మాయా ప్రపంచపు మైనింగ్‌ రాజ్యం ఎపిసోడ్‌ – 3

`అక్రమ మైనింగ్‌… లెక్కలేనంత బ్లాస్టింగ్‌!

`పిఎస్‌ఆర్‌ దుర్మార్గం.. చట్టాలంటే లెక్కలేని తనం

`రైతులకు ఎర…పర్యావరణం పాతర.

`చూపించే లెక్కలు వేరు…మైనింగ్‌ వందల ఎకరాలు.

`రైతుల వేధన…అరణ్య రోధన.

`అసైండ్‌ ఆక్రమణల్లో…వ్యవస్థలు గుప్పిట్లో.

`ప్రశ్నిస్తే దాడులు…బాదితులపైనే కేసులు…

`నిబంధనలకు ఉల్లంఘన…అధికారులకు సమర్పణ.

`అసైండ్‌ భూములు…రైతులకు బెదిరింపులు.

`బాంబుల మోత… పన్నులు ఎగవేత

`పల్లెల్లో భయం.. భయం… యదేచ్చగా బ్లాస్టింగ్‌.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అది ఉద్యమాల ఖిల్లా…కరీంనగర్‌ జిల్లా….చైతన్యవంతమైన ప్రాంతం. ఆకలి తాండవించే ప్రదేశం. ఉపాది లేక ఊళ్లు వదిలి దుబాయ్‌ లాంటి దేశాలకు జనం వలస వెళ్లే జిల్లా. బొంబాయి, పూనా, షోలాపూర్‌ వంటి ప్రాంతాలకు వెళ్లి బతికిన జిల్లా. తలాపున గోదారి పారుతుంది. కాని గుక్కెడు నీళ్లు అందని కాలం. యువత అడవుల బాట పట్టి తెలిసీ తెలియని వయసులోనే జీవితాలు తెల్లారిన జిల్లా. ఇన్ని బాధలున్న జిల్లా చుట్టూ ఎంతో జాతి సంపద వుంది. భూగర్భం నిండా గ్రానైట్‌ వుంది. ఏం లాభం. ఆ ప్రాంత వాసులకు పెద్దగా ఉపాధి అందిందిలేదు. వ్యవసాయం సాగింది లేదు. ఓ యాభై ఏళ్ల క్రితం అక్కడి దళిత ప్రజలకు కొన్ని శతాబ్దాలుగా తినడానికి తిండి లేని విగతజీవులుగా బతుకులీడుస్తున్నారు. సమాజంలో కలువలేకపోతున్నారు. భూములు లేక పనులు లేక పస్తులుంటున్నారు. దాంతో అప్పటి ప్రభుత్వాలు వారికి ఓ దారి చూపాలని, ప్రభుత్వ భూములు పంచింది. కాని చుక్క నీరు లేదు. బావులు తొవ్వుకునే శక్తి వారికి లేదు. తొవ్వుకున్నా నీరు పడే చాన్స్‌లేదు. వర్షాకాలంలో ఏవో వర్షాదార పంటలు పండిరచుకోవడం, జీవితాలు గడపడం జరుతుతోంది. కరువు తాండవమాడే ఆ జిల్లాలో భూముల కింద బంగారం కన్నా బరువైన, ఖరీదైన గనులున్నాయి.
లక్షల కోట్ల మైనింగ్‌ సంపద వుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన గ్రానైట్‌ వుంది.
ఈ విషయం అమాయకులైన దళితులకు తెలియదు. తమ భూముల్లో వున్న గుట్టలకు, రాళ్లకు విలుందని ఎంతో విలువుందని తెలియదు. ప్రభుత్వాలు వారికి చెప్పలేదు. నాయకులు వాటితో వారిని బాగు చేయాలని చూడలేదు. ఆ మైనింగ్‌ మీద వ్యాపారుల కన్ను పడిరది. ఇంకేముందు అమాయకులను ఆశలు చూపారు. తిండిగింజలిచ్చి ఆకలి తీర్చినట్లు నటించారు. ఆకలి తీరితే చాలనుకున్న అమాయకు దళితులు వ్యాపారుల మాయ మాటలు నమ్మారు. తమ భూములను వ్యాపారుల చేతుల్లో పెట్టారు. ఇప్పటికీ పెడుతున్నారు. కాని ఆ భూములున్న దళితులకు మాత్రం ఆ వ్యాపారాల గురించి ప్రభుత్వాలు చెప్పలేదు. లేదా ఆ భూములును ప్రభుత్వమే తీసుకొని ఆ దళితులకు న్యాయం చేయలేదు. ప్రైవేటు వ్యాపారులకు మాత్రం ప్రోత్సాహకాలు..వారికి రుణాలు..ఇచ్చి ప్రోత్సహించారు. కరీంనగర్‌ చుట్టూ గ్రానైట్‌ వ్యాపారాలకు అనుమతులిచ్చారు. ఇంకేముంది..తవ్వుకున్నవారికి తవ్వుకున్నంత అన్నట్లు భూముల యజమానులను ఒప్పించి, మెప్పించి, మాయ చేసి వారి అనుమతి తీసుకొని…వందలు, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు దశాబ్దాలుగా సాగిస్తున్నారు. అలా అనుమతులను దశాబ్దాలకు అవసరమైన లైసెన్సులు కూడా జారీ చేసుకుంటూనే వున్నారు.
అలాంటి వాటిలో ఎస్‌ఎస్‌ఆర్‌ గ్రానైట్‌ కంపనీ ఒకటి. కాని అక్కడున్న అన్ని కంపనీలకన్నా పెద్దది.
అక్రమ మైనింగ్‌లో ఆరి తేరింది. అక్కడ అక్రమ మైనింగ్‌తో లెక్కలేనంత బ్లాస్టింగ్‌ జగుతోంది. అమాయకపు దళిత రైతులకు డబ్బుల ఎరవేసి, వారిని నమ్మించి, మైనింగ్‌ క్యారీల పక్కనున్న భూములను వ్యవసాయానికి పరిని రాకుండా చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అసైండ్‌ భూములను రైతులకు ఉపయోగం లేకుండా చేసి, క్వారీల వ్యర్దాలను భూముల్లో వేసి, చివరికి ఆ భూములను లాక్కొన్నారు. ముందు రైతులకు ప్రలోభాలకు గురి చేశారు. వారికి ముందు కొంత సొమ్ము చెల్లించారు. కరీనంగర్‌ చుట్టూ వున్న అన్ని గ్రానైట్‌ కంపనీలు ఇదే పనిచేస్తారు. అందులో భాగంగా వందల ఎకరాల్లో సాగుతున్న పిఎస్‌ఆర్‌ కంపనీ మిగతా కంపనీలను మించి వ్యాపారం సాగిస్తోంది. వేలాది కోట్ల రూపాయల మైనింగ్‌ వ్యాపారం చేస్తోంది. కాని పేద దళితులకు ఏమిస్తోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగవేస్తోంది. పర్యావరణం పాడుచేస్తోంది. మైనింగ్‌ పక్కన వున్న రైతుల పొలాలను పాడు చేస్తున్నారు. వరుసగా అనుమతులు తెచ్చుకుంటూ, పక్కనున్న పొలాలన్నీ లాక్కుకుంటున్నారు. మైనింగ్‌ చేపడుతున్నారు. ఇలా ఒక దగ్గర మొదలైన మైనింగ్‌ చుట్టుపక్కల వున్న ప్రాంతాలన్నింటికీ విస్తరించింది. కేవలం తమ క్యారీ వ్యర్దాలను వేసుకున్నందుకు అవసరమైన సొమ్ము చెల్లిస్తామంటూ నమ్మిస్తారు. కొంత కాలానికి ఆ భూములను రాయించుకుంటారు.
ఇలా రైతులపై దౌర్జన్యం చేస్తారు. వారి నుంచి భూములు లాక్కొంటారు.
దళితులు కావడంతో వారు ఇతరులకు చెప్పుకోలేక, మైనింగ్‌ వ్యాపారులతో పోరాడ లేక, వాళ్లు ఇచ్చింది తీసుకొని భూములు కోల్పోతుంటారు. నిరంతరంగా సాగుతున్న వారి పోరాటానికి విలువ లేదు. వారి జీవితాలకు గ్యారెంటీ లేదు. ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్న మైనింగ్‌ వ్యాపారులను అడిగేవారు లేరు. బాధితులకు న్యాయం చేయమనే వారు లేరు. ప్రశ్నించిన వారి మీద దాడులు.. ప్రాణాల తీస్తామని బెదింపులు. మీడియా రాస్తే బెదిరింపులు. అధికారులకు సైతం హెచ్చరికలు. భూములు ఇచ్చిన రైతులను ఆదుకున్నది లేదు. అసలు అసైండ్‌ భూములు అమ్ముకోవద్దు. కొనుక్కొవద్దు. ఇది చట్టం చెబుతున్నది. అయినా అమాయక దళితులను మోసం చేస్తున్నా ఏ ప్రభుత్వం పట్టించుకోదు. సరే ఇంత జరుగతున్నా ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతుందా? అంటే అదీలేదు. కొన్ని వందల కోట్ల రూపాయల బకాయిలున్నాయి. అయినా ఎవరూ పట్టించుకోరు. అధికారులు గట్టిగా అడగలేరు. నాయకుల ఆదేశాలు పాటిస్తారు. గ్రానైట్‌ వ్యాపారులు ఇచ్చే కోట్లతో నాయకులు రాజకీయం చేస్తుంటారు. వ్యాపారులు ఇచ్చే ఖరీదైన కానుకలు పుచ్చుకొని అధికారులు వారి జోలికి వెళ్లరు. ప్రజల గురించి ఎవరూ ఆలోచన చేయరు. ప్రజలకు నష్టం చేసి, పర్యావరణానికి హనీ చేసి, ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టి వ్యాపారం చేసేవారిని ఏ అధికారి చట్టపరంగా చర్యలు తీసుకోరు. అధికారులు వస్తుంటారు..పోతుంటారు.. వ్యాపారాలకు సహకరిస్తూనే వుంటారు. బాదితుల గోడు మాత్రం ఎవరూ వినరు. దాంతో భూములు ఇచ్చిన పాపానికి తిండి లేక, భూములు తమవి కాక, తమ భూముల్లోకి తామే వెళ్లలేక, కూలీ లేక, జీవితమే శాపంగా బతుతున్నవారి గురించి ఎవరు పట్టించుకోవాలి. దళితుల భవిష్యత్తు క్యారీల వ్యాపారులు తుంచేస్తుంటే మౌనంగా రోధిస్తున్నారు. వారి గోడు ఎవరూ పట్టించుకోరు.
అధికారులు బాధితుల మొర ఆలకించరు. పోలీసు స్టేషన్లలో వారికి న్యాయం జరగదు.
వ్యాపారుల వ్యవస్ధలును గుప్పిట్లో పెట్టుకొని, అధికారులను తమ చెప్పుచేతల్లో పెట్టుకొంటూ వందలాది ఎకరాల్లో మైనింగ్‌ చేస్తున్నారు. అలాంటి అక్రమ మైనింగ్‌ వ్యాపారాల్లో లెక్కకు మించి తవ్వకాలు జరుగుతుంటాయి. లెక్కకు మంచి దారుణాలు చోటు చేసుకుంటాయి. కనుచూపు మేర కనిపించేంత మైనింగ్‌ చేస్తున్నా ఎక్కడా సరిహద్దు కనిపించదు. ఎక్కడా ఒక్క సూచిక కూడా ఏర్పాటు చేయరు. ఆ మైనింగ్‌ క్వారీల వైపు చీమ కూడా దూరకుండా చూసుకుంటారు. చుట్టూ మనుషులను పెట్టుకుంటారు. పొరపాటున కూడా అటు వైపు ఎవరూ రాకుండా చూసుకుంటారు. చివరికి పోలీసులు కూడా అటు వైపు చూడరు. అధికారులు అటు వైపు కన్నేయాంటే కూడా జంకుతారు. అధికారులకు ఎక్కడ ఎలా ముట్టాలో..అది ముట్టుతుంది. అంత వరకే…కాని క్వారీల వైపు ఎవరూ వెళ్లొద్దు. సహజంగా క్వారీలలో మైనింగ్‌కు వాడే పేలుడు పదార్దాలు సైతం నిబంధనలకు విరుద్దంగా వాడుతున్నారన్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మైనింగ్‌ వ్యాపారం అనుమతుల సమయంలో అధికారులు సూచించే పేలుడు పదార్ధాలు కాకుండా, తమ ఇష్టాను సారం వాడుతుంటారు. అవి ఎంత వాడుతున్నారన్నదానిపై కూడా లెక్కలేదు. యేధేచ్చగా బ్లాస్టింగ్‌లు చేపడుతుంటారు. అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడా లేకుండా పెద్దఎత్తున బ్లాస్టింగులు చేస్తుంటారు. నిబంధనలు తుంగలో తొక్కేస్తారు. పక్కనే వున్న సర్వారెడ్డిపల్లె ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తుంటారు. ఏ రాయి వచ్చిన వారి నెత్తిన పడుతుందో తెలియదు. ఏ రాయి వచ్చి వారి ఇంటి మీద పడుతుందో తెలియదు. ఎవరి ప్రాణాలు గాలిలో దీపాలౌతాయో తెలియదు. అయినా ఎవరూ పట్టించుకోరు. మైనింగ్‌ను ఆపరు. ఆ భూముల అసలు హక్కుదారులకు వాటాలివ్వరు. పేదలంటే అందరికీ చిన్న చూపే..వారి జీవితాలు కూడా అంతే!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!