కల్తీ..కల్తీ..కల్తీ!

https://epaper.netidhatri.com/view/335/netidhathri-e-paper-1st-aug-2024

`ఎక్కడ విన్నా ఇదే మాట!

`తిండి దగ్గర నుంచి అన్నీ కల్తీలే!

`నూనెల్లో కల్తీ..

`నెయ్యిలో కల్తీ

`కల్తీ లేని వస్తువు పేరు చెప్పలేం.

`వ్యాపారమంతా మోసం

`ప్రజల జీవితాలతో చెలగాటం.

`మంచినీటి నుంచి మందుల దాకా కల్తీ.

`ఉప్పు నుంచి పప్పు దాకా కల్తీ.

`కుకుంగ్‌ ఆయిల్‌ నుంచి హెయిర్‌ ఆయిల్‌ దాకా…

`ప్రతి వస్తువు కల్తీయే…

`పాల నుంచి పెగ్గుల దాకా…

`బియ్యంలో రాళ్లు కలిపే కాలం పోయింది.

`బియ్యమే కల్తీ చేస్తున్న కాలమొచ్చింది.

`మంచి తనం మాయమైంది…

`పాపం…పుణ్యం చెప్పుకోవడానికి మిగిలింది.

`కల్తీ లేని వస్తువు వెతికినా దొరకని పరిస్థితి వచ్చేసింది.

`కల్తీ లేకుండా బతకడమే కష్టమయ్యే కాలం దాపురించింది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కల్తీ..కల్తీ..ఈ మాట వింటేనే ప్రజల గుండె గుబెల్‌ మంటోంది. అయినా ప్రజలు చేయగలిగిందేమీ లేక, కల్తీలను కూడా లెక్క చేయకుండా సర్దుకుపోతున్నారు. తానే నీటి నుంచి, తినే తిండి దాకా అన్నీ కల్తీ అని తెలిసినా చేసేదేమీ లేక, కల్తీ అనే పదమే లేకుండా నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లడం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వాలకు పట్టింపు లేదు. చట్టానికి తీరిక లేదు. పట్టుకునేందుకు వ్యవస్దలకు సమయం లేదు. దాంతో సామాన్యుడు కల్తీల మీద పోరాటం చేసే శక్తిలేక, ఉరుకుల పరుగుల జీవితంలో తనను తాను నిందించుకుంటూ బతుకులీడుస్తున్నాడు. కారణం తన అశక్తత. తన అసమర్ధత. తన శక్తి హీనత. బతుకు పోరాటంలోనే అలసిపోతున్న సగటు వ్యక్తి వ్యవస్ధల మీద పోరాటం చేసేందుకు జంకుతున్నాడు. ఒకప్పుడు తప్పును తప్పని నిలదీసేందుకు వెనుకాడేవారు కాదు. కాని ఇప్పుడు తప్పును తప్పని చెప్పడానికి వెనుకాడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే భయపడుతున్నాడు. మనకెందుకు లే అని పారిపోతున్నాడు. అలా జీవితంలో సర్ధుకుపోవడం మేలనుకుంటున్నాడు. పిరికి తనం అలవాటు చేసుకుంటున్నాడు. తనను తాను మోసం చేసుకుంటున్నాడు. ఇది సమాజంలో ఏ ఒక్కరి పరిస్ధితి కాదు. సామాన్య ప్రజల నుంచి మొదలు ప్రభుత్వాలలో కీలకభూమిక పోషిస్తున్న పాలకులు కూడా పట్టించుకోవడం మానేశారు. అందుకు కారణాలు కూడా వున్నాయి. రాజకీయ పార్టీలకు ఫండ్స్‌ కావాలి. పాలకులకు ఆస్దులు కావాలి. అంటే వ్యాపారులను వసూలు చేసుకోవాలి. అంటే వ్యాపారులు వారి కనుసన్నల్లో వుండాలి. ఇంతకు మించి పెద్దగా ఆలోచించడానికి ఏమీ లేదు. అయినా ఆ పాలకులే కల్తీని సేవిస్తున్నారు. భుజిస్తున్నారు. పేరు పెద్ద ఊరు దిబ్బ అన్నట్లు మనం ఉదయం లేచిన నుంచి పడుకునే వరకు ప్రతిదీ కల్తీనే వాడుతున్నాం. ఉదయం లేచిన వెంటనే తాగే నీళ్లు కల్తీ. కాని వాటిని కొనుగోలు చేసి మరీ తాగుతున్నాం. మన తాగే కాపీ కల్తీ. టీ కల్తీ. ఆఖరుకు పాలు కల్తీ. పాల విషయానికి వస్తే ఎలా తయారు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. కాని పాలకులు ఏం చేయలేకపోతున్నాడు. వాళ్లు కూడా అవే పాలను తాగకుండా వుండలేకపోతున్నారు. పాకెట్‌ పాలకు అలవాటు పడ్డాము. అవి ఎలా వస్తున్నాయో చూస్తూనే వున్నాం. ఒక వేళ స్వచ్ఛమైన పాలను కనీసం పల్లెల్లోనైనా దొరుకుతున్నాయా? అదీ లేదు.

గేదెల రక్తాన్ని పాలగా మార్చేలా వాటిని ఇంజక్షన్లు చేస్తున్నారు. లీటరు పాలిచ్చే గేదే నుంచి రెండు లీటర్లు పిండేస్తున్నారు. గేదెలను హింసిస్తున్నారు. అలాంటి పాలను తాగడం వల్ల మన శరీరాలలో అనేక మార్పులు వస్తున్నాయి. రోగాలు దరి చేరుతున్నాయి. గేదెలకు ఇచ్చే ఇంజక్షన్ల మూలంగా మన శరీరంలో హార్మోన్లు సమతుల్యత దెబ్బతింటోంది. ఆడపిల్ల జీవితాలను చిదిమేస్తుంది. గతంలో ఒక వయసు వస్తే తప్ప ఆడపిల్లలో మార్పులు వచ్చేవి కాదు. కాని ఇలాంటి కల్తీ వస్తువుల వాడకం మూలంగా వారిలో హర్మోన్ల సమతుల్యత దెబ్బతింటోంది. ఇక మనం వంటింట్లో వాడే మంచినూనె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రిఫైండ్‌ ఆయిల్‌ అని నిత్యం వాడుతున్న మంచినూనే ఎలా తయారు చేస్తున్నారో అందరికీ తెలుసు. రిఫైండ్‌ ఆయిల్‌ అనేది కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయింది. అనేక కంపనీలు ఉద్భవించాయి. ప్రభుత్వాలు ఆ కంపనీలకు ప్రోత్సహిస్తున్నాయి. వాటి స్ధాపనకు అన్ని రకాలుగా సహకరిస్తున్నాయి. అసలు రిఫైండ్‌ ఆయిల్‌ తయారీ విధానం ఎలా వుంటుందనేది మీడియా కూడా కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే వుంటుంది. కాని చేసేదేమీ లేదు. గత రెండు దశాబ్ధాల క్రితం వరకు కనీసం పల్లెల్లో పొద్దు తిరుగుడు పువ్వు పంట కనిపించేది. కాని గత పదేళ్లుగా ముఖ్యంగా మన తెలంగాణలో పొద్దు తిరుగుడు సాగు అన్నది కంటికి కనిపించడం లేదు. దేశ వ్యాప్తంగా కూడా దాని సాగు కనుమరుగైంది. దేశంలో విస్తారంగా పొద్దు తిరుగుడు పువ్వు పండిన సమయంలో ఎక్కడా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ నూనే కనిపించేది కాదు. కనీసం ప్రభుత్వం రేషన్‌ షాపుల్లో కూడా విక్రయించేవారు కాదు. దేశంలో రేషన్‌ షాపుల్లో పామోలిన్‌ నూనెను సరఫరాచేసేవారు. కాని ఎక్కడా సన్‌ప్లవర్‌ సరఫరాచేసేవారు కాదు. ప్రభుత్వ వసతీ గృహాలలో కూడా గత ఇరవై ఏళ్ల క్రితం వరకు పామోలిన్‌ నూనెను సరఫరా చేసేవారు. సన్‌ఫ్లవర్‌కు తావులేదు. చోటు లేదు. ఇప్పుడు మన దేశంలోనే ఎక్కడా దాని సాగు లేదు. కాని సన్‌ఫ్లవర్‌ నూనె మాత్రమే మార్కెట్‌ను ముంచెత్తుతోంది. మరి ఎక్కడినుంచి వస్తోందన్న దానిపై సమాధానం చెప్పేవారు లేరు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పొద్దుతిరుగుడు గింజలతో, క్రూడ్‌ ఆయిల్‌ మిక్స్‌ చేసి, కొన్ని వందల సెంటీగ్రేడ్‌లో వేడిచేసి, రకరకాల కెమికల్స్‌ కలిపి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ తయారు చేస్తున్నారు. దాని వల్ల ప్రజల ఆరోగ్యాలకు పెద్దఎత్తున ప్రమాదం ఎదురౌతుందని తెలిసినా పాలకులకు పట్టిలేదు. కారణం మన దేశ జనాభాకు అవసరమైన పంటలు లేవు. దిగుబడి అవకాశంలేదు. మార్కెట్‌లో పొద్దు తిరుగుడు గింజలు కిలో కనీసం రూ.400లకు పైగా రేట్‌ వుంది.

ఒక కిలో నూనెరావాలంటే కనీసం మూడు కిలోలు అవసరం. ఒక కిలో సన్‌ప్లవర్‌ ఆయిల్‌ నాచురల్‌ నూనె కావాలంటే సమారు.1200 రూపాయలు చెల్లించాల్సిందే. కాని రిఫైండ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ మల్టీ నేషనల్‌ కంపనీలు అందమైన ప్యాకింగ్‌లలో, ప్లాస్టిక్‌ టిన్‌లలో లీటర్‌ను రూ.120కి విక్రయిస్తున్నారు. ఇదెలా సాధ్యం అని ఎవరూ అడగరు. పూర్తిగా నాణ్యమైన సన్‌ఫ్లవర్‌ నూనె కొనుక్కొలేము. మన జీవితాలకు, వచ్చే జీతాలకు అన్నీ నాణ్యమైన వస్తువులుకొనుగోలు చేయలేం. అందుకు మనం సర్ధుకుపోతున్నాం. మల్లీ నేషనల్‌ కంపనీలు తయారు చేసి ఇచ్చే నాసిరకం మంచినూనెను చౌకగా కొనుక్కుంటున్నాం. అదేదో సినిమాలో కోడిని వేలాడదీసుకొని చికెన్‌ తింటున్నట్లు భ్రమపడుతూ భోజనం చేసినట్లు, రిఫైండ్‌ ఆయిల్‌ చాల మంచిందని వాడుకుంటున్నాం. ఆకలి తీర్చుకుంటున్నాం. తర్వాత వచ్చే ఆపద సంగతి తర్వాత చూసుకుందామని వాయిదా వేసుకంటున్నాం. ఆరోగ్యాలు పాడైపోతున్నాయని లబోదిబో మంటున్నాం. ఓ ముప్పై ఏళ్లక్రితం గుండె జబ్బులు అంటే ఎవరికీ తెలియవు. బిపిలు షుగర్‌ వ్యాధులు వున్నట్లుకూడ చెప్పుకున్న సందర్భాలు లేవు. కాని ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. చిన్న వయసుల్లోనే షగుర్లు వస్తున్నాయి. బిపిలు పెరిగిపోతున్నాయి. అందుకు కారణం మనం వాడుతున్న కల్తీ ఆహార వస్తువులు. ఉత్తరాధిన కొండ కోనల్లో జీవనం సాగించే ప్రజల్లో ధైరాయిడ్‌సమస్యలుంటాయి. వారి కోసం తయారుచేసిన ఐయోడైజ్‌డ్‌ ఉప్పు ఇప్పుడు దేశమంతా అమ్ముతున్నారు. మైదాన ప్రాంతాలలో ధైరాయిడ్‌ జబ్బులకు కారణమౌతున్నారు. అయినా మనం ప్లూర్‌ ఫ్లో ఉప్పు కావాలని కొంటున్నాం.

సముద్రం నుంచి నేరుగా వచ్చే ఉప్పులో వుండే ఖనిజాలతో కూడిన ఉప్పును దూరం చేసుకున్నాం. మార్కెట్‌లో కనీసం అలాంటి ఉప్పు విక్రయాలు కూడా ఎప్పుడో ఆగిపోయాయి. జనాలు కొనడం మానేశారు. వ్యాపారులు అమ్మడం మానేశారు. ఒకప్పుడు అల్లం వెల్లుల్లి మన సంప్రదాయం ప్రకారం వాడకపోయేవారు. ఎప్పుడో పైత్యం చేస్తే అల్లం వాడేవారు. కాని వెల్లుల్లిని తక్కువగా వాడుతుండేవారు. కాని ఇప్పుడు అల్లం వెల్లుల్లి లేకుండా వంటలు చేయడంలేదు. దాంతో ఈ వ్యాపారం కూడా పెద్దపెద్ద కంపనీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే ఇక్కడ పాడైపోయిన అల్లాన్ని, వెల్లుల్లిలను పేస్టులు చేసి, అందులో ఆసిడ్‌ లాంటి భయంకరమైన కెమికల్స్‌ కలిపి నిలువ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇక మన సంప్రదాయ తినుంబండారాలు, నేతిమిఠాయిలు అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఇటీవల ఎమరాల్డ్‌ అనే ఓ స్వీట్‌ తయారీ దారులు పైకి మాత్రం పూర్తి ఆర్గానిక్‌ అని ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం చేయడం చూశాం. అంటే ప్రజల బలహీనతలను కూడా పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన మిఠాయిలు అంటూ, కల్తీ మిఠాయిలు అంటగడుతున్నారు. జనాలను నిండా ముంచుతున్నారు. అసలు ఏం తినాలన్నా భయపడే పరిస్ధితులు సృష్టించిన కల్లీగాళ్లే, ఇవి తింటే తప్ప గతి లేదన్న రోజులు తీసుకొస్తున్నారు. కల్తీ తయారీ ఆపాల్సిన సమయంలో, మన శరీరాలను కల్తీలకు అలవాటు చేస్తున్నారు. మనం చేయగలిగిందేమీ లేదు. వాడకుండా వుండకుండా వుండలేము. కాలంతోపాటు మనం మౌనంగానే కల్తీలను తింటూ కాలం వెల్లవెచ్చడం తప్ప చేసేదేమీ లేదు.! అయ్యో..అనుకోవడం తప్ప ఆగేది లేదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!