
Nithanya Siri Shines in National Karate
జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ..
అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్..
రామాయంపేట ఆగస్టు 30 నేటి ధాత్రి (మెదక్)
మెదక్ పోలీస్ విభాగానికి చెందిన హోం గార్డ్ నామ కృష్ణ కుమార్తె నితన్య సిరి జాతీయ స్థాయి కరాటే పోటీలలో అద్భుత విజయాలు సాధించి రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు శనివారం తన ఛాంబరులో నితన్య సిరిని సర్టిఫికెట్, మెమెంటో మరియు ఛాంపియన్షిప్ ట్రోఫీతో ఘనంగా సత్కరించారు.
హైదరాబాద్ బోడుప్పల్లో ఇటీవల నిర్వహించిన ఆర్ఎస్ఎస్ కాయ్ జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి సీనియర్ బ్లాక్ బెల్ట్‌గా గర్ల్స్ విభాగంలో కటా, వెపన్స్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించింది. అదేవిధంగా గ్రాండ్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో పాటు ఉత్తమ రెఫరీగా సేవలందించడం విశేషం అని ఎస్పీ గారు అభినందించారు.
ఇప్పటి వరకు నితన్య సిరి 11 బంగారు పతకాలు, రెండు అంతర్జాతీయ స్థాయి బంగారు పతకాలు, రెండు ఛాంపియన్షిప్ టైటిల్స్ సాధించడం ద్వారా తన క్రీడా ప్రతిభను నిరూపించిందని ఎస్పీ గారు తెలిపారు. చిన్న వయస్సులోనే క్రీడా రంగంలో ఇంతటి విజయాలు సాధించడం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అన్నారు.
జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ – నితన్య సిరి విజయాలు కుటుంబానికే కాకుండా మొత్తం మెదక్ పోలీస్ విభాగానికీ గర్వకారణం అని,ఇలాంటి ప్రతిభావంతులైన ఆడపిల్లలు సమాజానికి ఆదర్శం. భవిష్యత్తులో కూడా పోలీస్ శాఖ తరపున అవసరమైన సహాయం అందిస్తాం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారు, ఆర్ఐ శైలేందర్ గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, ఎస్ఐ నరేష్ గారు, మాస్టర్ రవీంద్ర కుమార్, స్థానిక కరాటే మాస్టర్ నగేష్ మల్లూరి, తల్లిదండ్రులు నామ కృష్ణ–కీర్తినేత తదితరులు పాల్గొన్నారు.