https://epaper.netidhatri.com/view/250/netidhathri-e-paper-1st-may-2024%09/3
`ఆవేశంలో నేటిధాత్రికి లీగల్ నోటీసులు పంపి ఇరుక్కుపోయింది?
`అమాత్యా…! కొందరు అధికారులు ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టిస్తున్నారు?
`ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు?
`డిప్యూటేషన్ల రద్దు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నారు?
`కులాన్ని అడ్డు పెట్టుకొని కుర్చీలలో తిష్ట వేసుకుంటున్నారు!
`వార్తలు రాసిన మీడియా మీద చిర్రుబుర్రులాడుతున్నారు!
`ఆరోగ్య శాఖ మంత్రిగారు ఈ వార్త చూడండి.
`గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుమున్న ఆ అధికారి!
`నేటిధాత్రి చెప్పింది ఒక ఉన్నతాధికారి..అని మాత్రమే చెప్పింది?
`కానీ ప్రధాన అధికారి ఉలికిపాటుతో స్పందించింది?
`డిప్యూటేషన్ ఆపుకొని మరీ కొలువు వెలగబెడుతోంది?
`ఎమ్మెల్యేల మద్దతుతో డిప్యూటేషన్ ఆపుకున్నది?
`ఆ విషయం తేల్చడానికి డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సమయం లేదట!
`విచారణకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సమయం కావాలట?
`ఒక ప్రభుత్వ అధికారి మీడియాకు లీగల్ నోటీసు పంపాలంటే పై అధికారి అనుమతి తప్పని సరి?
`డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అలాంటి అనుమతి ఏదైనా ఇచ్చారా?
`ఇలాంటి వైద్యాధికారుల మూలంగా బద్నాం అయ్యేది ప్రభుత్వమే!
`విమర్శల పాలయ్యేది వైద్య మంత్రిత్వ శాఖనే?
`రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి అధికారులను ‘‘మంత్రి పొంగులేటి’’ ఏరివేస్తున్నారు?
`వైద్య శాఖలో అవినీతి అధికారులను మంత్రి ఉపేక్షిస్తున్నారా? అన్న ప్రశ్నకు తావివ్వంకండి!
`తెలంగాణలో అందరికీ డిప్యూటేషన్లు రద్దైనా..శిరీషకు మాత్రమే ఎందుకు రద్దు కాలేదు?
`ఆమె వెనుక వున్న పెద్దలెవరు?
`ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నదెవరు?
`అవినీతి అధికారిపై చర్యలు తీసుకోలేనంత బిజీ డిహెచ్ కు ఏముంది?
`కనీసం విచారణకు ఆదేశించే సమయం ఎందుకు లేకుండా పోతోంది?
`ఇలాంటి అధికారుల వల్లే ప్రభుత్వం అబాసుపాలయ్యేది?
`వైద్య శాఖను ప్రక్షాళన చేయండి?
`ఏళ్ల తరబడి తిష్ట వేసిన వారిని కదిలించండి?
`వైద్య సేవలు వదిలేసి వ్యాపారాలు చేస్తున్న వారిపై దృష్టి పెట్టండి.
`ప్రైవేటు క్లినిక్‌లు పెట్టి ప్రజలను దోచేస్తున్నారు చూడండి?
`వ్యాపారాల పేరుతో ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న వారినుంచి …తిన్నది కక్కించండి!
`అవినీతి ఆపండి అంటే నేటిధాత్రికి లీగల్ నోటీసులా?
`ప్రజా పాలనలో వైద్య శాఖలో అవినీతి అధికారులకు పెద్ద పీటలా?
హైదరాబాద్,నేటిధాత్రి:
గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లే వుంది. చట్టం ఎవరికీ చుట్టంకాదు. అందులోనూ అవినీతి అధికారులకు అసలే కాదు. అన్యాయం చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదు. పరపతితో కొంత కాలం చట్టం చుట్టంలా కనిపించినా , న్యాయ స్ధానంలో తీర్పుతో నీళ్లేమిటో..పాలేమిటో నిజానిజాలు తేలిపోతాయి. అవినీతి బైట పడుతుంది. అయినా ఇక్కడ ముందు చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. నేటిధాత్రి రాసిన వార్త కథనం ఏదో కట్టు కథ కాదు. పిట్ట కథ అంతకన్నా కాదు. ప్రజలు పన్నుల నుంచి జీతాలు తీసుకుంటూ, ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై రాసిన వార్త. ఆ వార్తను సంబంధిత అధికారి జీర్ణించుకోలేకపోతే, అసలు పొరపాటే చేయకుండా వుండాలి. అవినీతికి పాల్పడకుండా వుండాలి? ఇక్కడ మరో ముఖ్యమైన విషయం. ఆ వార్తలో ఎక్కడా జిల్లా ముఖ్య వైద్యాధికారి అన్న పదం లేదు. జిల్లాలో ఉన్నతాధికారి అన్న పదాన్ని మాత్రమే వాడడం జరిగింది. మరి ఏ ఉన్నతాధికారి ఆ నేటిధాత్రి వార్తకు స్పందించలేదు. కేవలం ఒక్క డాక్టర్. శిరీష మాత్రమే స్పందించింది. ఆ వార్త తన గురించే అని తనకు తానే నిర్ధారించుకున్నట్లుంది. అందుకే నేటిధాత్రికి లీగల్ నోటీసులు పంపించింది. ఆ వార్తలో వున్నది నేనే అని డాక్టర్. శరీష స్వయంగా ప్రకటించుకున్నటైంది. అంటే అవినీతికి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లే అయ్యింది. ఇంకా లీగల్ నోటీసులకు తావెక్కడుంది. సరే..నోటీసులు పంపించారు…పత్రికలున్నవే సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నించడానికి! అవినీతిని ఎండగట్టడానికి! అసమానతలు రూపు మాపడానికి! అంతే కాని అధికారులు అవినీతిని చూస్తూ ఊరుకోవడానికి కాదు. అవినీతిని ఏ మీడియా ఉపేక్షించదు. తన అక్షరాలతో అవినీతి పరులను సమాజం ముందు దోషులుగా నిలబెడుతుంది. ఉన్నత విద్యావంతులకు ఈ మాత్రం తెలియదా? జిల్లాలో ఎంతో మంది వైద్యాధికారులున్నారు. కాని తనకు తానే…అది నేనే అని డాక్టర్. శరీష్ ఎందుకు స్పందిచించనట్లు? ఆ అధికారి అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? అవినీతికి పాల్పడినప్పుడు ఆత్మాభిమానం గుర్తు రాలేదా? ఆత్మగౌరవం అడ్డు రాలేదా? అసలు ఇక్కడ తేలాల్సింది అవినీతి జరిగిందా? లేదా? అన్నదే ప్రధానాంశం. మేం అవినీతి చేసుకుంటూ పోతాం..వార్తలు రాస్తే మీడియా మీద పరువు నష్టం దావా వేస్తాం…లీగల్ నోటీసులు పంపిస్తామంటే తప్పు, ఒప్పుగా మారుతుందా? అన్యాయం మాసిపోతుందా?
అవినీతి మీద వార్తలు రాయొద్దా? అన్యాయాలను ప్రశ్నించొద్దా?
అసలు వార్తల్లో వాస్తవాలు లేకుంటే మీడియా ముఖంగా ఖండిరచుకునే అవకాశం వుంది. ప్రభుత్వాధికారులంటే జవాబుదారులు కాదా? వారు చేసే అవినీతిని ఉపేక్షించాలా? ఆత్మాభిమానం డాక్టర్.శీరీషకుమాత్రమే వుంటుందా? ఆమె వల్ల నష్టపోయిన ఉద్యోగులకు లేదా? ఆమె ద్వారా కులం పేరుతో దూషిణలు ఎదుర్కొన్నవారిది ఆత్మ గౌరవం కదా? వారిని కనీసం మనుషులగా చూడా పరిగణించాలన్న ఆలోచన వుండొద్దా? జిల్లాలోని ఆసుపత్రులకు వెల్ల వేసేందుకు వచ్చిన నిధులు దుర్వినియోగం కాలేదా? కాకుంటే ఆ లెక్కలు బైట పెట్టండి? అది జిల్లా ఉన్నతాదికారిగా డాక్టర్. శిరీష బాధ్యత. కేంద్ర ప్రభుత్వ నిదులు దుర్వినియోగం కాలేదని ఎందుకు చెప్పడం లేదు? తెలంగాణ వ్యాప్తంగా వైద్య శాఖలో డిప్యూటేషన్లు రద్దు చేసినా, డాక్టర్. శిరీష అక్కడే ఎలా ఉద్యోగం చేస్తోంది. ఆమెకు నిబంధలను వర్తించవా? ప్రభుత్వ ఆదేశాలు బేకాతరు చేసినట్లు కాదా? ఒక వేళ ఆమెకు మాత్రమే ప్రత్యేకంగా ఏదైనా జీవో ఇచ్చారా? వుంటే అది బహర్గితం చేయొచ్చు కదా? ప్రభుత్వం మారిన తర్వాత నిబంధనలకు వ్యతిరేకంగా విధులు నిర్వర్తించడాన్ని మీడియా ప్రశ్నించదా? అలా ప్రశ్నిస్తే ఆత్మ గౌరవం దెబ్బతింటున్నట్లా? ప్రజా జీవితంలో వున్నవారు, ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్నవారు ఖచ్చితంగా జవాబు దారీ తనంగా వుండాలి.
ఇక్కడ డాక్టర్.శిరీష్ కొన్ని ప్రశ్నలకు సమాదానం చెప్పాల్సిన అవసరం వుంది.
నేటిధాత్రి రాసిన వార్తను తనకు తానుగానే స్వయంగా ప్రకటిం చుకున్న డాక్టర్. శిరీష వివరణ ఇవ్వాల్సిన బాద్యత విస్మరించింది. తన బాద్యతను తప్పించుకునే క్రమంలో నేటిదాత్రికి లీగల్‌నోటీసులు పంపించారు. నేటిధాత్రి మీద పరువు నష్టం దావా వేస్తే నిజం అబద్దమౌతుందా? చేసిన అక్రమాలు సక్రమాలౌతాయా? అంతే కాకుండా నేటిదాత్రి వార్త అధికారి విధినిర్వహణ గురించే తప్ప వ్యక్తిగతం కాదు. ఆ కుర్చీలో కూర్చున్నవారిగానే పరిగణించాలి. అందుకు ఆడ, మగ, కులం, మతం, బాషా బేదాలుండవు. మహిళా ఉద్యోగి అవినీతి సాగిస్తుంటే మీడియా చూస్తూ ఊరుకోవాలా? నిజానికి ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా అవినీతికి పాల్పడడం నేరం. ఆ మాత్రం తెలియకుండానే నిధులు పక్కదారి పట్టించారా? నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టు అప్పగించారా? అది నేరం కాదా? ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రజల్లో సరైన అభిప్రాయం లేదు. కేవలం కొందరు అవినీతి పరుల మూలంగా మొత్తం ఉద్యోగ సమాజమే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు తీసుకుంటూ, ప్రజలను పీడిరచుకుతింటున్న వాళ్లున్నారు. అలాంటి వారిని ఏరి వేయడం, వారి అవినీతిని వెలుగులోకి తేవడం మీడియా కర్తవ్యం. అవినీతి పరులను పట్టించడమే కాదు, నిజాయితీ పరులను కాపాడడం కూడా నేటిదాత్రికి తెలుసు. ఇటీవల కొందరు ఉద్యోగులు సమావేశాన్ని తప్పు పడుతూ ఎన్నికల సంఘం వారిపై వేటు వేసింది. అప్పుడు ఆ ఉద్యోగులకు అండగా నిలిచింది నేటిదాత్రి మాత్రమే. ఆ ఉద్యోగుల కొలువులు మళ్లీ తెప్పించడంలో నేటిధాత్రి కీలక భూమిక పోషించింది. ఎన్నికల సంఘం నిర్ణయంలో లోపం వుందని తెలియజేయడం జరిగింది. ఇదీ నేటిదాత్రి అక్షరానికి వున్న విలువ.
తప్పుచేసిన వాళ్లే వితండ వాదం చేస్తారు. ఇదే ఉద్యోగులను మరింత కష్టాల్లోకి నెట్టేస్తుంది.
తప్పు చేస్తున్నారని హెచ్చరించే మీడియాను ఎప్పుడైతే తప్పు పడతారో అప్పుడే వారి గోతి వారు తీసుకుంటున్నట్లు లెక్క. గతంలో ఓ సబ్ రిజిస్ట్రార్ పైకి సమాజ సేవకురాలిగా పేరు కోసం పాకులాడుతూ, విచ్చలవిడి అవినీతికి పాల్పడిరది. ఆ విషయం నేటిధాత్రి వెలుగులోకి తెచ్చింది. వరుస కధనాలు రాయడం జరిగింది. నా అవినీతిని నిరూపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని ప్రకటించింది. నేటిధాత్రి మూలంగా ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటూ లీగల్ నోటీసులు కూడా పంపించింది. ఆఖరుకు ఏసిబికి పట్టుబడిరది. ఆమె కూడబెట్టిన ఆస్ధులన్నీ వెలుగులోకి వస్తున్నాయి. అమాయకులను కూడా పీడిరచుకొని తిన్న ఆమె అవినీతి బండారం మొత్తం బైపడిరది. ఇప్పుడు ఆమె బాధితులంతా రోడ్డెక్కుతున్నారు. వారికి జరిగిన అన్యాయం గురించి చెబుతున్నారు. ఆనాడు నేటిధాత్రి రాసిన ప్రతి అక్షరం నిజమైంది. ఆమె ఆస్దులు చిట్టా మొత్తం బైటపడిరది. అలా ఎంతో మంది రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల గురించి నేటిధాత్రి రాయడం జరిగింది. వాళ్లపై విచారణలు అనేకం జరుగుతున్నాయి. అదీ నేటిధాత్రి అక్షరం నిబద్దత. అంతే గాని చేసేదిచేస్తాం…అవినీతిని ప్రశ్నిస్తే నోటీసులిస్తామనే వారిని నేటిధాత్రి ఇరవై ఏళ్లలో ఎంతో మందిని చూసింది. వారి జీవితాలు సమాజం ముందు నిలిపింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. జిల్లా వైద్యాధికారి వల్ల నష్టపోయిన, జీవితాలు ఆగమైన చిరుద్యోగులు నేటిధాత్రికి చెప్పుకొని తన గోడు వెళ్లబోసుకున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. జరుగుతున్న అక్రమాలపై వివరాలు అందించారు. గిరిజన బిడ్డలను ఎలా సంబోదిస్తారో..పూ స గుచ్చినట్లుచెప్పారు. అవే విషయాలను, వివరణాత్మకంగా నేటిధాత్రి పాఠకుల మందుంచింది. ఆ వార్త డాక్టర్. శిరీషకు నచ్చలేదు. నోటీసులు పింపించారు. నోటీసులు పంపించినంత మాత్రాన అవినీతి మాసిపోతుందా? అక్రమాలు వెలుగుచూడకుండా వుంటాయా? ఉద్యోగ నిర్వహణలో అవకతవకలకు పాల్పడడం నేరం. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేయడం అంతకన్నా నేరం. ప్రభుత్వ వైద్య సేవలందించే గురుతర బాద్యతలో వుండి, సేవకు ప్రాదాన్యత నివ్వకపోవడం తప్పు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ, ప్రైవేటు ఆసుపత్రి నిర్వహణ చట్ట విరుద్దం. ఇవన్నీ తప్పులు కళ్లముందు కనిపిస్తుంటే… మీడియా ప్రశ్నించదా? వార్తలు ప్రచురించదా? అయినా ఒక ప్రభుత్వాధి కారి మీడియాకు లీగల్ నోటీసులు పంపాలంటే పై అధికారుల అనుమతి తప్పనిసరి. మరి సంబంధిత అధికారికి ఏ అధికారి అనుమతినిచ్చాడన్నది కూడా తేలాల్సివుంది.
అమాత్యా…కొంతమంది వైద్యాధికారులు ఆరోగ్యశాఖను భ్రష్టుపట్టిస్తున్నారు…?
ఒక్కసారి సమీక్ష నిర్వహించడండి. ప్రభుత్వ ఆదేశాలను బేకాతరు చేస్తూ, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఏళ్ల తరబడి కుర్చీలను అంటిపెట్టుకుంటున్నారు. డిప్యూటేషన్ల మీద వచ్చి కూడా సంవత్సరాల కొద్ది పాతుకుపోతున్నారు. వారిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దుచేసింది. భద్రాద్రి జిల్లా వైద్యాధికారికి మాత్రం ప్రభుత్వ ఆదేశాలు చెల్లవా? ప్రభుత్వమేమైనా ఆ అదికారి కోసం నిబంధనలు సడలిలించిందా? ప్రత్యేకంగా జీవోలు ఏమైనా జారీ చేసిందా? అంతే కాదు కులాన్ని అడ్డం పెట్టుకొని కుర్చీలో తిష్టవేసుకొని కూర్చుంటున్నారు. గత ప్రభుత్వంలో ఆ అధికారి కుల పెద్దల ఆశీస్సులతో ఇంత కాలం సాగారు. ఇప్పుడు కూడా అదే కులపెద్దలు అండతో అక్కడే కొనసాగుతున్నారు. డిప్యూటేషన్ వర్తించకుండా నిబంధనలు పాతర వేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ దృష్టికి తీసుకెళ్తే ఆయన సమయం లేదంటూ దాట వేస్తున్నారు. అంటే ఎక్కడో తేడా కొడుతోంది. ప్రభుత్వాధికారులు ఒకే చోట పాతుకుపోవడానికి కారణం ఏమిటి? అందులోనూ వైద్య సేవలు అందించే వ్యవస్ధలో ఒకే చోట పని చేయడం ఏమిటి? వైద్య రంగం సేవ రంగంలో ఎంతో గొప్పది. అందులో ఎంతో మంది గొప్ప గొప్ప వైద్యులు ప్రజలకు సేవలందిస్తున్నారు. అలాంటి వ్యవస్ధ కొంత మంది వల్ల అబాసుపాలౌతోంది. ప్రజాస్వామ్య వ్యవస్ధలో అధికారులకు మితిమీరిన స్వేచ్చ అంత మంచిది కాదు. ప్రభుత్వాలెప్పుడూ కొంత మంది అధికారుల తీరు వల్ల కూడా బద్నాం అయిన సందర్భాలు కోకొల్లలు. అవినీతి అదికారుల మూలంగా ప్రజలు పార్టీలను తిరస్కరించిన సందర్భం బిఆర్ఎస్ విషయంలో చూశాం. ఏ ప్రభుత్వంలో అదికారులు ఎక్కువ నిజాయితీగా పనిచేస్తారో ఆ ప్రభుత్వంపై ప్రజలు ఎక్కువ విశ్వాసం పెంచుకుంటారు. గత బిఆర్ఎస్ తెచ్చిన ధరణి మూలంగా అటు రెవిన్యూ, ఇటు రిజిస్ట్రేషన్ శాఖల అదికారుల తీరుతో ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. అది పరోక్షంగా బిఆర్ఎస్ మీద తీవ్ర ప్రభావం చూపింది. అలా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగకూడదనుకుంటే అధికారుల తీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తుండాలి. అవినీతికి పాల్పడిన అదికారులను ఉపేక్షించొద్దు. తాజగా రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతికి పాల్పడిన అధికారులపై సంబంధింత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొరడా రaులిపిస్తున్నారు. ఆ శాఖను ప్రక్షాళన చేస్తున్నారు. అలాగే ప్రజల జీవితాలతో ముడిపడిన ఆరోగ్య శాఖపై కూడా మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టిపెట్టి, వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారిని గుర్తించాలి. మీడియాలో వస్తున్న వార్తలను పరిగణలోకి తీసుకొని ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి. తమకు ఎదురులేదు..మంత్రుల అండదండలు వున్నాయని ప్రచారం చేసుకొనే కొంత మంది అధికారులు కొన్నేళ్లుగా తిష్ట వేసుకొని వుంటున్నారు. గత ప్రభుత్వంలో పెద్దల ఆశీస్సులతో తిష్ట వేసుకున్నవాళ్లే, కొత్త ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నారు. కొత్త ప్రభుత్వంలో మంత్రులను కూడా ప్రసన్నం చేసుకుంటున్నారన్న అపవాదులు వస్తున్నాయి. అలాంటివి విసృత ప్రచారం కాకముందే, పాతుకుపోయిన వారిని తప్పించే ప్రయత్నం చేయండి. ఏ అధికారి రెండేళ్ల కంటే ఎక్కువ కాలం కొనసాగ కూడదు. కాని వైద్య శాఖలో కొంత మంది కొన్నేళ్లుగా పాతుకుపోయినవారున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి వారి డిప్యూటేషన్లు రద్దు చేయబడ్డాయి. కాని కొందరు వెరీ వెరీ స్పెషల్ అన్నట్లు కొనసాగుతున్నారు. పైగా వారి ఆగడాలపై వార్తలు రాస్తే లీగల్ నోటీసులు పంపిస్తున్నారు. అంటే వారి వెనక ఈ ప్రభుత్వ పెద్దలు కూడా వున్నారా? అన్న అనుమానం కలుగకమానదు. కాస్త భద్రాద్రి జిల్లా వైద్య శాఖ మీద దృష్టిపెట్టండి. మీడియా కథనాలు చూడండి. ప్రక్షాళన చేయండి.