https://epaper.netidhatri.com/
సారే కావాలి…బిఆర్‌ఎస్ గెలవాలి!
`నేటిధాత్రి, ఢీ ప్యాక్ సంచలన సర్వే!
`అన్ని వర్గాల తెలంగాణ ప్రజల మనోగతం.
`పార్లమెంటు ఎన్నికలలో పల్లె, పట్నం బిఆర్‌ఎస్ వైపే!
`నాలుగు నెలల్లోనే తెలంగాణ ప్రజల్లో మార్పిదే!
`కేసిఆర్ పాలనలో పదేళ్ళు కోతలు లేని కరంటు చూశాం!
`ఇప్పుడు కోతలు మళ్ళీ చూస్తున్నాం!
`తెలంగాణ గొంతెండుతోంది.
`జనం గొంతు తడారిపోతోంది.
`కరువు లేని తెలంగాణ చూశాం.
`పదేళ్ళ తర్వాత కరువు గురించి మాట్లాడుకుంటున్నాం.
`ఎండాకాలంలో నీళ్లు చూశాం.
`కళ్ల నిండా పంటలు చూశాం.
`పండిన పంటలతో రోజూ పండగలా బతికాం.
`నాలుగు నెలలకే పదేళ్ళ కింద తెలంగాణ మళ్లా …చూస్తున్నాం.
`తొందరపడినందుకు ఆలోచనలో పడ్డాం.
`నీళ్లు, కరంటు లేక గోసలుపడుతున్నాం!
`మళ్లా కేసిఆర్ రావాలి.
`మా బాధలు తీరాలి.
`కాంగ్రెస్ మీద తొలగిన మబ్బులు!
`నేటిధాత్రి, ఢీ ప్యాక్ సర్వేలో తేలిన నిజాలు.
`మెజారిటీ సీట్లు బిఆర్‌ఎస్ సొంతం.
`టాప్ గేర్‌లో కారు దూసుకుపోవడం ఖాయం!
`పార్లమెంటు ఎన్నికలలో 8కి పైగా సీట్లలో బిఆర్‌ఎస్ విజయం!
`తెలంగాణకు కారే దిక్కనుకుంటున్న జనం.
హైదరాబాద్,నేటిధాత్రి:
పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఎటు వైపు అనేది జోరుగా జరుగుతున్న చర్చ. అదే క్రమంలో ఢీ ప్యాక్, నేటిధాత్రి నిర్వహిస్తున్న సర్వేలలో విస్తుపోయే నిజాలు వెల్లడౌతున్నాయి. పల్లెల్లో ఎక్కడికి వెళ్లినా ప్రజల నాడీ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు బిఆర్‌ఎస్ గురించి ఎక్కువగా మాట్లాడటం కనిపిస్తోంది. సరిగ్గా నాలుగు నెలల క్రితం పల్లెల్లో కాంగ్రెస్ గురించి చర్చ వినిపించేది. ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో బిఆర్‌ఎస్‌ను ఓడిరచి, పొరపాటు చేశామన్న భావన ప్రజలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సందర్భం తెలంగాణ ఉద్యమ కాలంలో ఎక్కువగా వినిపించేది. మళ్ళీ ఇంత కాలానికి ప్రజల్లో మళ్ళీ స్పష్టమైన చర్చ జరుగుతోంది. తాము గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ను నమ్మడం మొదటికే మోసానికి వచ్చిందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. పల్లెల్లో నీళ్లు కరువౌతున్నాయి. మళ్ళీ బిందెలు కనిపిస్తున్నాయి. అంతెందుకు ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు నింపుకొని తెచ్చుకుంటున్నారు. అంటే ప్రజల గొంతు ఎంత ఎండిపోతుందో అర్థం చేసుకోవచ్చు. పట్టణాలలో సైతం ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయి. బోర్లు ఎండిపోవడం, మోటార్లు కాలిపోవడం కనిపిస్తోంది. ఇక రైతులు చదువుతున్న పంచాంగం వింటే కాంగ్రెస్ పెద్దలు చెవులు మూసుకోవాల్సిందే. ఇది ఏప్రిల్ నెల మాత్రమే. ఇంకా మేలో ఎండలు ముందు ముందు తమ ప్రతాపం చూపనున్నాయి. ఈ పరిస్థితులు కచ్చితంగా కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. బిజేపి పరిస్థితి కాంగ్రెస్ కన్నా గొప్పగా ఏమీ లేదు. కానీ కాంగ్రెస్ కంటే మెరుగైన స్థితిలోనే వుంది. కేంద్రం విషయంలో కొంత సానుకూలత కనిపించినట్లు, అనిపించినా అది పార్టీలోనే ఎక్కువగా వుంది. ప్రజల్లో బిజేపికి అంత ఆదరణ లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా, బిఆర్‌ఎస్‌కే మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం వుంది. ఇంకా ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయం వుంది. బిఆర్‌ఎస్ గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం వుంది. సీట్లు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ గోసంతా నీళ్లతోనే…అది కాంగ్రెస్ విస్మరించింది. ఇప్పుడు అదే కాంగ్రెస్‌కు శాపం కానుంది. సీట్ల కోతకు కారణం కానుంది.
తెలంగాణలో ప్రజా క్షేత్రంలో వినిపిస్తున్న ప్రజాభిప్రాయానికి, వెలుగులోకి వస్తున్న విషయాలకు ఇటీవల కొంత పొంతన లేకుండా పోతోంది.
సర్వేలు కొన్ని వెలువరుస్తున్న విషయాలు వాస్తవాలు వ్యక్తీకరించడం లేదు. పార్టీల వారిగా జరుగుతున్న సర్వేలలో నిజాలు ఒక రకంగా వుంటే, సమాచారాలు మరో రకంగా వుంటున్నాయి. కానీ అసలు విషయాలు పార్టీలకు తెలిసిపోతున్నాయి. ప్రజాభిప్రాయాలను తెలుసుకుంటున్నాయి. వాటిలో పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ విషయానికి వస్తే ఏక పక్ష తీర్పు వుండబోతోందని స్పష్టంగా కనిపించనుందని తెలుస్తోంది. తెలంగాణలో మళ్ళీ కారు రేసులోకి వచ్చిందనే విషయం అన్ని పార్టీలకు అర్థమౌతోంది. సరిగ్గా పదిహేను రోజుల ముందు నాయకులు వేసుకున్న అంచనాలు వేరు. ఇప్పుడు జనం మది నుంచి వినిపిస్తున్న మాటలు వేరు. వాటిని తెలుసుకొని నాయకులు కంగారెత్తుతున్నారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. తొందరపడిన వారు కొందరైతే, తప్పక జారుకున్న వారిలో కూడా పశ్చాత్తాపం కనిపిస్తోంది. ప్రజల వ్యతిరేకత ప్రస్పుటంగా తెలిసిపోతోంది. ప్రజలు ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు, ఎన్ని చెప్పినా వినరు. సరిగ్గా శాసనసభ ఎన్నికలలో ఇదే జరిగింది. ఎప్పుడైతే ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి వెళ్లాయో! అప్పడే ప్రజలు మార్పు కోరుకున్నారు. నిజానికి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో మొత్తం బిఆర్‌ఎస్ జిరాక్సే. ఎందుకంటే బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు బలంగా ప్రజల్లోకి వెళ్లాయి. నిక్కచ్చిగా అమలౌతున్నాయి. వాటికి మరింత కొత్త రూపునిస్తే ప్రజలు మన వైపు చూస్తారని కాంగ్రెస్ అంచనా వేసింది. బిఆర్‌ఎస్ అమలు చేసిన పథకాలకే కొత్త పేర్లు పెట్టి, నిధులు పెంచింది. ఏక కాలంలో, ఏక మొత్తంలో అన్న కాంగ్రెస్ ప్రచారానికి బలం చేకూరింది. అయితే బిఆర్‌ఎస్ మ్యానిఫెస్టో కూడా ముందుగా ప్రకటించిన కాంగ్రెస్‌ను పోలి వుందని ప్రజలు భావించారు. ఎందుకంటే అప్పుడు అధికారంలో వున్న బిఆర్‌ఎస్ ముందుగానే కొన్ని అమలు చేస్తే బాగుండేది. కానీ మరోసారి గెలిపిస్తే అన్న బిఆర్‌ఎస్ ట్యాగ్ లైన్ ప్రజలకు నచ్చలేదు. దానికి తోడు కాంగ్రెస్ చెప్పిన విషయాలను ప్రజలు బలంగా నమ్మారు. అప్పుటికే బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఆగడాలు మరీ మితిమీరి పోయాయి. మరో సారి అదే బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఓట్లేస్తే మరింత నరకం చూస్తామని అనుకున్నారు. కొంతమంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మూలంగా ఎంతో గొప్ప పథకాలు కూడా పక్కకు పోయాయి. కాంగ్రెస్ వాగ్థానాలు ముందుకొచ్చాయి. రైతుబంధును రైతు భరోసా పేరుతో రూ.15 వేలు కాంగ్రెస్ ఇస్తామని చెప్పింది. అయినా ఇప్పటికీ ప్రజల మదిలో రైతు బంధు అనేదే నాటుకుపోయింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కూడా రైతు బంధు అనే సంబోదిస్తున్నారు. ప్రస్తావిస్తున్నారు. సకాలంలో రైతు బంధు పడలేదన్నదానిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలున్నాయి. ఆ ఆరోపణలపై నిదానంగా సమాధానం చెబితే బాగుండేది. కానీ బాధ్యత కలిగిన నేతలు చెప్పుతో కొట్టాలని అనడం వివాదాలకు దారి తీసింది.
అలా మొదలైన వివాదాలు నాలుగు నెలలుగా ముసురుతూనే వున్నాయి. ప్రభుత్వ పథకాల మీద ప్రభావం చూపుతూనే వున్నాయి.
ఇంతలో పార్లమెంటు ఎన్నికలు రానే వచ్చాయి. ప్రజల ఆలోచనా తీరులో మళ్ళీ మార్పులు వస్తూనే వున్నాయి. ప్రభుత్వ పథకాలు ఎలా వున్నా తెలంగాణలో నీళ్లు, కరంటు అన్నది కీలక పాత్ర పోషిస్తోంది. కేసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణను దోచుకుతిన్నదని గత శాసనసభ ఎన్నికలలో నమ్మిన ప్రజలు పార్లమెంటు ఎన్నికలలో నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇంత కాలం కేసిఆర్ ఇచ్చినవి కాళేశ్వరం నీళ్లు కాకుంటే, కాంగ్రెస్ నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతోందని ప్రజల్లో ప్రశ్న మొదలైంది. అది మళ్ళీ తెలంగాణలో చర్చకు దారి తీసింది. అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం మొదలైంది. దానంతటికీ కారణం నీళ్లు. కరంటు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించలేకపోయింది. పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొదటి రోజు నుంచి ఎంతో జాగ్రత్తగా అడుగులేల్సి వుంది. అది విస్మరించారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులపై తవ్వకాలు మొదలుపెట్టారు. మొదట శ్వేత పత్రాలన్నారు. తర్వాత విచారణలన్నారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటనలు వెలుగులోకి తెస్తూ వచ్చారు. గత ప్రభుత్వాన్ని నిత్యం విమర్శించడానికే పూర్తి కాలం వినియోగించారు. ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలో అర్థం కాక, గత కేసిఆర్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడమొక్కటే అలవాటు చేసుకున్నారు. ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పై విరుచుకుపడడంతోనే కాలయాపన చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలపై ప్రజలు అడగకుండా, రోజుకో కొత్త విషయం తెచ్చి సమాజం మీద రుద్దుతున్నారు. రైతులకిచ్చిన హామీలు మర్చిపోయారు. కనీసం నిరంతర కరంటు, సాగుకు ఇబ్బంది లేకుండా నీళ్లు ఇస్తే కాంగ్రెస్ కు ఇంత సమస్య వచ్చి వుండేది కాదు. దాంతో ఎండాల్సినంత వరి ఎండిపోయింది. పండిన పంట అమ్మకానికి దిక్కులేకుండా పోయింది. రైతు కోసం శాపంగా మారే తరుణం వచ్చేసింది. కారుకు జోరును పెంచింది. కేసిఆర్ అధికారంలో వుంటే సమస్యలు వుండేవి కాదన్న చర్చ మొదలైంది. పల్లెల్లో, పట్నాలలో మళ్ళీ కారుకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఎన్నికల నాటికి ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ సారు, సారు అని కేసిఆర్‌ను కలవరిస్తోంది.