వారిని తిప్పుకోకుండి? ఆ మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి వద్దకు వెళ్లారు. ప్రభుత్వంతో మాట్లాడతా అని మాట ఇచ్చారు. తాజాగా అసెంబ్లీలో బిజేపి ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి వీరి అంశాన్ని ప్రస్తావించారు. భూమి గుండ్రంగా వున్నట్లు గత పన్నెండేళ్లుగా అటు బిఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరిగి అలసిపోయారు. యూనిఫామ్ మీద వున్న మమకారం, దశాబ్దంన్నర పనిచేసిన డిపార్టుమెంటును వదిలుకొని కూలీలుగా మారి బతుకుతున్నారు. ఇప్పటికైనా పాలకులు కనికరించండి. కరుణించండి. వారికి కొలువులిచ్చి ఆదుకోండి.
