మీ పనులు ఆపండి!
మా పైసలు మాకివ్వండి!!
చిత్రపురి యవ్వారంలో కొత్త వ్యవహారం!
నేటిధాత్రి కథనానికి స్పందన!
కలెక్షన్ ‘‘సింగ్’’ కు షాక్
సింగ్ వినతి…గద్దల తిరస్కృతి!
రో హౌస్ గద్దల రివర్స్ గేర్.
లాక్కోలేక, పీక్కోలేక తలపట్టుకుంటున్న సింగ్!
పరిస్థితి బాగో లేదు…కొంత కాలం పనులాపండి!
సంతోష్ సింగ్ వేడుకోలు.
భవిష్యత్తులో నా సహకారం సంపూర్ణంగా వుంటుంది! నమ్మండి!!
ఉన్న ఫళంగా లక్షలు చెల్లించాం!
పనులు చేసుకొమ్మంటేనే చేసుకుంటున్నాం!
ఇప్పుడొచ్చి ఆపమంటే ఆపం!
ఎంత దూరమైనా వెళ్తాం!?
ఇలా ఎల్లకాలం ముడుపులతోనే సరిపోతోంది.
మేం…ఆపం ఏం చేస్తారో చూస్తాం!
‘‘రో హౌస్’’ గద్దల అల్టిమేటం!
డామిట్ కథ అడ్డం తిరిగింది.
‘‘సింగ్’’ ఒకటి తలిస్తే…మరొకటైంది.
‘‘సింగ్’’ కాసుల కక్కుర్తి రివర్సైయ్యింది.
‘‘సింగ్’’ ను మరో సారి దోషిగా నిలబెట్టింది.
ఇలాంటి పనులతోనే ‘‘గతంలో సస్పెన్షన్’’.
అయినా మారని కరెప్షన్ సింగ్.
కొలువుకెక్కిన వెంటనే మళ్లీ దోపిడి!
హైదరాబాద్,నేటిధాత్రి:
ఎన్ని సార్లు పరువు పోయినా, ఎన్ని సార్లు తప్పు చేసి కొలువుకు ఎసరొచ్చినా కొంత మంది ఉద్యోగుల తీరు మారడం లేదు. ముఖ్యంగా వారి భయం లేదు. నీతి, నిజాయితీ అసలే లేదు. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు. ప్రజలను పీడిరచుకు తినడం అలవాటు చేసుకున్నారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగడం మానుకోలేకపోతున్నారు. పరువు ఒక్క సారి పోయినా, పది సార్లు పోయినా ఒక్కటే అనుకుంటున్నారు. సిగ్గు శరం వదిలేసి బతుకుతున్నాయి. పాపపు సొమ్ముకు అలవాటు పడ్డారు. ప్రజల శాపనార్థాలు సైతం దీవెనలే అనుకుంటారు. మంచి చేయకపోయినా ఫరవాలేదు. చెడును మాత్రం చేయొద్దన్న మంచి మాటను ఏనాడో గాలికొదిలేశారు. అలాంటి వాళ్లు ఇటీవల అనేక మంది పట్టుబడుతున్నారు. అయినా మిగతా వాళ్లు భయపడడం లేదు. నిత్యం లంచాలకు మరిగి ప్రజల రక్తం తాగుతున్నారు. తప్పుల మీద తప్పులు చేసి దర్జా వెలగబెడుతున్నారు. లంచాలు మా హక్కు అన్నట్లు దిగజారి బతుకుతున్నారు. అలాంటిదే ఇది కూడా… కలెక్షన్ సింగ్ నడుపుతున్న కథ.
అన్ని సార్లు మన రోజులు కావు. ప్రతి పని అనుకున్నట్లు జరగదు. తప్పుడు పనులు ఎల్లకాలం చెల్లవు. సరిగ్గా చిత్రపురి విషయంలో మణికొండ టిపివో సంతోష్ సింగ్కు ఎదురైంది. డామిట్ కథ అడ్డం తిరిగినట్లైంది. సినిమా ప్రపంచం అంటే ఘనులు. వాళ్లను వెనకేసుకురావడమో, సహకరించడమో చేసి నాలుగు పైసలు వెనకేసుకోవాలని కలెక్షన్ కింగ్ అనుకున్నాడు. పాచిక విసిరాడు. అది పారినట్లే పారి ఆగిపోయింది. చిత్రపురి వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తిగా తెలుసు. చిత్రపురిలో రో హౌస్ ల నిర్మాణం అక్రమమని టిపివో సింగ్కు తెలుసు. గత కొన్నేళ్లుగా రో హౌస్ లపై నిరంతర పోరాటం జరుగుతుందనే తెలుసు. అయినా అత్యాశకు పోయి సింగ్ కలెక్షన్ చేసుకున్నాడు. చిత్రపురిలో రో హౌస్ ల నిర్మాణం మీద గత కొన్నేళ్లుగా నేటిధాత్రి కార్మికుల పక్షాన అక్షర పోరాటం నిరంతరం సాగిస్తోంది. చిత్రపురిలో చీమ చిటుక్కున్నా నేటిధాత్రి వార్తలు ప్రచురిస్తూనే వుంది. హరహర బ్రహ్మాదులు వచ్చినా రో హౌస్లను నేటిధాత్రి ఇప్పటి వరకు అడ్డుకుంటూనే వున్నది. కార్మికులకు కేటాయించిన భూమి కార్మికులకే చెందాలని నేటిధాత్రి చేస్తున్న పోరాటం టిపివో సింగ్కు తెలిసి కూడా వాటి నిర్మాణానికి సహకరిస్తానని సినీ గద్దలతో ఒప్పందం చేసుకున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే రో హౌస్ ల కూల్చివేత ఎప్పుడో మొదలైంది. రో హౌస్ ల నిర్మాణం అక్రమమని అందరికీ తెలుసు. అయినా నేనున్నాను మీరు మరమ్మత్తులు పూర్తి చేసుకోండి అని సింగ్ అభయమిచ్చినట్లు సమాచారం. అయితే గుట్టు చప్పుడు కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సమయంలో రో హౌస్ ల నిర్మాణపు పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ విషయం నేటిధాత్రి ప్రముఖంగా ప్రచురించింది. సిఎం అమెరికా నుంచి తిరిగి వచ్చేలోపు పూర్తి చేసుకోండి. నాది బాధ్యత అని సింగ్ భరోసా కల్పించారు. దాంతో పెద్ద మొత్తంలో సినీ గద్దలు టిపివోకు సమర్పించుకున్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. కలెక్షన్ కింగ్ లో బంగారు మొదలైంది. నేటిధాత్రి కథనం అందరికీ చేరింది. ఇంకేముంది హుటాహుటిన సింగ్ చిత్రపురికి చేరుకొని కొద్ది కాలం మీ పనులు ఆపండి! అని సూచించారు. ఇది మళ్లీ మొదటికి వచ్చేలా వుందని ఆలోచించిన గద్దలు మా పైసలు మాకివ్వండి!! అని సింగ్ను రివర్స్ అటాక్ ఇచ్చారు. పనులు ఆపమంటే ఆపేస్తారని అనుకున్న సింగ్ వాళ్లిచ్చిన సమాధానంతో ఖంగుతిన్నారు.
అసలే కొత్తగా హైడ్రా హైదరాబాదులో హల్ చల్ చేస్తోంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తోంది. చిత్రపురి అన్నది అసలే ప్రభుత్వ భూమి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కార్మికుల సొంత ఇంటి కోసం 67 ఎకరాల 15 గుంటల భూమి ఇచ్చారు. అందులో సినీ కార్మికులకు మాత్రమే అప్పార్టుమెంట్లు నిర్మాణం చేసి ఇవ్వాలని జివో కూడా అప్పుడే జారీ చేశారు. అయితే కొంతమంది సినీ గద్దలు ఈ భూమి మీద వాలారు. ఆ సమయంలో అప్పటి సినీ పెద్ద దాసరి నారాయణరావు ఈ భూమిపై సినీ పెద్దలకు ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పారు. ప్రేక్షక దేవుళ్ల దయతో నిర్మాతలు, దర్శకులు, హీరోలు, ఇతర నటులు పెద్ద ఎత్తున సంపాదించుకున్నారు. అంతే కాకుండా సినిమాలకు ఎలాంటి రాయితీలు కూడా అవసరం లేదని ఆనాడే తేల్చి చెప్పారు. చిన్న సినిమాలు బతికితే సినీ కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. చిత్రపురిలో సినీ కార్మికులకు తప్ప సినీ పెద్దలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. అయితే దాసరి నారాయణరావు కాలం చేసిన తర్వాత చిత్రపురిపై కొన్ని సినీ గద్దలు వాలాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను తుంగలో తొక్కాయి. సొసైటీని గుప్పిట్లో పెట్డుకొని 14 ఎకరాలు వశం చేసుకున్నాయి. రో హౌస్ ల నిర్మాణం చేపట్టాయి. కేవలం 228 పెద్దలు ఆ భూమిని కార్మికుల పొట్టకొట్టి లాగేసుకున్నారు. ఓ వైపు కార్మికులు పోరాటం చేస్తున్నా వారిని పట్టించుకోకుండా భూమిని అప్పటి పాలక పెద్దలకు దగ్గరై పంచుకున్నారు. రో హౌస్ లు నిర్మాణం చేసుకున్నారు. నిజానికి ఆ పద్నాలుగు ఎకరాలలో సినీ ఓ రెండు ఎకరాలలో టవర్స్ నిర్మాణం చేసుకున్నా సరిపోయేది. ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులే అప్పార్టుమెంట్లలలో వుండేవారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్లైనా, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్లైనా అన్నీ అప్పార్టుమెంట్లే…కానీ చిత్రపురిలో సినీ గద్దలు మాత్రం విల్లాలకు మించిన హంగులతో రో హౌస్ లు నిర్మాణం చేసుకున్నారు. నిరంతరంగా కార్మికుల పోరాటం వల్ల గతంలో రో హౌస్ లను కూల్చివేయాలని ప్రభుత్వం తూతూ మంత్రంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే కొన్ని నిర్మాణాలను కొంత వరకు కూల్చివేయడం జరిగింది. ఇంత కాలానికి కలెక్షన్ సింగ్ అత్యుత్సాహాన్ని నమ్మి గద్దలు సొమ్ములు ముట్టజెప్పారు. ప్రభుత్వం సీరియస్ అయ్యే అవకాశం కనిపించడంతో సింగ్ లాక్కోలేక, పీక్కోలేక తలపట్డుకునే పరిస్థితి వచ్చింది. కొంత కాలం నిర్మాణ పనులు ఆపాలని సింగ్ సూచించిన వెంటనే మా డబ్బులు మాకు ఇవ్వమని గద్దలు అంటారని ఊహించలేకపోయాడు. భవిష్యత్తులో నా సహకారం సంపూర్ణంగా వుంటుంది! నమ్మండి!! అని సింగ్ వేడుకుంటున్నా వాళ్లు వినడం లేదు. కార్మికులు చిత్రపురి వ్యవహారాన్ని హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ఒత్రిడి చేశారంటే రో హౌస్ లని నేల మట్టమే…బుల్డోజర్లతో కూల్చడమే ఖాయంగా కనిపిస్తోంది. హైడ్రా ఇంత దూకుడుగా వ్యవహరిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు అక్రమ నిర్మాణాలు చేసుకున్న వారి గుండెల్లో బుల్డోజర్లు పరుగెత్తుతున్నాయి. చిత్రపురి కూడా ప్రభుత్వ స్థలమే…రో హౌస్ లు అక్కడ అక్రమ నిర్మాణాలే..అత్యాశకు పోయి సినీ గద్దలు అన్యాయంగా కార్మికుల జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పుడు ఖర్మ రిటర్న్స్ అన్నట్లు హైడ్రా బుల్డోజర్లు వేసుకొని వస్తోంది. ఈ రో హౌస్ లు ఎలాగూ మాకు దక్కే అవకాశం కనిపించడం లేదని తెలుసుకున్న సినీ గద్దలు కలెక్షన్ సింగ్ నుంచి తిరిగి వసూలుకు బలంగా నిర్ణయించుకున్నారు. ఈసారి సింగ్కు శంకరగిరి మాన్యాలు తప్పవని అంటున్నారు. గతంలో ఇదే మణికొండ లోనే ఉన్నతాధికారుల ఆదేశాలను లెక్క చేయకుండా, వసూళ్ల పర్వాలు చేశాడని నిర్ధారణ చేసి, అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సింగ్ ను సస్పెండ్ చేశారు. తర్వాత మళ్లీ కొలువులో చేరి అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. సినీ పెద్దలు ఎలాంటి పిర్యాదులు చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది. ఏది ఏమైనా చిత్రపురి సినీ కార్మికు సమాజానిదే…రో హౌస్ లు కూల్చి కార్మికులకు అప్పార్టుమెంట్లు కట్టేదాకా నేటిధాత్రి కార్మికుల పక్షాన అక్షర పోరాటం చేస్తూనే వుంటుంది. కార్మికుల కళ్లలో ఆనందం చూసే దాక చిత్రపురిలో చీమ చిటుక్కుమన్నా స్పందిస్తూనే వుంటుంది. కార్మికులకు అండగా వుంటుంది.