https://epaper.netidhatri.com/view/380/netidhathri-e-paperap-18th-september-2024%09
ఆంధ్రుల హక్కు నినాదానికి బూజుపట్టిందా?
-స్టీల్ ప్లాంట్ అమ్మకానికే కేంద్రం సై!
-జగన్‌ను నిన్నటిదాకా నిందించారు!
-జగన్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సహకరించారన్నారు.
-జనసేనాధినేత ఉద్యమాలు చేశాడు.
-అధికారంలోకి రాగానే సైలెంట్ అయ్యాడు.
-మళ్ళీ స్టీల్ ప్లాంట్ అమ్మకం తెరమీదకు…
-జనసేనకు పట్టడం లేదెందుకు…
-స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అడ్డుకోలేరా!
-కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించలేరా!
-పొత్తు ధర్మం ఎవరికోసం!
విశాఖ ఉక్కు కోసం సాగిన ఉద్యమాలన్నీ ఉట్టి మీద పెట్టేసే తరుణం వచ్చినట్లే…విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ఇక చరిత్రగానే మిగిలిపోతోందా? ఒకనాడు ఐదు వేల కోట్లతో మొదలై ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల ఆస్థిగా మారి కనుమరుగు కానుందా? ఉద్యోగులకు బలవంతంగా విఆర్‌ఎస్ ఇస్తున్న పరిస్థితులు రాజకీయ పార్టీలకు కనిపించడం లేదా! విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఇంతగా ఎందుకు పగపట్టారు. లాభాలతో నడుస్తున్న కంపనీని ఖాయిలా పరిశ్రమగా ఎందుకు మార్చుతున్నారు. తక్కు కింద కంపనీని ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారు. ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు కూటమి బాగస్వామ్య పక్షాలైన తెలుగు దేశం, బిజేపి రాష్ట్ర నాయకత్వం, జనసేనలు సమాధానాలు చెప్పి తీరాలన్న డిమాండ్ పెరుగుతోంది. అయితే కూటమి ప్రభుత్వాన్ని విశాఖ ఉక్కు సమస్య ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ప్రయత్నం చేస్తోంది.అయితే దీనిని వ్యతిరేకిస్తు ఇక్కడి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. రిలే నిరాహార దీక్ష లు కూడా చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయంపై వెనక్కి తగ్గుతున్నట్లు కనిపించడం లేదు. పైగా శరవేగంగా ప్రైవేటు పరం చేసే చర్యలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ సర్కారు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గిన దాఖలాలు లేవు. తాజాగా ఉక్కును కరిగించే( బ్లాస్ట్ ఫర్నేస్) యూనిట్ను మూసివేసినట్టు కార్మికులు ఆరోపిస్తున్నారు. నిజానికి ఇప్పటికే ఒక బ్లాస్ట్ ఫర్నేస్‌ను మూసేశారు. తాజాగా మరో యూనిట్‌ను కూడా ఆపేశారని సమాచారం. సహజంగా విశాఖలో కనీసం 90 రోజులకు సరిపడా బొగ్గును నిలువ వుంచుతారు. ప్రస్తుతం బొగ్గు15 రోజులకు అవసరమైనంత మేరకే వుందంటున్నారు. కొత్తగా బొగ్గు కొనుగోలు చేయడం లేదు. అదేసమయంలో స్టీల్ ప్లాంట్ కు ఇప్పటికే బొగ్గును ఆపేశారు. దీంతో ఉత్పత్తి 70 శాతం నిలిచిపోయింది. మరోవైపు శాశ్వత ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తున్నారు. దీనిని కూడా కార్మిక సంఘాలు తప్పుబడుతున్నాయి. బలవంతంగా వాలంటరీ రిటైర్మెంట్ చేయిస్తున్నారంటూ గతవారం రోజులుగా పేర్కొంటూ తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు.
ఈ క్రమంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఇక్కడకు వెళ్లిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు తమ గోడు వెళ్లబోసుకున్నారు.ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. తాము ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుతామన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మౌనం అర్థం కాక కార్మికులకు ఏం చెప్పాలో అర్థం కాక నాయకులు తలలు పట్టుకుంటున్నారు. పట్టించుకోకపోతే కార్మికులు టిడిపి మీద దుమ్మెత్తిపోస్తారు. టిడిపి నాయకులను రోడ్ల మీదకు కూడా రానవ్వరు. ఇప్పటికే ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వంద రోజులలో రోడ్లు బాగుచేస్తామన్నారు. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు ఎక్కడికి వెళ్తే అక్కడ రోడ్లు, రోడ్లంటూ నిలదీస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఇదే సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ అంశం తెరమీదకు వచ్చింది. ఉత్తరాంధ్ర టిడిపి, జనసేన నాయకులు సమాధానం చెప్పలేక సతమతమౌతున్నారు. ఇదిలా వుంటే బొగ్గును సరఫరా చేయడం లేకపోతే.. నిర్వహణ బాధ్యతలు మాకే అప్పగించాలని కార్మికులు రెండు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు పెడుతున్నారు. ఈరెండు విధానాలకు కూడా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు తలూపడం లేదు.
ప్రైవేటు పరం చేయడానికే మొగ్గు చూపుతోంది. ఇదే విషయాన్ని కార్మికులు సైతం పల్లా శ్రీనివాసరావుకు చెప్పారు. ఈ రెండు విషయాలు గత జగన్ ప్రభుత్వంలోనూ తెరమీదికి వచ్చాయని కానీ, ఒక్కదానికి కూడా కేంద్రం ఒప్పుకోలేదన్నారు.ఈ పరిణామాలతో రాష్ట్రంలోని కూటమి సర్కారుకు ఉక్కు కర్మాగారం ఒక పరీక్షగా మారింది. గత వారంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి నిర్వహించిన సమావేశంలో ప్రైవేటీకరణవైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోందని కార్మికులు చెబుతున్నారు.
దీంతో రాష్ట్ర సర్కారు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నదివారి వాదన.మరోవైపు ఇప్పుడు బీజేపీతోనే టీడీపీ రాజకీయ బంధం పెట్టుకున్న దరిమిలా తమకు అన్యాయం చేస్తుందన్న భావన కూడా వారిలో ఉంది. ఏదేమైనా ఇప్పుడు విశాఖ ఉక్కు వ్యవహారం కూటమి సర్కారుకు పరీక్షగానే మారిందని చెప్పాలి.