మాయా ప్రపంచపు మైనింగ్‌ రాజ్యం ఎపిసోడ్‌ 2

https://epaper.netidhatri.com/

కోట చుట్టూ కోట్లలో గ్రానైట్‌ వ్యాపారం!

ప్రజల ప్రాణాలు గాలిలో…గ్రానైట్‌ వ్యాపారం కోట్లలో.

పర్యావరణం పరాధీనం..గ్రానైట్‌ వ్యాపార విశృంఖలత్వం.

ఎలగందుల కోటను ఆగం చేస్తున్నారు!

కాపాడాల్సిన పాలకులే చోద్యం చూస్తున్నారు.

తెలుగు చరిత్రకు ఆనవాలే ఎలగందుల.

తొలి తెలుగు రాజుల గూడే కరీంనగర్‌ జిల్లా.

శాతవాహనుల కాలం తొలి తెలుగు వైభవం.

ఎలగందుల కోట కింద చరిత్రను సమాధి చేస్తున్నారు.

పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు?

ఎలగందులలో ఇంకేం మిగిలిందులా?

ఊరును దుమ్ముతో నింపుతున్నారు.

చెరువును చెరబట్టి రాళ్లతో పూడ్చుతున్నారు.

చారిత్రక ఆనవాలు తుడిచేస్తున్నారు.

మంచినీటి చెరువును మట్టిలో కలిపేస్తున్నారు.

కాలుష్యకాసారం చేస్తున్నారు.

మత్స్య కారుల పొట్ట కొడుతున్నారు.

వారి జీవనోపాధిని ధ్వంసం చేస్తున్నారు.

నోటి కాడి కూడును లాగేసుకుంటున్నారు.

పర్యావరణం ప్రభుత్వాలకు పట్టడం లేదు.

చారిత్రక ఆనవాలు కాపాడాలన్న సోయి లేదు.

జీవన విధ్వంసమేనా అభివృద్ధి మంత్రం.

చరిత్రను కాపాడలేరు..ప్రజలను బతకనీయరు.

కొండ కోణల్లో ఏం దాగి వుందంటే చరిత్ర ఆనవాళ్లుంటాయని చెప్పుకునే వాళ్లు…కానీ ఇప్పుడు కొండ కోనల్లో గ్రానైట్‌ వుంటుంది. దాని విలువ కోట్లలో వుంటుంది. వ్యాపారం చేస్తే లెక్కలేనంత లాభం వస్తుంది. చరిత్రదేముంది చింపేస్తే చిరిగిపోతుంది. కొండను చూస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? తవ్వితే బంగారు కొండ మన సొంతమౌతుంది. అమ్ముకుంటే కోట్ల సొమ్ము వచ్చి పడుతుంది. కొండే, కదా! బండే కదా? అని పూర్వీకులు వదిలేసి, పర్యావరణం కోసం తపించారు. ప్రకృతిని కాపాడుకున్నారు. మరి ఇప్పుడు విధ్వంసమే అభివృద్ధి అవుతోంది. ప్రగతికి మార్గమౌతోంది. పరిమితికి మించి ఆదాయానికి వనరుగా మారుతోంది. కొండను తవ్వి అమ్ముకున్నా సంపదే…తర్వాత చదును చేసి బిల్డింగులు కట్టినా సంపదే…ప్రకృతి విధ్వంసమైతే మనకేంది… తర్వాత తరాలు ఏమైతే మనకేంది…ఇదీ గ్రానైట్‌ వ్యాపారుల ఆలోచన…

కొండకోనల్లో ఏం దాగి వుందంటే చరిత్ర ఆనవాళ్లున్నాయని నిన్నటి తరం గొప్పగా చెప్పుకునేది. కాని ఇప్పుడు కొండ కోనల్లో ఏముందంటే గనులున్నాయని, వాటిని అమ్మితే కోట్లొస్తాయని చెబుతున్నారు. వ్యాపారం లెక్కలేసి ఎంత లాభమొస్తుందో చెప్పేస్తున్నారు. చరిత్రదేముంది చింపేస్తే చిరిగిపోతుందనేంత గొప్పవాళ్లు తయారౌతున్నారు. కొండను చూస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? తవ్వితే బంగారమౌతుంది. అమ్ముకుంటే కోట్ల సంపద వచ్చి చేరుతుంది. కొండ, బండ కదా! ప్రకృతి సంపద కదా! అని నిన్నటి తరం కాపాడిరది. పర్యావరణం కాపాడుకున్నారు. చరిత్రను నిలబెట్టారు. తర్వాత తరాలకు మేలు చేశారు. కాని ఇప్పుడు విధ్వంసమే అభివృద్ది అనుకుంటున్నారు. కొండలు తవ్వి కోట్లు సంపాదిస్తున్నారు. బండలు అమ్ముకొని బడా వ్యక్తులౌతున్నారు. ఇదే ప్రగతి మార్గమంటున్నారు. అంతే కాదు నిన్నటిదాకా జనజీవనానికి అండగా వున్న కొండను కళ్లుముందే కరిగిస్తున్నారు. కొండ ఆనవాలు కూడా లేకుండా చేస్తున్నారు. అది కూడా వదిలేయడం లేదు. అక్కడ కూడా రియల్‌ వ్యాపారం సాగిస్తున్నారు. బిల్డింగులు కట్టేస్తున్నారు. ప్రకృతి దగ్గరకు వెళ్లాల్సిన మనుషులు, ప్రకృతిని దూరం చేసుకుంటూ, దాన్ని ఆక్రమించుకుంటూ పోతున్నారు. పచ్చని ప్రకృతి సంపద లేకుండా చేస్తున్నారు. ప్రకృతి విద్వంసమైతే మనకేంది…తర్వాత తరాలు ఏమైతే మనదేంపోతుంది? అదే గ్రానైట్‌ వ్యాపారుల ఆలోచనతౌతోంది. చేయడానికి వ్యాపారాలు ఎన్నో వున్నాయి. కాని గ్రానైట్‌ కొండలు తవ్వితేనే కోట్లొస్తున్నాయి. మరి ఇతర వ్యాపారాలెందుకు చేస్తారు. ప్రకృతి విధ్వంస పాపాలు ఎందుకు మూట గట్టుకుంటారు..
అది కరీంనగర్‌ జిల్లా…ఎలగందుల కోట..తెలుగు వారికి తొలి ఆనవాలు కరీంనగర్‌. తొలి రాజరికపు పునాదులు. శాతవాహన రాజులకు పుట్టిల్లు. ఎంత గొప్పది నా తెలంగాణ చరిత్ర అని గొప్పగా చెప్పుకోవడం కాదు. దాన్ని కాపాడుకోవాలి. కొన్ని వందల సంవత్సరాలు కాపాడి, ఇచ్చిన పూర్వీకులకు కృతజ్ఞత తీర్చుకోకుండా, రేపటి తరానికి శాపాలను మిగుల్చుతున్నాం. నెత్తుడి కూడుతో కడుపు నింపుకుంటున్నాం. మరో తరం నాశనానికి కారణమౌతున్నాం. చరిత్రకు సాక్ష్యాలు కాల చక్రంలో మునిగిపోవడం వేరు. కాల గమనంలో కనుమరుగవడం వేరు. కాని మనమే చరిత్రను ద్వంసం చేస్తే. విద్వంసానికి మనమే శ్రీకారం చుడితే వచ్చే తరానికి ఏం ఇస్తాం..ఏం మిగుల్చుతున్నాం..ప్రజలకు బాద వుంది. కాని పాలకులకు ఏం సోయి వుంది? అన్నదే ఇక్కడ మిగిలిన ప్రశ్న.
ఇప్పటి కరీంనగర్‌కు ఒకప్పుడు ఎలగందులు రాజధాని. రాజులేలిన భూమి. ఎగలందుల కోట. ఒక చరిత్రక ఆనవాలు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మర్చిపోయి, వ్యాపారం పేరుతో ప్రైవేటు వ్యక్తులు సంపదను దోచుకుంటున్నారు. పాలకులు సహకరిస్తున్నారు. సంపద వెలికి తీయకపోతే సమాజమెట్ల బతుకుందని అనేంత దర్మార్గం పెరిపోతోంది. సంపద సృష్టించాలని పెద్దలు కోరుకుంటే, సందప విద్వంసం చేసుకుంటూ ముందుకు పోతున్నాయి. కరీంనగర్‌కే తెలమానికమైన ఎలగందుల కోట చుట్లూ వున్న పరిసర గ్రామాలలో లెక్కలేనన్ని కొండలున్నాయి. వాటి కింద గ్రానైట్‌ బండలున్నాయి. కాని ప్రకృతి సందప. దాని మీద ఆధారపడి బతకాలే గాని, దాన్ని ధ్వంసం చేసి బతకొద్దు. దాని హద్దులు చెరిపేయోద్దు. దాన్ని కాలగర్భంలో కలిపేయొద్దు. కాని ఇక్కడ జరుగుత్నుది అదే. కొన్ని దశాబ్ధాలుగా ఈ కొండలను కొల్లగొడుతున్నారు. ఆఖరుకు ఎలగందుల అనే పేరునే చెరిపేస్తున్నారు. ఊరును వల్ల కాడు చేస్తున్నారు. చెరువును చెల్లా చెదరు చేస్తున్నారు. కోటను కనుమరుగు చేస్తున్నారు. చరిత్రకు సాక్ష్యంగా లేకుండా చేస్తున్నారు. పర్యావరణం పాడు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది.

కరీంనగర్‌కు ఆనుకొని వున్న గ్రామాలలో వున్న గ్రైనైట్‌ వ్యాపారులు, అక్కడి నుంచి తొలగించి తెచ్చిన బండలను ఎలగందుల చెరువు సమీపంలో శుద్ది చేస్తుంటారు. కట్టర్లసాయంతో వాటికి సానపెడుతుంటారు. అందుకు నీరు కావాలి. ఆ నీరు ఎలగందుల చెరువు నుంచి కావాలి. వ్యర్ధాలు వదిలేందుకు కూడా ఓ చోటు కావాలి. అది కూడా ఎలందుల చెరువే పనికొచ్చింది. గతంలో ప్రభుత్వాలు అనుమతినివ్వలేదు. రాను రాను అధికారుల నిర్లక్ష్యం, ముడుపుల బాగోతం, పాలకులకు అందే నైవేద్యాన్ని బట్టి సాగుతోంది. ఇప్పుడు చెప్పలేనంత దుర్మార్గం జరుగుతోంది.
గ్రానైట్‌ కట్టర్ల మూలంగా వెలువడే రాతిపొగ పల్లెల్లో పంటలు ముంచేస్తోంది. పంటలను నాశనం చేస్తోంది. ప్రజలను పగపడుతోంది. పర్యావరణం దెబ్బతింటోంది. చెట్లు ఎండిపోతున్నాయి. రోడ్లు నాశనమౌతున్నాయి. మనుషుల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. నేత్ర, శ్వాససంబంధ వ్యాధులు పెరిగిపోతున్నాయి. ఆఖరుకు అవి క్యాన్సర్‌గా మారిపోతున్నాయి. అయినా ఎవరికీ పట్టడం లేదు. అసలు సాధారణంగా ఏదైనా తగలబడితే వచ్చే పొగతోనే ఊరితిత్తులు చెడిపోతుంటాయి.. అలాంటిది గ్రానైట్‌ నుంచి వచ్చే సన్నని రాతి పొగ ప్రజల ఊపిరితిత్తుల్లో నిండిపోయి, ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడంలేదు. ఇదిలా వుంటే ఎలగందుల చెరువు అన్నది ఒక చారిత్రక ఆనవాలు. దాని ద్వారా కొన్ని వందల సంవత్సరాలు కరీంనగర్‌కు కూడా మంచినీటి వనరు. ఎల్‌ఎండీ నిర్మాణం జరక్కముందు ఆ చెరువే చుట్టుపక్కల గ్రామాలకు ఆదెరువు. కాని దాన్ని కూడా వదలడం లేదు. ఆ చెరువు మీద ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు జీవనం సాగిస్తుంటాయి. వారి జీవనోపాదిని కూడా దెబ్బతీస్తున్నారు. చురువు నీటిని వాడుకుంటూ చెరువులో గ్రానైట్‌ కటింగ్‌ తర్వాత మిగిలిన రాళ్లను, రప్పలను చెరువులో వేస్తున్నారు. చెరువు ఆనవాలు లేకుండా చేస్తున్నారు. అటు చెరువు నీటిపై తేలియాడుతున్న గ్రానైట్‌ పొడి, చెరువు చుట్టుపక్కల నుంచి చెరువును ముంచేస్తున్న రాళ్లతో త్వరలోనే చెరువు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి వుంది. చెరువు సగం ఇప్పటికే చెదిరిపోయింది. ఎక్కడ చూసిన గ్రానైట్‌ వ్యర్ధాలే దర్శనమిస్తున్నాయి. దాంతో మంచి నీటి చెరువు కాస్త మురికి చెరువగా మారిపోయింది. జలజీవవానికి ఆటంకం కలిగింది.
ఎలగందుల చెరువు మీద ఆదారపడి కొన్ని శతాబ్ధాలుగా ముదిరాజ్‌లు జీవనం సాగిస్తున్నారు. వారి జీవనోపాధి అయిన మత్య్స సంపద చేతికందకండా చేస్తున్నారు. వారి పొట్టకొడుతున్నారు. వారికి జీవనోపాదిని దూరం చేస్తున్నారు. వారి నోటి కాడ కూడును లాగేసుంకుటున్నారు. వృత్తిలో కడుపునింపుకునేవారికి ఆకలి పెంచి, వారి జీవితాన్ని దహించి, వ్యాపారులు కోట్లు సంపాదిస్తున్నారు. మత్స్య కారులను రోడ్డున పడేస్తున్నారు. ఒక్క గ్రానైట్‌ వ్యాపారి కోసం అటు రైతులను, ఇటు ముదిరాజ్‌ జీవితాలు దుర్భరం చేస్తున్నారు. వారికి జీవనోపాది లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వానికి పర్యావరణం పట్టడం లేదు. కోటను పర్యావరణ కేంద్రంగా సుందరీకరిస్తే, గ్రానైట్‌ వ్యాపారాలకు తావుండదు. అందుకే ఎలగందుల కోట శిధిలమౌతుంటే పాలకులు చోద్యం చూస్తున్నారు. తరతరాలకు చెరగని చిరునామగా వుండాల్సిన ఎలగందుల కోట, దాని పరిసరాల చరిత్ర, గ్రానైట్‌ సంపదను కాపాడాల్సిన బాద్యత పాలకులు విస్మరిస్తున్నారు. తాత్కాలిక సంపద కోసం, వారసత్వ సంపదలను నాశనం చేస్తున్నారు. జీవన వైవిద్యాన్ని ద్వంసం చేస్తున్నారు. ప్రకృతి కాపాడాల్సిందిపోయి, కనుమరుగు చేస్తున్నారు. పిడికెడు మంది వ్యాపారుల కోసం లక్షల మంది ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. వారి జీవితాలతో చెలగాటమాడుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఎలగందుల లాంటి కోటను సంరక్షించి, దానికి పూర్వ వైభవం తెచ్చిపెడితే, కొన్ని తరాల వరకు సందపను అందించే పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. ప్రకృతికి మనం కాపాడుకుంటే, జనజీవనాన్ని అది కడుపులో పెట్టుకుంటుంది. ప్రకృతిని ధ్వంసం చేస్తే జనాన్ని తనలో కలిపేసుకుంటుంది. ఇదే సత్యం. అది గ్రహించకపోవడం మన ఖర్మం. ప్రకృతి ప్రేమికులారా కళ్లుతెరవండి! పర్యావరణ వేత్తల్లారా..కదం తొక్కండి!! ముదిరాజ్‌లారా ముందడుగు వేయండి!!! చెరువు సకల సంపదలకు నెలవు. కాపాడుకుంటేనే బతుకు!! వ్యాపారులను తరిమేస్తేనే చెరువుకు రక్షణ..లేకుంటే లేకుంటే మీకు మీరే భక్షణ!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!