https://epaper.netidhatri.com/view/353/netidhathri-e-paper-20th-aug-2024
`ఎన్నికల ముందు నుంచే మొదలైన బూతుల పర్వం.
`ఇప్పటి రాజకీయమంటేనే తిట్ల పురాణం.
`ఏపిలో ఎప్పటి నుంచో వున్న దూషణల పర్వం.
`తెలంగాణలో మొదలు పెట్టిన హస్తం.
`స్థాయి మరిచి సోయి లేని మాటలు.
`పదే పదే అబద్దాల ప్రచారాలు.
`నిజాలు మాట్లాడడం ఎప్పుడో మర్చిపోయారు.
`తిట్లు లేకుండా మాట్లాడడం మానుకున్నారు.
`మితిమీరి పోతున్న కాంగ్రెస్ నాయకుల తిట్ల దండకాలు.
`ఒకరిని మించి ఒకరు పోటీ పడి పూనకాలు.
`రాజకీయ దాడులకు తెలంగాణలో ఏనాడు చోటు లేదు.
`ఇలాగే కొనసాగితే తెలంగాణ సమాజం సహించదు.
`ఇప్పటికైనా మానుకుంటేనే మంచిది.
`ప్రజల చీత్కారం కొరి కోరి తెచ్చుకోవడమంటే ఇదే మరి.
`ఇంతగా మితిమీరి వ్యాఖ్యలు అనర్థదాయకం.
`శాశ్వతం కాని అధికారం కోసం బూతుల ఆరాటం.
`అతి చేసే వారికి ప్రజా క్షేత్రంలో తప్పదు అవమానం.
`పాలకులు అభివృద్ధితో సమాధానం చెప్పాలి.
`ప్రతిపక్షాలకు చోటు లేకుండా చేయాలి.
`ప్రతిపక్షం మీద ప్రగతితో పై చేయి సాధించాలి.
`మాటల దాడితో జరిగేది శూన్యం.
`ప్రజలు కోరుకునేది మేలైన పాలనుకు నిర్వచనం.
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణలో ప్రశాంతమైన రాజకీయ వాతావరణంలో అలజడులు రేగడాన్ని మేదావి వర్గం ప్రశ్నించాలి. తెలంగాణ రైతాంగ ఉద్యమ కాలం నుంచైనా, ఎంతో చైతన్యవంతమైన సమాజం తెలంగాణ. తెలంగాణ రాజకీయాల్లో ఆవేశాలకు తావులేదు. ఆలోచన పూర్వకమైన విధానమే ఆనాటి నుంచి వుంది. అదే ప్రజల జీవన విధానంలో వుంది. నాయకుల తత్వంలోనూ వుంది. కాని కొద్ది కాలంగా తెలంగాణలో తిట్లపురాణాలు, బూతుల దండకాలు మొదలయ్యాయి. అవి మరీ మితిమీరిపోతున్నాయి. ఇలాంటి కలుషిత వాతావరణం ఆది నుంచి ఏపిలో వున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు కూడా అలాంటి ఆధిపత్య రాజకీయాలు ఏపికి మాత్రమే పరిమితయ్యాయి. ఏనాడు తెలంగాణ సమాజం మీద, రాజకీయాలలో దాని ప్రభావం కనిపించలేదు. నాయకులు కూడా చూపించలేదు. ఎలాంటి సమస్యనైనా రాజకీయంగా పరిష్కరించుకునేవారు. ఏనాడు హద్దులు దాటలేదు. కాని ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలంగాణ రాజకీయాలకు ఏమాత్రం మంచిది కాదు. ఇది తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి. ఆవేశాలు ఎప్పటికైనా అనర్ధమే. ప్రజలు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అదికారమిచ్చారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను వేడుకున్నారు. బిఆర్‌ఎస్ పార్టీకంటే మెరుగైన పాలన అందిస్తామన్నారు. ఆ బాటలో నడిస్తేనే ఎంతో మేలు. రాజకీయలలో కలుపుకుంటూ పోవాలి. కాని కెలుక్కుంటూ పోతే దాని ప్రభావం రాష్ట్ర ప్రజలు మీద పడుతుంది. నాయకులు బాగానే వుంటారు. వారి వెంట తిరిగే కార్యకర్తల జీవితాలు ఆగమౌతాయి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు పొరుగు తెలుగురాష్ట్రంలో చూస్తున్నాం. అలాంటి పరిస్దితులు తెలంగాణలో ఎవరూ కోరుకోవద్దు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ తెలంగాణ పోరాటం కూడా అన్ని రాజకీయ పార్టీలు కలిసి సాగించినవే. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మేం చేస్తేనే తెలంగాణ వచ్చింది వచ్చిందని ఇంత కాలం ఎంత ప్రచారం చేసుకుంటూ వచ్చినా ఫలితం లేకుండాపోయింది. తెలంగాణ తెచ్చినపార్టీ ఉద్యమ కాలంలో ఇచ్చిన ప్రధాన హహాలలో నియామకాలను గాలికి వదిలేసింది.
పోలీసు ఉద్యోగాల మీద పెట్టిన శ్రద్ద ఇతర ఉద్యోగాల కల్పనలో పెట్టలేకపోయింది.
అప్పటికీ తెలంగాణ సమాజం హెచ్చరిస్తూనే వుంది. యువతరం ఉద్యమించింది. నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఉద్యోగాలివ్వమని పోరాటాలు చేశారు. అయినా బిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. వ్యవసాయం మీద పెట్టిన ప్రత్యేక దృష్టి కొన్ని సత్పలితాలిచ్చినా కాళేశ్వరం గుదిబండగా మారుతుందని హెచ్చరించిన వినిపించుకోలేదు. ఎన్నికల ముందు సరిగ్గా అన్నారం బ్యారేజ్‌లో కుంగిన పిల్లర్లు బిఆర్‌ఎస్‌కు ఓటమి తెచ్చిపెట్టాయి. సుందిళ్లలో ఏర్పడిన బుంగలు నిండా ముంచాయి. ఏ రైతుల కోసం కేసిఆర్ తపన పడ్డాడో అదే రైతులు వ్యతిరేకమయ్యారు. బిఆర్‌ఎస్‌ను బోల్తా కొట్టించారు. అయితే 2014 ఎన్నికల ముందు ప్రధానంగా ఇచ్చిన కొన్ని హమీలలో రెండు పడకల గదుల ఇండ్ల ప్రభావం గత ఎన్నికల్లో తీవ్రంగా పడిరది. కారుకు ఓటమిని కట్టబెట్టింది. ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూపోవడం వల్ల ప్రజలు మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలను ప్రజలు బలంగా నమ్మారు. ఇక్కడే అసలైన రాజకీయం మొదలు పెట్టింది. ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజలు వినసొంపుగా మారాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే తరుణంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హమీలు ప్రజలు బాగా ఆకట్టుకున్నాయి. కాని అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాతున్న బాష మీద ప్రజలు కూడా తీవ్ర అభ్యంతరపెడుతున్నారు. ప్రధానంగా కేసిఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు ఆహ్వానించలేకపోతున్నారు. పార్టీ సభల్లో కాంగ్రెస్ కార్యకర్తలు చప్పట్లు కొడుతున్నారని రెచ్చిపోయి మాట్లాడడం సబబు కాదు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలను చూసి, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఇది నగుబాటకు మార్గంగా మారుతున్నాయి.
మొత్తంగా చూసుకుంటే ఏపి రాజకీయాలు ఇక్కడ కనిపిస్తున్నాయి.
ఇటీవల అసెంబ్లీలో దానం నాగేందర్ మాట్లాడిన మాటలు, 2015లో ఏపి అసెంబ్లీలో బోండా ఉమ, మాజీ మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ధ్వనిస్తున్నాయి. దానం నాగేందర్ వ్యాఖ్యలు అంత దారుణంగా లేకపోయినా, ఒకసారి అలవాటైతే పదే పదే అలాంటి వ్యాఖ్యలే చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికలు ముందు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. పండబెట్టి తొక్కుతా..కొడుకులను..అంటూ రెచ్చిపోయారు. కత్తెరతో చింపి పేగులు మెడలేసుకంటా అంటే చేసిన వ్యాఖ్యలను సహజంగా కాంగ్రెస్‌నేతలే కూడా సమర్ధించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొన్ని సామాన్యుడు మాట్లాడితే దేశ ద్రోహం కేసులు పెట్టేంతగా వున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు మానవబాంబులౌతారంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆధిపత్య దోరణిని చూపించినా, కార్యకర్తలు ఆ మాటలు నిజంగా తీసుకంటే పరిస్దితి ఎలా వుంటుంది? కేసిఆర్ లాంటి వారిని లాగు లేకుండా చేస్తాను..లాగుల్లో తొండలు తొడుగుతాను? అంటూ సిఎం అలవాటుగా చేసుకున్న వ్యాఖ్యలపై తెలంగాణ మేధావి సమాజం స్పందించాల్సిన అవసరం వుంది. అలాంటి మాటలు రాజకీయంలో భాగమనుకంటే పొరపాటు. ఇక ఇటీవల సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు విషయంలో హుస్సేన్ సాగర్‌లో దూకి చావమంటూ సిఎం వ్యాఖ్యానించడం సమర్ధనీయం కాదు. నిజానికి ప్రతిపక్షం పాలకపక్షాన్ని రెచ్చగొట్టడడం చూస్తుంటాం. కాని ప్రభుత్వమే, ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టే రాజకీయాలు కూడా ఏపి నుంచే మొదలయ్యాయి.
ఏపిలో 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు అక్కడి ప్రతిపక్ష నాయకుడు జగన్‌ను అడుగడుగునా అవహేళన చేశారు.
అప్పటికే ఆయన బలమైన ప్రతిపక్ష నాయకుడగా వున్నారు. అయినా ఆయనను అడుగడుగునా అసెంబ్లీ లో అడ్డుకుంటూ సామరస్య పూర్వకమైన వాతావరణంలో ప్రజా సమస్యలు చర్చ జరగాల్సిన సమయంలో తిట్ల పురాణాలు జరిగాయి. దాంతో జగన్ అసెంబ్లీకి వెళ్లలేదు. పాదయాత్ర చేశాడు. 2019లో గెలిచాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్, అదే తీరును అనుసరించాడు. అందకంటే ఎక్కువ రెచ్చిపోయాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను పురుగుల కన్నా హీనంగా చూసి మాట్లాడుతూ వచ్చారు. ఏకంగా కక్ష్యపూరిత రాజకీయాలు చేశాడు. కొడాలి నాని, పేర్ని నాని, రోజా , అంబటి రాంబాబు, జోగి రమేష్, వల్లభనేని వంశి లాంటి వారు చంద్రబాబు క్యారెక్టర్ మీద విపరీత వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దాంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసుకున్నారు. అదే పరిస్దితి రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చుకునే పరిస్ధితి తేచ్చుకోవద్దు. తెలంగాణ రాజకీయాలు ఎట్టి పరిస్దితుల్లోనూ అదుపు తప్పకుండా వుండాలన్న ఉద్ధేశ్యంతో బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ ఎంతో సంయమనం పాటిస్తున్నారు. అది అర్ధం చేసుకోలేక కేసిఆర్ చేతగాని తనంలో అచేతనమైపోయినట్లు భావిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రతిపక్షం మీద విరుచుపడడంలో పెడర్ధాలు వచ్చేలా మాట్లాడొద్దు. హద్దూ బద్దూ లేని వ్యాఖ్యలు చేయెద్దు. వాడూ, వీడూ అంటూ సంబోధిస్తూ వీపరీత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. ఆ మధ్య నాయకులు మాట్లాడే బూతు పదాలను మీడియా చూపించొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడం వల్ల ఆయన ఛరిష్మా మరింత దిగజారిందనే చెప్పాలి. ఒక్కసారి ప్రజలు వ్యతిరేకత పెంచుకున్నారంటే తర్వాత ఎవరు చెప్పినా వినిపించుకోరు. ప్రతిపక్షానికి అభివృద్దితో సమాధానం చెప్పండి. ప్రగతిని చూపించి దుమ్ము దులపండి. పల్లెల్లో వెలుగులు నింపండి. తెలంగాణ ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నించండి. అంతే కాని ప్రతిపక్ష బిఆర్‌ఎస్ మీద నిందలేస్తూ, కాలయాపన చేయడం వల్ల ఒరిగేదీ లేదు. కాంగ్రెస్ భవిష్యత్తుకు దారి చూపదు.