`అభిమానులు వలవల…రెండు కుటుంబాలు కలకల!!
`అల్లు..మెగాల మధ్య పరిశ్రమ గిలగిల!
`పదే పదే అల్లు గిల్లుడు!
`వాళ్లు గీసుకునేవి చిన్న గీతలు…వాటిని పెద్దది చేస్తున్న అభిమానులు.
`పెడర్థాలు తీరి చెరిపేసుకోలేనంత దూరం పెంచుతున్నారు.
`అటు అభిమానులు… ఇటు కుటుంబ సభ్యులు.
`నాటకాన్ని రక్తి కట్టిస్తున్న రెండు కుటుంబాలు.
`మధ్య లో నలిగిపోతున్న సినీ వర్గాలు.
`మెగాభిమానుల జోకుడు!
`అల్లువారి ప్రతాపం దూకుడు
`మెగా నుంచి అదే సనుగుడు
`అడకత్తెరలో అరవింద్ నసుగుడు.
`మెగా కుటుంబం భరించలేనంత కుతకుత.
`అల్లు వారి నుంచి ఆగని మోత.
`అల్లు మాటలతో పవన్ ప్రస్టేషన్.
`నేరుగా ప్రశ్నించలేక కళ్లలో చూపిస్తున్న ఎమోషన్.
`అడకత్తెరలో చిరు ఆటుపోటులు.
`అల్లుని అనలేక..తమ్ముడిని సమర్థించలేక అన్న అవస్థలు.
`ఇదంతా పైన ప్రచారమే…సినిమాల ప్రమోషన్‌లో భాగమే!
`తెర మీదనే కాదు…బైట కూడా మహానటులే.
`అల్లు..మెగా వేరు వేరు కాదు…
` అది అర్థం చేసుకోలేక అభిమానులు పిచ్చోళ్లు కావొద్దు!
నీ యవ్వ..తగ్గేదే లే అని పుష్ప సినిమాలో డైలాగ్ కొట్టిన సినీ హీరో అల్లు అర్జున్ మరోసారి తేనె తుట్టె కదిపాడు. అల్లు గిల్లుడు మళ్లీ మెగా కుటుంబానికి పుండు మీద కారం చల్లినట్లైంది. అల్లు అర్జున్ తాజా వ్యవహారం మళ్లీ మెగా కుటుంబానికి చిర్రెత్తుకొత్తుకొచ్చేలా చేసింది. అయితే అల్లు గిల్లడానికి ముందు ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. వైరల్‌గా మారాయి. మీడియాలో ఎక్కడ చూసినా అదే చర్చ…సోషల్ మీడియాలో అదే రచ్చ…ఒకప్పుడు సినిమాలో అంటూ హీరోలు ఎన్ని వేషాలేసినా, తర్వాత ఒక సందేశం ఇచ్చేలా వుండేవి. ఇప్పుడు సందేశమే తప్పుడు మార్గంగా వుంటున్నాయంటూ పవన్ కళ్యాణ్ పుష్ప సినిమానుద్దేశించినట్లు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీనిపై మళ్లీ ఏదో ఒక రచ్చ త్వరలోనే జరుగుతుందని అందరూ అనుకుంటూనే వున్నారు. అల్లు అర్జున్ నాకు ఇష్టమైన వారి దగ్గరకు వెళ్తానంటూ తేల్చి చెప్పారు. నిజానికి ఇది రెండు కుటుంబాల మధ్య చిన్న సమస్య. ఒక రకంగా చెప్పాలంటే అది సమస్యే కాదు. చీఫ్ పాలిటిక్స్‌లో ఒక భాగం అంతే..లోతైన విశ్లేషణ చేసేవారికి అసలు ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి లొల్లి లేదని తెలుసు. కాని అభిమానులనేవారు రెండు గ్రూపులుగా చీలిపోయారు. మొన్నటి దాకా ఒకే గొడుగు కింద వున్న అభిమానులు చీలిపోయారు. కొంత మంది బుల్లి తెర నటులు మెగా కుటుంబానికి తోడుగా నిలుస్తున్నారు. తెలిసీ తెలియక తమ అభిమానాన్ని చూపించుకునేందుకు ఇదే అదునుగా రెండు కుటుంబాల మధ్య దూరుతున్నారు. మెగా కుటుంబానికి మేమున్నామన్నంతగా బిల్డప్‌లిస్తున్నారు. కాని మెగా, అల్లు కుటుంబాల మధ్య ఎలాంటి విబేధాలు లేవు. వారి మధ్య సఖ్యతకు ఎలాంటి ఢోకాలేదు. వారి మధ్య ఎలాంటి దూరం పెరగలేదు. కాని సినిమాలో చూపించాల్సిన నటనను ఇటీవల కాలంలో బైట కూడా చూపిస్తున్నారు.
రెండు కుటుంబాల మధ్య ఏదో జరుగుతుందన్న ప్రచారం వాళ్లకు వాళ్లే చేస్తున్నారు. అభిమానుల చేత విచిత్రమైన ఆరోపణలు చేయిస్తున్నారు. ముందుగా ఎన్నికల తర్వాత జరిగిన సందర్భాలను అభిమానులు గుర్తించాలి. ఆ మధ్య ఓ వేధిక మీద చిరంజీవి, అల్లు అరవింద్ ఇద్దరూ కలిశారు. చిరంజీవి ఒక పుస్తకం అల్లు అరవింద్‌కు ఇచ్చారు. తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అల్లు అరవింద్ వేదిక దిగిపోయాడంటూ వార్తలు వచ్చాయి. కాని చిరంజీవి ఒక పుస్తకం అల్లు అరవింద్‌కు ఇవ్వడం, ఆయన తీసుకోవడం రెండూ స్పష్టంగా కనిపించాయి. కాని నటులను గుడ్డిగా ప్రేమించే అభిమానులకు అవి కనిపించవు. ఇలా అభిమానులు తమలో తాము విభేదాలతో రెండు కుటుంబాలను ఎప్పుడూ సోషల్ మీడియాలో లైమ్ లైట్‌లో వుంచడమే కావాలి. ఎప్పుడూ రెండు కుటుంబాలు మాత్రమే ప్రజల్లో నానుతూ వుండాలి. తాజాగా చిరంజీవి సతీమణి సురేఖ రాఖీ పౌర్ణమి రోజున అల్లు అరవింద్ ఇంటికి వచ్చిన వీడియో కూడా అందరూ చూశారు. అల్లు అర్జున్ మేనత సురేఖను ప్రేమతో పలకరించి సందర్భం చూశాం. అదే సమయంలో రెండు కుటుంబాలు కలిసే వున్నాయన్న భావన ప్రజలకు కలగకూడదన్న ఆలోచనతో వెంటనే అల్లు అరవింద్ ఏదో సైగ చేశాడు. వెంటనే అక్కడి నుంచి అల్లు అర్జున్ వెళ్లిపోయాడు. కాని ఎడిటింగ్ అసలు విషయం తేలిపోయింది. అయినా అభిమానులకు అది కనిపించడం లేదు. మెయిన్ మీడియాకు కూడా టిఆర్‌పి రేటింగ్ కోసం ఇలాంటి వివాదాలను ముందుకు తీసుకోకుండా వండలేదు.
గత శాసన సభ ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్ వైసిసి అభ్యర్ధికి ప్రచారం చేయడానికి వెళ్లాడు. తనను ఎంతో అభిమానించే వ్యక్తి పోటీ చేస్తున్నప్పుడు, ఒక్కసారి వచ్చి వెళ్లమని కోరినప్పుడు అల్లు అర్జున్ వెళ్లడం జరిగింది. అది కూడా ఆయన ఓపెన్‌గా చెప్పడం జరిగింది. కాని అల్లు అర్జున్ ఎక్కడా తెలుగుదేశం, బిజేపి, జనసేన కూటమిని ఓడిరచమని చెప్పలేదు. తన మిత్రుడి ప్రచారానికి మాత్రమే వెళ్లాడు. అది కూడా ఒక్క నియోజకవర్గం మాత్రమే. అయితే రాజకీయాలల్లో పార్టీలు కాదు వ్యక్తులు ముఖ్యం. సమాజానికి సేవ చేయగలిగే వ్యక్తి ఏ పార్టీలో వున్నా సరే మంచి నాయకుడిని ఎన్నుకోమని చెప్పడమే ఎన్నికల అసలు రహస్యం. ప్రజా స్వామ్యంలో రహస్య ఎన్నికల విధానంలో ఇదే నైతికతకు నిదర్శనం. ఏ పార్టీని గెలిపించాలన్నది ప్రజలు ఇష్టం. ఏ నాయకుడిని ఎన్నుకోవాలన్నది ప్రజలకున్న సంపూర్ణ స్వేచ్ఛకు ఆధారం. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులలో నీతి,నిజాయితీ కలిగిన నాయకుడిని ఎన్నుకోమని చెప్పడమే ఎన్నికల ధర్మం. అంతే కాకుండా ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎవరికైనా స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కు కూడా వుంది. అదే ఇక్కడ అల్లు అర్జున్ నిర్వర్తించాడు. ఇకపోతే ఒక వైసిసి అభ్యర్ధి ఎన్నికల ప్రచారానికి బన్నిని పిలిచాడు. కాని జనసేన ఎక్కడా బన్నిని ప్రచారానికి రమ్మన్నట్లు ఆహ్వానం లేదు. పిలిచినట్లు పిలుపులు కూడా ఎవరూ చెప్పింది లేదు. కాని ఓ వైసిసి. అభ్యర్ధికి ప్రచారం చేయడానికి వెళ్లడమే బన్ని చేసిన నేరమైతే, 2014,2019 రెండు ఎన్నికల్లో సాక్ష్యాత్తు చిరంజీవి కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ప్రచారం చేయలేదు. అంతెందుకు ఈ ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేసింది లేదు. కేవలం అన్న ఆశీస్సులు అన్న కన్సెప్టు మాత్రమే కనిపించింది. గడచిన రెండు ఎన్నికల్లో జనసేనకు అనుకూలంగా బన్ని ప్రచారం చేశారు. అంతకు ముందు ప్రజారాజ్యం పార్టీకి కూడా బన్ని ప్రచారం చేశాడు. కాని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడుగా వున్న చిరంజీవి 2014 ఎన్నికల్లో జనసేనకు మద్దతు ఇవ్వలేదు. అప్పటికి చంద్రబాబుకు, చిరంజీవికి మధ్య సఖ్యత సరిగ్గా లేదు. ఒక 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిపోరు చేసినా చిరంజీవి ప్రచారం నిర్వహించిది లేదు. అంటే అన్నకో న్యాయం, బన్నికో న్యాయమా?
మన వాడు కాని వాడు మనవాడైనా పరాయి వాడే! అంటూ నాగబాబు పెట్టిన ట్విట్టర్ పోస్టు మళ్లీ ఎందుకు డిలీట్ చేసినట్లు? రాజకీయాల్లో ఎన్నికలు అనేవి ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. ఆ ఎన్నికల్లో సహకరించని అల్లు కుటుంబంతో అన్న చిరంజీవి ఎలా సఖ్యత ప్రదర్శిస్తున్నట్లు? వీటికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా వుంది. జబర్ధస్ధు ఆర్టిస్టుల అభిమానాన్ని మెగా కుటుంబం ఇలా వాడుకొని వదిలేస్తే భవిష్యత్తులో వారి ఇబ్బందులు తప్పవు. చిరంజీవి కుటుంబం ఆది నుంచి కొన్ని కుటుంబాలకు ఎప్పుడూ దూరమే..కాకపోతే అల్లు కుటుంబంతో కలిసి మెగా కుటుంబం అంటారే గాని, కేవలం మెగా కుటుంబాన్ని ఇంత వరకు ప్రత్యేకంగా ఎవరూ చూసింది లేదు. చిరంజీవి, మోహన్ బాబుల మధ్య ఎలాంటి దూరం వుందో అందరికీ తెలుసు. హరో రాజశేఖర్ ప్రజారాజ్యాన్ని విమర్శించినప్పుడు ఆయనపై దాడులు చేసిన సందర్భం చూశాం. 2019 ఎన్నికల ముందు జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టుకున్న తిట్లు అన్నీ ఇన్నీ కావు. నన్ను తిట్టిన వారిని జీవితంలో మర్చిపోను అంటూ పవన్ కళ్యాణ్ చేసిన శపధం కూడా చూశాం. తెలుగుదేశం పార్టీ అంతు చూస్తామని హెచ్చరించిన వ్యాఖ్యలు కూడా విన్నాం. మరి మళ్లీ అదే చంద్రబాబుతో ఎలా అంటకాగుతున్నారు. అలాగే ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బిజేపి మోసం చేసిందని, పాచిపోయిన రెండు లడ్డూలు చేతికిచ్చిందని విమర్శంచిన పవన్ మళ్లీ బిజేపి పంచన ఎలా చేరారు. అంటే మెగా కుటుంబ సభ్యులు తమ అవకాశ వాదం కోసం ఎలాగైనా వుండొచ్చా? ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను మార్చుకోవచ్చా? 1980 హీరోలు, హీరోయిన్‌లు, నటులు ఏటా చేసుకునే గెట్‌టు గెదర్ పార్టీకి బాలకృష్ణకు పిలుపులుండవు. ఆ విషయాన్ని స్వయంగా బాలకృష్ణే చెప్పాడు. ఎందుకు పిలవరో తెలుసుకోలేనంత అమాయకుడినా? అంటూ బాలకృష్ణ కూడా వ్యాఖ్యానించారు. సినీ రంగంలో వున్న రంగులన్నీ ఇప్పుడు రాజకీయాలకు పులుతున్నారు. ఇక్కడ కూడా మెగా నటులమే అనిపించుకోవాలని తపన పడుతున్నారు. అభిమానులను పిచ్చోళ్లను చేస్తున్నారు. ఇదంతా ఒక డ్రామా? అంతే…ఈ విషయం అభిమానలు తెలుసుకోవాల్సి వుందంతే!!