‘‘గుమస్తా’’.. ‘‘గుప్పిట్లో వ్యవస్థ’’!

`గుమస్తా నుంచి గుత్తాధిపత్యం దాకా!

`చిక్కడు దొరకడు ఈ జగత్‌ కిలాడి

`బినామీ మిల్లుల అధినేత…ఇతర మిల్లర్ల అణచివేత.

`కోట్ల చెక్కు రెడీ..కోటి రూపాయల వాటాల కోసం అధికారులు రెడీ రెడీ.

`చిన్నా చితకా మిల్లర్లను మింగేస్తున్న మాయల మరాఠీ!

`హన్మకొండ జిల్లాలో అనుచరులతో కలిసి మిల్లులు ఏర్పాటు చేసి,

`పదేళ్లుగా ఇష్టానుసారం దోచుకొని,

`గత ప్రభుత్వంలో పెద్దలను మచ్చిగ చేసుకొని,

`కులం పేరు చెప్పుకొని, అధికారులను చెప్పు చేతుల్లో పెట్టుకొని,

`పదేళ్లుగా ఇంటి పేరు గల ఓ నాయకుడి వద్ద పతారా పెంచుకొని,

`బిసి మిల్లర్లను ముంచి బినామీ మిల్లులకు దోచి పెట్టి!

`కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ సమావేశాన్నే అపహాస్యం చేసి,

`అడ్డూ అదుపు లేకుండా అక్రమాలకు తెగబడి

`ఇప్పటికీ ఆటలాడుతున్న బిల్లుల మాయగాడు.

`రవాణా దోపిడిలో అంతుచిక్కని సంపాదనలో ఆరితేరినాడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అతను ఓ గుమస్తా! జస్ట్‌ సివిల్‌ సప్లయ్‌ శాఖలో గుమస్తా!! ఇప్పుడు అరాచకానికి వ్యవస్ద. అక్రమాలకు వ్యవస్ధ. తోటి వ్యాపారులకు మింగిస్తున్న వ్యవస్ధ. తాను తప్ప మరొకరు మిల్లుల వ్యాపారంలో వుండకుండా చేయాలని చూస్తున్న వ్యవస్ధ. తాను తిమింగలమై, ఇతర మిల్లుల ఉనికి లేకుండా చేసేందుకు తెగబడుతున్న అవస్ధ. వ్యవస్ధకే అవస్ధలు తెచ్చిపెడుతున్న దురవస్ధ. ఇది తోటి మిల్లలు పడుతున్న ఆవేదనకు నిదర్శనం. ఆందోళనకు సంకేతం. వారు అనుభవిస్తున్న గోసకు నిర్వచనం. ఒక వ్యక్తి తాను తప్ప మరొకరు వుండకూడదన్న అహం ముందు పాపం ఇతరులు నష్టపోతున్నారు. ఏ సివిల్‌ సప్లయ్‌ శాఖలో గుమస్తా గిరి వెలబెట్టాడో అదే శాఖను హన్మకొండ జిల్లాలో గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తున్నాడు. అందుకు కారణం ఒక్కటే..అతనేదో గొప్ప వ్యాపారనిష్టాడై కాదు. కేవలం కులం. ఒక వ్యక్తి ఆధిపత్యానికి కులం ఎలా తోడౌతుందో, బలమౌతుందో ఈ వ్యక్తి అరాచకం చూస్తేనే అర్ధమౌతుంది. ఒకప్పుడు అందరికీ వంగి వంగి దండాలు పెట్టి కొలువు చేసుకున్న వ్యక్తి. ఇప్పుడు అందరిచేత శనార్ధులు పెట్టించుకునే స్ధాయికి చేరుకున్నాడు. కారణం కులం. అంతే జస్ట్‌ కులం. అంతే కాదు ఇప్పుడు ఈ సివిల్‌ సప్లయ్‌ శాఖనే శాసిస్తున్నాడు. అలా ఫోజు కొడుతున్నాడు. ఇక్కడ మరో కీలకమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి ముందు ఇతర కులాలకు చెందిన వ్యాపారులు వుండొద్దు. వారి మనుగడ కనిపించొద్దు. అతను వెలుగబెడుతున్న వ్యాపారంలో ఇతర కులాలకు చెందిన వాళ్లు వుండొద్దు. ఎదగొద్దు. కాకపోతే తన అనుచురులు, బినామీలకు మాత్రం వెసులుబాటు కల్పించినట్లున్నాడు. ఎందుకంటే వాళ్లు ఈ వ్యక్తి చెప్పు చేతుల్లో వుంటారు. అణిగి మణిగి వుంటారు. ఇతరులు మాత్రం అతని దృష్టిలో చీమలు, దొమలు, పురుగులు..మొత్తంగా అంటరాని వారు.
ఇంతటి దుర్మార్గం కొనసాగుతున్నా పట్టించుకున్నవారు లేరు.
ఎదురించిన వారు లేరు. తమ గోడు అధికారులకు చెప్పుకున్నా, మళ్లీ అతని చెవికి చేరుతుందని భయపడుతున్నారంటే ఎంతగా తన ఆధిపత్యం పెరిగిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా కులం పేరుతో విర్రవీగేవారు వున్నారా? అంటే మిల్లర్ల సమాజం మొత్తం అతన్ని వెలెత్తి చూపిస్తుందంటే ఎంతగా వారిలో ఆందోళన, ఆవేదన వుందో అర్ధం చేసుకోవచ్చు. కులం పేరుతో అహం నింపుకున్న ఆ వ్యక్తి ఇతర కులాలు మిల్లింగ్‌ వ్యవస్ధలో వుండడానికి ఇష్టపడడం లేదు. కొన్ని దశాబ్దాలుగా మిల్లుల వ్యాపారాలు సాగిస్తున్న కుటుంబాలను కూడా ఈ వ్యక్తి బెరిరిస్తున్నాడు. అదిరిస్తున్నాడు. వారిపై వ్యాపారాలను దెబ్బతీస్తున్నాడు. వారికి ప్రభుత్వం నుంచి వడ్లు అందకుండా చేస్తున్నాడు. హన్మకొండ జిల్లాలో తన బినామీ మిల్లులకే మొత్తం వడ్లు సమకూర్చుకుంటున్నారు. అధికారులను తన గుప్పిట్లో పెట్టుకొని ఆటలాడుతున్నాడు. ఇతర మిల్లర్లను నిండాముంచేస్తున్నాడు. వారి మిల్లులు నడవకుండా చేస్తున్నాడు. వారికి వడ్లు రాకుండా అదికారుల మీద ఒత్తిడి తెస్తున్నాడు. బకాయి దారులకు వడ్లు ఇవ్వకూడదని ప్రభుత్వం చెప్పిన ఒకే ఒక్క మాటతో ఇతర మిల్లర్ల మీద కక్ష కట్టి తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నాడు. నిజానికి ఈ వ్యక్తి కక్షకట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడో ఆ మిల్లర్లు కేవలం ఒకే సీజన్‌కు మాత్రమే బకాయిలున్నారు. అలా ఒక సీజన్‌ బకాయిదారులకు రాష్ట్రంలో అంతటా వడ్లు ఇస్తున్నారు. కాని ఇతర మిల్లర్ల మీద బకాయిదారులను లేనిపోనివి అధికారులకు చెప్పి వారి మీద ఒత్తిడి తెచ్చి, తన ఇలాఖాలో తన బినామీ మిల్లులు తప్ప, ఇతర మిల్లులు లేకుండా చేస్తున్నాడు.
సివిల్‌ సప్లయ్‌ శాఖలో గుమస్తాగా పనిచేసిన వ్యక్తికి శాఖలో లొసుగులు తెలుసు.
అధికారుల అండదండలు పుష్కలంగా వున్నాయి. గుమస్తా కొలువు నుంచి తప్పుకున్న తర్వాత నేరుగా ఈ వ్యక్తి మిల్లుల వ్యాపారంలోకి దిగినా అతని పేరు మీద లేవు. కొంత మంది అనుచరుల పేరుతో మిల్లులు ఏర్పాటు చేసుకున్నాడు. పై నుంచి చక్రం తిప్పుతూ వాటిని నడిపిస్తున్నాడు. ఇటు మిల్లులే కాదు, దానికి సంబంధించిన మరో వ్యాపారాన్ని కూడా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నాడు. అక్కడ కూడా కోట్లు దండుకుంటున్నాడు. ఈ విషయం మరో ఎపిసోడ్‌లో చెప్పుకుందాం…ఇప్పుడు చిన్నా చితక మిల్లర్లు పడుతున్న ఇబ్బందులు, ఈ వ్యక్తి మూలంగా ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకుందాం. చిక్కడు, దొరకడు లాంటి క్యారెక్టర్‌ ఈ గుమస్తాది. కొలువు నుంచి రిటైర్‌ అయిన తర్వాత తెలంగాణలో వారి కులం అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు ఈ గుమస్తా ఎవరో తెలియదు. కాని తెలంగాణ గత ప్రభుత్వంలో ఆ కులమే కీలకం. ఆ కులానికి చెందని నాయకులదే ఆధిపత్యం. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. దాన్ని ఆసరా చేసుకొని తాను కూడా కులం బోర్డు తగిలించుకున్నాడు. జిల్లాలోని ఓ పెద్ద నాయకుడికి పేరు చెప్పుకుంటూ వెలుగుతూ వచ్చాడు. ఇప్పటికీ ఆ వెలుగులోనే వుంటున్నాడు. ఉమ్మడి జిల్లాలలోనే పేరున్న ఆ నాయకుడి కులం, ఈ గుమస్తా కులం ఒకటే కావడంతో తనకు కాలం కలిసి వచ్చింది.. ఆ నాయకుడికి ఎంత దగ్గరో ఎవరికీ తెలియదు. ఆ నాయకుడికి కులం, ఈ వ్యక్తి కులం ఒక్కటే కావడమే తన వ్యాపారానికి అడ్డూ అడుపూ లేకుండాపోయింది. అదే సమయంలో కులాన్ని అడ్డు పెట్టుకొని ఎదగాలనుకున్నాడు. ఆ పెద్ద నాయకుడితో పలుసార్లు కనిపించడం మొదలు పెట్టాడు. మిల్లులు ఏర్పాటు చేసి, వ్యాపారం మొదలు పెట్టాడు.
పదేళ్లు తన ఆదిపత్యం కొనసాగిస్తున్నాడు.
హన్మకొండలో వున్న ఇతర మిల్లుల మీద పగబట్టాడు. ఆ మిల్లులను ఆగం చేస్తున్నాడు. ఒక మిల్లు నడకుండా వుంటే ఎంత నష్టమో ఈ గుమస్తాకు తెలుసు. అలా మిల్లులు నడవకుండా చేసి, దివాళా తీసేలా చేస్తే తన మిల్లులకు అడ్డుం వుండదని స్కెచ్‌ వేసుకున్నాడు. ఇతర మిల్లులను ఇబ్బందులకు గురి చేయడం మొదలుపెట్టాడు. ఆ మిల్లులను బాకాయి మిల్లులుగా ముద్ర వేసి, వారికి వడ్లు రాకుండా చేస్తూ వస్తున్నాడు. ఆ మధ్య మిల్లర్ల సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ షరతులను జాయింట్‌ కలెక్టర్‌ వివరిస్తుంటే మీటింగ్‌ నుంచి లేచి వెళ్లిపోవడమే కాకుండా తొక్కలో షరతులు అంటూ వెళ్లిపోయేంత అహం నింపుకున్నాడు. తాను బకాయిలు లేకుండా చూసుకొని, ఇతరుల బకాయిలను తెరమీదకు తెచ్చిన తాను సద్దుపూసనన్నట్లు కలరింగ్‌ ఇచ్చుకుంటున్నాడు. పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్లు, రైతులను తాను ఎలా మోసం చేస్తున్నాడో ప్రపంచానికి తెలియదనుకుంటున్నాడు? ప్రభుత్వాన్ని ఎలా మాయ చేస్తున్నాడో ఇతరులు కనిపెట్టలేకపోతున్నారన్న భ్రమల్లో వున్నాడు. కోట్ల రూపాయలు చెక్కులు ఎలా తయారు చేయించుకుంటున్నాడో నేటిధాత్రి వద్దపూర్తి సమాచారం వుంది. ఈ కోట్ల రూపాయల చెక్కు రెడీ అయ్యింది. అందులో వాటాలు పంచుకునేందుకు అదికారులు కూడా రెడీగా వున్నారు. తన కులం వాళ్లు కాకుండా ఇతర కులాలకు చెందిన మిల్లుల మనుగడ లేకుండా ఓ వైపు కుట్రలు చేస్తున్నాడు. ప్రభుత్వం కళ్లుగప్పి మరో రకంగా కోట్లు ఆర్జిస్తున్నాడు. అటు వడ్లు తన బినామీ మిల్లులకు మాత్రమే అందేలా తన కులం పలుకుబడి ఇంత కాలం చూపించుకుంటూ వస్తున్నాడు. ఆ ముసుగులో ఎవరికీ కనిపించని మరో చీకటి వ్యాపారం సాగిస్తున్నాడు. అందులో రైతులను నిండా ఎలా ముంచుతున్నాడన్నది మరో కథనంలో పూర్తి వివరాలు అందిస్తాం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!