కమిట్‌ మెంట్‌ ‘కామ’నా?

-ఆడవాళ్లు ఎప్పటికీ ఆట బొమ్మలేనా?

-సినీ రంగానికే పరిమితమా?

-వ్యవస్థలో పెరిగిపోయిన జాడ్యమా?

-అవినీతిలో ఇదొక భాగమా?

 

-అన్ని రంగాలలో మహిళలు అనుభవిస్తున్నదేనా?

-ఏ వ్యవస్థలో చూసిన కనిపించకుండా వుందా?

-రాజకీయాలలోకి కూడా వుందా?

-వైద్య వృత్తిలో కూడా నీచం లేకుండా పోయిందా?

-పోలీసు వ్యవస్థలో ఏమైనా తక్కువుందా?

-విద్యా వ్యవస్థను కూడా నాశనం చేసిందా?

-ప్రైవేటు కంపనీలైనా, ప్రభుత్వం ఉద్యోగులకు తప్పడం లేదా?

-మహిళ అంటే సమాజంలో ఇంత చిన్న చూపా?

-విద్యావంతమైన సమాజంలో కూడా మహిళకు స్వేచ్ఛ లేదా?

-స్వాతంత్య్రం ఇంకా మహిళలకు అందడం లేదా?

-ఎక్కువగా సినీ రంగంలోనే ఎందుకు వేళ్లూనుకొని పోయింది?

-సినీ వ్యవస్థ ఎందుకు ఇంతగా దిగజారిపోయింది!

-జనం గొప్పగా కీర్తించే వారిలో కూడా ఈ రోగం ఎందుకుంది?

-సహ నటీమణులతో నటుల పైత్యమేమిటి?

-గుడికెళ్తే అమ్మవారిని కొలుస్తారు?

-బైట ఆడవారు కనిపిస్తే కామంతో చూస్తారు?

-మహిళ నవ్వితే చాలు నానా పెడర్థాలు తీసుకుంటారు?

-కనీసం మహిళలు మనసారా నవ్వుకునే స్వేచ్ఛను దూరం చేస్తున్నారు.

-వేధింపులకు గురి చేస్తున్నారు!

-లొంగిపోతే తప్ప వదలనంత దుర్మార్గం చూపిస్తున్నారు.

ఏ వ్యవస్థ చూసినా ఏమున్నది గర్వకారణం.. సమస్తం కామపు చూపుల మృగాల అరణ్యం. నాకెంతిస్తావంటే ఒక రకమైన అర్థమొస్తుంది. నాకేమిస్తావంటే మరో అర్థం స్పురిస్తుంది. అసలు కమిట్‌ మెంట్‌ అనేది ఒక్క సినిమా రంగంలోనే వుందా? అంటే అన్ని వ్యవస్థలలోనూ పాతుకుపోయింది. వేళ్లూనుకుపోయింది. ఆ దారిద్య్రం రాజకీయాలలో కూడా వుంది. కానీ సినిమా విషయంలోనే ఎక్కువగా వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే సమాజంలో ఎలాంటి వారికైనా సినిమా రంగంలో ఏం జరుగుతోందనేది తెలుసుకోవాలన్న ఉత్సుకత వుంటుంది. సామాన్యులలో మరీ ఎక్కువగా వుంటుంది. ఇక స్థితి మంతులలో తమకు అవకాశం దొరికితే బాగుండు అనే కోరిక కలుగుతుంది. మహిళలు బైటకు రావాలి. రాజ్యమేలాలి. అన్ని రంగాలలో దూసుకుపోవాలి. అని గొప్పలు బాగానే చెప్పుకుంటాం. కానీ మహిళలు బయటకు వస్తే ఎన్నో వేల కామపు కళ్ల ముందు నుంచి వెళ్లాలి. మహిళలు ఎంత ఉన్నత స్థానంలో వున్నా ఈ సమాజపు చూపులో తేడా వుంటుంది. అందుకే ఆడ పిల్లలను బైటకు పంపాలంటే తల్లిదండ్రులు ఒకటి లక్ష సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఎంత గొప్ప స్థానంలో వున్నా సాయంత్రానికి ఇంటికి చేరుకోకపోతే భయపడాల్సి వస్తోంది. ఇదేం ఖర్మనో ఇప్పటి వరకు అర్థం కాదు. మహిళకు స్వేచ్చను ఎలాగూ ఈ సమాజం ఇవ్వదు. గౌరవం అంత కన్నా ఇవ్వదు. కానీ చెడు దృష్టినైనా మార్చుకుంటుందా? అదీ వుండదు. నాపై ఆ కళ్లు పడలేదు. అని చెప్పడానికి కూడా లేకుండా పోతోంది. సినిమా రంగంలో ఆ తరం నుంచి మొదలు ఈ తరం వరకు అందరూ బాధితులే…పైకి చెప్పుకోవడానికి ఎంత అబద్దమాడాలనుకున్నా, కళ్లలో ఆ తడి వారిని నిజం చెబుతుంది. వారికి జరిగిన అన్యాయం తన్నుకుంటూ వస్తుంది. సినిమా రంగంలోనే ఇంత దిగజారుడు తనం వుంటుందనుకుంటే, ఆ దుర్మార్గం టెలివిజన్‌కు కూడా సోకిందని తెలుస్తుండడం విడ్డూరం. సినిమాలో వుండే ప్రతి మగాడు కళా హృదయుడు కాదు. హీరోలు కాదు ముసుగు మాయగాళ్లు. సినిమా అంటే రంగుల ప్రపంచం. అందమైన లోకం. నిజానికి సినీ లోకం అంటే కళాత్మక నిండివుండాలి. నటనా చాతుర్యం తెలిసి వుండాలి. ఎలాంటి పాత్రలోనైనా సహజ నటనత్వంతో ఒదిగిపోవాలి. ప్రేక్షకులను రంజింపజేయాలి. ప్రేక్షకులు ఆ పాత్రలో లీనమైపోయే చేయాలి. సినిమా చూస్తున్నంత సేపు సగటు ప్రేక్షకుడు సినిమా చూస్తున్నామనే భావన రాకూడదు. తాను తన్మయత్వంలో మునిగిపోవాలి. అదీ సినిమా అంటే..కానీ ఇప్పడుడేమైంది. వ్యాపార వస్తువైపోయింది. ఆదాయ మార్గమైపోయింది. కళాత్మక చిత్రాల జాడ లేకుండా పోయింది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఎప్పుడో కళ తప్పింది. కాసుల వర్షం కోసం మాత్రం నిర్మాణం సాగుతోంది. రూపాయి పెట్టుబడితో వంద రూపాయల ఆదాయం సమకూర్చే వ్యాపారమైపోయింది. కొత్త తరం వచ్చినా వారసత్వంతో నిండిపోయింది. కొన్ని కుటుంబాల గుప్పిట్లో సినిమా బంధీ అయిపోయింది. దాంతో వాళ్లు తీసిందే సినిమా. వాళ్లు వేసిందే వేషం. వాళ్లు చేసేదే నటన. అంతకు మించి ప్రేక్షకులకు గత్యంతరం లేదు. కొత్తగా ఎవరైనా వస్తామంటే రానివ్వరు. వచ్చినా వారిని రాణించనివ్వరు. సినిమా అవకాశాలు రాకుండా చేస్తారు. ఎవరూ వారికి సహకరించకుండా చూస్తారు. వాళ్ల సినిమా తెరమీద పడకుండా అడ్డుకుంటారు. ధియేటర్లన్నీ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ల సినిమాలు మాత్రమే ఆడేలా చేసుకుంటారు. ఇదోరకమైన దోపిడీ ఇలా సాగిస్తూనే మరో వైపు హీరోయిన్లను వేధించుకు తింటారు. అదే కాస్టింగ్‌ కౌచ్‌. పేరు కూడా వినసొంపుగా పెట్టారు. ఆ దరిద్రాన్ని అర్థం కాకుండా చేస్తున్నారు. కమిట్‌ మెంట్‌ ‘కామ’నా? అనే ప్రశ్న ఉత్పన్నం కానటువంటి వ్యవస్థ కనిపించకపోవడం మన దౌర్భాగ్యం. అది ఒక్క సినీ రంగానికే పరిమితమా? అంటే ఎక్కువ సమానం మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. అది అందరూ అంగీకరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో గతంలో వారికి జరిగిన అనుభవాలను అనేక మంది హీరోయిన్ల వెల్లడిస్తున్నారు. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు వాటిని గాసిప్స్‌గా మాత్రమే చెప్పుకునే వారు. ప్రజలు కూడా సినీ పత్రికలలో ఇలాంటి వార్తలను ఆసక్తిగా చదువుతుండేవారు. వాటిలో నిజమెంత అనేదానికన్నా, అదే నిజమైతే బాగుండు అని చదువుకునే వారు. అక్కడితో వదిలేసేవారు. ఎప్పుడైతే సోషల్‌ మీడియా వచ్చిందో అప్పటి నుంచి అన్ని వ్యవస్థలలో జరిగే అన్యాయాలు వెంటనే వెలుగులోకి వస్తున్నాయి. ఈ మధ్య గతంలో సినిమా రంగంలో పేరు పొందిన హీరోయిన్లు తమ అనుభవాలను జంకు లేకుండా చెప్పేస్తున్నారు. అప్పటి కమిట్‌ మెంట్‌ లపై ఇప్పుడు వాస్తవాలు బైట పెడుతున్నారు. ముఖ్యంగా అప్పుటి హీరోలు ఎంత దారుణంగా ప్రవర్తించే వారో చెబుతున్నారు. వాళ్లెంత అన్యాయమైపోయారో కూడా చెప్పేస్తున్నారు. ఎలా తమ జీవితాలు ఆగమైపోయాయో! పూస గుచ్చినట్లు చెప్పేస్తున్నారు. ఆ విషయాలను కొందరు దర్శకులు కూడా నిజమే అని ఒప్పుకోవడం కూడా చూస్తున్నాం. తాను ఓ హోటల్‌ రూంలో వున్నప్పుడు, పక్కనే అదే హోటల్‌లో మరో దర్శకుడు ఐదుగురు హీరోయిన్లతో ఎంజాయ్‌ చేశాడని అన్నారు. అంటే అక్కడ ఎవరు? ఎవరిని మోసం చేశారు? అన్నది చెప్పలేం. కాకపోతే సినిమాలో నటించాలని, తెరమీద కనిపించాలన్న కోరిక బలంగా వున్నప్పుడే హీరోయిన్లుగా ముందుకొస్తారనే అపవాదు వుండనే వుంది. అయితే తెరమీద నటిగా వెలిగిపోవాలన్న లక్ష్యాన్ని హీరోలు, దర్శకులు, నిర్మాతలు వారి బలహీనతలను ఈ విధంగా ఉపయోగించుకునే వారంటేనే అసహ్యం వేస్తుంది. ఎందుకంటే ఓ ఇరవై ఏళ్ల క్రితం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో నటి కావడం కోసం ఒక అమ్మాయి పడే తపనను ఎలా చూపించారో ప్రపంచమంతా చూసింది. నటి కావాలనుకునే వారి నటనను పక్కన పెట్టి ముందు ఆ దుర్మార్గులు తమ అవసరం తీర్చుకోవడం నిజంగానే రాక్షసత్వం. అయితే కమిట్మెంట్‌ అనేది సినిమా రంగానికే పరిమితమా? అంటే కాదు. సినిమా రంగంలో అతి ఎక్కువ. తొందరగా వెలుగులోకి వస్తుంది. అక్కడ కూడా ఓ పది శాతం మంచి వుంది. కానీ తొంభై శాతం కాస్టింగ్‌ కౌచ్‌ ముందు మంచి తనం కనిపించకుండా పోతోంది. మిగతా వ్యవస్థలలో కూడా వుంది. కానీ తక్కువ వుంటుంది. బైట పడడం తక్కువగా కనిపిస్తోంది. వ్యవస్థలో పెరిగిపోయిన జాడ్యమా? అంటే కాదు ముదిరిపోయిన రోగం. దానికి మందు లేకుండా పోయింది. సినిమా రంగంలో అవకాశాలలో అది కామన్‌. మిగతా వ్యవస్థలో అవినీతిలో ఇదొక భాగం. అన్ని రంగాలలో మహిళలు అనుభిస్తున్నదే? కానీ ఇతర వ్యవస్థలో ఇంత దుర్మార్గం వుండదు. ఎక్కడో అక్కడ భయం వుంటుంది. పరువు కూడా తప్పు చేయడానికి వెనక్కి లాగుతుంది. అన్ని వ్యవస్థలో చూసిన కనిపించకుండా వుంటుంది. ముఖ్యంగా రాజకీయాలలోకి కూడా వుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. నాయకులలో ఇలాంటి పాడు పనులు చేసే వారు చాలా తక్కువ. కానీ అవి బైటకు రావు. రాజకీయాల విషయానికి వస్తే ఇక్కడ రకరకాల కమిట్మెంట్లు వుంటాయి. అన్ని రకాలు అవసరాలు తీర్చుకుంటారు. కాకపోతే విచ్చలవిడి తనం వుండదు. అంతా గోప్యంగా జరిగిపోతుంది. ఇక చెప్పకూడని వ్యవస్థ అంటే వైద్య వృత్తి. నిజానికి పవిత్రమైన వృత్తి. గతంలో పెద్దగా ఇక్కడ నీచం వినిపించేది కాదు. కానీ ఇక్కడ కూడా విచ్చలవిడి తనం విపరీతంగా పెరిగిపోయింది. వైద్య వృత్తిలో కూడా నీచం లేకుండా వుంటుందా? అనే స్థితికి మరింత దిగజారిపోయింది. ఇక పోలీసు వ్యవస్థలో ఏమైనా తక్కువుందా? చెప్పుకోవడానికి సిగ్గు చేటు. ఇక్కడ కమిట్మెంట్‌ అంటే కంచె చేను మేయడమే. పై స్థాయిలో కొంత మెరుగు. కానీ కింది స్థాయిలో మహిళా కానిస్టేబుల్‌లను పై అధికారులతో పాటు, తోటి కానిస్టేబుల్‌లు కూడా వారిని ఎలా సంబోదిస్తారో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే? అంత దిగజారుడు బాషను వారి పట్ల అనుసరిస్తుంటారు. పై స్థాయి అధికారులు చాలా మంది మహిళా పోలీసులకు కనీస విలువ కూడా ఇవ్వరనేది జగమెరిగిన సత్యమే. మహిళా పోలీసుల ఆవేదన అక్కడ ఎవరూ వినిపించుకోరు. కనీసం అర్థం చేసుకోరు. ఎలాంటి దుర్మార్గం జరిగినా బైటకు రానివ్వరు. ఈ దుర్మార్గం విద్యా వ్యవస్థను కూడా నాశనం చేసిందనే చెప్పాలి. కాకపోతే మిగతా వ్యవస్థలన్నే విద్యా వ్యవస్థ చాలా మేలు. ప్రైవేటు కంపనీలైనా, ప్రభుత్వం ఉద్యోగులకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. మహిళ అంటే సమాజంలో ఇంత చిన్న చూపని ప్రపంచానికి తెలిసినా బాగు చేద్దామన్న ఆలోచన ఎవరికీ రాదు. ఎందుకంటే వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకునేదంతా పురుష సమాజమే. విద్యావంతమైన సమాజంలో కూడా మహిళకు స్వేచ్ఛ ఇప్పటికీ లేదు. కొన్ని సార్లు మహిళల ఇష్టం లేకుండా కొన్ని జరిగిపోతాయా? అనే ప్రబుద్దులు చాలా మంది వుంటారు. సమాజంలో తాను అలా కావాలని ఏ మహిళ కోరుకోదు. ప్రతి మహిళ ఆత్మ గౌరవంతోనే బతకాలనుకుంటుంది. ఒకరి ముందు తల దించుకొని బతకాలని ఎవరూ కోరుకోరు. కానీ పురుష సమాజం వారిని వేధించి, వెంటాడి, భయపెట్టి, ఆశలు కల్పించి మహిళను తొంగే పరిస్థితులు సృష్టిస్తారు. అష్ట దిగ్భంధనం చేస్తారు. అందుకే 78 ఏళ్ల స్వాతంత్య్రం అందరికీ వచ్చినా, ఇంకా మహిళలకు అందడం లేదు. ఈ దుర్మార్గం ఎక్కువగా సినీ రంగంలోనే వేళ్లూనుకొని పోయింది. సినీ వ్యవస్థ అంతగా దిగజారిపోయింది!

జనం గొప్పగా కీర్తించే వారిలో కూడా ఈ రోగం నిలువెల్లా నిండిపోయింది. సహ నటీమణులతో నటుల పైత్యానికి పరాకాష్ట దశకు చేరుకున్నది. ఆడవాళ్లు ఎప్పటికీ ఆట బొమ్మలనే దౌర్భాగ్యంలో సినీ రంగం వుంది. గుడికెళ్తే అమ్మవారిని కొలుస్తారు? బైట ఆడవారు కనిపిస్తే కామంతో చూస్తారు?మహిళ నవ్వితే చాలు నానా పెడర్థాలు తీస్తుంటారు. కనీసం మహిళల మనసారా lo నవ్వుకునే స్వేచ్ఛను దూరం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!