అందెశ్రీ…ఎందుకీ కిరికిరి!

https://epaper.netidhatri.com/view/280/netidhathri-e-paper-30th-may-2024%09

-పాటే తెలంగాణ ప్రాణం.

– పాటే తెలంగాణ వేదం.

-పాటే తెలంగాణ జీవం.

-పాటే తెలంగాణ ఆత్మ గౌరవం.

-పాటే తెలంగాణ కీర్తి పతాకం.

-పాటే తెలంగాణ నవ జీవన వేదం.

-పాటే ఉద్యమ స్పూర్తికి ఊపిరి.

-పాటే తెలంగాణ జీవనాడి.

-పాటే తెలంగాణ పోరాట చైతన్య దీప్తి.

-పాటే తెలంగాణ అస్థిత్వ ఆర్తి.

-పాటే నిరంతర పోరాట దివిటి.

-ఆ పాటకు కొత్త రాగమెందుకు!

-ఆ పాటకు కొత్త సొగసులెందుకు!

-తెలంగాణ హృదయాలనేలిన పాటకు కొత్త గొంతులెందుకు.

-తెలంగాణ ఆకలిని ఎగతాలి చేసిన వారి చేతుల్లో పెట్టడమెందుకు!

-ఒక్కటైన తెలంగాణ సమాజంలో కొత్త అలజడెందుకు?

-మన హృదయాలలో పదిలంగా ఉన్న పాటకు గాయాలెందుకు?

-జనగీతాన్ని నడి బజారులో నిలబెట్టి నాటకాలెందుకు?

-జయజయహే అని పాడుకున్న నోటికి కొత్త నొప్పులు లెందుకు?

-పాటకు మళ్ళీ పురిటినొప్పులెందుకు?

-ఉద్యమ కాలంలో ఎగిరిన పతాకకు ఈ మరకలెందుకు!

-ఉద్యమాన్ని జీవితం చేసిన పాట కొత్తగా పట్టమెందుకు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ సమాజం దేనినైనా సహిస్తుంది. కాని ఆత్మగౌరవం విషయంలో మాత్రం రాజీ పడదు. ఆకలినైనా ఎదిరిస్తుంది. అంతస్తులను లెక్క చేయదు. కాని ఆత్మ స్ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోదు. అది తరతరాలుగా వస్తున్నది. ఆ గర్వం, దైర్యం, ఆ ఆత్మాభిమానం ఈ మట్టిలోనే వున్నాయేమో? అనిపిస్తుంది. తెలంగాణకు ఆత్మగౌరవం ఎక్కువ…పాటల దాహమెక్కువ. ప్రపంచంలో తెలంగాణకు మించిన సాహిత్యాధారాలు మరే ప్రాంతానికి లేవు. ఏ ప్రాంతంలో తెలంగాణలో వున్నన్ని జనపదాలు లేవు. తెలంగాణలో పల్లె పాటలే కాదు, బతుకమ్మ పాటలున్నాయి. చైతన్యగీతాలున్నాయి. అందుకే తెలంగాణ పాట పుట్ట. సాహిత్యానికి గుట్ట. అవును తెలంగాణకు పాటే ప్రాణం. ఆ పాటే జీవం..జీవితం. ఆ మాట నుంచి వెలువడే శబ్దమే తెలంగాణకు ఊపిరి. ఆ పాట వింటూ కష్టం మర్చిపోతాడు. ఆ పాట వింటూ తనకు ఎదురైన కష్టం గురించి తెలుసుకుంటాడు. ఆ పాట వింటూ తనను ఎవరు మోసం చేశారో తెలుసుకుంటాడు. ఆ పాట వింటూనే తనకు అన్యాయం చేస్తున్న వారి మీద తిరగబడతాడు. ఇదీ తెలంగాణకు వున్న ప్రత్యేకమైన జీవన విధానం. ఇక్కడ ఆకలికి కూడా కోపమెక్కువ. ఆకలికి కూడా పాటలంటే మక్కువ. ఆకలి దహిస్తున్నా పాటతో కడుపునింపుకుంటాడు. కడుపు రగిలిపోతున్నా పాటే అందుకుంటాడు. ఇంతటి గొప్పగుణమున్న స్ధలం మన తెలంగాణ. అలాంటి తెలంగాణ పాటపై తెలంగాణ రగులుతోంది. పాట పరాయి గొంతులో పలికేందుకు తెలంగాణ సమాజం ఇష్టపడనంటోంది. తెలంగాణ పాట మనల్ని కాదన్న సమాజం నుంచి కొత్త బాణీలుతో కొత్త రూపు దిద్దుకోవడాన్ని తెలంగాణ సమాజం అడ్డుకుంటోంది. ఎందుకంటే తెలంగాణ అంటేనే ఎదిరించడం, తెగించడం. తెలంగాణలో ఎదిరించని సందర్భం లేదు. తెగించని కాలం లేదు. రాజుల కాలంలో కాకతీయులకు వ్యతిరేకంగా సమ్మక్క సారక్కలు తిరుగుబాటు కాలం చూశాం. ఇప్పటికీ ఆ వీర వనిత పౌరుషం తల్చుకుంటున్నాం. వారి వీరత్వానికి, అమరత్వాన్ని దైవత్వంగా కొలుస్తున్నాం. మనల్ని మనం స్పూర్తి పొందుతున్నాం. అంతటి గొప్ప గడ్డ మన తెలంగాణ.

ఈ మట్టిలోనే పౌరుషం వుంది. ఈ మట్టిలోనే పాట పుట్టింది. ఈ మట్టి పరిమళాన్నే పాట అద్దుకున్నది. ఈ మట్టిలోనే పాట పురుడుపోసుకొని ప్రపంచాన్ని ఏలింది. అంతగొప్పటి పాటలకు మన తెలంగాణ వేదికైంది. తెలంగాణ రైతంగా సాయుధ పోరాటంలో కొన్ని వేల పాటలు. నైజాం వ్యతిరేక పోరాటంలో కొన్ని వందల పాటలు. తెలంగాణ తొలి దశలో కొన్ని వేల పాటలు. తెలంగాణ మలిదశలోనూ మరెన్నొ పాటలు..ఆ పాటలే నేటి తెలంగాణ అస్దిత్వ ఆనావాలు. చరిత్రకు సాక్ష్యాలు. ముందుతరాలకు బాటలు. తెలంగాణలో పుట్టె పల్లె పదాల మట్టిపరిమళం అద్దుకున్నాయని చెప్పడానికి అనేక సాక్ష్యాలున్నాయి. గొర్రెల కాపరులు కూడా అప్పటికప్పుడు కైగట్టి పాటలు పాడుతుంటారు. అంతో రాగయుక్తంగా రక్తి కట్టిస్తుంటారు. అందుకే పాటల పోరాటాల గడ్డ మన తెలంగాణ. పాలకుల నిబద్దతను ప్రశ్నించే పాటలైనా, తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించే పాటలైన తెలంగాణకే సొంతం. భక్తికైనా, రక్తికైనా ఎదిరించే శక్తికైనా తెలంగాణ పాటే మూలం. గడ్డ పార మొన కూడా పాట పాడుతుంది. మట్టినెత్తే పార కూడా పాటల రాగం తీస్తుంది. అది శ్రమశక్తి నుంచి వచ్చే నినాదమై తెలంగాణను తట్టిలేపుతుంది. చీకటిని చీల్చే దివిటి కూడా వెలుగు పాట పాడుతుంది. అంతటి మహత్తు తెలంగాణ పాటకుంది. తెలంగాణ నేలకున్నది. ఈ గాలిలో, ఎండిన ఆకుల్లో, పారే ఏరులో, వాగులో వంకలో కూడా పాటను చూసే మనసున్న నేల మన తెలంగాణ. మాటకు పౌరుషం నింపేది తెలంగాణ పాట. సమాజాన్ని నిద్రలేపేది తెలంగాణ పాట. నిద్రానంలో వ్యవస్ధను తట్టిలేపేది తెలంగాణ పాట. మనకణకణాల్లో, నరనరాల్లో ఉరకలెత్తించి, ఉత్తేజాన్ని నింపేదే తెలంగాణ పాట. అది అమ్మ పాటైనా..తెలంగాణ తల్లి నేర్పే తిరుగుబావుటా పాటైనా తెలంగాణ పాటకే ఎక్కడైనా పట్టం. అదే తెలంగాణకు గొప్ప వరం.

ఇంత గొప్ప పాటలో ఒకటైన జయజయహే తెలంగాణ…అన్న అందెశ్రీ పాట ఒకటి. ఈ పాట ఒక్కటే తెలంగాణ కోసం కొట్లాడలే..ఈపాట ఒక్కటే తెలంగాణ తేలే..ఈ పాట ఒక్కటే తెలంగాణను ఉరకలెత్తించలేదు. కాకపోతే అందరూ నా పాట అనుకున్నారు. ఆ పాటను మనసులో నింపుకున్నారు. రాసిన అందెశ్రీని గుండెల్లో పెట్టుకున్నారు. కవిగా ఆయనకు గొప్ప స్దానమిచ్చారు. తెలంగాణ కాళిదాసుగా కీర్తిస్తున్నారు. మరి అలాంటి అందెశ్రీ ఇప్పుడు వివాదాలు మూట గట్టుకుంటున్నాడు. జయజయహే తెలంగాణ..అన్న పాట ఆయన రాసిందే అయినా, అది ప్రజల హృదాయాలలో ఎప్పుడో పదిలమైపోయింది. ఇప్పుడు ఆ పాట అందెశ్రీది కాదు..తెలంగాణ ప్రజలది. తెలంగాణ ఆత్మగౌరవానిది. తెలంగాణ ఆత్మది. ఏ కవి అయినా రాసే వరకే తన పాట. అది జనంలోకి వెళ్లిందంటే అదిజనం పాట…ఇప్పటికిప్పుడు ఆ పాట మరోసారి ఆవిష్కరించుకోవడం, తెలంగాణ గేయంగా ప్రకటించుకోవడాన్ని అందరం స్వాగతించాం. సంతోషించాం. ఎందుకంటే అందెశ్రీ రాసిన పాట జయజయహే తెలంగాణ పాట లేకుండా తెలంగాణ ఉద్యమం సాగలేదు. కాకపోతే ఈ ఒక్కపాటే తెలంగాణ ఉద్యమం కాదు. తెలంగాణ ఆత్మకు ఈ పాటొక్కటే అనడం సరైంది కాదు. గద్దర్‌ అమ్మా తెలంగాణమా..అన్నపాట తెలంగాణ సమాజాన్ని ఉరకలెత్తించింది. రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా?..అన్న పాట తెలంగాణనే కాదు, ఆ పాట విన్న ప్రపంచాన్ని కన్నీటిసాగరం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పాటలకు అంతులేదు. అంతం లేదు. అయినా అందెశ్రీ పాటకు ఎంతో గౌరవం దక్కింది. తెలంగాణ సమాజమే ఆ పాటను రాష్ట్ర గీతం కావాలని కోరుకున్నది. కాకపోతే దానిలోకొత్త బాణీల పేరుతో పొరుగు రాష్ట్ర సంగీత దర్శకుడుతో పాడిరచినా తెలంగాణ అభ్యంతరం చెప్పాలిన పనిలేదు. కాని తెలంగాణలో కీరవాణికన్నా గొప్ప సంగీత దర్శకుడు లేడని అందెశ్రీ అనడం యావత్‌ తెలంగాణ జీర్ణించుకోలేకపోతోంది. అసలు ఇలాంటి వ్యాఖ్య అందెశ్రీ నుంచి వుస్తుందని ఎవరూ ఊహించలేదు.

ఇటీవలే పాట అమ్ముడుపోయిందంటూ ఓవేదిక మీద ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నతో పంచాయితీ పెట్టుకున్నంత పనిచేశాడు. తన అక్కసునంతా వేదిక మీద వెళ్లగక్కే ప్రయత్నం చేశాడు. ఆ రోజు కూడా ఇలాగే అందరి చేత తనమీద వున్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ స్వాగతించడం లేదు. పైగా మరో ఆడియోలో అక్కమొగుడా..అమ్మ మొగుడా? అంటూ అందెశ్రీ మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు తెలంగాణలో తన పాటకు కైగట్టే సంగీత పరిజ్ఞానే లేడన్నంత మాట్లాడిన అందెశ్రీ, మరో వివాదాన్ని తన తలకు చుట్టుకున్నాడు. ఏది ఏమైనా తెలంగాణలో అధ్భుతమైన గాయకులున్నారు. తెలంగాణ పాటకు ప్రాణం పోసిన వారున్నారు. పరాయి వాళ్లు పాడితే తెలంగాణ పాటకు జీవం వుండదా? అంటే వుండదు. అవును ఎందుకుంటే ఈనాడు రామోజీరావు తీసిన పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌ అనే సినిమాలో ఊరు మనదిరా…ఈ వాడ మనదిరా! అనే పాట ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాడారు. ఆయన కొన్ని వేల పాటలకు ప్రాణం పోశారు. కాని ఆయన పాడిన ఆ పాటలో జీవం లేదు. అదే పాటను ఎర్రసైన్యం సినిమాలో వందేమాతరం శ్రీనివాస్‌ పాడితే తెలంగాణ అంతా దద్దరిల్లింది. అదీ తెలంగాణ ఆత్మ…ఒకనాడు తెలంగాన సినిమాలో నటించేందుకు ఏ నటుడు ముందుకు రాలేదు. పాట పాడేందుకు ఏ గాయకుడు ముందుకు రాలేదు. తెలంగాణ ఉద్యమాన్నే ఆంద్రాకు చెందిన మేదావులు సహించలేదు. ఇప్పుడు వారి గొంతులో జీవం వుట్టిపడేలా గానం కోరుకోవడం మాత్రం తెలంగాణ సమాజం ఇష్టపడడం లేదు. ప్రభుత్వం కూడా అందెశ్రీ వ్యక్తిగత వివాదంలో అబాసు పాలు కావొద్దు. పాటకు గౌరవం ఇచ్చే దశలో ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజల వ్యతిరేకతను మూట గట్టుకోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *