Centre Clarifies on Chandigarh Bill
చండీగఢ్ బిల్లుపై తుది నిర్ణయం తీసుకోలేదు.. కేంద్రం వివరణ
చండీగఢ్‌లో చట్టాలు చేసే అధికారాన్ని రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రతిపాదనగా ఉంది. అయితే దీనిని పంజాబ్‌లోని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చండీగఢ్ పరిపాలనకు సంబంధించిన బిల్లు తీసుకువచ్చే ఆలోచన ఏదీ కేంద్రానికి లేదని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. చండీగఢ్ చట్టాలను సులభతరం చేసే ప్రతిపాదన మాత్రమే కేంద్ర పరిశీలనలో ఉందని, అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని వివరించింది.
చండీగఢ్‌లో చట్టాలు చేసే అధికారాన్ని రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రతిపాదనగా ఉంది. అయితే దీనిని పంజాబ్‌లోని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర తాజా వివరణ ఇచ్చింది. చండీగఢ్ పరిపాలనా నిర్మాణంలో మార్పులు చేసే ఆలోచన ఏదీ తమకు లేదని పేర్కొంది. చండీగఢ్ పరిపాలన, పంజాబ్, హరియాణాతో దాని సంబంధాల్లో ఎలాంటి మార్పులు చేసే ఉద్దేశం లేదని పేర్కొంది. చండీగఢ్ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని అందరినీ సంప్రదించిన తర్వాతే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని వివరణ ఇచ్చింది. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించింది.
కాగా, ప్రస్తుతం ఆర్టికల్ 240 కింద కేంద్రపాలిత ప్రాంతాలుగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, పుదుచ్చేరి ఉన్నాయి. ప్రస్తుతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా గవర్నర్ ఉన్నారు.
