బిఆర్‌ఎస్‌ బతికి బట్టకట్టేదెట్ల!

https://epaper.netidhatri.com/view/295/netidhathri-e-paper-16th-june-2024%09/3

సర్థుబాటు లేదు…దిద్దుబాటుకు దిక్కు లేదు!!

నిండా మునిగితేగాని అధినేతకు అర్థం కాదు.

బిఆర్‌ఎస్‌ కోలుకోవడం పెద్ద కష్టం కాదు!

జగన్‌ స్పిరిట్‌ కేసిఆర్‌లో లేదు.

ఓడిన మరునాడే మళ్ళీ వచ్చేది మనమే అన్నాడు.

అదీ నాయకుడికి వుండే లక్షణం.

బిఆర్‌ఎస్‌ అధినేతకు ఆ నమ్మకం లేదు.

వయసు కూడా కేసిఆర్‌కు సహకరించకపోవచ్చు.

ఓడిపోయినా కనీసం మీడియా ముందుకు రాలేదు.

కేటిఆర్‌, హరీష్‌లు ఎన్ని మాట్లాడిన అధినేత మాటకాదు.

ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే దూకుడు ప్రదర్శించారు.

పార్లమెంటు ఎన్నికల తర్వాత చతికిలపడ్డారు.

పాలించినప్పుడు ప్రజలకు నమ్మకం కలిగించలేదు.

ఓడిపోయి క్యాడర్‌కు ధైర్యం నింపడం లేదు.

బిఆర్‌ఎస్‌ బతికెదెట్లా? అని ఇటీవల చాలా మందికి దిగులు పట్టుకున్నది. అందులో ముఖ్యంగా ఓ సెక్షన్‌ ఆఫ్‌ మీడియా అయ్యో..బిఆర్‌ఎస్‌ పరిస్దితి ఏమిటనీ ఎంతో దిగాలు చెందుతున్నది. సహజంగా ప్రత్యర్ధి రాజకీయ పార్టీలు పోషించాల్సిన పాత్రను ఇటీవల మీడియా పోషిస్తోంది. ఇదే తెలంగాణ దౌర్భాగ్యం. బిఆర్‌ఎస్‌ పార్టీ త్యాగాల పునాదుల మీద నిర్మాణమైన పార్టీ. ఉద్యమ రూపం నుంచి ఎదిగిన పార్టీ. ఉద్యమం కోసమే పురుడు పోసుకున్న పార్టీ. తెలంగాణ ప్రయోజనాల కోసమే పుట్టిన పార్టీ. తెలంగాణ పోరును జెండాగా, ఎజెండాగా చేసుకొని రెపరెపలాడిన పార్టీ. జై తెలంగాణ అంటూ పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన పార్టీ. అలాంటి పార్టీ ఏమౌతుంది? ఎలా వుంటుంది? ఇంకా ఏం చేస్తుంది? ఎలా మనగలుగుతుంది?అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇప్పుడే ఆకాశం విరిగి పడినట్లు చేస్తున్నారు. ఇంకా వంద సంవత్సరాలైనా బిఆర్‌ఎస్‌ పునాదులకు ఢోకా లేదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఉద్యమ సమయంలోనే ఉద్దాన పతనాలను చూసి ఎదుర్కొని నిలదొక్కుకున్న పార్టీ బిఆర్‌ఎస్‌. అప్పుడు కేవలం ఉద్యమ పార్టీయే. ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీ. ఇప్పుడు పార్టీ పార్టీ కుంగిపోతుందనుకోవడం భ్రమ. ఏ జెండా అయినా గాలి వున్నప్పుడు రెపరెపలాడుతుంది. గాలి లేనప్పుడు కొంత నిస్తేజంగా వుంటుంది. ఇప్పుడూ అదే పరిస్దితిలో వుంది. అందుకు కారణాలు అనేకం వున్నాయి. అందుకు దారి తీసిన పరిస్దితులు కూడా ఎన్నో వున్నాయి. ఎంత పెద్ద నాయకుడైనా అంచనాలు తప్పొచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్లే నాయకులౌతారు. పాలకులౌతారు. ప్రజల తీర్పే ఎవరికైనా శిరోదార్యం. అందువల్ల బిఆర్‌ఎస్‌కు ఇప్పటికిప్పుడు ఏదో అవుతుంది. పార్టీ ఖాళీ అవుతుంది. 22 మంది ఎమ్మెల్యేలు జారిపోతున్నారు. అంటూ వచ్చే కథనాలతో ఒరిగేదేమీ లేదు. ఒక వేళ అందరూ వెళ్లినా మళ్లీ చిగురించే పార్టీ బిఆర్‌ఎస్‌. మళ్లీ నిండు వసంతం చూసే పార్టీ బిఆర్‌ఎస్‌. ఇది నూరుపైసల నిజం. చిరిత్రలో రాజకీయ వ్యవస్థలు ఎదిగి, కుంగి, మళ్లీ జెండా ఎగురవేసిన పార్టీలు అనేకం వున్నాయి. కాంగ్రెస్‌ లాంటి పార్టీ అనేకసార్లు చీలికలు పీలికలై ఇప్పటికీ కొనసాగుతోంది. నిజానికి ఒకప్పటి కాంగ్రెస్‌ నేడున్నది కాదు. ఇండియా అంటే ఇందిరాగాందీ. ఇందిరాగాంధీ అంటే ఇండియా అన్న పేరును సార్ధకం చేసుకున్న ఇందిరాగాంధీనే ఓడిరచిన ప్రజాస్వామ్య వ్యవస్ధ మనది. ప్రజలకు నచ్చకపోతే ఎంత పెద్ద నాయకుడినైనా పక్కన పెడుతుంది. మళ్లీ నిలబెడుతుంది. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్‌ను పాతాళానికి పంపించిన దేశ ప్రజలే మళ్లీ ఇందిరాంధీని మళ్లీ గెలిపించారు. ఇది ప్రజాస్వామ్యంలో సహజం.

1984లో వచ్చిన బిజేపి రెండు సీట్లతో మొదలైంది. ఇప్పుడు మూడోసారి కేంద్రంలో హాట్రిక్‌ విజయాన్ని అందుకున్నది. కాంగ్రెస్‌ను మూలకు నెట్టేసింది. హాట్రిక్‌ విజయాలు 130 సంవత్సరాల కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యం కాలేదు. ఇదే గెలుపు పరంపర బిజేపికి కొనసాగుతుందని కూడా చెప్పలేం. గత రెండు ఎన్నికల్లో బిజేపికి మంచి మెజార్టీ ఇచ్చిన ప్రజలు, ఇప్పుడు ఇతత పార్టీల మీద ఆధారపడేలా తీర్పిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గొప్పగా గెలిపిస్తారో..పక్కన పెడతారో చెప్పలేం… ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పాలనును వద్దనుకున్న ప్రజలే, విభజత ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ ఎన్నుకున్నది. ఆ తర్వాత వచ్చిన 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిరచింది. మళ్లీ 2024 ఎన్నికల్లో చంద్రబాబును అఖండ మెజార్టీతో గెలిపించుకున్నది. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందన్నారు. చంద్రబాబు వయసు మీదపడిపడిరదన్నారు. లోకేష్‌కు పప్పు అన్నారు. కాని ఏమైంది. అదే లోకేష్‌ను గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిరచి, ఇప్పుడు లక్ష మెజార్టీతో గెలిపించుకున్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ పార్టీకి అత్తెసరు మార్కులేం రాలేదు. బలమైన ప్రతిపక్షంగా ప్రజలు తీర్పిచ్చారు. ముప్పై తొమ్మిది స్దానాలలో గెలిపించారు. అంత మాత్రాన ఆ పార్టీ కనుమరుగౌతుందనుకోవడం కల్ల. కాకపోతే బిఆర్‌ఎస్‌ వరస తప్పులు చేస్తోంది. శాసన సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజల తీర్పును కేసిఆర్‌ స్వాగతించలేదు. ప్రజలకు కృతజ్ఞత చెప్పలేదు. ఓడిన తర్వాత మళ్లీ ఫామ్‌ హౌజ్‌కు వెళ్లిపోయాడు. మళ్లీ పార్లమెంటు ఎన్నికల వేళ బస్సు యాత్ర అంటూ వచ్చారు. ఇలాంటివి తెలంగాణ ప్రజలకు నచ్చడం లేదు. పార్లమెంటు ఎన్నికల్లో గోర పరాభాన్ని చవిచూసిన తర్వాత మళ్లీ కేసిఆర్‌ ఫామ్‌ హౌజ్‌కు చేరుకున్నారు. కనీసం పార్టీ ఎందుకు ఓడిపోయింది. ప్రజలు ఎందుకు తిరస్కరించారు. ఎక్కడ పొరపాటు జరిగింది. తన వల్ల పార్టీ కుదేలైందా? లేక పార్టీ నాయకుల మూలంగా నష్టం వాటల్లిందా? అన్నదాని మీద ఎలాంటి సమీక్ష లేదు. నాయకుల సంప్రదింపులు లేవు. దాంతో పార్టీలో కొంత నిస్తేజం ఆవహించింది నిజం. బిఆర్‌ఎస్‌ను నిశీది వెంటాడిరది. పార్టీ చీకటిమయమైంది. గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఇలాంటి పరిస్ధితి ఏనాడు లేదు. ఒకప్పుడు పిలవకున్నా వచ్చి పడిగాపులు కాసిన నాయకులు ఇప్పుడులేరు. రారు. ఉద్యమ సమయంలో కూడా అప్పుడు అధికారంలో వున్న కాంగ్రెస్‌ పార్టీ కన్నా, బిఆర్‌ఎస్‌ కార్యాలయం వద్దే సందడి వుండేది. కేసిఆర్‌ ఇంటి దగ్గరే జనాలుండేవారు. ఫామ్‌ హౌజ్‌ ఎప్పుడూ నేతలతో నిండిపోయేది. ఇప్పుడు కేసిఆర్‌ ఎక్కడున్నా వచ్చేందుకు ఎవరు లేరు. రమ్మన్నా వచ్చేందుకు సిద్దంగా లేరు.

కారు అన్న పదమే వినేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. తెలంగాణ భవన్‌ వైపు తొంగిచూసే నాధుడు లేడు. నాయకులు జిల్లాల్లో వున్నా, హైదరాబాద్‌లో వున్నా కేసిఆర్‌ వద్దకు వెళ్లాలన్న ఆలోచన చేయడం లేదు. ఎక్కడ పిలుపొస్తుందో అని సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసుకుంటున్నారట. కొత్త నెంబర్లు తీసుకొని వాడుకుంటున్నారట. చాల మంది తెరాస నాయకులు రాష్ట్రంలోనే లేరని సమాచారం. ఇలాంటి పరిస్ధితి వస్తుందని కేసిఆర్‌ కలలో కూడా ఊహించి వుండడు. కాని అదంతా కేసిఆర్‌ స్వయం కృతాపరాధం. ఉద్యమ సమయంలో తమ భుజాల మీద పార్టీని మోసిన ఉద్యమ కారులు అధికారంలోకి వచ్చిన తర్వాత పనికి రాలేదు. కేసిఆర్‌ను ప్రత్యక్ష్యంగా నోటికి ఎంత వస్తే అంత తిట్టిన నేతలను ఆయన అక్కున చేర్చుకున్నారు. పక్కన కూర్చోబెట్టుకున్నారు. పదవులిచ్చి గౌరవించాడు. వారికి రాజకీయ భవిష్యత్తు కల్పించాడు. ఉద్యమ కాలంలో కేసిఆర్‌ వెన్నంటి వున్న నాయకులు ఎంతో మంది వున్నారు. వాళ్లెవరూ కేసిఆర్‌ కళ్లకు కనిపించలేదు. అధికారంలో వున్నప్పుడు నాయకులను తయారు చేయడం పెద్ద సమస్య కాదు. కేసిఆర్‌ మాత్రం పార్టీ బలోపేతం కోసం సీనియర్‌ నాయకులను ప్రోత్సహిస్తూ వచ్చారు. వారికి ప్రాదాన్యత కల్పించారు. ఉద్యమకారులను పక్కన పెట్టారు. ఇది కేసిఆర్‌ చేసి అతి పెద్ద పొరపాటు. అన్నీ నాకే తెలుసు అనుకునే కేసిఆర్‌ కాలం కలిసొచ్చి అపర చాణక్యుడు అని కీర్తంపబడ్డారే గాని, రాజకీయాలను ఔపోసాన పట్టడం ఆయనకు తెలియదని అనేక సార్లు రుజువైంది. తర్వాత పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి లాంటివారిని పార్టీలోకి తీసుకొని వారిని పక్కన పెట్టారు. పువ్యాడ అజయ్‌ బలమైన నేతగా భావించి ఆయనను కీలకం చేశారు. దాంతో కనీసం చెప్పుకోవడానికైనా వున్న నేతలు కూడా లేకుండాపోయారు. బలమైన నేత పొంగులేటి దూరమయ్యాడు. కాకపోతే ఖమ్మంలో అప్పుడూ లేదు..ఇప్పుడూ లేదు. అని సరిపెట్టుకున్నా, ఇక భవిష్యత్తు కూడా లేదని మాత్రం ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఇప్పటికిప్పుడు కేసిఆర్‌తో నడిచేందుకు ఎవరూ సిద్దంగా లేరు. ఆదిలాబాద్‌ జిల్లాలో కూడా అలాగే ఇంద్రకరణ్‌ రెడ్డి లాంటి వారికి ప్రాధాన్యత కల్పించారు. పార్టీ ఓడిపోయాగానే వెళ్లిపోయాడు. వరంగల్‌ జిల్లాలో నమ్మిన బంటులా వున్న రాజయ్యను దూరం చేసుకున్నాడు. తెలంగాణ వ్యతిరేకి, హైదరాబాద్‌ను యూటీ చేయాలిన డిమాండ్‌ చేసిన దానంకు రెండుసార్లు టికెట్‌ ఇచ్చారు. ఇప్పుడేమైంది. ఆయనకూడా పార్టీని వీడివెళ్లిపోయాడు. అంతే కాదు నిత్యం కేసిఆర్‌ను, కేటిఆర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు. ఇలా కేసిఆర్‌ చేసిన తప్పులే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి.

పార్టీ ఓడినా, పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కసీటు రాకపోయినా కేసిఆర్‌లో చలనం లేదు. స్పందన లేదు. పార్టీ ఏమైతుందో అన్న ఆందోళన కనిపించడం లేదు. అంటే ఆయన నిండు కుండ అని కాదు. రాజకీయాలపై ఆయను ఆసక్తి పోయింది. ప్రజలను బ్రతిమిలాడడం ఆయనకు తెలియదు. ప్రజలను దూషించడమే తెలుసు. పార్టీ నేతలు నిరంతరం తన చుట్టూ ప్రదక్షిణాలు చేయాలనుకునే రకం. కాని ఇప్పుడు తెలంగాణలో బిఆర్‌ఎస్‌కు అంత సీన్‌ లేదు. కేసిఆర్‌పై బిఆర్‌ఎస్‌ నేతల్లోనూ అంత భయం లేదు. ఆయనంటే భక్తి కూడా లేదు. ఇలాంటి సమయంలో కేసిఆర్‌ మళ్లీ ప్రజల్లోకి రావాలి. కాని ఆ పని చేయడంలేదు. ఈ విషయంలో ఏపి మాజీ ముఖ్యమంత్రి జగన్‌లాగా నిర్ణయాలు తీసుకోగలగాలి. ఓడిపోయిన రోజే మీడియా ముందుకు వచ్చిన జగన్‌ ప్రజలు ఎందుకు ఓడిరచారని ప్రశ్నించారు. తాను ఏం తక్కువ చేశానన్నారు. టిడిపి పార్టీ నాయకులు వైసిపి నేతలను టార్గెట్‌ చేస్తుంటే, నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. నేనున్నానంటూ ధైర్యం నూరిపోస్తున్నారు. త్వరలోనే మళ్లీ ప్రజల్లోకి వస్తానని ప్రకటించారు. పాదయాత్ర చేసిన సమయంలో వున్న జోష్‌ నాలో ఇంకా వుందన్నారు. ఐదేళ్లు చూస్తుండగానే గడిచిపోయాయి. ఇప్పుడు కూడా ఐదేళ్లు అలాగే గడిచిపోతాయి. వైసిపికి సీట్లు తక్కువ వచ్చినా, ఓట్లు తక్కువేం రాలేదని కార్యకర్తలకు మనో ధైర్యం నింపారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్యకర్తల దగ్గరకు నేరుగా వస్తానన్నారు. పార్టీని కాపాడుకోవాలనుకున్న నాయకుడు చేయాల్సిన పని. కాని ప్రజలకు దూరంగా వుంటూ ఎన్నికల సమయంలో మాత్రమే వస్తా అంటే ప్రజలు ఆహ్వనించకపోవచ్చు. అందువల్ల ఇప్పటిప్పుడు బిఆర్‌ఎస్‌కు వచ్చిన నష్టమేమీ లేకపోయినా, నాయకుల భరోసా అవసరం. వర్కింగ్‌ ప్రెసిడెంటుగా నిన్నటిదాకా అందరి చేత శభాష్‌ అనిపించుకున్న కేటిఆర్‌ ఇప్పుడు ఎందుకు విమర్శలపాలౌతున్నాడో తెలుసుకోవాలి. తనను తాను ఆత్మపరిశీలన చేసుకోవాలి. వివాదాలకు మూల కేంద్రం కేటిఆరే అన్న ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి. అధికారంలో వున్నప్పుడు వచ్చిన ఆరోపణలు, భూముల వ్యహరంలో కేటిఆర్‌పై వస్తున్న విమర్శలకు సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం వుంది. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాల్సిన బాధ్యత నాయకుడిగా కేటిఆర్‌పై వుంది. మౌనం ఎప్పుడూ సమాధానం కాదు. అర్ధాంగీకారమే అవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన పనులపై తప్పులు వెతుకుతోంది. అన్ని పథకాలలో అవినీతి జరిగిందనే ఆరోపణలు చేస్తోంది. గొర్రెల స్కాం. బర్రెల స్కామ్‌ అంటూ రకరకాల కేసులను నమోదు చేస్తోంది. వాటిపై వివరణ ఇచ్చుకోకపోతే ప్రజలు కూడా దోషులుగానే చూస్తారు. ప్రభుత్వ ఆరోపణలపై స్పందించకపోతే ప్రజలు బిఆర్‌ఎస్‌ నాయకులను అవినీతి పరులుగానే చూస్తారు. ఇప్పటికే కాంగ్రెస్‌ , బిజేపి పార్టీలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నిజమే అని నమ్మడం మూలంగానే శాసనసభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఓడిపోయింది. పార్లమెంటు ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. అయినా బైటకు రాకపోతే ఎవరూ ఏంచేయలేదు. ప్రజలు ఉద్యమ సయమంలో నాయకుడిగా నెత్తిన పెట్టుకున్నట్లు ఇప్పుడు పెట్టుకోరు. రాజకీయాలను రాజకీయాలుగానే చూస్తామని చెప్పడం కాదు. ప్రజలకు విశ్వాసం కల్గించే రాజకీయాలు చేయాలి. అప్పుడే నమ్ముతారు. విశ్వసిస్తారు. ఆలోచించుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *