వె(వే)స్ట్ అయిపోయింది! ఈస్ట్ కొచ్చింది!!

https://epaper.netidhatri.com/view/281/netidhathri-e-paper-31st-may-2024%09/3

అసలు రియల్‌ గుట్టు…ఆంద్రా, తెలంగాణల మధ్య చెరగనున్న హద్దు.

తెలంగాణ మీద పెత్తనానికి ఈస్ట్‌ తొలిపొద్దు.

వెస్ట్‌ పెరిగేందుకేమీ లేదా!

ఎక్కడైనా ఈస్ట్‌ నుంచి వెస్ట్‌ కెళ్తారు.

ఇక్కడ వెస్ట్‌ నుంచి ఈస్టుకెందుకొస్తున్నారు.

ఇంతకాలం ఈస్ట్‌ ఎందుకు పనికి రాలేదు.

ఇప్పటికిప్పుడు ఈస్ట్‌పై తొందరేమొచ్చింది!

వెస్ట్‌ లో స్థలాలు లేవా!

ఆంధ్రా పెత్తందారుల చేతికి పని పడిరది.

పదేళ్ళు అనుకూలించని కాలం ఇప్పుడు చేతికొచ్చింది.

మళ్ళీ రియల్‌కు రెక్కులు తొడిగే కాలమొచ్చింది.

సామాన్యడి జేబుకు చిల్లుపడే తరణం రానే వచ్చింది.

వెస్ట్‌లో కొన్న వాడి ఖర్మ కాలింది.

అమ్ముకున్న వాడి పంట పండిరది.

అక్కడ కొనే దిక్కులేదు…అమ్ముకునే అవకాశం లేదు.

వ్యాపారం ఆగడం పెద్దలకిష్టం లేదు.

ఈస్టునుంచి మొదలుపెడితే పోయేదేమీ లేదు.

లాభమెంతొచ్చినా ఇప్పటికి ఫరవాలేదు.

ముందు ముందు బండి సాగేందుకు దిగులు లేదు.

రెండు రాష్ట్రాల మధ్య దూరం తగ్గితే చాలు.

ఏనాటికైనా కలవాలంటే ఈ పునాదులే మేలు.

ఆంధ్రా వాళ్ల ఆలోచనలు ఆరు తరాల ముందే పరుగులు పెడతాయని అంటారు. ఇది చాలా మందికి తెలియని విషయం. అందుకే చెన్నై నుంచి తరిమేశారు. చెన్నై మాకే కావాలని ఆనాడు కోరారు. ఇప్పుడు హైదరాబాద్‌ మాదే అని చెప్పడానికి మరో రంగాన్ని సిద్దం చేసుకుంటున్నారు. దాని పేరే రియల్‌ ఎస్టేట్‌..ఈస్టు సిటీ బిల్డప్‌. అవును…సామాన్యంగా ప్రజలు అంత దూరం ఆలోచించరు. ఎవరికీ తెలియకుండానే ఊడ్చేయాల్సిందంతా ఊడ్చేసుకుంటారు. ఇది గత అనుభవాలు నేర్పుతున్న పాఠం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన సత్యం. ఇప్పుడు వెస్ట్‌ పని అయిపోయింది. ఈస్టులో పని మొదలు పెడదామనుకుంటున్నారు. ఈస్ట్‌ సిటీ డెవలప్‌ చేయాలనుకుంటున్నారు. అంటే హైదరాబాద్‌`విజయవాడ మధ్య దూరం తగ్గించాలనుకుంటున్నారు. ఇదీ అసలు రహస్యం. మరి ఈ ఆలోచన గతంలో ఎందుకు చేయలేదన్న సందేహం అందరికీ వస్తుంది. ఆంధ్రా నుంచి ఒకప్పుడు ఎల్‌బినగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్త పేట ఏరియాల్లో చేరిపోయారు. కాని అక్కడ ఉపాది లేదు. సినీ రంగం అక్కడికి చేరుకోలేదు. గత ప్రభుత్వాలు సినీ పరిశ్రమ పెద్దల కోసం ఇచ్చిన స్దలాలు ఇటు వైపు లేవు. పైగా ఇటు వైపు ఉపాది లేదు. గతంలో వున్న పరిశ్రమలన్నీ వెస్ట్‌వైపే వున్నాయి. దాంతో ఆ ప్రాంతాల్లో పాగా వేస్తే అటు ఉపాది లబిస్తుంది. తెలంగాణ ప్రజానీకానికి కొంత దూరంగా వున్నట్లు వుంటుంది. ఎందుకంటే ఆంధ్రా ప్రాంతం వారికి హైదరాబాద్‌ కావాలి. కాని తెలంగాణ వారితో అంటకాగడం నచ్చదు. పైగా తెలంగాణ మీద పెద్దనం చేయాలంటే దూరంగానే వుండాలి. అందుకే ఎల్‌బినగర్‌ నుంచి ముందుకు వెళ్లకుండా వెస్ట్‌ వైపు వచ్చారు. కూకట్‌ పల్లి నుంచి పటాన్‌చెరు వరకు చేరిపోయారు. ఇప్పుడు అక్కడ నుంచి ఇతర పరిశ్రమలు తరలిపోయాయి. ఒక్క ఐటి మాత్రమే మిగిలింది. ఇంతలో తెలంగాణ వచ్చింది. పెద్ద చిక్కొచ్చి పడిరది. తెలంగాణ ఉద్యమం ఎంత ఉదృతంగా సాగినా నల్లగొండ వైపు అంత పెద్దగా ప్రభావం పడలేదు. ఖమ్మంలో ఆ ఆనవాలు కనిపించలేదు. ఎంత బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మణికొండ, షాద్‌ నగర్‌దాక చేరినా తెలంగాణ, ఆంధ్రా ప్రజల మద్య విభజన రేఖ అలాగే వుండిపోయింది. తెలంగాన ప్రజలతో మమేకమైపోయేంత సాంస్కృతిక సహజీవనం సాగలేదు. దాంతో తెలంగాణ రాష్ట్రంలో ఎంత భద్రతగా వున్నా, కొలువులన్నీంటిలో సింహభాగంలో వున్నా ఎక్కడో వెలితి వారిలో వుండనేవుంది. అదే ఇప్పుడు ఈస్ట్‌ సిటీ పేరుతో కొత్త నాటకానికి తెరలేస్తోంది.
నిజానికి కూకట్‌ పల్లి ప్రాంతాలలో ఆంద్రా ప్రాంతానికి చెందిన ప్రజలు చేరుకున్న సమయంలో తెలంగాణ ఉద్యమం వస్తుందనిగాని, తెలంగాణ ఆవిర్భవిస్తుందనికాని అంచనాలు లేవు. తెలంగాణలో తెలుగుదేశం బలంగా పాతుకుపోయింది. తెలంగాణ అన్న పదం కూడా వినిపించకుండా చంద్రబాబు చేశాడు. కాంగ్రెస్‌లో పెత్తనమంతా సీమాంధ్రులదే సాగడం వంటి రాజకీయాలు చూసిన వారికి తెలంగాణ వస్తుందన్న నమ్మకం ఏ కోశాన లేదు. తెలంగాణ ఉద్యమం అన్నది నిరంతరం ఎన్ని దశాబ్ధాలు సాగినా నెరవేరని కలగానే మిగిలిపోతుందనుకున్నారు. కాని కాలం తిరబడిరది. ఇదిలా వుంటే ఆంద్రా ప్రాంత వాసులు, వ్యాపారులు, నాయకులంతా వెస్ట్‌ వైపు రావడంలో మరో కారణం వుంది. మంచీనీటి కొరత. అందులోనూ నల్లగొండ వైపు ఆనుకొని వున్న ప్రాంతాలన్నీ ఆఖరుకు హైదరాబాద్‌ ఈస్ట్‌ ప్రాంతాలన్నీ ఫ్లోరైడ్‌ నిండిన ప్రాంతాలు. ఆ నీళ్లు కూడా ఆంద్రా ప్రాంత ప్రజలను వెస్ట్‌ వైపు వెళ్లేలా చేసింది. కాని ఇప్పుడు హైదరాబాదే కాదు, తెలంగాణ మొత్తం నీళ్లకు కొరత లేదు. ఫ్లోరైడ్‌ జాడ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం లాంటి జిల్లాల్లో ఫ్లోరైడ్‌ సమస్య వుంది. కాని తెలంగాణలో ఫ్లోరైడ్‌ భూతం పారిపోయింది. దానికి తోడు మళ్లీ సమైక్య రాగం అందుకునేందుకు మరో తరం సిద్దమయ్యందుకు తెరమీదకు వచ్చిందే ఈస్ట్‌ సిటీ. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ తెలుగుదేశం అదికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయన్న బలమైన ప్రచారం సాగడంతో ఆంద్రా రియలెస్టేట్‌ వ్యాపారులకు ధైర్యమొచ్చింది. మళ్లీ తమ వ్యాపారాలకు ఢోకాలేదన్న బలం ఏర్పడిరది. అటు స్వామి కార్యం, ఇటు స్వకార్యం రెండూ నెరవేరే అవకాశం వుంటుంది. నల్లగొండకు చెందిన నేతల చూపు కూడా ఆంద్రావైపే వుంటుంది. నిజానికి అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఎంచుకొని గుంటూరు..విజయవాడల మధ్య రాజధానితో ఆ రెండు జిల్లాలు కలిస్తే హైదరాబాద్‌ కంటే పెద్ద రాజదాని అవుతుందని అనుకున్నారు. కాని జరగలేదు. ఇక ఇప్పుడు అది సాధ్యం కాదు. హైదరాబాద్‌ ఇంతలా అభివృద్ది జరుగుతుందని ఏ అంధ్రా నాయకుడు కలగనలేదు. అసలు తెలంగాణ విఫల రాష్ట్రంగా చూపించాలని అనేక సార్లు ప్రయత్నాలు చేశారు. కాని కుదరలేదు. అమరావతి అభివృద్ది ముందట పడలేదు. జగన్‌ వచ్చి అమరావతిని ముట్టుకోలేదు. ఆయన విశాఖ వైపు చూశారు. విశాఖ రాజధాని జనానికి పెద్దగా నచ్చలేదు. తిరుపతి నుంచి విశాఖ వెళ్లాలంటే సాద్యం కూడా కాదు. అందుకే మళ్లీ చంద్రబాబు వస్తే, అమరావతి తెరమీదకు వస్తుంది. విజయవాడ..గుంటూరుకు పూర్వ వైభవం వస్తుందని అనుకున్నారు. ఇప్పుడు ఆలోచన కూడా పక్కన పెట్టి విజయవాడను పెంచుకుంటూ పోతే కోదాడ దాక లాక్కొస్తే చాలు, రెండు రాష్ట్రాల మధ్య దూరం తగ్గుతుంది. అగాధం కూడా పూడుకుపోతుంది. అందుకు ఈస్ట్‌ సిటీ అభివృద్ది నమూనాతో అడుగులు వేస్తే ఈ తరంలోనే రెండు రాష్ట్రాల మధ్య కలయికకు దారి పడినట్లే అంటున్నారు.
ఎలాగూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మార్కు పాలన సాగాలనుకుంటున్నారు. అన్నీ ప్రత్యేకతలతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఎన్నికలకు ముందే ఈ విషయం స్పష్టంగాచెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఈస్ట్‌వైపు 50వేల ఎకరాలు సేకరించి కొత్త నగరాన్ని నిర్మాణం చేస్తామన్నారు. అంటే ఆయన పాలనలో కొత్త నగరంతోపాటు, తెలంగాణకు చెందిన కొత్త పాలనా కేంద్రాలు కూడా వచ్చే అవకాశం వుంది. అంటే భవిష్యత్తులో శీఘ్రంగా ఈస్ట్‌ సిటీ విస్తరిస్తే కొత్త అసెంబ్లీ భవనం నిర్మాణంలోకి రావొచ్చు. అది ఈస్ట్‌సిటీలో నిర్మానం జరగొచ్చు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చెప్పినట్లు సెక్రెటెరియేట్‌ను కూడా ఈస్ట్‌ సిటీ వైపు తరలించి అక్కడ కూడ మరో సచివాలయం నిర్మాణం జరగొచ్చు. తమిళనాడులో కరుణానిది నిర్మాణం చేసిన సెక్రెటెరియేట్‌ను జయలలిత ఆసుపత్రిని చేసిన సందర్భం చూశాం. ఇక్కడ కూడ నిమ్స్‌కు మరో ప్రత్నాయంగా పెద్ద ఆసుపత్రి భవనంగా ప్రస్తుత సెక్రెటెరియేట్‌ను వినిగించుకోవచ్చు. లేకుంటే ప్రస్తుతం బీబీనగర్‌లో వున్న నిమ్స్‌కు, పంజాగుట్టలో వున్న నిమ్స్‌ను అక్కడికి తరలించే అవకాశం ఏర్పడొచ్చు. ఇలా ఈస్ట్‌ను పెంచితే పదేళ్లలో మరో నగరం రూపుదిద్దుకోవచ్చు. అప్పుడు సమైక్య భావనలు మళ్లీ చిగురింపజేయొచ్చు. రియల్‌ దందాలో నయా స్కెచ్‌ అన్న సంకేతాలు అందుతున్నాయి. అందుకే తెలంగాణకు చెందని మేదావులు ముందే హెచ్చరిస్తున్నారు. మరి పెరిగిన వెస్ట్‌ సిటీ వేస్టేనా? అంటున్నారు. ఎందుకుంటే వెస్ట్‌ సిటీని ఎంత పెంచినా అక్కడ సమైక్య భావనలు చిగురింపజేయడం అసాద్యం. ఉమ్మడి రాష్ట్రంలో ఎండిపోయిన పాలమూరుకు ఆ ఆశలు లేవు. సమైక్య బావనలు పెంచినా తెలంగాణ భావనను తప్పించలేరు. నైజాం కాలంలో గాని, తర్వాత మలి దశ తెలంగాణ ఉద్యమంలోగాని పాలమూరు పాత్ర గొప్పది. సురవరం సుదాకర్‌ రెడ్డి నుంచి మొదలు, అనేక మంది వైతాళికులు పాలమూరు నుంచే వచ్చారు. తెలంగాణ సాహిత్యానికి,ఉద్యమ రూపకల్పనకు పాలమూరు వేదికయ్యింది. ఆంద్రాకు దూరంగానే వుంది. అందువల్ల వెస్ట్‌లో సమైక్య భావనలు పురుడు పోసుకోవడం కల్ల. ఈస్ట్‌లో ఇప్పుడు కాకపోయినా మరి కొంత కాలమైనా రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య దూరం తగ్గితే కలవాలన్న కోరిక కలగొచ్చు. మళ్లీ తెలుగు జాతి మనది అని పాడుకోవచ్చు. అందుకే ఇప్పటినుంచి ఈస్ట్‌ సిటీకి పరుడు పోయొచ్చు…ఇదీ మ్యాటర్‌…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!