
MLA Gandra Satyanarayana Rao
ప్రభుత్వ ఐటీఐలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్
అందుబాటులో ఆరు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సులు.. మొత్తం సీట్లు 172..
ఈనెల 28తో ముగియనున్న దరఖాస్తు గడువు.
పదో తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గ కేంద్రాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను(ఏటీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లా నాయక్, కళాశాల సిబ్బంది, కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఏటీసీ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం భూపాలపల్లిలో సుమారు రూ.42.64 కోట్లతో కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏటీసీలో రెండేళ్ల కాల పరిమితి కలిగిన ఆరు అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులు ఉన్నట్లు తెలిపారు. పదో తరగతి పాస్ అయిన భూపాలపల్లి నియోజకవర్గ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియాగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఏడాది కోర్సులల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, పార్టిషన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా, రెండేళ్ల కాలపరిమితితో ఉన్న కోర్సులు బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్, అడ్వాన్సుడ్ సిఎంసి మిషన్ టెక్నీషియన్. మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ పురుషులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మొత్తం 172 సీట్లు ఉన్నాయని, నియోజకవర్గం విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియాగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈనెల 28వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకునేవారికి వెబ్ సైట్ చిరునామా https:/iti.telangana.gov.in ను సందర్శించి రూ.100 రుసుము చెల్లించాలని సూచించారు.